ఆ భా 3 7 361 to 3 7 390

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

--రానారె 11:11, 20 సెప్టెంబర్ 2006 (UTC)


3_7_361 చ.

అనవుడుఁ గర్ణుఁ డిట్లనియె నక్కట యేను విశిష్టవస్తువుల్

గొనకొని యిత్తు నాఁగ నిటు గోరెదు నీవు దలంప నప్రయో

జన మగువాని భూమిసురసత్తమ యెంతయు బేల వైతి ము

న్నెనయఁగ నిట్టి వెవ్వరును నెవ్వరి వేఁడిరె యిజ్జగంబులన్.

3_7_362 క.

కుండలములుఁ గవచము న

ట్లుండఁగని మ్మనఘ వేఁడు మొండు ధనంబుల్

నిండింతు నీమనోరథ

మొండేమియు ననకు మింక నూర్జితచరితా.


3_7_363 వ.

అనిన నతం డెవ్విధంబున నొడంబడక కవచకుండలంబులయంద బద్ధాభి

లాషుం డయి పలికినఁ గర్ణుం డలనిం బ్రార్ధించియుఁ బూజించియు ననేక

మణికనకాదిద్రవ్యంబులు నివేదించియు నెట్లును నొడం బఱుపనేరక

యిట్లనియె.


3_7_364 తే.

సహజములు నాకు నిక్కవచంబుఁ గుండ

లములు నివిలేక యున్ననే సమరభూమిఁ

గడిఁదిశత్రువులచేత భంగంబు వచ్చుఁ

గాన యీఁజాల నయ్యెద వీని నేను.


3_7_365 క.

నానాజనపదబహుళము

నానాధనయుతము నైన నారాజ్యము స

మ్మానంబున నిచ్చెదఁ గొన

వే ననుఁ గారింప కింక విప్రవరేణ్యా.


3_7_366 వ.

అనియును నతనియందు సుముఖత్వంబు గానక కానీనుండు దరహ

సితాననుం డగుచుఁ గృతకభూసురు నుపలక్షించి యిట్లనియె.


3_7_367 చ.

ఎఱిఁగితి నిన్ను నేను విభుదేంద్రుఁడ వీవు జగత్త్రయంబు గ్ర

చ్చఱ భవదీయరక్షణమునంద వెలుంగుచు నుండు నట్టి ని

న్నుఱవుగ నేను వేఁడుకొన యుక్తుఁడఁగాక మొఱింగి నన్ను న

క్కఱ పడి నీవు వేఁడు టిది కర్జమె నిర్జితదైత్య చెప్పుమా.


3_7_368 తే.

అనిన నింద్రుఁ డిట్లనియె మీయయ్య పద్మ

హితుఁడు మున్నింతయును జెప్పె నిష్ట మెసఁగ

గాన నెఱిఁగితి నీ వింకఁ గడప నేల

యనఘ మాబోఁటులకుఁ బ్రియమైన పనికి.


3_7_369 వ.

అనిన రాధేయుండు దేవా యట్లయిన నిఖిలశత్రుఘాతిని యైన నీయమోఘ

శక్తి నాకుం గృపసేసి కవచకుండలంబులు గొను మనినం బాకశాసనుం డి

ట్లనియె.


3_7_370 ఉ.

ఇచ్చెద శక్తి నీకు విను మేర్పడ నాజి మదీయశత్రులం

గ్రచ్చఱఁ జంపి చంపి యది గ్రమ్మఱ చేతికి వచ్చుచుండు నీ

కిచ్చుట యట్లుగాదు భువి నెందును దుర్జయుఁ డైన నీరిపుం

జెచ్చెరఁ దున్మునొక్కరుని చేకుఱ నన్ను భజించుఁ గ్రమ్మఱన్.


3_7_371 వ.

ఇట్టిది సమయంబుగాఁ బరిగ్రహింపు మనినఁ గర్ణుండు నాకుం గల పగ

తుండును నొక్కరుండ వాని వధియించుటయ మదీయమనోరథం

బనుటయుఁ బురందరుండు దరహసితవదనుండై.


3_7_372 ఉ.

నీయభిలాష మేను మది నిక్క మెఱుంగుదు నుగ్రశౌర్యతే

జోయుతుఁ బార్థు నోర్తునని చూచెదు నీకది యేల తీరు రా

ధేయ దయావిధేయుఁడు విధేయజగత్త్రయుఁడవ్యయుండు నా

రాయణుఁ డమ్మహాత్మునకు రక్షకుఁ డేరికి వాఁడు సాధ్యుఁడే.


3_7_373 వ.

అనినం దపనందనుం డది యట్లుండె సహజం బైన కవచం బొలిచి యిచ్చిన

మదీయదేహంబు వికృతంబగు నిదియేమని యవధరించెదవనిన నింద్రుండు

నీశరీరంబు భవజ్జనకుం డైన యరుణకిరణువర్ణం బెట్టి దట్టి దీప్తిం జెలు

వొందు నని పలికి వానికి నమోఘశక్తి యొసంగి దీని నాపత్కాలంబునం

దక్కఁ బెఱయప్పుడు ప్రయోగించిన నీ కపాయం బగు నని చెప్పెఁ దదనంత

రంబ యవ్వీరుండు కవచకుండలంబులం బుచ్చి యతని కిచ్చె.


3_7_374 చ.

అలఘునిశాతశస్త్రమున నంగములెల్లను నిర్వికారుఁ డై

యొలువఁ దొడంగినట్టియెడ హో యని కిన్నర యక్ష సిద్ధ సా

ధ్యులు దివినుండి యార్చుచును దూర్యరవంబు సెలంగ నద్భుతం

బెలయఁగఁ బుష్పవృష్టిఁ గురియించిరి కర్ణునిపైఁ బ్రియంబునన్.


3_7_375 వ.

ఇట్లు సూతపుత్రుని వికృతగాత్రుం జేసి వానవుండు ప్రమోదవికాస

భాసితుం డగుచు నిజలోకంబున కరిగెఁ దద్వృత్తాంతం బంతయు విని

కౌంతేయులత్యంతసంతోషంబునం బొదలిరి గాంధారేయులు దుఃఖవిదారిత

హృదయు లై రని యిట్లు కవచకుండలాభిహరణంబు సవిస్తరంబుగాఁ

జెప్పిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.


3_7_376 క.

అనయము దుస్తర మగు న

వ్యనవాసము నిస్తరించి ద్వాదశవర్షం

బున కడపట నేమివిధం

బొనరించిరి మత్పితామహులు మునినాథా.


3_7_377 వ.

అనిన నమ్మహీపతికి నమ్మహీదేవుం డిట్లనియె నట్లు మార్కండేయువలనఁ

బుణ్యకథలు విని పాండవు లనంతరంబ క్రమ్మఱి ద్వైతవనంబునకుం జని

యం దొక్కనాఁడు సుఖాసీనుం డయి యున్న ధర్మరాజుపాలికి నొక

బ్రాంహణుండు సంభ్రమంబునఁ జనుదెంచి యిట్లనియె.


-:ధర్మరాజు బ్రాహ్మణుని యరణిఁ దెచ్చుటకుఁ బోవుట:-


3_7_378 క.

తరుశాఖఁ దగిల్చిన నా

యరణి యొక మృగంబు వచ్చి యతిరయమున న

త్తరువును నొరసి కొనంగా

ధరణీశ్వర తగిలెఁ జువ్వె తచ్చృంగమునకున్.


3_7_379 క.

దానిఁ గొని పఱచె నమ్మృగ

మానతరిపులోక నాకు నయ్యరణిఁ దగం

గా నిపుడు దేరఁ బనుపవె

భూనుత నిత్యవిధిలోపమునఁ జనకుండన్.


3_7_380 చ.

అనవుడు నక్షణంబ మనుజాధిపుఁ డుద్ధతచాపహస్తుఁ డై

యనుజులుఁ దాను నెంతయు రయంబున నాహరిణేంద్రుపజ్జఁ గై

కొని చని కూడముట్టి మెఱుఁగుల్ నిగుడం బటుసాయకంబు లే

సిన నొక యమ్ము నమ్మృగము సెందెద చేరెద యద్భుతంబుగన్.


3_7_381 వ.

అదియును వారి నతిదూరంబుగా నెలయించికొని చని యొక్క ఘోర

విపినంబున నదృశ్యం బైన ప్రయత్నంబు విఫలం బగుటకు విషాదంబు

నొందుచు నయ్యేవురు నతిశ్రాంతు లై శీతలచ్ఛాయం బగు నొక్క వటమహీ

రుహంబుక్రింద విశ్రమించి రపుడు నకులుండు ధర్మనందనున కి ట్లనియె.


3_7_382 క.

కులశీలోన్నతియు విని

శ్చలకరుణారతియు ధర్మసంగ్రహమతియుం

గలమనకు నివ్విధంబున

నలదడి వచ్చుటకు మూల మది యెయ్యదియో.


3_7_383 వ.

అనిన నమ్మహాప్రాఙ్ఞుం డతని కి ట్లనియె.


3_7_384 క.

వినుము సుఖమునకు దుఃఖం

బునకుం గారణము దనదు పూర్వకృతం బై

చను కర్మమ కారణ మిది

యని యన్యము గలుగనేర దం దొక్కటియున్.


3_7_385 చ.

అనుటయు భీమసేనుండు నకులున కి ట్లనియె.


3_7_386 చ.

ప్రాతికామి వోయి పాంచాలి గొలువులో

పలికిఁ దెచ్చి నపుడ యలుకయెసఁగ

నాంబికేయసుతుల నందఱఁదునుమక

యునికి నిట్టి యెడరు మనకుఁబుట్టె.


3_7_387 చ.

అనవుడు నర్జునుం డనియె నా సభ సూతసుతుండు పేర్చి ప

ల్కినపటువాక్యముల్ వినియుఁ గిన్కకుఁ బూనక యేఁ దొలంగి కా

ననమున కిట్లు కాతరజనంబుల చాడ్పున నేఁగుదెంచుటన్

మనకు దురంతదుఃఖములు మానక పైకొని వచ్చెఁ దమ్ముఁడా.


3_7_388 వ.

అనిన యనంతరంబ సహదేవుం డి ట్లనియె.


3_7_389 ఆ.

దుష్టశీలుఁ డైన దుర్ద్యూతవరుని గాం

ధారుఁ బట్టి యేను దడయ కపుడ

తునుమ కునికి నిట్టి దర్దశపా లైతి

మనఘ మనము కాననాంతరమున.


3_7_390 వ.

అని యిట్లందఱు నన్నితెఱంగులఁ బలుకుచుండ నజాతశత్రుండు నకులుం

జూచి భవదీయసోదరు లత్యంతవిపాసితు లైనవారు నీ విమ్మహీరుహం బెక్కి

జలంబు లున్న యెడ యరయు మనిన నతండును నవ్వనస్పతిసమారోహ

ణంబు సేసి దెసలు గలయం బరికించి దూరంబున సలిలంబు లున్న వని యన్న

కెఱింగించిన నతం డట్లేని నీవు పోయి జలపానంబు సేసి మాకును జలంబులు

గొని రమ్మని పనుచుటయు మాద్రేయుండు వృక్షావతీర్ణుం డయి రయంబునం

జని ముందట నతిమనోహరం బగు తటాకంబుఁ గని జలంబులు ద్రావం

బోయిన నొక్క యశరీరభూతం బిట్లనియె.