Jump to content

ఆ భా 7 1 301 to 7 1 330

వికీసోర్స్ నుండి


7_1_301 క. పెనుగాలిని వెసఁ గూలిన వనము క్రియం బడిన పాండవ బలముఁ గంటే విను మింక నెన్నఁడును మొగ కొన రీ యోడి చనువారు గురుకోల్తలకున్.

7_1_302 చ. పవన తనూజుఁ గంటె నిజ పార్శ్వములం దనవారు లేక కౌ రవులు మహోగ్ర భంగి నడరం గడు దైన్యముఁ బొంది యున్న వాఁ డవిరళ దివ్యమార్గణ దురాసదు ద్రోణునిఁ జూచి వీఁడు రా జ్య విభవకాంక్ష యెల్లఁ దెగటాఱఁగఁ బాఱెడు నట్లు సూడుమీ.

7_1_303 వ. అనిన విని కర్ణుం డతని కిట్లనియె.

7_1_304 ఉ. భీముడు నట్టివాఁడె యరిభీషణ విక్రముఁ డస్మదీయ సం గ్రామ జయంబు ప్రాణములు గల్గఁగ సైఁ చునె పాండవేయు లు ద్దామ బలాఢ్యు లాహవము దక్కుదురే యది గాక వారు నీ చే మును పడ్డ పాట్లు దమ చిత్తములన్ మఱవంగ నేర్తురే.

7_1_305 చ. వినుము తదీయ యోధులును వీర గుణాఢ్యులు భీము మున్నుగాఁ గొని గురుఁ దాఁక కుండుదురె కూడుద మీతఁడు నొవ్వకుండఁగా మనమును నీతనిన్ బల సమగ్రుల మై యటు గాక యోడి రం చునికి ప్రమాద మేను మొగమోడక చెప్పితిఁ గౌరవేశ్వరా.

7_1_306 వ. అని పలుకునంతకుం గూడుకొని.

7_1_307 సీ. హంగ గౌరము లగు హయములు నమృతాంశు కేతువు మెఱయ నజాత రిపుఁడు రురుని భాశ్వంబులు హరికేతనంబును బ్రస్ఫురితములుగఁ బవన సుతుఁడు శుక వర్ణ హరులు ప్రస్తుత శరభధ్వజంబును నొప్ప సహదేవ పూర్వజుండు నంబుదచ్ఛాయ రథ్యములు శుండాల పతాకయు శోభిల్లఁ దదనుజుండు

తే. గడఁగి తమతమ సిడములు గ్రాల ద్రుపద మాత్స్య సాత్యకి ముఖ యోధ మండలములు దారుణాటోప విక్రమోత్సాహ లీలఁ దోడు నడవంగ నడరిరి ద్రోణు మీఁద.

7_1_308 వ. ఇట్లు పాండవ బలంబులు జలధరంబులు శైలంబు గప్పుకరణిం గుంభ సంభవుం బొదివిన దృష్టిపథం బగుటయు నతండు దెగియె నను దిగులు మన వారికిం బుట్టె నట్టియెడ నీ కొడుకు గడంగి సేనలకుం జేయి వీచి యందు ముంగలి యై నడచు వడిముడిం దాఁకినం దమకించి సాత్యకిని గృతవర్మయు క్షత్త్రధర్ముని సైంధవుండును యుయుత్సుని సుబాహుండును నకులుని దుశ్శాసనుండును సహదేవునిఁ జిత్రవర్ముండును ధర్మనందను శల్యుండును ద్రుపదుని బాహ్లికుండును విరాటుని విందానువిందులును శ్రుతకీర్తిని వివింశతియు శ్రుతసేనుని సాల్వుండును శ్రుతసోమునిఁ జిత్రసేనుండును శతానీకుని శ్రుతవర్మయుఁ బ్రతివింధ్యుని నశ్వత్థామయు సౌభద్రుని లక్ష్మణుండును శిఖండిని వికర్ణుండును గుంతిభోజుని దుర్ముఖుండును గేకయ పంచకంబును గర్ణుండును గాశీశ్వరుని జయుండును బాండ్యుని జయత్సేనుండును ధృష్టద్యుమ్న పుత్రుల బృహద్ధనుర్జయ మిత్త్రులును వార్ద్ధక్షేమిని గృపాచార్యుండును మణిమంతుని భూరిశ్రవుండును ఘటోత్కచుని నలంబుసుండును దలపడి రెన్నం గొలఁది గాదు గాని మఱియు ననేకుల మార్కొని రిబ్భంగి భారద్వాజునిం బరిమార్పను గావను బూని యక్కడి యిక్కడివీరు టక్కుమిగిలి యొండొరుల కేతనంబులు గూల్చి.య ఘోటక కంబుల ప్రాణంబులఁ బీల్చియు సారథుల రూపుమాపియు నరదంబులు పఱియలు వాపియు నాతపత్ర చామరంబుల బడలు వఱిచియుఁ జాపంబులు విఱిచియుఁ గత్తళంబుల తునియలు ధరన్ దొరగించియు నెత్తురు లురలించియు నిత్తెఱంగున ఘోర సంగ్రామంబు సేయుచుండ మధ్యాహ్నం బయ్యె నప్పుడు దన్నుం గవిసిన ధృష్టద్యుమ్ను నమ్ముల నవలీలం గుదియించి యగ్గురుండు వెండియుం గొందఱం జిక్కువఱిచె ననిన విని ధృతరాష్ట్రుండు సంజయున కిట్లనియె.

7_1_309 క. వీ రిచట నివ్వధంబునఁ బోరఁగ నర్జునుని తోడఁ బోక పెనఁగున వ్వీరులు సంశప్తకు లె ట్లైరొకొ యాతని పరాక్రమాతిశయమునన్.

7_1_310 చ. అనవుడు నాతఁ డిట్టు లను నవ్విభుతో నది వెండి చెప్పెదన్ వినుము నరేంద్ర యట్టియెడ వీర రస స్ఫురణంబునన్ భవ త్తనయుఁడు గంధ సింధుర వితానముపై నడరించి భీమసే నునిఁ గినియించె నాతఁడు గనుంగవ నిప్పులు రాలుచుండఁగన్.

7_1_311 క. శరజాల మహావాత స్ఫురణంబున నుగ్రదంతి భూరి ఘటా బం ధుర వారివాహ పటలము విరియించుచు బెట్టు గవిసి విభు నొప్పించెన్.

7_1_312 వ. అట్లు కురురాజు నొచ్చిన నడ్డంబు సొచ్చి.

7_1_313 శా. వంగాధీశ్వరుఁ డేనుఁగుం గొలిపి గర్వస్ఫూర్తి దీవ్రాస్త్రవి ద్ధాంగు జేసె మరుత్తనూజు నతఁ డుద్యత్క్రోధుఁడై వాని మా తంగంబుం బడ నేసి వాఁ డొఱగుచోఁ దన్మస్తకం బుర్వి డొ ల్లం గేలీవిధ మొప్ప నేయ బల మెల్లం బెల్లగిల్లెన్ వడిన్.

7_1_314 వ. ఆ సమయంబున.

- భగదత్తుఁడు సుప్రతీకముఁ బఱపి పాండవ సైన్యంబులం గలంచుట - సం. 7-25-19

7_1_315 క. దానవజయ మింద్రున కె ద్దాని వలనఁ గలిగె మున్ను దానోగ్రము న య్యేనుఁగు భగదత్తుఁడు పవ మానతనయ దెసకుఁ గొలిపె మద మెలరారన్.

7_1_316 వ. ఇట్లు మన సైన్యంబు దైన్యంబు వాయం గొలుపుటయు నగ్గజంబు.

7_1_317 సీ. కినుకమై నిగిడిన కనుఁగవ మెఱుఁగుల గముల ముందటఁ గెంపు గడలు కొనఁగఁ జెవులు మ్రొగ్గించి పూఁచిన రౌద్రతర రేఖ వినువీథిఁ జూపఱ వేడ్కఁ బెనువ గండునఁ జాఁగిన తొండంబు లయసమవర్తి దండములీలఁ బట్టుపఱుపఁ గడు బెట్టిదపు టురవడిఁ బదన్యాస మిలాస్థలి గ్రక్కదలంగఁ జేయ

ఆ. ననిల పుత్రు దెసకు నడరినఁ గని ధర్మ తనయుసేన జనులు దల్లడిల్లి చంపెఁ జంపె భీము సామజం బనియెడు నులివు గల.యఁ జెలఁగఁ గలఁగి రధిప.

7_1_318 వ. తదవసరంబున యుధిష్ఠిరుండు.

7_1_319 క. అలుకొందు మనముతోఁ దన బలముం బరుకొలిపి పొదివి భగదత్తుని న మ్ములఁ గప్పె నతఁడు వానిన్ విలసిల్లు మహాంకుశమున విరియ జడియుచున్.

7_1_320 క. గజముఁ గొలిపి యా దిక్కున గజఘోటక భట నికాయ కాయములు రథ వ్రజములుఁ బొడిపొడిగా న క్కజముగ విహరించె బాహు గర్వస్ఫూర్తిన్.

7_1_321 వ. అప్పు డాలోకించి.

7_1_322 చ. అలిగి దశార్ణ భూరమణుఁ డాతనిఁ దాఁకిన జుడ నొప్పె ఱె క్కలు గల పర్వత ద్వయము కై వడి వారల దంతియుగ్మ మి ట్టుల సుగువీఁగఁ దత్కరిఁ బడం బొడిచెన్ నడి సుప్రతీక ము త్తలపడు వానిఁ జంపె భగదత్తుఁడు తోమర సప్తకంబునన్.

7_1_323 ఆ. చంపి విక్రమంబు సొంపారఁ బాండవ బలము బడలు వడఁగ భద్రదంతిఁ జటుల గతులఁ బఱప సాత్యకి యడ్డంబు నడచి యేసె దొడ్డ నారసమున.

7_1_324 చ. కరిపతి బిఱ్ఱనం దిరిగి క్రమ్మఱ నూల్కొని వృష్ణి వీరు ను ద్ధుర రథ ముద్ధతిం బెనఁచి తొండమునన్ వెస నెత్తి వీచి వై చె రయముమై నతం డిలకుఁ జిత్రముగా నెడ దాఁచి పోయెఁ జె చ్చెర గజ మొండు మైఁ గవిసి చిందఱ వందఱ సేసె మూఁకలన్.

7_1_325 క. సారథి తురంగముల మెలు పారంగాఁ దఱమి తెచ్చి యవికల మగునా తే రల్లఁ దేర సాత్యకి బీరము వోలి వోవకుండఁ బ్రియమున నెక్కెన్.

7_1_326 ఉ. భీముఁ డుదగ్రతం గవియఁ బెల్లగు నా కరి చేతి శీక ర స్తోమమునం దురంగములు దోఁగి కడున్ వెగ డొంది యీడ్చె సం గ్రామ వినోద లీలకు విఘాతము గాఁగ రథంబు నప్పు డు ద్దాను పరాక్రమ స్ఫురణఁ దాకి సుపర్వుఁడు సచ్చె హస్తిచేన్.

7_1_327 వ. అతని పడుట గనుంగొని సౌభద్రుండును ద్రౌపదేయ పంచకంబును జేకితానుండును ధృష్టకేతుండును యుయుత్సుండును గడంగి సామజంబుపై శర వర్షంబులు గురిపిన నది కోపించి యురవడించి.

7_1_328 క. పదముల రథ వాహంబులఁ జదుపుచుఁ బైకొని యుయుత్సు సారథిఁ జంపన్ బెదరక యభిమన్యుని తే రొదవిన నది యెక్కి యాతఁ డుద్ధతి సేసెన్.

7_1_329 క. నర తనయ ప్రముఖ రథిక వరులు నిభము మీఁద నేయు వాలమ్ములు ని ష్ఠుర గతి శరదభ్రము పైఁ బరగు తరణి కిరణ చయము పగిదిం బొలిచెన్.

7_1_330 క. రభసంబునఁ బ్రాగ్జ్యోతిష విభుఁడు గరిం గొలుపుటయును వెస నది యరి వీ ర భయంకరమున వారల ప్రభ సెడ నరదములు వైచెఁ బలు దెసలఁ బడన్.


http://www.volamsite.com