Jump to content

ఆ భా 7 1 61 to 7 2 90

వికీసోర్స్ నుండి

--ప్రకాశ్ స్వామినాథన్ 1:41, 17 జూన్ 2006 (UTC)


7_1_61

వ. కావున నొక్కరు నిరూపింపు మనవుడు గాంధారేయునకు రాధేయుం డి

ట్లినయె.


7_1_62

సీ. అధిప నీయోధులయందు సేనాపతిత్వమునకుఁ జాలని వారుఁ గలరె

యందఱు నయవిక్రమాదిగుణంబుల మాననీయుల యట్టులైన నెల్ల

వారి ముఖ్యులఁ జేయవచ్చునే యొక్కరుగైకొన్న మత్సరగ్రస్తబుద్ధి

నన్యులు విపరీతులై కలంగక యుండువాఁడు గావలయు నెవ్విరును ద్రోణుఁ


తే. డనినఁ గా దన రాతండ యర్హుఁ డాధి

పత్యమునకు నాచార్యుండు బ్రాహ్మణుండు

వివిధరణకోవిదుఁడు వయోవృద్ధుఁ డధిక

బలుఁడు శూరుండు గట్టుము పట్ట మతని.


7_1_63

వ. అనుటయుం గురురాజు దగురాజులం గూర్చుకొని గురుం డున్నయెడకుం

జని సవినయంబుగా నతని కి ట్లనియె.


7_1_64

ఉ. ప్రాయముకల్మి నొక్కటన భవ్యధృతిన్ మహనీయశీలతన్

సాయకసంపదం బటుభుజవిభవంబున గార్యతంత్రిశి

క్షాయుతబుద్ధి వృద్ధుఁడవు గావె ధరాసురవర్య మున్ను గాం

గేయుఁడు మాకు నెల్ల నెఱిఁగింపఁడె నీదుమహానుభావమున్.


7_1_65

వ. అని వెండియు.

7_1_66

క. కనువెలుఁగు నీవు గా నీ

వెనుక భవన్మతమ యూఁది వీరలు నేనుం

జనుదెంచెద మూఱట నెల

కొన వృషంభముపజ్జ నడచుగోవుల పగిదిన్.


7_1_67

ఆ. అనుచు నచట నున్న యవనీ పతులఁ జూపి

మఱియు నిట్టు లనియె మనుజవిభుఁడు

దేవసేన నడపి దితిజుల గెలిచిన

షణ్ముఖుండు నీవు సరియ కారె.


7_1_68

వ. కావున.


7_1_69

తే. సర్వసేనాధిపత్యంబు నిర్వహింప

వలయు ననవుడు నమ్మహీశ్వరులు నట్ల

చెప్పి గెలువుము నీ వని చెలఁగి యతనిఁ

బ్రస్తుతించి ప్రార్థించిరి భరతముఖ్య.


7_1_70

వ. మఱియు నమ్మహీశ్వరుండు.


7_1_71

క. సేనాసముదయవర్తకుఁ

గా నిని నేఁ బడసినపుడ కౌంతేయులు నా

చే నడఁగ రెట్లు భీష్మువి

హీనుల మగుమమ్మఁ గావు మెల్లవిధములన్.


7_1_72

వ. అని వేఁడికొనిన నయ్యందఱం గలయం గనుంగొని యాచార్యుఁ డి

ట్లనియె.


7_1_73

ఉ. వేదములుం దదంగములు వింతలుగా నొకకొన్ని నేర్తుధై

ర్యాదిగుణంబు లెందుఁ గల వైనను నింతటివానిఁ గాఁగ న

త్యాదరవృత్తి మీరు విజయాశ ననుం గొనియాటఁ జేసి యౌఁ

గా దన కియ్యకొంటిఁ దగఁ గౌరవనాథునికోర్కిదీర్పఁగన్.


7_1_74

శా. భవ్యంబైనబలాధిపత్యమునకుం బట్టంబు గట్టుండు న

న్నవ్యాకీర్ణగజాదియై మెఱము సైన్యశ్రేణిఁ బాలించి కౌ

రవ్యోత్సాహముఁ బెంచి మార్కొనినవీరవ్రాతముం ద్రుంచి నా

దివ్యస్త్రంబుల ముంచి పాండవులదీప్తిన్ మాయఁ జేయించెదన్.


7_1_75

వ. అని పలికిన బ్రీతిచేతస్కుం డయి నీతనూభవుండు గనకకలశంబులం బావన

జలంబులు దెప్పించి మంగళోపకరణశోభితంబు గావించి పుణ్యాహనాదం

బులుం బరమాశ్వీర్వాదంబులున్ మాగధగీతంబులున్ వందిజనస్తుతివ్రాతం

బులుం జెలంగఁ బ్రభూతపతులుం దానును ద్రోణాచార్యునకు సేనాధి

పత్యాభిషేకపట్టబంధం బొనర్చి పేర్చినం గని రథికవరు లార్చి నిజశంఖం

బులు పూరించిన నఖిలసైన్యంబులందును భేరీమృదంగపణవాదితూర్యనినా

దంబులు నిగిడి నింగి ముట్టె నిట్లు సకలచమూపతిత్వపదభాసితుండై

భారద్వాజుండు.


7_1_76

సీ. కౌరవసేనాముఖంబునఁ దిలక మై యొప్పి రాధేయాదియోధవరులఁ

గొని పాండురాజనందనులసైన్యములతోఁ దొడరి ధైర్యంబు నద్భుతమహాస్త్ర

వీర్యంబు ననివార్యశౌర్యంబు దోర్బలౌదార్యంబు మెఱయ నీతన యువలని

కూరిమి వెలయ నక్షోహీణిపైఁ గొంతబలమును దొర లనేకులను గూల్చి


తే. చామరచ్ఛత్త్రకేతుభూషణతురంగ

దంతిరథహేతివర్మయోధవ్రజంబు

తుని యలిల నించి కతిపయదినము లరులు

సురలు వినుతింప విహరించె ధరణినాథ.


7_1_77

క. అడవుల దవశిఖ దరికొను

వడువున ని ట్లరిబలం బవారణఁ బొడిగా

నడరి యతఁ డాఱె ద్రుపదుని

కొడు కార్వ నుభయజనములకున్ వగ మిగులన్.


7_1_78

క. దుష్టమనస్కుం డగునా

ధృష్టద్యమ్నండు దక్కదేవా సుజనో

త్కృష్టుఁ డగుగురునితెగుటకు

నిష్టాపముఁ బొందె భూతనికరము లెల్లన్.


7_1_79

వ. అనిన విని యాంబికేయుండు హృదయంబ జల్లన జెదర వదనంబు వెల్ల

నయి మొగుడ నివ్వెఱఁ గంది కొండొకప్రొద్దు నిశ్చేష్టితుండై యుండి

గద్గదవికలకంఠుం డగుచు సంజయుతో నిట్లనియె.


-: ద్రోణాచార్యునిమరణంబు విని ధృతరాష్ట్రుండు పరితపించుట :-

సం. 7_8_1

7_1_80

సీ. అస్త్రశస్త్రంబుల నధికుండు వెరవరి భుజబలవిక్రమంబుల ఘనుండు

గురుఁ డట్టివానిఁ దేఁకువ లేక కదిసిరే పాంచాలు రతనిచాపంబు దునిసె

నో తేరు విఱిగెనో సూతుండు వడియెనో యేమఱి యలసత నెదిరి సరకు

సేయని మఱ పాత్మఁ జెందెనో హీనాత్ముఁడై నధృష్టద్యుమ్నుఁ డతనిఁ జంపె.


తే. నట్టె యచ్చెరు విది దైవ మగ్గలంబు

పౌరుషముకంటె ద్రోణునిపాటు వినియు


వేయిపఱియలై పోవదు ఱియి గాఁగ

నోపు నాగుండెయే మని యుమ్మలింతు.


7_1_81

వ. అని యడ లూని పొగిలి వెండియు.


7_1_82

తే. మేరు వొఱుగుట యినుఁ డిలమీఁద బడుట

యబ్ధి యింకుట గాదె ధైర్యమునఁ బేర్చి

ప్రభ వెలింగి గభీరత రాశి కెక్కి

యెందుఁ బొగ డొందునాచార్యుఁ డిట్టు లగుట.


7_1_83

క. అతిలోకపరాక్రమనిధి

మతిసురగురు మిగులుఁ గురుకుమారుఁడు దు

ర్మతు లగుమత్లుతులకుఁ గా

మృతుఁ డయ్యెఁ బరోపకారమృతి యొప్పుఁ గదా.


7_1_84

తే. విల్లు వట్టెడువా రెల్ల వెరవు గఱచి

పోవ నెల వైనద్రోణునిభుజము నిలువ

రించి పాంచాలనందనుఁ బంచి పార్థుఁ

డిట్లు సేయించెఁ గా కొరుఁ డేల చాలు.


7_1_85

క. పాముఁ బొదివి పడఁ దిగిచిన

చీమలగములట్లు ద్రోణుఁ జిక్కువఱిచెఁ గా

కేమి బహుదేశసైన్యము

లే మనఁ గల దింక నూత యెవ్వరు మనకున్.


7_1_86

వ. అని పలుమాట లాడి యొల్లంబోయి యాలోనన కొంత దెప్పిఱి యంగం

బులు వడంకుచుండ మఱియు నమ్మానవేశ్వరుండు సూతనందనున కి

ట్లనియె.


7_1_87

తే. ప్రథమగిరిమీఁదఁ దోఁతెంచుభానుఁ బోలి

ధర్మపుత్రుండు దోఁచినఁ దిమము విరియు


నట్లు విరియక గురునకు నడ్డపడఁగ

వచ్చునే తమ్ము మెఱసి యెవ్వరికినైన.


7_1_88

క. సింధురము మహోద్రేకమ

దాంధంబై నచ్చులీల నాచార్యునిపై

గంధవహసుతుఁడు గవియ న

మంధరగతి నెవ్వఁ డాగు మనయెధులలోన్.


7_1_89

చ. ఉఱుముచు నెల్లడం బిడుగు లుగ్రగతిం బడ ఘోరమూర్తియై

యఱిముఱిఁ గప్పుదెంచువిలయాభ్రము చాడ్పన మౌర్వినాద మే

డ్తెఱఁ జెలఁగన్ వడిం దొరఁగుదివ్యశరంబులు ద్రోణుతేరిపై


బఱపుకిరీటి మీధరణిపాలకుజోదులచేత నిల్చునే.


7_1_90

క. ఎవ్వఁడు దెరలెనొ తిరుగక

యెవ్వఁడు నిల్చెనొ కడంగి యెవ్వఁడు బిరుదై

క్రొవ్వునఁ జచ్చెనొ కుంభజు

నెవ్వఁడు గావంగ లేఁడ యెయ్యది దుదియో.

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_7_1_61_to_7_2_90&oldid=3402" నుండి వెలికితీశారు