ఆ భా 3 6 301 to 3 6 330

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_6_301 వ. అనిన నతండయ్యతివం గనుగొని యవధ్యుల వధియించుటయును వధ్యులం గాచుటయును బ్రాహ్మణ ధనంబులు దక్క నన్యుల ధనం బపహరించుటయును నభీష్ట ధనంబు నిచ్చుటయును మొదలుగా నతి దుష్కరంబు లైన వాని నైనను భవత్ప్రియార్థంబు సేసెద నెయ్యది సెప్పు మనిన ప్రీతయై భరతమాత యిట్లనియె.

3_6_302 తే. యౌవ రాజ్యపదంబున యందు భరతు నధిప యభిష్క మొనరింపు మడవి లోన నొలసి పదునాల్గు వర్షంబు లుండ నాన తిమ్ము రాముని నురువర మ్మిదియ నాకు.

3_6_303 క. అనవుడు వీనులు గొఱివిం గొని చూఁడిన యట్టు లైనఁ గువలయపతి పె ల్చన పిడు గడఁచిన క్రియఁ జే త నరహితుం డగుచు ధరణి తలమునఁ బడియెన్.

3_6_304 వ. అంతయు నెఱింగి రాఘవుండు నిజ జనకుండు సత్య ప్రతిజ్ఞుండు గావుతమని యా క్షణంబ సీతా సమేతుం డై వనంబునకు వెడలె నతని పిఱుందన లక్ష్మణుండును జనియెఁ దదనంతరంబ.

- దశరథుఁడు రామ విశ్లేషముచే సురలోక గతుం డగుట – సం. 3-61-292

3_6_305 క. రాముఁడు సనుట విని మహో ద్దామం బగు శోక వహ్ని దరి కొనఁగను హా రామ గుణధామ యని యని భూమీశ్వరుఁ డసు వియోగముం బ్రాపించెన్.

3_6_306 వ. ఇట్లు దశరథుండు సురలోక గతుం డగుటయుఁ గైకేయి దన కొడుకు రావించి భూ వల్లభుండు దేవ భావంబు నొందె రాముండును వనంబున కరిగె నింక నర్హుండవు నివ కావున నఖిల మహీ రాజ్య రక్షణంబు సేయు మనిన నక్కుమారుండు క్రోధ శోక దందహ్యమాన మానసుం డగుచుఁ దల్లి కిట్లనియె.

3_6_307 సీ. దురితంబు లెన్నండుఁ బొరయక వెలుఁగొందు కమలాప్త కులమునఁ గసటు గలిపి పరమ ధర్మాత్మకుఁ బురుహూత సన్నిభుఁ బతి మ్రింగికొని కృపఁ బాఱ వైచి యాయత బాహుఁ దేజోయుక్తు మాయన్న బటు ధైర్యు నడవుల పాలు వఱిచి జీవిత హంత్రి వై త్రోవంగ రావి దుష్కీర్తి నా యౌదలఁ గీలుకొల్పి

ఆ. శ్రీకి నెడలి సకల లోకంబు చేతను దిట్టు గుడిచి కోర్కి దీర్చు కొంటి పాప జాతురాల యీ పాతకం బేమి సేయ దింక నేమి సేయువాఁడ.

3_6_308 వ. అని దుఃఖించి భరతుండు దండ్రికి నుచిత క్రియలు నిర్వర్తించి యనంతరంబ సమస్త మంత్రి సామంత భూసురు పౌర జానపద సహితుం డై కదలి మువ్వురు దల్లులను వసిష్ఠ వామదేవులను బురస్కరించుకొని తానును శత్రుఘ్నుండును రామా నునయార్థంబు చిత్ర కూట శైలంబున కరిగి యందు.

3_6_309 మ. కనియెం గోమల నీల మేఘసుభగా కారున్ జటావల్కలా జిన ధారున్ సితభూతి భూషితుని రాజీవాక్షుఁ గల్యాణ కీ ర్తనుఁ గాకుత్ స్థకుల ప్రదీపకుని సీతాలక్ష్మణోపేతు స న్ముని లోకార్చితు సత్కృపాభరణు రామున్ రాజ చూడామణిన్.

3_6_310 వ. కని యంతంత నాక్రందన పరుం డగుచుం జని తదీయ చరణంబుల పయిం బడి పితృ మరణ ప్రకారం బంతయు నెఱింగించి దేవా సకల సామ్రాజ్య ధురీణుండవై మమ్మందఱ ననుశాసింపవే యని యర్హ జన సహితంబుగా నతనిం బ్రార్థించిన.

3_6_311 క. గురు వాక్య రక్షణైకా దరచిత్తుం డైన యయ్యుదాత్ర చరితుఁ డె ప్పరుసున నొడఁబడఁ డయ్యెను సరస మహీ రాజ్య సమను శాసనమునకున్.

3_6_312 వ. భరతుండును రాము చేతఁ బ్రత్యాఖ్యాతుండై తదీయ పాదుకంబులు గొని చని వాని నర్చించుచు నంది గ్రామంబు నందు వసియించి రాజ్యను సంధానంబు సేయు చుండె నిట రాఘవుం డయోధ్యా పుర సమీపం బగుటం జేసి క్రమ్మఱ భరతాగమనంబు శంకించి చిత్రకూటంబు వాసి శరభంగు పాలికిం యతని చేత సత్కృతుం డై దండ కారణ్యంబు సొచ్చి యందు గోదావరీ తీరంబున ననుజ వధూ సహితంబుగాఁ గృత నివాసుండై యున్నంత దశగ్రీవు చెలియలు శూర్పణఖ ననుదెంచి వారికి నపకారంబు సేయ మొనసినం గినిసి యా రాజపుత్త్రులు దత్కర్ణ నాసికా వైకృతం బొనరించినం బదంపడి.

3_6_313 ఉ. శూర్పణఖా నిమిత్తమున శూరు లనేకులు రక్కసుల్ మహో త్సర్పిత రోషులై బహుళ సైన్యయుతంబుగ నెత్తి వచ్చుడున్ దర్పిత వైరి భంజనుఁ డుదారుఁడు రాఘవుఁ డస్త్రవిద్య నే ర్పేర్పడఁ గేలిఁబోలె సమయించె రణాంగ భూమి నందఱన్.

3_6_314 వ. ఇట్లు ఖర దూషణాదులం గొట్టి పదునాలుగు వేల రాక్షసులం జంపి దండ కారణ్యంబు విగక కంటకంబు గావించె నంత శూర్పణఖయు రయంబున రావణు పాలికిం జని తచ్చరణంబుల పయిం బడి యేడ్చినం జెలియలకైన వైకృతం బేర్పడం జూచి యన్నిశాచర నాథుం డిట్లనియె.

3_6_315 సీ. ఎఱిఁగి యెఱింగి నేఁ డెవ్వాఁడు నిశిత విస్ఫార శూలాగ్రంబు పయికి నుఱికెఁ దపయంపియం దగ్గి దరికొల్పియెవ్వండు నేఁడు నెమ్మది శయనింప జూచె నుగ్ర విషానలం బుమియు చున్న యహీంద్రుఁ గడఁగి నేఁ డెవ్వండు గాలఁ దన్నె హుంకార ఘోరమై యుదరు బెబ్బులి మీస లుఱుక యెవ్వాఁడు నేఁ డూఁచి కొనియె

ఆ. నిన్ను నెవ్వఁ డకట నేఁ డిట్లు గడు భంగ పఱిచెఁ జెపుమ నాకుఁ బద్మనయన యాయువును సిరియును నవశంబు లయ్యె నేఁ డెవ్వనికొ తలంప నిజ్జగమున.

3_6_316 క. అని పలుకు నప్పు డాతని ఘనతర ముఖ నేత్ర నాసికా కర్ణములం దనవరత రోష పావక జనిత శిఖావితతు లక్కజంబుగ వెడలెన్.

3_6_317 వ. శుర్పణఖయు నతనికి రాఘవు లున్న తెఱంగును నిజ పరిభవంబు దత్కృతం బగుటయు ఖర దూశణాది రాక్షస వధయునుం జెప్పిన విని ధన దానుజుండా క్షణంబ పుర సంరక్షణంబునం దాప్త జనంబుల నియోగించి సన్నద్ధుం డై యొక్కరుండు వెలువడి త్రికూట కాల పర్వతంబులు గడచి సముద్ర తీరంబునఁ బరమేశ్వర నివాసం బైన గోకర్ణ స్థానంబునకుం జని యచ్చటం దొల్లి రామువలనం బ్రాప్త పరాభవుం డై ప్రవ్రజనంబు నొంది తపంబు సేయుచున్న వానిం దన పూర్వామాత్యు మారీచుం గనిన నతుండును బ్రియ సంభ్రమంబుల తోడ నతనిం బూజించి కుశంలం బడిగి భవదాగమ ననిమిత్తం బేమి యని యడిగిన నసురేశ్వరుం డిట్లనియె.

3_6_318 ఉత్సాహము. వినవె రాముఁ డనఁగ నొకఁడు విపుల దర్ప హృదయుఁడై మన ఖరుండు లోనుగా సమగ్ర శౌర్యులైన య ద్దనుజ వరులఁ దునిమి యిపుడు దండక స్థలంబునం దొనర నిర్భయత్వ మొప్ప నున్న వాఁడు మేటి యై,

3_6_319 ఆ. వానిఁ బరిభవింప వలయు నప్పనికి సా హాయ్యకం బొనర్పు మనఘ నాకు ననిన నధిక భయ సమావిష్ట హృదయుఁడై యమర వైరి కిట్టులనియె నతఁడు.

3_6_320 చ. ఎఱుఁగవు గాక రాఘవు నుదీర్ణ భుజాల రూఢి నాజి లో నుఱక తదీయ బాణరయ మోర్వ వశంబె పినాకికైన ను క్కఱ మఱి నీకు నిత్తెఱఁగు గాదన కేఖలుఁ డొక్కొ బుద్ధిఁగాఁ గఱపిన వాఁడు సేటునకుఁ గాలము సేరెనొ కాక యిమ్మెయిన్.

3_6_321 ఆ. రాము తోడఁ దొల్లి రణమునఁ గడు భంగ మొంది కాదె దైన్య యుక్తి నిట్లు దపసి నైతి నేఁడు తగ దమ్మహాత్ముని యందు వైర బుద్ధి యధిప నీకు.

3_6_322 వ. అనినం గలుషించి లంకేశ్వరుండు వానిం జూచి నా పనుపు సేయవైతి వేని నిన్నిప్పుడ కృతాంత గోచరుం జేయుదు ననిన వాఁడును దన మనంబున వీనిచేతం జచ్చుట కంటెను రాఘవ కృతం బైన మరణంబు మే లని తలపోసి మహాత్మా నీకు హితంబు గోరి చెప్పితి నిది యిష్టంబు గాదేని భవదీయ శాసనంబు గైకొని చేసెదం బనుపు మనినఁ బౌలస్త్యుం డిట్లను నీవు రత్నమయ తనూరుహం బగు కనక మృగంబై చని జానకిం బ్రలోభింప వలయు సీతా చోదితుం డై రాముండు నిన్నుం బట్ట సమకట్టి నీ చేత నతి దూరంబు గొనిపోవం బడు నప్పు డేను దద్భామిని నపహరించెదఁ బ్రియా విరహ దుర్మనస్కుండై యతండు చెడిపోవు ననిన నట్లకాక యని మారీచుండు.

- మారీచుండు మయా మృగం బై చనుదెంచుట – సం. 3-262-24

3_6_323 క. కనక మృగ రూపమునఁ జని యిన వంశ్యుఁడు సతియు నున్నయెడ మెలఁగుటయుం గని జానకి కౌతూహల మునఁ బ్రియుఁ బ్రార్థించె హరిణ పుంగవుఁ బట్టన్.

3_6_324 ఆ. ధరణి సుతయు విధియుఁ దన్నుఁ బ్రేరేపంగ వివశ బుద్ధి యగుచు నవని విభుఁడు మృగముఁ బట్టఁ దివిరె మృగ నేత్ర కావ స ద్వినుత బలు సుమిత్ర తనయు నునిచి.

3_6_325 క. ఆసదృశ కార్ముక ధరుఁడై మసలక యా మృగము వెనుక మర్దిత రిపుఁ డే పెసఁగంగ నరుగఁ దొడఁగెను వెస రుద్రుఁడు యజ్ఞ మృగము వెనుకొను మాడ్కిన్.

3_6_326 వ. అట్టి యవసరంబున.

3_6_327 మ. పఱచున్ దవ్వుగఁ జేయలంతి నిలుచుం బట్టీక యాసాస లం బిరువోవుం బొదలందు డిందుఁ బొడమున్ బి ట్టుల్కి వేదాఁటుఁ గ్ర మ్మఱి చూచుం జెవి దార్చి నిల్చు మలయున్ మట్టాడుఁ గోరాడు నే మఱిన ట్లుండుఁ దృణంబు మేయు నెలయున్ మాయా మృగం బిమ్ములన్.

3_6_328 వ. ఇట్లతి దూరంబుగా నెలయించి యలయించిన నది రాక్షస మాయగా నూహించి రాఘవుం డమోఘ బాణంబు దొడిగి తడయక యమ్మృగంబు నేసిన.

3_6_329 క. వాలమ్ము దాఁకి యొఱులుచు నాలోనన రాము నెలుఁగు నట్టి యెలుఁగుగా హా లక్ష్మణ సీతా యని కూలి కపట మృగము దన్నికొనుచు జచ్చెన్.

3_6_330 తరువోజ. అయెలుఁ గేర్పడ నవనీ తనూజ యాలించి తల్లడం బడరు చిత్తమున నోయన్న లక్ష్మణ యొలని మీ యన్న యుగ్ర రాక్షస బాధ నొందంగఁ బోలు నాయత భుజ వింటె యమ్మహా బాగుఁ డత్యంత దుఃఖార్తుఁ డై నిన్నుఁ జీరెఁ బోయు వే కావు విస్ఫురిత పుణ్యైక భూషణోదార యప్పురుష రత్నంబు.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com