ఆ భా 3 7 001 to 3 7 030

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


శ్రీమదాంధ్ర మహా భారతము ఆరణ్య పర్వము – సప్తమాశ్వాసము

3_7_001 క. శ్రీకర సోమాన్వయ ర త్నాకర హిమధామ ధార్మికాంచిత వినయో త్సేక భువనైక వీర మ హా కావ్య రస ప్రయోజనారూఢమతీ.

- రాముఁడు లక్ష్మణుని సుగ్రీవు నొద్దకుఁ బంపుట – సం. 3-226-4

3_7_002 వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పెనట్లు పరమ తపోనిలయుండయిన మార్కండేయుండు పాండవేయులతో మఱియు నిట్లనియె నంత మాల్యవత్కందర మందిరుం డైన దశరథాగ్ర నందనుండు నవ కందళిత సుందరంబులును జనక నందినీ వియోగ దుస్సహంబులు నగు ఘన సమయ దివసంబుల నెట్టకేనియుం గడపి నిరతిశయ సాంద్రచంద్రాతపస్న వనశీతల సమీర వాహ్యమాన వినిద్రకుముద కేదార సౌరభ్య నిర్భరంబులు నతి దీర్ఘయామంబులు నైన శారద యామినులు సైప నోపక యొక్కనాఁడు దమ్మునిం జూచి యిట్లనియె.

3_7_003 సీ. చూచితే లక్ష్మణ సుగ్రీవు కొఱగామి యమ్మెయిఁ దనపగ యడఁచి మనము కపిరాజ్య మిచ్చినఁ గైకొని యింద్రియ సుఖముల నెంతయుఁ జొక్కి నేఁడు మన దిక్కు దలపఁడు మన తోడఁ బల్కిన సమయంబుఁ జెల్లింపఁ జనదె తనకు గడుఁ గృతఘ్నత సేసెఁ గపికులాధముఁడు నీ వనఘ కిష్కింధకు నరుగు మిపుడ

ఆ. యద్దురాత్ముఁ గృపణు నాత్మీయ కార్య త త్పరుని నధిక రాగ పరవశాత్ముఁ దొడరి వాలి చనిన త్రోవన యనిచి ర మ్మేల తడయ మనకు నింక నిచట.

3_7_004 ఆ. నీవు సనకమున్న నెఱితోడ మన కార్య మునకుఁ దగిన యత్నములు ఘటించి యుండెనేని వాని నొండేమియుం జేయ వలదు తోడి తెమ్మవార్య శౌర్య.

3_7_005 చ. అనుడుఁ దదాజ్ఞఁ బూని యతఁ డాతత కార్ముక హస్తుఁడై రయం బునఁ జనియెం గపీశ్వరుని ప్రోలికి వాఁడును సంభ్రమంబుతో ననుఁగులుఁ దాను రాజసుతు నర్థి నెదుర్కొని మ్రొక్కి యర్హ పూ జన మొనరించుడున్ విభుని శాసన మాతఁడు సెప్పె వానికిన్.

3_7_006 వ. చెప్పిన విని భయ కంపిత గాత్రుం డగుచుఁ గమల మిత్త్ర పుత్త్రుండు సుమిత్త్రా పుత్త్రున కిట్లనియె నయ్యా యే నేల కృతఘ్నుండ నగుదు జానకి నన్వేషించుటకు నై బలవంతులు బుద్ధిమంతులు నగు వానరుల ననేకుల నలు దెసలకుం బనిచితి వారును సకల వన శైల సాగర గ్రామ నదీ సహితంబైన భూచక్రంబునం దెల్ల రోసి యొక్క మాసంబు లోనం గ్రమ్మఱి వచ్చు వారై సమయంబు సేసి పోయిరింక నైదు దినంబులు గొఱంత యింతియ యటమీఁద వైదేహి వార్త గొనుచు దేవరం గొలువ వచ్చువాఁడ నై యున్న వాఁడ ననినం బ్రీతుం డై లక్ష్మణుండు.

3_7_007 క. వాని దోడ్కొకి చని యా భూ నాథునిఁ గానుపించి పొందుగఁ దత్కా ర్యానుష్ఠాన విశేషము దా నెఱిఁగించుటయు విభుఁడు దద్దయు నలరెన్.

3_7_008 వ. పదంపడి కొన్ని దివసంబులకుఁ బూర్వ పశ్చిమోత్తర దిక్కులకుం జనిన వనచరు లరుగుదెంచి రాఘవునిం గని దేవా సకల సాగల మేఖలా వలయితం బైన భూవలయం బంతయు వెదకితిమి దేవిం బొడగావ మని చెప్పిన నతండు దుఃఖితుం డయి దక్షిణ దిశకుఁ బోయిన వానరుల వలన వైదేహి తెఱంగెఱుంగుదు నను నాసం జేసి ప్రాణంబులు ధరియించి యుండె నంత వెండియు నొక్క మాసంబు సెల్లినఁ గొందఱు వనచరులు పఱతెంచి సుగ్రీవుం గని యిట్లనిరి.

3_7_009 సీ. నీవును వాలియు నేఁడును నాఁడునుఁ బ్రియమునఁ బాటించు పెద్ద తోఁట మథువనం బదె నేఁడు మన యంగదుండును హనుమంతుఁడును మొదలైన వారు బలువిడిఁ జూఱాడి ఫలము లానెదరు తద్రక్షకు లగు మమ్ము రయము మీఱ భంగించి రనవుడు భాను నందనుఁ డాత్మ నంగద ప్రముఖులు యామ్య దిశకుఁ

తే. జనిన వారలు గావున జనక పుత్త్రిఁ గనిన య బ్బిది గాఁబోలుఁ గాక యిట్లు సేయ వెఱవరె పతి కార్య సిద్ధి సలుపు జనుల కీ చన వెందును జనునకాదె.

3_7_010 వ. అని యూహించి తత్ప్రకారంబు రఘుపతికిం జెప్పె నంత.

3_7_011 ఉ. తేనెలు గ్రోలి క్రోలి కడుఁ దియ్యని కమ్మని పండు లింపు సొం పానఁగ నాని యాని పర పందిన నీడలు మెచ్చి మెచ్చి మం దానిలశైత్య సౌరభ సమగ్రతకుం గడుఁ జొక్కిచొక్కి యు ద్యానము నందు మారత సుత ప్రముఖుల్ విహరించి తృప్తు లై.

3_7_012 వ. అందఱుం గూడుకొని చని సుగ్రీవ లక్ష్మణ సహితుం డై యున్న జన నాథుం గని దండ ప్రణామంబులు సేసినం గాకత్ స్థకుల ప్రదీపకుండు వారల ముఖ వర్ణ విశేషంబు లుపలక్షించి సీతం గనిన వారకా నిశ్చయించె నప్పు డత్యంత మతిమంతుం డయిన హనుమంతుండు రాఘవునకుఁ గృతాంజని యై యిట్లనియె.

3_7_013 క. దేవిఁ బొడగంటి నేను ధ రా వల్లభ శైల సరిదరణ్య నగర పా రా వార కలిత మగు వసు ధా వలయము వెదకి వెదకి దక్షిణపు దిశన్.

- హనుమంతుఁడు రామునితే సీతం జూచిన వృత్తాంతము సెప్పుట – సం. 3-266-38

3_7_014 తే. అవధరింపుము దేవ నేమందఱము న నేక ముఖమునఁ దొలి తొలి యిందు నందు నరయుచును బోయి యొక్కెడ నతి విశాల మైన భూవివరము గంటి మద్భుతముగ

3_7_015 వ. కని దానిం బ్రవేశించి నిరంతర తిమిర సంవృతంబును బహు కీట సంకులంబును నైన మార్గంబున ననేక యోజనంబులు సనునెడ ముందట నర్క ప్రకాశంబైన పురంబు గానంబడియె నందొక్క తాపసాంగన యుండి మమ్ము నాదరించి తన పేరు ప్రభావతి యనియును నప్పురంబు మయుని పురంబనియును జెప్పి మధురంబు లయిన భక్ష్యభోక్ష్యంబు లొసంగినం దృప్తులమై తదుపదిష్ట మార్గంబున మహీ వివరంబు నిర్గమించి సహ్యదర్దుర శైలంబులు గడచి మలయ శైల శిఖరం బెక్కి.

3_7_016 స్రగ్ధర. లీలం గల్లోల మాలోల్లిఖిత గగనమై లీననానాకుళీర వ్యాళోగ్రగ్రాహమీనావళుల నెసఁగి దుర్వార వారోఘగంభీ రాలంఘ్యప్రౌఢవేగం బగుచు బహుతరాయామ విస్తార మై బి ట్టాలోకింపంగ నుగ్రం బగు జలనిధి నంతంతటం గంటి మంతన్.

3_7_017 క. కని యిది రత్నాకర మి వ్వననిధి సీమమునఁ గల్గు వసుమతిలోనన్ జనకసుత వెదకి కానమ చన దివ్వారాశి దాఁటి చన నెవ్వరికిన్.

3_7_018 ఉ. భూమితనూజఁ గాన మని పోయి రఘూద్వఙుతోడఁ జెప్పి య బ్భూమిపుచిత్త మాతురతఁ బొందఁగఁ జేయుట కంటెఁ జూడఁగా నీమెయిఁ జావు మేలు మన కేల విచారము లింక నంచు నం దేము గడంగి యందఱము నేక తమం బగు నిశ్చయంబుతోన్.

3_7_019 వ. అనశన వ్రతంబు సంకల్పించి నియచిత్తుల మై యుండి రాఘవు కార్యార్ధం బై తెగిన జటాయువు గృతార్ధుం డయ్యె మనము నట్ట పుణ్యలోకంబు వడయుదమని పలుకు చున్న యెడ.

3_7_020 క. గిరి శృంగతుంగ విగ్రహుఁ డురుత రసత్త్వుఁడు విహంగ మోత్తముఁ డందొ క్కరుఁ డొయ్యన మాయున్నెడ కరుదుగఁ జనుదెంచి విగళితాశ్రుం డగుచున్.

3_7_021 సీ. అయ్యలార జటాయు వని పల్కెదరు మీర లెవ్వరు సెప్పరే యేను వాని కగ్రజుండ ననూరునాత్మజన్నుల మేము సంపాతి నా పేరు సమ్మదమున నేనును దమ్ముడు నినమండలమునకుఁ జను వేడ్క నొకనాఁడు చదల నెగసి చనఁ జనఁ దీవ్రాంశు సంతాపమునఁ జేసి కమరె నా ఱెక్కలు గమర వయ్యె

తే. ననజు పక్షమ్ము లే నిమ్మహాచలమున నాఁటఁగోలె నెచ్చటికిఁ జనంగ నేర కున్నవాఁడ నాతమ్ముఁడెట్లున్న వాఁడొ యెఱుఁగ నెఱిఁగింపరే నాకు నిష్ట మెసఁగ.

3_7_022 వ. అనిన నే మతనికి భవదీయ వృత్తాంతంబును రావణుండు దేవిం గొనిపోవుటయు దదర్ధం బై రావణునితో జటాయువు సమరంబు సేసి యీల్గుటయుఁ జెప్పిన విని దుఃఖితుం డై సంపాతి యస్మదీయ ప్రవర్తనం బేర్పడ నడిగి మా కిట్లనియె. 3_7_023 ఉ. రావణు నే నెఱుంగుదుం బరాక్రమ దుస్సహుఁ డన్నిశాచరుం డీ వన రాశి మధ్యమున నిచ్చటికిన్ శతయోజనంబులన్ భూవిదితంబు లంక యను ప్రోలు తదీయ నివాస మచ్చటన్ భూవరుదేవిఁ గాన నగుఁ బొం డరయుండు కృత ప్రయత్నులై.

3_7_024 క. అని యతఁడు సనిన నందఱ మును సాగర తరణ కార్యమునకు నుపాయం బొనరఁ దలపోయు నెడ నేనని యుత్సాహంబు సేయఁ డయ్యె నొకండున్.

3_7_025 మ. జన నాథోత్తము యేను బూని భవదాజ్ఞా లీల చెల్వంబు మ జ్జనకుం డైన సమీర దేవు కృపయున్ సత్త్వోన్నతుం జేయఁగా ఘన వాస్తుంగ తరంగ సంగత మహాగ్రాహోరగాత్యుగ్రద ర్శన మై పేర్చు పయోధి దాఁటితి జనాశ్యర్యైక సంపాదినై.

3_7_026 ఉ. ఆలవణాబ్ధి మధ్యమున యందుఁ ద్రికూట నగంబుమీఁద మ త్తాల విశాల హేమ మణి ధామ సముజ్జ్వల మైన లంకయన్ ప్రో లొగి గంటి నెంతయు నపూర్వము దద్విభవంబు దేవ య చ్చో లలితాంగి నారయుచుఁ జొచ్చి యనేక విధంబులం దగన్.

3_7_027 వ. అరసి యొక్కెడ రావణాంతఃపురం బయిన యశోక వనంబు నందు.

3_7_028 సీ. కన్నీర జడిగొని క్రమ్మఁ బ్రాఁ కెక్కిన కమ్రకపోల భాగములు గలిగి యవశమై యొఱఁగిన యం గవల్లిక పొంత నున్న భూమీరుహం బూతగాఁగ వెడలు నిట్టూర్పుల వేఁడిమిఁ బగిలిన యధర పల్లవము గారాకుఁ బోలఁ దలఁపుల సందడి దందడించిన తాల్మి గదిరి శిరః కంప గతుల బెరయ

ఆ. నున్న పుణ్యముర్తి నుత్తమ సౌందర్య నవనతాస్య నార్తయైన దానిఁ గని విదేహ తనయఁ గా నెఱింగితి నేను హా రఘు ప్రవీర యనుచు నడల.

3_7_029 క. వినయమున దేవిఁ జేరం జని యభివాదము సేసి జానకి రఘునం దను దూత నేను మారుత తనయుఁడ వానరుఁడ నిన్నుఁ దడవ నిచటికిన్.

3_7_030 వ. అరుగు దెంచితి రామలక్ష్మణు లత్యంత కుశలంబున నున్నవారు వానరేశ్వరుం డయిన సుగ్రీవుండు వారితో సఖ్యంబు సేసి తత్కార్యంబు దీర్పం బూనె నింక మసలక నీ హృదయేశ్వరుండు ననుదెంచు నూఱడిల్లుము.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com