Jump to content

ఆ భా 3 6 391 to 3 6 411

వికీసోర్స్ నుండి

3_6_391
వ. అమ్మగువ కాపున్న దనుజాంగనలు త్య్రక్షియు లలాటాక్షియుఁ ద్రిస్తనియు నేక పాదయు దీర్ఘజిహ్వయు నజిహ్వయుఁ ద్రిజటయు నేక లోచనయు మొదలయిన వారు పెక్కండ్రు వికృతాకారంబుల తోడ నయ్యబలం బరివేష్టించి యహర్నిశంబును నురక యదల్చువారును బెలుచం దిట్టు వారును ఖరోష్ట్రనిస్వనంబులు సెలంగ వెఱపించు వారును ద్రిభువనాధిపతి యైన మన దశగ్రీవు నొల్లని యీ దుష్ట మానుషిఁ బట్టి చెండి కండలు దిందు మనువారును నై యున్న నయ్యుగ్మలి గళద్బాప్బయు గద్గద కంఠియు నగుచు నా రాక్షస స్త్రీల కిట్లనియె.

3_6_392
తే. అమ్మలార మీ వలసిన యట్ల చేయుఁ
డిక నేటికిఁ దడయంగ నేను రాము
దప్పఁ నొండొక పురుషుఁ జిత్తమునఁ దలఁప
నింత నిజము నాకును జీనితేచ్ఛ లేదు

3_6_393
వ. అనిన నజ్జానకి తెగున రావణున కెఱింగింపఁ గొందఱు సనిరి మఱియు సంతత ప్రియవాదినియు ధర్మజ్ఞుయు నైన త్రిజట యను రక్కసి రామాంగనం జేరం జని యిట్లనియె.

- త్రిజట దన స్వప్న వృత్తాంతము సీతతోఁ జెప్పుట –
సం. 3-264-56

3_6_394
సీ. అమ్మ నీ కెంతయు హర్షంబుగాఁ
నొక వార్త నే నెఱింగింతు వనజ వదన
నా మాట నిజముగా నమ్ముము వినవె
యనింధ్యుండు నానొక్క వృద్ద దైత్యుఁ
డనఘుండు రామ హితాన్వేషి యై నీకు
నా శ్వాస మొనలుప నబల నన్నుఁ
బనిచెను విను నిన్నుఁ బాసిన పిదప
లక్ష్మణుఁడును దాను సేమమునఁ గలసి

ఆ. యఖిల వానరేంద్రుఁ డైన సుగ్రీవుతోఁ
జెలిమి సేసి యిపుడు శీఘ్రమున
వీరవరుఁడు నిన్ను విడిపించు పనికి నై
యొదవి యుత్సహించి యున్న వాఁడు.

3_6_395
వ. రావణునకు రంభా నిమిత్తం బయిన నలకూబరు శాపంబు గలదు గావున నీయందు బలాత్కారంబు సేయ రాదు నీకు వీని వలని భయంబు వలదు మఱి యిద్దురాత్మునకుఁ జేటు దెలుపునట్టి దుస్స్వప్నంబుఁ గలిగెనది యాకర్ణింపుము.

3_6_396
క. ఖరములఁ బునిన రథమున
విరిసిన వెండ్రుకలు వెంట వ్రేలఁగ దశకం
ధరుఁడు బహుళతైలాప్లుత
శరీరుఁడై దక్షిణంబు సనఁ గలఁ గంటిన్.

3_6_397
తే. అతని చుట్టును గంభకర్ణాదులెల్ల
నరుణ మాల్యానులేపనులై వికీర్ణ
పతిత కేశులై నగ్నులై పరగఁ బ్రేత
పతి దిశకు నేఁగు గతి గానఁ బడియె నాకు.

3_6_398
ఉ. చారుసితోష్ణ వారణలసత్సిత మాల్య సితాంగరాగుఁ డై
ధీర గుణోత్తరుం డధిక ధీ నిలయుండు విభీషణుండు వి
స్ఫారసితాద్రి శృంగమున భవ్యుఁడు మంత్రి చతుష్టయాన్వితుం
డై రమణీయ లక్ష్మిఁ బొలు పారఁగ నే గల గంటి నుగ్మలీ.

3_6_399
చ. తన సితకీర్తి విశ్వ వసుధా గగనాతంర పూరితంబుగా
ఘన భుజుఁ డున్న తద్విరద కంథర సుస్థితుఁడై ముదంబుతో
ననుజుఁడు దాను రాఘవ కులాగ్రణి సన్మధు సిక్త పాయసం
బొనర భుజింపఁ గంటి విక చోత్పలలోచన నిక్క మింతయున్.

3_6_400
క. పులి చేత వ్రేటువడి మైఁ
గలయఁగ నెత్తురులు గ్రమ్మఁగా నేడ్చుచు ని
మ్ముల నుత్తరాభి ముఖివై
కలుషిత గతి నరుగ నిన్నుఁ గనుఁ గొంటిఁ గలన్.

3_6_401
క. నా కల నిక్కల యయ్యెడు
శోకింపకు మమ్మ యింక సుందరి పుణ్య
శ్లోకు జితలోకు నతుల వి
వేకుం బ్రియుఁ బొందఁ గలుగు వేగమ నీకున్.

3_6_402
ఆ. అనినఁ ద్రిజట పలుకు లవి నిక్కములు గాఁగ
వగచి సీత గొంత వసట దక్కి
యాసతోడ నుండె నట దశవదనుండు
సీతఁ దలఁచి వివశ చిత్తుఁ డగుచు.

3_6_403
వ. తాను దేవ దానవ గంధర్వాది భూత వర్గంబుల నెల్ల జయించియుం గందర్ప దర్పంబు వారింప నోపక యా క్షణంబ దివ్య మాల్యాంబరాభరణ భూషితుండై సంచార శీలం బైన కల్ప పాద పదంబునుం బోలె నొప్పి యుఁ దన యొప్పుఁ బితృవనంబు నందలి వటభూరుహంబు సొంపునుం బోలె నతి భీషణం బగుచుండ నశోక వన మధ్యబు సొత్తెంచి రోహిణీ సమీపంబునకు వచ్చు శనైశ్చరుండునుం బోలె జానకిం జేరం జనుదెంచి ప్రణయ పూర్వకంబుగా నిట్లనియె.

3_6_404
క. ఏల మదిరాక్షి వలవని
జాలిం బడి నవసెదవు లసద్భూషణ లీ
లాలంకృతవై ననుఁ గృప
నేలికొనం గరవె వేయు నేటికి నింకన్.

3_6_405
చ. అనిమిష యక్ష రాక్షస వియచ్చర కిన్నర పన్నగాసురాం
గనలఁ గరంబు చిత్తమునఁ గైకొన కే ననురాగ లీలమై
నిను మది నాదరించు టిది నీదకు భాగ్యము గాదె యింతయున్
వనిత యెఱుంగవైతి గరువంపు విచారము లేల నీ యెడన్.

3_6_406
ఉ. రాముఁ డనంగఁ బేర్మియుమ రాజ్యముఁ గోల్పడి కానలోన దుః
ఖామయ మగ్నుఁ డైన యొక యల్ప మనుష్యుఁడు వాని పైఁ గడుం
బ్రేముడి సేయుచున్ వగపు పెల్లునఁ జిత్తము దల్లడిల్లగా
నీ మెయి నుండు నీ యునికి యే సుఖ మండ్రు లతాంగి చెప్పుమా.

3_6_407
వ. ఏను సకల లోకేశ్వరుండ నాకుం గింకరులై పదునాలుగు కోట్లు నిశాచర భటులును నిరువది యెనిమిది కోట్లు రాక్షసులును నెనుబదియాఱు కోట్లు యక్షులును వర్తిల్లుదురు నిఖిల ధనాధ్యక్షుం డయిన యక్షేశ్వరుండు నా యగ్రజుండు బ్రహ్మసమానుం డగు విశ్రవసుండు మదీయ జనకుండు గుబేరునకు వినోద పాత్రంబు లైన గంధర్వాప్సరోగణంబులు నన్ను సేవించుఁ బంచమ లోకపాలుఁ డని నన్నుఁ ద్రిభువనంబులుఁ గీర్తించు భక్ష్యభోజ్యాది వస్తువులును సురేశ్వర గృహంబునం దెట్లట్ల నా గృహంబున నక్షయంబు లిట్టి నా విభవం బింతటికిని మదీయ జీవితంబునకు నధీశ్వరివై సుఖంబున భోగింపు మనిన విని వైదేహి క్రోధ శోక వ్యాకుల హృదయ యగుచు వాని దెసం జూడక యొక్క తృణాంకురం బుపలక్షించి యిట్లనియె.

3_6_408
సీ. అకట పరాంగన నబల బతివ్రతఁ
బరికింపఁగా మర్త్యభామ నేను
రాక్షసుండవు నీవు రాగంబు మది నించుకయు
లేని నాదు సంగమము నందుఁ
గలిగెడు నట్టి సౌఖ్యం బెంత యదియును
గాక యాద్యుండైన కమల గర్భూ
పౌత్త్రుఁ నని లోకపాలతుల్యుఁడ నని
హర సఖుం డైన ధనాధి నాథు

ఆ. భ్రాత నని భవత్ప్రభావంబు సెప్పితి
విట్టి నీవు ధర్ము వెఱిఁగి దురిత
వర్తనంబు విడువ వలదె సిగ్గేది యి
ప్పగిదిఁ బ్రల్లదములు పలుకఁ దగునె.

3_6_409
వ. అని పలికి జానకి యుత్తరీయ సంవృత వదన యై యతి కరుణంబుగా నేడ్చిన నద్దురాత్ముండు వెండియుఁ గొన్ని దుర్వచనంబులు పచరించి యనంతరంబ
యంతర్ధానంబు నొందె నప్పొలతియు నెప్పటియట్ల రాక్షసీ రక్షిత యై యుండెనని మార్కండేయుండు ధర్మరాజునకు నిర్దేశించిన తెఱఁగు వైశంపాయనోక్తం బైన యాఖ్యానంబు విఖ్యాత మాధుర్య మనోహరంబుగా.

3_6_410
క. విమలక్షాత్ర గుణోన్నత
విమలాదిత్యాత్మ జన్మ విలసత్కమలా
రమణీ కర కమలోజ్జ్వల
విమలాంబుజ రేణు గార విలసిత వక్షా.

3_6_411
వన మయూరము.
భూసుర కదంబ సుర భూరుహ వికాసో
ద్భాసిత కృపారస విపాక సుగుణైకో
ల్లాస హరహర మృగలాంఛన మృణాళీ
హాసినవకీర్తి వసరాకలితలోకా.

గద్యము. ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబు నందారణ్య పర్వంబునందు దుర్యోధను ప్రాయోపవేశంబును బాతాళ గతులయిన దానవు లతని నాశ్వాసించుటయు వైష్ణవ యాగ ప్రవర్తనంబును బాండవులు గ్రమ్మఱఁ గామ్యక వనంబున కరుగుటయు వ్రీహిద్రోణాఖ్యానంబును ద్రౌపదీ హరణంబును జయద్రథు భంగంబును రామాయణ కథా ప్రవృత్తియు నందు రామ రావణుల జననంబును రాఘవు వన ప్రస్థానంబును సీతాప హరణంబును సుగ్రీవ మిత్రత్వంబును వాలి వధయును ద్రిజటా స్వప్న కథనంబును రావణు దుష్ట వచనంబులు నన్నది షష్ఠాశ్వాసము.