Jump to content

ఆ భా 3 7 241 to 3 7 270

వికీసోర్స్ నుండి

--రానారె 12:07, 10 సెప్టెంబర్ 2006 (UTC)


3_7_241 తే.

నాకు డప్పి యెక్కడిది మనంబు భర్తృ

చరణపంకజాసక్తమై కరము భక్తి

నలరుచున్నది సతులకు నన్య మెట్టి

దియును ధర్మమె భర్తృసంశ్రయము కాక.

3_7_242 వ.

మఱియు నొక్క విన్నపంబు సేసెద.


3_7_243 ఆ.

ఆత్మధర్మనిరతు లైన పుణ్యాత్ములు

దుర్లభులు సమస్తదురితములును

శాంతిఁ బొందు వారి సంసర్గమునఁ దీర్థ

భూతమతులు వారు భూతలమున.


3_7_244 ఉ.

వారల పేర్మిఁ గాదె శశివారిజమిత్రులు నిర్వికారసం

చారత నుల్లసిల్లెదరు సర్వపయోనిధులున్ నిరాకులా

కారతఁ గ్రాలెడుఁ గులనగంబులు నిశచలరూఢిఁ జాల నొ

ప్పారెడు భూతధాత్రి నిఖిలై కధురీణతఁ బేర్మిఁ బొందెడున్.


3_7_245 వ.

అని పలికి మఱియు ని ట్లనియె.


3_7_246 తే.

ఏడుమాటలాడినయంత నెట్టివారు


నార్యజనులకుఁ జుట్టంబులగుదురనినఁ

జిరసమాలాపసంసిద్ధిఁ జేసి నీకు

నేను జుట్టమ నని చెప్పనేల వేఱ.


3_7_247 వ.

కావున మిత్రమనోరథం బవస్యకర్తవ్యంబుగాఁ జిత్తగింపు మనిన

నమ్మహానుభావుం డబ్భామిని దెసం గనుంగొని నీకుం బ్రసన్నుడ నైతి

నీకిష్టం బైన వరం బొక్కటి యిచ్చెద నడుగు మనిన నమ్మానిని యి

ట్లనియె.


3_7_248 క.

మది సత్యవంతు జీవిత

మది యిమ్ముగఁ దొలఁగఁ బెట్టి యన్యంబుల ని

చ్చెద నని పలుకుదు మును నీ

వది యిప్పుడు లేద యింక నడిగెదఁ బ్రీతిన్.


3_7_249 చ.

పతి విరహంబు దుస్సహము భర్తృవినాకృత యైన కాంత దూ

షిత యగు సర్వమంగళవిశషములందును గాన మత్ప్రియుం

డతులితకీర్తిశాలి సుగుణాఢ్యుఁడు సాళ్వసుతండు లబ్దజీ

వితుఁడుగ నిమ్ము ధర్మపదవీపరిరక్షణ పుణ్యవీక్షణా.


3_7_250 వ.

అనిన నట్ల చేయుదు నని యక్షణంబ కృతాంతుండు సత్యవంతు నపగతపాశుం

జేసి యాసుందరి కి ట్లనియె.


3_7_251 చ.

కొని మిదె నీమనఃప్రియునిఁ గోమలి వీఁడు చతుశ్శతాబ్దముల్

మను నిటమీఁదఁ బుత్తరులఁ గ్రమంబున నూర్వురఁ గాంచుఁ గీర్తిన

ర్ధనుఁ డగు సంతతాధ్వర వితానములం బరితుష్టి సేయు న

య్యనిమిషకోటి కెల్లను నిజాన్వయమౌళి విభూషణం బగున్.


3_7_252 వ.

అని యాదేశించి యంతర్హితుండయ్యె నక్కాంతయుఁ గ్రమ్మఱి చని

యెప్పటియట్ల జీవితేశ్వరుతల తొడలపై నిడుకొని కూర్చున్నయెడం

గొండొక వడికి లబ్దచేతనుం డై సత్యవంతుండు దెలిసి నిజవల్లభం జూచి

యి ట్లనియె.


3_7_253 క.

కడుఁ దడవు నిద్రవోయితిఁ బడ

తీ ననుఁ దెలుఁవలదె బలియుఁ డొకరుఁ డె

క్కుడు జవమునఁ బట్టి బలం

బెడలఁగ ననుఁ దిగిచె నాతఁ డెవ్వఁడు సెపుమా.


3_7_254 చ.

అది కల గాదు నిక్కువమ యైనటు లున్నది నాకు నెంతయున్

మది వెఱపుట్టె నావుడును మానిని యిట్లను నీకు నంతయున్

ముదమున రేవుసెప్పెదఁ దమోమయమై యిదె శర్వరీముఖం

బొదవె విలంబనం బిచట నొప్పదు లెమ్ము నరేంద్రనందనా.


3_7_255 మ.

అదె న క్తంచరు లిందు నందును మహోగ్రాకారు లై క్రందుగా

మెదలం జొచ్చిరి ఘోరఫేరవతుల్ మిన్నందెఁ దీవ్రంబు లై

పదశబ్దంబులు మీఱెఁ జూడు కలయంబాఱం దొడంగెం బెనుం

గదుపుల్ గట్టి మృగంబు లెంతయు భయోత్కంపంబు నా కయ్యెడున్.


3_7_256 క.

విను నీవు దడయుటకు మీ

జననియు జనకుండుఁ గరము సంతాపభరం

బునఁ బొందుదు రింతకుఁ గ్ర

న్నన వారికి సంతసం బొనర్పవె యధిపా.


3_7_257 వ.

అని పలికి తదీయవిషాదచేష్టితంబు లుపలక్షించి వెండియు.


3_7_258 చ.

తమమును బెల్లుగాఁ బరగె దవ్వు నిజాశ్రమభూమియున్ మదిన్

శ్రమమును బాయ దిప్పు డను చందమయైనఁ జనంగనేల యిం

పమరఁగ నింతప్రొద్దు సుగుణాకర యిచ్చట నిల్చి రేపు వో

దమె తెఱఁగెద్ది నావుడును దన్వికి సాళ్వతనూజుఁ డిట్లనున్.


3_7_259 క.

మానె శిరోవేదన నా

మేనికిఁ దగ లావు వచ్చె మెల్లన జరుగం

గా నేర్తుఁ దల్లిదండ్రులఁ

గానక యేనెట్లు నిలుతుఁ గాననభూమిన్.


3_7_260 క.

ఇంతకు మున్నెన్నఁడు నే

నింత తడవు వారిఁ బాసి యెందుఁ దడయ నేఁ

డింతవడి మసలుటకు వా

రెంత వడిరొ యేమియైరొ యెట్లున్నారో.


3_7_261 ఆ.

సంధ్యప్రొద్దు నన్ను జనని యెన్నఁడు నిల్లు

వెడలనీదు నేఁడు విపినభూమి

మధ్యరాత్రివేళ మసలుట కాయమ

యెట్టిపాటు పడెనొ యేనెఱుంగ.


3_7_262 సీ.

కౌఁగిట ననుఁ జిక్కఁ గదియించి శిరము మూర్కొంచును బాష్పముల్ గురియుచుండఁ

బట్టి మాయొడలుల బ్రాణంపులును నెల్ల యర్థముల్ నీవ మాయన్ననీవు

దెప్పగా సంసారతీరంబు సేరెద మని తలంచెదము సుమ్మన్న యన్న

కన్నులు లేని మాకన్నులుఁ గాళులు నీవ కదన్న మానిఖిలవంశ


ఆ.

మును సముద్ధరించు మోపు నీయదియ క

దన్న యనుచు నిట్టు లగ్గలంపుఁ

బ్రేమ ననుదినంబుఁ బ్రేముడింతురు వృద్ధు

లక్కటకట యేమి యైరొ నేఁడు.


3_7_263 ఆ.

అడవి కేఁగుదెంచి యడరంగ ఫలమూల

తతులు గొనుచు నేను దడయ కపుడ

పోవఁగాన నైతి దైవోపహతి నింత

చిక్కువడితి నేమి సేయువాఁడ.


3_7_264 క.

నాయున్న చో టెఱుంగక

యాయాశ్రమవాసు లైన యందఱ యతిదుః

ఖాయత్తుఁ డగుచు నడుగును

మామయ్య దలంకి మాటిమాటికి నింకన్.


3_7_265 క.

నావార్త వినక యింతకు

నావృద్ధులు భిన్నహృదయ లై ప్రాణంబుల్

పోవిడుతురు గా కచటికి

బోవం బని గలదె యేనుఁ బుచ్చెద నసువుల్.


-: సత్యవంతుఁడు సావిత్రితోడ మరలి తన యాశ్రమంబునకు వచ్చుట :-

3_7_266 వ.

అని బహుప్రకారంబులం బలవించి కన్నీరు నించిన నక్కాంత దుఃఖా

క్రాంత యగుచు నతని నాశ్వాసించి నవమృణాళమృదులంబు లగు భుజం

బులం గౌఁగిలించి యెగయ నెత్తిన మెత్తన లేచి యతండు ధూళిధూసరితం

బైన శరీరంబు దుడిచికొని గమనంబున కుత్సహించిన.


3_7_267 ఆ.

ఫలభారము దుర్భర మని

వెలఁది యచట నొక్కవృక్ష విపటంబున ని

మ్ముల గరడియ దగిలిచి యు

జ్జ్వలపరశువుఁ గొనుచు మృదులసంభ్రమలీలన్.


3_7_268 వ.

జీవితేశ్వరు వామబాహువు నిజవామభుజంబుపయి నిడికొని దక్షిణ

హస్తంబున నతని గ్రుచ్చి గౌఁగిలించి మందగమనంబున నాశ్రమ

దేశంబునకు మగుడె నంత నక్కడ.


3_7_269 ఉ.

కన్నులువచ్చి యెల్లెడలుఁ గన్గొని వృద్ధనరేంద్రుఁ డాత్మకుం

గన్నులుఁ బోలెనైన తన గాదిలి పుత్త్రుఁడు గాననంబులో

నెన్నఁడు లేని యింత తడ వేటికిఁ జిక్కెనొ యంచు నార్తితోఁ

గన్నులు లేని యట్లతఁడుఁ గానక యేడ్చె సతీసమేతుఁ డై.


3_7_270 తరలము.

కొడుకు నిందును నందు రోయుచుఁ గోరి ప్రేమభరంబునం

గొడుకు సద్గుణకోటి యెల్లను గోటిభంగుల నోలి ను

గ్గడన సేయుచు సత్యవంతునిఁ గానరే మునులార యే

యడవిలోపల నుంచు హా సుత యంచు ధైర్యము డించుచున్.