ఆ భా 6 1 001 to 6 1 030

వికీసోర్స్ నుండి


శ్రీమదాంధ్ర మహా భారతము
భీష్మ పర్వము – ప్రధమాశ్వాసము

6_1_001
క. శ్రీ సంపాదిపదాంబుజ|
నాసాగ్ర నివాస రసిక నాదామృత ధా|
రా సారరూప వేద|
వ్యాసవ్యంజిత విహార హరిహరనాథా.|

- ధృతరాష్ట్రుని కడకు వేదవ్యాసుండు వచ్చుట –
సం. 6-2-1

6_1_002|
క. దేవా జనమేజయ వసు|
ధా వల్లభుఁ డధిక వినయతత్పరుఁ డై సం|
భావించి కుతూహలమునఁ|
దా వైశంపాయునకుఁ దగ నిట్లనియెన్.|

6_1_003
క. ఒండొరుల గెలుచు తలఁపునఁ|
బాండవులును గౌరవులును బాహా గర్వో|
ద్దండత నెట్లు దొడంగిరి||
భండన మెప్పాటఁ జెల్లెఁ బరమ మునీంద్రా.|

6_1_004
క. అనుటయు వైశంపాయనుఁ|
డను మోదరసార్ద్ర హృదయుఁ డై యిట్లనియెన్|
జనమేజయు మనమున సం|
జనితం బగు కౌతుకంబు సఫలతఁ బొందన్.|

6_1_005
వ. పుణ్య క్షేత్రోత్తమం బయిన యా కురుక్షేత్రంబున నా రెండుదెఱంగుల వారి కటకంబులును విడిసి కయ్యంబునకు గాలు ద్రవ్వునట్టి సమయంబున ధృతరాష్ట్రుండు గొడుకుల దుర్వినయంబునకు నిర్వేదనంబు నొంది సంజయ ద్వితీయుం డై చింతించు చున్న యెడకుం ద్రికాలవేది యగు వేద వ్యాసుండు విజయం చేసి యమ్మహీపతి సేయు నర్చనఁబులం గైకొని యతని కిట్లనియె.|

6_1_006
క. కాలం బగుటయు నృపులకు|
నాలము సమకూరె దీని కడలకు మది నీ|
వాలోకింపఁగ వలసిన|
నే లోనికి దివ్యదృష్టి నిచ్చెదఁ బుత్త్రా.|

6_1_007
చ. అనుఁడు నతండు ఘోరముగ నన్నలుఁ దమ్ములుఁ బోరు క్రూరతం|
గనుఁగొనఁ జాల నేను వినఁగా వలతుం దదనుగ్రహంబు సే|
సినఁ గడు లెస్స యన్న ముని చిత్తమునం గరుణించి సంజయుం|
బనిచె మహారణంబు పరిపాటి మెయిన్ సకలంబుఁ జెప్పఁగన్.|

6_1_008
వ. ఇట్లు ధృతరాష్ట్రునకుం గయ్యంబు తెఱంగు వినిపింప నియోగించి యా సూత నందనునకు నా రెండు దెఱంగుల వారి దివారాత్ర ప్రవర్తనంబులు గనునట్లును రహస్య ప్రకార భాషణంబులు వినునట్లును మనోవృత్తంబు లెఱుంగునట్లునుంగా వరం బిచ్చి యతి శీఘ్ర గమనంబు నొసంగి భారత సమర ధరణిం దిరిగినను శస్త్రాస్త్రంబు లెవ్వియుం దాఁకకుండునట్టి ప్రభావంబుఁ బ్రసాదించి దివ్యుల యాలాపంబులు రూపంబులుం దలంపులుం దేటపడునట్టి మహనీయ బోధంబును గలుగ ననుగ్రహించి యా వైచిత్రవీర్యు నాలోకించి యిది ప్రాప్తకాలం బై వచ్చిన భూప్రజాక్షయంబు దీనికి వగవం బని లేదు ధర్మోజయ తనుచు నిశ్చింతంబున నుండు మేనును గురుపాండవుల కీర్తిఁ బ్రగటింప గలవాఁడ నని యతని నాశ్వాసించి సాత్యవతేయుండు వెండియు.|
|
6_1_009
క. మొగుళులు లేకయు నుఱుములు|
గగనక్షోభంబు సేసెఁ గరిహయతతిఁ బె|
ల్లుగ నశ్రు లురులఁ జొచ్చెను
మృగములు పక్షులను బసులు మృగముల నీనెన్.|

6_1_010
క. నలువురు నేవురు బిడ్డలు
గలిగెద రొక్కొక్క వనిత గర్భంబున వా
రలు పుట్టినపుడ యాడుచుఁ
గలకల నవ్వుచుఁ జెలంగఁ గనియెద మెందున్.

6_1_011
తే. అర్కునుదయాస్తమయములయందుఁ గృష్ణ
కాంతి ఘోరకబంధంబు గప్పఁ జొచ్చె
నిందులాంఛన స్థితి తలక్రిందు గాఁగఁ
దోఁచు చున్నది ప్రజ యెల్లఁ ద్రుంగ కున్నె.

6_1_012
వ. విశేషించియుం గౌరవ నికేతనంబులఁ గేతనంబులఁ బొగ లెగయుటయు నాయుధంబులు మండుటయు నివి మొదలుగా ననేక దుర్నిమిత్తంబులు పుట్టుచున్నయని కులక్షయంబును నానా నరేంద్ర నాశంబును నగు నుపేక్షింపం దగదు దుష్పథ వర్తులగు దుర్యోధనాది కుమారుల వారించి నీ తమ్ముని పా లతని కొడుకుల కొసంగి శాంతి సేయుట మేలు మముబోంట్ల మనంబులకుం బ్రియంబు గాని యీ రాజ్యంబు నీ కేటి కనిన విని యమ్మనుజేంద్రుం డమ్మునీంద్రున కిట్లనియె.

6_1_013
చ. హితమును ధర్మముం దలఁచి యిమ్మెయిఁ జెప్పితి రిట్లు మున్ను నా
సుతుల నయంబుమై దఱిమి చూచితి వారలఁ బంపుసేయ నేఁ
జతురుఁడఁ గాను బ్రాభవము సాలదు నా దెసఁ దప్పు లేమి మీ
మతిఁ దలపోసి యీ పలుకు మానుఁడు పాకము దప్పెఁ గార్యముల్.

6_1_014
వ. అనిన విని పరాశర సూనుం డది యట్లుండనిమ్మింక నేమేనియుం జెప్పవలయునది గలదే యని పలికిన నాంబికేయుండు గయ్యంబున గెలుపు దెలుపు నిమిత్తంబు లడిగిన నమ్ముని వరేణ్యుండు వహ్నులు హోమ కాలంబునం బుణ్య గంధంబులతోఁ బ్రదక్షిణార్చు లగుటయు భేరీ ప్రముఖంబులు గంభీర ఘోషంబు లగుటయు వాయువులు నుకూల మృదు మనోహర ప్రచారంబు లగుటయు నివి మొదలుగాఁ గొన్ని శుభ సుచకంబులు నిర్దేశించి కొంచెంబు పెద్ద యన లేదు సమరంబున జయంబు దైవాధీనంబు గావునం బెద్దలు పెనఁకువ లొప్ప వని చెప్పుదు రేను బోయివచ్చెద నని చెప్పి సముచిత ప్రకారంబున నంతర్ధానంబు సేసెఁ దదనంతరంబ యక్కౌరవేంద్రుండు గొండొక సేపు చింతించి నిట్టూర్పు నిగుడించి సంజయున కిట్లనియె.

6_1_015
ఉ. భూమికిఁ గాఁగఁ బ్రాణములపోక దలంపక రౌద్రఘోర సం
గ్రామము సేయుచుండుదురు రాజులు దొల్లియు నెంత దీపొకో
భూమి మునీంద్ర సంగతి సుబుద్ధము నీకు జగంబు నాకు నీ
భూమి తెఱంగు సెప్పుము ప్రబోధ నిరూఢముగా సమస్తమున్.

6_1_016
వ. అనిన విని సంజయుం డతని కిట్లను నాయెఱింగినంతయు నెఱింగించెద భూతత్త్వ ప్రకారం బవధరింపుము.

- సంజయుఁడు ధృతరాష్ట్రునకు భూపరిమాణంబు సెప్పుట -
సం. 6-5-9

6_1_017
తే. అధిప నానా ప్రకార చరా చరంబు
లింద వేర్వేఱ జనియించు నింద పెరుఁగుఁ
బిదప నింద యడంగు నీ పృథ్వి దాన
సకలమునకుఁ బరాయణస్థాన మరయ.

6_1_018
వ. అదియునుంగాక విను మాకాశంబునకు గుణంబు శబ్ధంబు వాయువునకు శబ్దస్పర్శంబులును దేజంబునకు శబ్దస్పర్శరూపంబులును నప్పులకు శబ్దస్పర్శ రూప రసంబులును గుణంబులు పృథివికి శబ్దస్పర్శ రూప రసగంధాత్మకం బైన గుణ సముదయం బంతయుం గలదు గావున నిమ్మహాభూతంబు లేనింటిలోనం బృథివి యెక్కుడు దీనియున్న విధంబు వివరించెద నాకర్ణింపుము.

6_1_019
సీ. ధాత్రీశ మేరువు దక్షిణంబున
సుదర్శన మను నభిధానమునఁ బ్రభుత
విస్తార మై రెండు వేలు నేనూఱు
యోజనముల పొడువు నై సరస మధుర
విపుల శాశ్వత ఫల వితతి సమేత మై
యొక్క జంబూతరు వొప్పి యుండు
దాని పండులు మహీ స్థలి మహారవముగ
ననిశంబుఁ బడి రాలి యవియుచుండు

ఆ. వాని పసము పొంగి వాహినీ మూర్తి న
న్నగమునకుఁ బ్రదక్షిణంబు గాఁగ
నొరసికొనుచుఁ దిరిగి యుత్తకురుభూము
లందుఁ జొచ్చి పాఱు నంబునిధికి.

6_1_020
వ. జంబూనది యనం బరగిన యా తరంగిణీ నీరు సోఁకిన చోట్లెల్లను సువర్ణం బగుటం జేసి కనకంబునకు జాంబూనదం బను నామంబునం గలిగెఁ దదీయ జలపానంబు సేసిన మానవులకు ముదిమియుం దెవులును దప్పియు లే వని చెప్పుదు రయ్యేటి పడమటం బెరిఁగి పఱపు గలిగి శరనిధి చందంబున జంబూ షండంబు గాఱుకొనుచుండు నింతటికిం గారణం బయిన యా జంబూ వృక్షంబు పేర నీ ద్వీపంబు జంబు ద్వీపంబును సుదర్శన ద్వీపంబు నన నెగడి లవణ సముద్ర ముద్రితం బయి పొలుచు నద్దీవియందు.

6_1_021
సీ. నిడుపునఁ దూర్పను బడమర నై
గడలు నంభోనిధి గదిసియుండు
రత్నమయంబులు రమణీయములు
సాధ్య సిద్ధ చారణగణ సేవితములు
నై హిమాచలమును నావల హేమ
కూటంబును నట నిషధంబు నొప్పు
లలితంబు లైన నీల శ్వేత శృంగ
వంతంబులు గ్రమమునఁ దనరి పొలుచు

ఆ. నివులమూఁటి కవల నవుల యమ్మూఁటికి
నివలఁ దేజరిల్లు దివిజ నగము
గమల కర్ణి కానుకారి యై కాంచన
మణిమయత్వ మహిమ మహిత మగుచు.

6_1_022
తే. అతి దృఢం బగు పాఁతు పదాఱు వేల
యోజనము లంద్రు దానికి రాజ ముఖ్య
విందు మెనుబది నాలుగు వేల యోజ
నంబులని హేమ ధాత్రీ ధరంబు పొడువు.

6_1_023
వ. ఇవ్విధంబున భూ మధ్యంబున నున్న యమ్మేరు మహీధరంబున దేవతలును దేవములును గంధర్వ కింపురుషాది దేవ యోనులును దేవేంద్ర ప్రముశ దిక్పతులును బరమేష్ఠియుం దత్తత్ప్రదేశంబులఁ బుణ్య వర్తనంబులం బరమ సుఖంబు లనుభవింతు రుత్తర తటంబునం గర్ణికార వనంబున గౌరీ సమేతుం డై సిద్ధ గణంబులు పరివేష్టింప విశ్వేశ్వరుండు విహరించు చుండు.

6_1_024
క. తొమ్మిది ఖండము లై వ
ర్షమ్ము లనం జాల నొప్పెసఁగు జంబుద్వీ
పమ్మున జనపదములు విను
మమ్మహితాంశములు దెలియ నను వర్ణింతున్.

6_1_025
వ. ఉత్తర సముద్రంబు శృంగవంతంబు మధ్యమం బైరావత వర్షంబన నొప్పు శ్వేత పర్వత శృంగవంతంబుల నడుము హైరణ్మయ వర్షం బనం బొలుచు నీల శైలోత్తర దక్షిణ దేశంబులు గ్రమంబున రమణక వర్షంబును ననం జెలు వమరు మేరువునకుం బ్రాచ్యప్రతీచ్యంబు లగు భాగంబులు వరుసన భద్రాశ్వ వర్షంబును గేతు మాలా వర్షంబును ననం బొగడొందు హేమ కూటోత్తర భూమి హరి వర్షంబన నెగడు హిమవంతంబు నక్కడయు నిక్కడయు నోలిన కింపురుష వర్షంబును భారత వర్షంబును ననం బెంపారు నిట్లున్న దీని యందు.

6_1_026
క. భారత వర్షముఁ దొడఁగి మ
హీ రమణ యుదీచ్యము లను నెక్కడు బల స
త్త్వారోగ్యాయు స్సుఖ పు
ణ్యారంభ గుణంబు లంత కంతకు నరయన్.

6_1_027
వ. అనిన విని వైచిత్ర వీర్యుండు సమస్త ద్వీపంబులు సకల జల నిధులు నున్న పరిపాటియుం బ్రమాణంబులు బ్రకాశంబుగ నెఱిఁగింపు మనుటయు సూత సూనుండు జంబు ద్వీప విష్కంభంబు కొలఁది యెనుబది వేలు నాఱు నూఱు యోజనంబులు దీని రెండంతలు దొడంగి లనణేక్షు సురాఘృత దధి క్షీర శుద్ధ జలమయంబు లయిన మహార్ణవంబు లవిష్కంబులు గ్రమంబున నొకటి కొకటి రెట్టి యై యుండుఁ బ్లక్షద్వీప శాల్మల ద్వీప క్రౌంచ ద్వీప కుశ ద్వీప శాక ద్వీప పుష్కర ద్వీపంబుల విష్కంభంబులు జంబు ద్వీప విష్కంభ ద్విగుణ ప్రమాణంబు మొదలుగా నోలి నొకటి కొకటి యినుమడి యై యుండు నయ్యాఱు దీవులును జంబు ద్వీపంబు కంటె నెల్ల దానను బొగడ్తవడి యనేక పర్వతంబులను నానా నదులను బహుజన పదంబులను నొప్పి వరుస నొండొంటికి గుణ విశేషంబుల నధికంబు లై యండు నింతకుం గర్తయు భర్తయు హర్తయు నై దుగ్ధాంభుధియుత్తరంబునం గనకమయం బై యష్ట చక్రంబును బ్రభూత భూత యుక్తంబును మనోజవంబును నగు మహనీయ శకటంబున వినోద పరాయణుం డైన నారాయణుండు వికుంఠ నిధానుం డగుచు వైకుంఠాభిధానంబున విఖ్యాతుం డై విహరించు చుండునని చెప్పుటయు నతండు.

6_1_028
క. భారత వర్షమునకుఁ గాఁ
గౌరవులును బాండవులును గాంక్షం గడుం చె
ల్లై రాసి యొండొరులతోఁ
బోరం దెగి రిట్టి లుబ్ధ బుద్ధులు గలరే.

6_1_029
వ. అనిన విని యమ్మనుజ పతికి సంజయుం డిట్లనియె.

6_1_030
ఆ. అధిప పాండు సుతుల కరయంగ నతి కాంక్ష
లేదు లుబ్ధ బుద్ధి నీదు సుతుఁడు
శకుని కఱపు విని యసన్మార్గ వృత్తికిఁ
జొచ్చి యిట్టి యెడరు దెచ్చికొనియె.|