Jump to content

ఆ భా 7 1 271 to 7 2 300

వికీసోర్స్ నుండి

--ప్రకాశ్ స్వామినాథన్ 14:27, 3 జూలై 2006 (UTC)


7_1_271

క. ఇరువాఁగును దార్కొని వి

స్ఫురణ మెరయ నాయుధముల పొగ లేనిశిఖల్

దరతరమ యెగయఁ బోరఁగ

ధరఁ జతురంగములు నద్భుతంబుగఁ గెడసెన్.


7_1_272

క. కరిఘటలు దురగములదళ

మరదంబులమొత్త మనక యడరి వడిం గా

ల్వురు మ్రగ్గఁ జేయుచును మ్ర

గ్గిరి విస్మయ మొలయఁ జూచు ఖేచర తతికిన్.


7_1_273

ఉ. తేరులయొప్పు మ్రోడుపడఁ దేఁకువ లేనిపదాతికోటి ను

గ్గైరుధిరంబులో మునుఁగ నానినయేనికపిండు పక్షముల్

ఘోరము గాఁగ ద్రెవ్వి వెసఁ గూలుకులాద్రులఁ బోలు నాశ్వికుల్

వీరవినోదముల్ సలుపువేడుక సొంపునఁ గూడి యెక్కినన్.


7_1_274

చ. నిలిచినరూపు డొల్లి ధరణిం బడి యున్న శరీర మింత లిం

తలు శకలంబులై నెఱయ దందడిమూఁక గలంగ నొంటి గుం

పులు పఱివోవ రక్తజలపూరము రొంపులు ధూళిగా రథం

బులు రభసంబునం బఱపి పోరిరి యోధులు గ్రోధదీప్తులై.


7_1_275

క. కొమ్ములఁ గ్రుమ్మియుఁ బాదత

లమ్ములఁ జమరియును గరములం బఱపఱి యై

యి మ్మెడలఁగఁ రిగిచియు నర

దమ్ముల నేనుఁగులు వీటతాటము సేసెన్.


7_1_276

క. తురగమున నరుని వ్రేయుచుఁ

గరిదంతము వెఱికి యన్యకరి వైచుచును

ద్ధురరథము చదలఁ ద్రిప్పుచుఁ

గరులు వినోదంబు సేసెఁ గనుఁగొను ప్రజకున్.


7_1_277

వ. ఒక్కొక్కచోట.


7_1_278

చ. మెఱుఁగులు గర్జితంబులును మిక్కిలిసోనయుఁ గల్గుమేఘము

ల్గిఱిగొన నొప్పు నాకసములీల రణక్షితి సూడఁ బొల్పగుం

దఱ చగుభూషణద్యుతివితానము పర్వగజవ్రజంబు పె

ల్లొఱలుచు నెత్తరుల్ దొరఁగుచుండ నొగిం బడి యున్కి నత్తఱిన్.


7_1_279

ఆ. అశ్వసుభటతతుల యంగఖండంబులు

రుధిరకర్దమమున బ్రుంగి యున్న

పెల్లు చూడ రౌద్రబీభత్సకరుణభ

యానకైకహేతు వయ్యె నధిప.


7_1_280

వ. అట్టిసమయంబున నారోహకులు వడినం దెరలం బాఱువారణహయంబు

లును వాహసంబులు విహరంబు లయిన వెడవెడ మెలంగు వివిధయోధు

లును రుధిరమాంసము స్తిష్కమయమహాపంకంబునం గలయ మునింగియం

గాళులు వెఱుక రాకుండియు గొరిజ దిగంబడియును రథకరిఘోటకంబులు

సంచరింప నేర కునికి వెడంగు వడుచుం బెనంగు కడిందిమగలును రక్తాం

బుతరగావర్తకరిగిరికలితంబైనసమరాంగణసాగరంబు నానావిధవాహన

యానపాత్రగతులం దఱియుం జొచ్చి తమయట్టివారు గొందఱు మునింగి

నను వెండియు విజయధనవాంఛం జేసి వెఱవక వర్తించు వీరవ్యవహారులు

నయి యెయ్యది సూచిన నెత్తుటం గెం పెక్కుసైనికులుక్కునం బొంపిరి

వోవుచున్న సంకులసంగ్రామంబునం జెక్కు సెమర్పక దర్పంబునం జెలం

గుచు ద్రోణుం డెలుంగు సూపి కడంగి.


7_1_281

క. కరియూథనాథుఁ బొదువం

ద్వరితోద్ధతి యానదుర్ని వారంబై కే

సరి సనియెడుపగిది యుధి

ష్ఠిరుదెసకుం జనియె నతనిసేన దలంకన్.


7_1_282

క. అతికోలాహలవికల

స్థితి యగుతనబలము మిగిలి ధీరత్వమహో

న్నతుఁ డగునతండు విశిఖ

ప్రతతి వఱపె గురునిపై నరాతులు వొగడన్.


-: ద్రోణాచార్యునిచేత సత్యజిత్తు సచ్చుట :-


7_1_283

చ. కని ద్రుపదాన్వయోత్తముఁ డకంపితశౌర్యుఁడు సత్యవిక్రముం

డనుపమధైర్యధుర్యుఁడు మహాబలదీప్తుఁడు సత్యజిత్తు ద్రో

ణుని వెసఁ దాఁకితత్తునువు నొవ్వ దశోగ్రశరంబు లేసి సూ

తునిమెయిఁ గ్రుచ్చెఁ బేర్చి పదితూపలు ధర్మజుఁ డుల్లసిల్లఁగన్.


7_1_284

ఆ. గురుఁడు సత్యజిత్తు కోదండదండంబు

దునుముటయును వేఱుధనువు వుచ్చి

కొని యుదాత్తరేఖఁ గ్రూరభల్లంబులు

ముప్పదింట నతనిఁ గప్పె నతఁడు.


7_1_285

వ. తదవసరంబున సత్యజిత్తుం గూడికొని.


7_1_286

క. వృకుఁ డనుపాంచాలకుమా

రకుఁ డఱువదితూపులం గరం బరుదుగ న

స్త్రకళాచార్యుం బొదివిన

వికాసముం బొందెఁ బాండవేయబలంబుల్.


7_1_287

చ. ఘనతరకోపవేగమునఁ గన్నుల నిప్పులు రాల సత్యజి

త్తనువు వృకాంగమున్ విశిఖధారల ముంచె గురుండు వార లా

తనివడి కోర్చి మైగలయఁ దాఁకఁగ సారథియు బ్బడంగ వా

హనములు బీఱువోవ సిడ మల్లల నాడఁగ నేసి రుద్ధితిన్.


7_1_288

ఆ. సత్యజిత్తుమేన సాయకదశకంబు

నాఁటి కుంభజుండు నగుచు విల్లు

దునుమ నొండువింట ద్రోణుని నొప్పించె

నతఁడు వృకుఁడుఁ బెలుచ నడరి యేసె.


7_1_289

క. కినిసి వెసన్ సత్యజితుని

ధనువు నఱకి గురుఁడు వృకునితల దునియఁగ నా

తనిహయములు సారథియును

మును డొల్లఁగ నాఱుబాణముల్ బి ట్టేసెన్.


7_1_290

ఆ. అన్యచాపహస్తుఁడై సత్యజిత్తుసం

రంభజృంభణమునఁ గుంభజన్ముఁ

దలర నేయుటయు నతండు గెంపారెడు

నాననంబుతోడ నవుడు గఱచి.


7_1_291

ఉ. ఖండములై పడం ధనువు గ్రక్కున నేయుడు సత్యజిత్తు వి

ల్గొండు గొనం గొనం దునియ నుద్ధతి నేయుచుఁ బెక్కు విండు లు

ద్దండత నుగ్గుసేసి భుజదర్పధురంధరుఁ డీతఁ డింత ద

క్కం డని యర్ధచంద్రవిశిఖప్రహతిం దల డొల్ల నేసినన్.


7_1_292

క. సాహంకారుం డగుగురు

బాహుబలంబునకు నులికి పాఱఁ దొలంగెన్

వాహములఁ దోలుకొని యు

త్సాహంబుఁ జలంబు నెడల ధర్మజుఁ డధిపా.


-: ద్రోణాచార్యునిచేత సూర్యదత్తుఁడు సచ్చుట :-


7_1_293

సీ. ఆతని వెనుకొన నాచార్యునకు నడ్డపడి వారిమొన లెల్లఁ గడక నొక్క

వెట్ట త్రోచిన దూదితిట్టలపైఁ బ్రాఁకు నగ్నిచందంబున మ్రగ్గఁ జేయు

నగ్గురుఁ దాఁకి మాత్స్యానుజుఁడాఱుదూపుల నొంచియార్పిననలిగియతని

తనకుండలములతో నిలఁబడ నతఁ డేసె ధరణినాయక సూర్యదత్తుఁ డిట్లు


ఆ. వడినఁ జూచి మత్స్యబలకోటివిచ్చినఁ

జేదిమగధకేకయాదిసేన

లెల్లఁ జెదరఁ దల్లరఁ దల్లడపడఁ గల

గుండుకొనఁగఁ జేసెఁ గుంభజుండు.


7_1_294

క. మెఱుమ ధనుర్దండము గుణ

ముఱుమఁగ విశిఖతతి దొరుఁగ నొక్కటఁ దఱ చై

పఱవ రుధిరంపుఁగాలువ

లఱిముఱి ఘనభుజుఁడు ద్రోణుఁ డడరె నరేంద్రా.


7_1_295

క. వీరాస్థిశర్కరాఘవ

భేరీమండూకకవచపృథులోర్మరథ

స్ఫారావర్తగజమకర

ఘోరమహిమ రక్తనదులకుం దగియె నృపా.


7_1_296

వ. ఇవ్విధంబునం బాండవాగ్రజుం బట్టికొన నప్పళించి తఱుము నమ్మహావీరు

మార్కొని యుధామన్యుండును నుత్తమౌజుండును వసుదానుండును

శిఖండియును నైదైదుశరంబు లేసిరి సాత్యకిక్షత్రధర్ములు వరుసన నూట

యిరువదింటఁ బదింటం గప్పి రయ్యుధిష్ఠిరుండును మరలి బాణశతత్రయ

ప్రయోగతీవ్రులగుధృష్టద్యుమ్నచేకితానులమున్నిడికొని పొంగి తానును

బండ్రెంట నొప్పించె నప్పు డాభారద్వాజుని మఱియునుం బలువురు పాండ

వపక్షయోధవీరులు వొదివినం గని నీమన్నించురాజులు రాజకుమారులు

నతనికి బాసటయై కవిసి రతండు వసుదాను వసుధం గూల్చి క్షేము జము

కడ కనిచి యుధామన్యుని నుత్తమౌజుని శిఖండిని సాత్యకిని బెక్కమ్ము

లెమ్ములం గీలించి తన్నుం గదిసినం గని యయ్యజాతశత్రుండు వెండియుఁ

గైతవంబున రణంబు దక్కి తొలంగం బాఱిన.


7_1_297

క. గురుదృఢసేనుఁడు దాఁకిన

హరిసారథి కేతురథశరాసనశకలో

త్కరములతోడ నతండును

దొరఁగించెఁ దదీయతనువు దునియలు ధరణిన్.


7_1_298

వ. ఇత్తెఱంగునం దునిమి తఱుమునతనిదోర్విలాసంబు దుస్సహం బగుటయుం

బాండవబలంబులు దెరలినం గురుసైనికులు నలుగడలకు నెగచి రట్లు విజృం

భించినకుంభసంభవు నెదుర్కొని వార్ద్ధక్షేమియుఁ జిత్రసేనుండును సేనా

బిందుండును సువర్చసుండును ధృష్టద్యుమ్నుండును జేకితానుండును శిఖం

డియు సాత్యకియును సుమిత్రుండును సాయకజాలంబులు నిగిడించిన.


7_1_299

తే. అందఱకు నన్ని రూపులై యతఁడు వోరి

యాసుమిత్త్రునిఁ గూల్చిన నతనిఁ గేక

యులును మాత్య్యపాంచాలురు నొక్కపెట్ట

కవిసి విరిసిరి తచ్ఛరాఘాతభీతి.


7_1_300

వ. ధృష్టద్యుమ్నసాత్యకిసేనాబిందుప్రముఖరథికవరులును వసమఱి యుండి

రనిన విని ధృతరాష్ట్రుం డచ్చెరువడి యిట్లు వేర్చినయాచార్యు శౌర్యభుజ

వీర్యంబులు సైరింప నక్కడ నెవ్వరు లేరైరి గదే యనుటయు సంజయుం

డది సెప్పెద నాకర్ణింపు మని యి ట్లను నట్లు గలంగినకౌంతేయసేనం

గనుంగొని కలకల నవ్వుచుఁ గురువిభుండు గర్ణునితో ని ట్లనియె.