Jump to content

ఆ భా 7 1 31 to 7 1 60

వికీసోర్స్ నుండి

--మధు 7 ఆగస్ట్ 2006

7_1_31

క. మీ రెల్లఁ జూచుచుండఁగఁ

గౌరవ నికురుంబమునకుఁ గన్నా కై యొ

ప్పారెడు భీష్ముఁడు వడియెను

మేరు వొఱగినట్టు లసము మిగుల నరునకున్.


7_1_32

వ. నాతెఱంగు వినుండు.


7_1_33

క. కలఁగిన సేనలఁ గాచెద

నిలిపెద నర్జునునికడఁక నెఱపెద బాహా

బల మాభీష్ముం డెట్ల

గ్గలిక మెఱసె నట్ల మీకుఁ గన్నులు దనియన్.


7_1_34 ఉ. ధర్మజభీమపార్థులును దమ్ములు నుద్భటసంగరక్రియా

కర్మఠు లచ్యుతానుజునిగర్వము దుర్విషహంబు వారి మ

త్కార్ముకముక్తచండశరఖండితదేహులఁ జేసి యిత్తు నేఁ

బేర్మిగఁ గౌరవవేంద్రున కభీష్టత రాజ్యరమావిలాసమున్.


7_1_35

క. కాదేని గాండివజ్యా

నాదము సురదుందుభిప్రణాదంబును నిః

ఖేదుఁడ నై వించు నధిక

మోదంబున నిత్యసౌఖ్యముం గై కొందున్.


7_1_36

క. కౌరవులం గాచుచు రణ

శూరులఁ బాండవుల నోర్చుచుం గీర్తికర

స్ఫారవిహారత భీష్మునిఁ

జేరం జనుకంటె నొప్పు సెప్పం గలదే.


7_1_37

వ. అని పలికి తనసారథిం గనుంగొని.


7_1_38

సీ. మణిగణోజ్జ్వల మైన మనయరదంబున జవనాశ్వములఁ బూన్పు చాపబాణ

ఖడ్గాదిసాధనోత్కర మొడఁగూర్పుము రత్నధ్వజం బెత్తు రశ్ము లడర

శంఖమృదంగనిస్సాణాదితూర్యముల్ సంఘటింపుము రభసమున ననుడు

వాఁ డట్ల చేయు దుర్వారగర్వోద్ధతి నగ్ని ప్రభం బగునారథంబు


తే. పటురయంబున నెక్కి భూపతికి మ్రొక్కి

యాతఁ డెల్ల కౌరవులును నఖిలనృపులుఁ

దన్నుఁ గొనియాడఁ గర్ణుఁ డుత్సాహలీల

నిజబలాభీలసుందరధ్వజము లొప్ప.


7_1_39

వ. నడచి నదీనందనుఁ డున్న యెడకుఁ జేరం బోయి శోషించిన సముద్రంబు

చందంబున విమానంబు విఱిగిపడినదివ్యుని తెఱంగునభూతలపతితుండయిన

పతంగు భంగిని భగ్నపక్షం బైనమైనాకంబు మాడ్కిం బొలుచు నతనికడకుం

బాదచారి యై యంగి ఫల్గునునారాచనిచయంబునం బొదువంబడి యమునా

నదీహ్రదస్థితంబును మదనిమీలితాక్షంబును నై శోభిల్లు శుండాలంబు

ననుకరించుచు వీరశయనమహనీయుం డైన యమ్మహానుభావుని యడు

గుల పైఁ గన్నీరు దొరఁగం బ్రణమిల్లి కేలు మొగిడ్చి వినయవినమిత

శరీరుం డై.


7_1_40

క. వచ్చితి రాధేయుఁడఁ గను

విచ్చి ననుం జూడు భరతవీరాగ్రణి నీ

సచ్చరితముఫలమే యి

ట్లిచ్చట నీయునికి ధాత నే మన నేర్తున్.


7_1_41

ఆ. పావనంబు లయినపలుకు నాచెవు

లార నెమ్మి నన్ను నాదరింపు

మయ్య ధర్మనిత్య యంచితసత్య శం

తనుకుమర గాఢధైర్యసార.


7_1_42

ఉ. పేర్చినమూఁకఁ గూడ నడపింపఁగఁ గోల్తల సేయఁ దీవ్రబా

ణార్చుల మార్బలంబుల రయంబున నీఱుగఁ గాల్ప నాజి నీ

నేర్చినభంగి నొండొకఁడు నేర్చునె పాండవబాహుసంపదల్

పెర్చు నెలర్చు నింకఁ గురుబృందము లెల్లను దల్లడిల్లంగన్.


7_1_43

క. శరజిహ్వాభీకరుఁ డగు

నరుఁ డనుశిఖి నిగడఁ జేసి నారాయణదు

ర్భరపవనుఁ డింక బంధుర

కురుసేనాకననంబుక్రొ వ్వడఁగించున్.


7_1_44

మ. భరితాశాంతరపాంచజన్యరవ దృప్యద్దేవదత్తధ్వని

స్ఫురణన్ వీనులు వ్రయ్యఁ గేతనకపి స్ఫూర్జత్ర్పభం జూడ్కు లా

తురతం బొందఁగఁ జండగాండివసముద్భూతాస్త్రజాలంబు లె

వ్వరు సైరింతురు నీవు దక్క భుజగర్వస్ఫూర్తినిర్వాహకా.


7_1_45

ఆ. మెయి మెయిం బెనంగి మెచ్చించి ముక్కంటి

చే వరంబు గొని విశిష్టదివ్య

కర్మదీప్తుఁ డైనగాండీవి నొరుఁ డాజిఁ

జెనయఁజాల కునికి సెప్పనేల.


7_1_46

క. అని పెక్కుమాట లాడిన

విని యాదరభరితనేత్రవిస్తారుం డై

యనిమిషనదీతనూజుఁడు

గనుఁగొనుటయు మఱియు మ్రొక్కి కర్ణుఁడు వలికెన్.


7_1_47

ఉ. ఆనరు నేనొకండన విషానలదుస్సహదృష్టిభీషణం

బైనమహాభుజంగమము నద్భుతమంత్రనిరస్తదర్పముం

గా నొనరించునట్లు భుజగర్వ మడంచెద నస్త్రశస్త్రవి

ద్యానిపుణత్వసంపద నుదాత్తగుణోత్తర నీవు పంపఁగన్.


7_1_48

వ. అనిన గాంగేయుండు రాధేయున కి ట్లనియె.


7_1_49

మ. తగఁ బర్జన్యునిసొంపునన్ బ్రతుకు భూతవ్రాతముల్ వార్థి సొ

చ్చి గరిష్ఠస్థితి నుండునేఱులును సంక్షీణంబులై యుర్వి ని

ల్చి గుణాధిక్యముఁ బొందుబీజములుఁ బోలెం గౌరవుల్ విశ్రుతం

బగునీప్రోవును బ్రాపుఁ గాపుఁ గని సౌఖ్యం బొందు టొప్పుం గడున్.


7_1_50

చ. అరయఁగ బంధుకోటులకు నొక్కురునాథునియట్ల కావె నీ

వరిబలభేది జన్మమున నయ్యెడు చుట్టఱికంబుకంటె సు

స్థిరతర మైన సంగడముచే నగుభాంధవ మెక్కు డండ్రు నా

నరపతి రాజ్యభారము మనంబు నీయదిగాఁ దలంపుమీ.


7_1_51

వ. అంబష్ఠవిదేహపౌండ్రాదిదేశాధీశుల గెల్చి దుర్యోధనాధీనవర్తులంగా నిర్వ

ర్తించిన నీకు నిట్లు సెప్పవలయునే యండజంబులు పండినవృక్షంబు నుప

జీవించు చందంబున నిన్నుంజెంది బంధువులు సుహృజ్జనులు సుఖు లై

యుండువారు గాక నాకు నీవును సు యోధను నట్ల కావున మే

లాడెదఁ గౌరవుల నడిపికొని యమ్మహీవిభునకు విజయంబు గావింపుము

పొ మ్మని సమ్మదంబునం బలికిన సూతనందనుండు ప్రీతుం డై యద్దేవవ్రతు

చరణంబులు శిరంబు సోఁక వినతుం డై వీడ్కొని యరదం బెక్కి యరుగు

దెంచి భవదీయసైన్యంబు దైన్యంబు వాపి యే పగ్గలించి కలయం గనుంగొని.


7_1_52

క. నరపతి యలరఁగ రథకరి

తురగసుభటసముదయముల దోర్గర్వధురం

ధరలీల మెఱసి యతిబం

ధురములు గా సంఘటించె దురమునకుఁ దగన్.


7_1_53

వ. అట్టియెడ.


7_1_54

క. అరుణాశ్వములు రుచిరరు

క్మరథంబుఁ బ్రదీప్తవేదికాధ్వజమును ను

ద్ధురగాత్రకల్లితసితబా

సురబంధురకంటకంబు శోభిల్లంగన్.


7_1_55

క. మొగమునఁ గయ్యపు వేడుక

చిగురొత్త నుదాత్తమూర్తిఁ జెలువొందు గురుం

దగురాజులుఁ గౌరవులును

బొగడి రులివు మిగులఁ బ్రమదపూర్ణ హృదయు లై.


7_1_56

తే. అపుడు నీయగ్రనందనుఁ డల్లఁ దనదు

తేరు రాధేయునరదంబు సేరఁ బోవ

నిచ్చి మనమున సంతస మెసక మెసఁగ

నాదరంబున నిట్లను నతనితోడ.


7_1_57

క. నీవలన సనాథం బై

యీ వీ డెంతయును మెఱసె నిం కిట మనకుం

గావింప వలయు కార్యము

నీ వెఱింగింపంగవలయు నెయ్య మెలర్పన్.


7_1_58

క. అనిన నతం డిట్లను బహు

జనరక్షకు లైననృపులు సద్బుద్ధులు గా

వున నీవు సెప్పఁగా నే

వినియెద నెయ్యది దలంపు వివరింపు తగన్.


7_1_59

ఉ. నావుఁడు గర్ణుతోడ నరనాయకుఁ డి ట్లను సర్వయోధసం

భావితుఁ డైన శాంతనవు బాహులమాటున నస్మదీయుసే

నావిభంబు సెల్లెఁ బదినాల్లును నీమది కెక్క నాదుయో

ధావలిలోన నింకఁ బృతనాధుపుఁగాఁ గొన నెవ్వఁ డర్హుఁడో.


-: ద్రోణాచార్యులకు సర్వసేనాధిపత్యంబు నిర్ణయించుట  :-

7_1_60

క. సేనాపతిత్వమునకుం

బూని యొకఁడు నడపకున్నఁ బొడ వడఁగదె యా

సేన యనిఁ గర్ణధారవి

హీనం బగుకలము జలధి నెడలినభంగిన్.

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_7_1_31_to_7_1_60&oldid=3401" నుండి వెలికితీశారు