ఆ భా 3 6 151 to 3 6 180

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


3_6_151 సీ. మృగనేత్ర దారుణ మృగ సమాకుల మైన యివ్వనాంతరము నం నేకతంబ యిట్లు నీ యున్కికి నెయ్యది మూల మివ్వనదేవతవే సురేశ్వరుని తోడ నలిగి ధరిత్రికి నరుగు దెంచిన శచీ లలనవో హరి యురస్థ్సలి దొరంగి కేలిఁ గ్రుమ్మరు పద్మ గేహవో భవదీయ జనకత్వమున సముజ్జ్వలితుఁడైన

తే. పుణ్యుఁ డే వంశమున వాఁడు పొలఁతి నీదు జీవితేశ్వరుఁ డగు సుఖ జీవితాత్ముఁ డెవ్వఁ డబల నీ నామమై యింపు మిగులు శబ్ద మెయ్యది నాకు నిజంబు సెపుమ.

3_6_152 క. కరి రాజ గమన మా తెఱఁ గలయఁ దలఁచితేని వినవె యధిక బలుఁడ నే సురథుఁ డను రాజు పుత్త్రుఁడ నరి మథనుఁడఁ గోటికాస్యుఁ డనఁ జనువాఁడన్.

3_6_153 తే. అల్ల కాంచన రథముపై నలరు వాఁడు ఘనుఁడు క్షేమంకరుండు త్రిగర్తవిభుఁడు మఱియు నినుఁ జూచుచున్నాఁడు మగువ వాఁడె దీప్తభుజుఁ డైన కాళింగ దేశ విభుఁడు.

3_6_154 తే. ఉల్ల పద్మాకరము పొంత నుండి నిన్ను మెచ్చి కనుఁగొనుచున్న యున్మీలితాక్షుఁ డుత్పలాక్షి యిక్ష్వాకు వంశోద్భవుండు సుబల భూపతి పుత్త్రుండు సుభగుఁ డతఁడు.

3_6_155 వ. అరుణాశ్వ యుక్తంబు లయిన రథంబుల యందు రత్మమయ భూషణు లయి సమిద్ధ వహ్నులుం బోలె వెలుంగుచున్న యా సౌవీర కుమారులు పన్నిద్దఱుం దన్నుం జేరికొలువ ననేక సహస్ర కరి తురంగ రథ పదాతి పరివృతుం డై మహా గజంబు పై శోభిల్లుచున్న యవ్వీరుండు సింధు సౌవీర నాథుం డైన జయద్రథుం డమ్మనుజేశ్వరుం డిప్పుడు నీ తెఱం గెఱుంగఁ దివిరి నన్ను నిట పుత్తెంచె ననినఁ బాండవపత్ని మృదు మంభ్రమంబునం గదంబ శాఖ విడిచి యుత్తరీయంబు సంగతుంబ గావించుకొని కోటికాస్యున కిట్లనియె.

3_6_156 తే. అన్న యిచ్చట నే నొంటి నున్న దాన నీ విచటి కేఁగు దెంచుట నియతి యగునె సుతవతిని ధర్మవతి నన్ను నితరకాంతఁ గాఁ దలఁచి పెక్కులు వల్కఁ గాదు నీకు.

3_6_157 వ. నీవు శిబి వంశోద్భవుండైన సురథు పుత్త్రుండ వగు టే నెఱుంగుదు నస్మత్ప్రకారంబు సెప్పెద వినుమేను బాంచాలపతి యైన ద్రుపదు కూఁతురఁ గృష్ణ యను దానం బాండు నందను లగు యుధిష్ఠిర భీమార్జున నకుల సహదేవులకు ధర్మపత్ని నవ్వీరు లిప్పుడు నన్ను నివ్వనంబున నునిచి.

3_6_158 తే. ధర్మజుఁడు దూర్పు భీముఁడు దక్షిణంబు నర్జునుఁడు పడమర గవ లర్థి నుత్త రంబుగా వేఁటవోయిరి రాజ ముఖ్యు లనఘు లింతకు వత్తురు వినుత బలులు.

3_6_159 వ. మీ రమ్మహాత్ములకు మాననీయులరు గావున నార్య జన మిత్త్రులగు నక్కురు కుల పవిత్రులు సేయు సత్కారంబులు గైకొని పోవుదురు గాని యొక్కింత తడ వియ్యాశ్రమ సమీపంబున నిలువుం డని పలికి యల్లన యవ్వర వర్ణిని భయంబునం బర్ణ గృహంబు సొచ్చినం గోటికాస్యుండును గ్రమ్మఱ చని జయద్రథుని తోడ నబ్భామిని పాంచాల కన్యక యనియును బాండవ పత్ని యనియునుం జెప్పిన నద్దురాత్ముండు మదన కంపిత హృదయుం డగుచు నమ్మగువ నపహరింపం దివిరి కతిపయ జన సమేతంబుగా నరిగి సింహాగారంబు సొచ్చు వృకంబునుం బోలెఁ బాండవ నివాసంబు సొత్తెంచి పాంచాలిం గని దాని కిట్లనియె.

3_6_160 క. వామాక్షి నీకుఁ గుశలమె నీ మన సెవ్వారియందు నిత్య ప్రేమం బై మెఱయు నట్టి సొబగులు నీ మగ లేవురుకు నిపుడు నెమ్మదియె మదిన్.

3_6_161 వ. అనిన వానికి నమ్మానవతి యిట్లనియె.

3_6_162 చ. స్థిరమతు లైన పార్థులకు సేమమ నీకు ననామయంబె భూ వర తగ వింద వైతి కురువర్యుల యింటికి నట్లు గావునం బరువడి నాసన క్రియముఁ బాద్యముఁ గైకొను మాదరంబుతో సరస కురంబ మాంసములఁ జల్పుము భోజన కృత్య మిత్తఱిన్.

3_6_163 ఆ. వేఁట వోయినారు విభు లిప్డు వత్తురు వారు వచ్చి నీకు వలయునట్టి ప్రియము లాచరింపఁ బ్రీతుండ వై మఱి యిష్టజనులు నీవు నేగుఁ మనఘ.

3_6_164 చ. అనవుడు సైంధవుం డనియె నంబుజ లోచన నీవు మాకుఁ జే యు నతిథి పూజ లన్నియును నొక్కటనైనఁ గొఱంత లేక వ చ్చినవియ మన్మథాస్త్రముల చిక్కునఁ గాఱియవొందె డెంద మిం క ననుఁ గృతార్థుఁ జేయుము దగన్ రథ మెక్కుము లెమ్ము నెమ్మితోన్.

3_6_165 మ. ధరణీ రాజ్యము గోలుపోయి ఘన కాంతార స్థలీ వాసులై సరివా రెల్లను నవ్వఁ గుత్సిత దశా సంప్రాప్తిమై నున్న ము ష్కరులం బార్థులఁ గొల్చినం గలదె సౌఖ్యం బెంతయున్ బేలవై త రవిందానన శ్రీ విహీనులఁ గరం బర్థింతురే కామినుల్.

3_6_166 ఆ. చిగురుఁ బోఁడి నిఖిల సింధు సౌవీర భూ వలయ రాజ్య గౌరవంబు తోన నున్న నేలికొని మనః ప్రియ భోగైక యోగ్య వగుము విడువు మొండు దలఁపు.

3_6_167 వ అనినం బాంచాలి ప్రకంపిత చిత్త యగుచుఁ గొండొక దొలంగి వాని దెస ననాదర దృష్టిం జూచుచుఁ దన పతుల రాకయ కోరుచు బ్రతివాక్యంబుల గొంత కాలక్షేపంబు సేయుటకై వాని కిట్లనియె.

3_6_168 తే. తలఁపఁ బాండవ ధార్తరాష్ట్రులకుఁ జెలియ లైన యాదుస్సలకుఁ బతి వనఘ నీవు నాకుఁ దోఁబుట్టువవు గావె నాకుఁ జననె పాడి దప్పిన మాటలు పలుక నిచట.

3_6_169 క. నయమును ధర్మము గల య న్వయమున జనియించినాఁడ వక్కట ధర్మ క్రియ యెఱుఁగంగా వలదె యు భయలోక విరుద్ధమైన పథ మేమిటికిన్.

3_6_170 వ. అనిన నద్దురాత్ముండు దరస్మితాననుం డగుచు నిట్లనియె.

3_6_171 క. వనజాక్షి రాజ ధర్మము వినవే యెన్నఁడును మనుజ విభులకుఁ బ్రమదా జనుల యెడ వాని వెదకం జనదు వలసినట్ల వేడ్క సలుపఁగఁ జెల్లున్.

3_6_172 క. విను మదియుఁ గాక జగమున వనితా రత్నంబు లెల్ల వారికి భోగం బున యెడ సాధారణము లో కని ధన మని గురుతు గలదె కరి నిభ గమనా.

3_6_173 వ. అనిన నయ్యంగన క్రోధ కలుషితాంత రంగయై యిప్పాపాత్ముండు ప్రియ వచనంబులం బోవండు బెట్టిదంబులం గాని చక్కంబడఁ డని తలంచి యిట్లనియె.

- ద్రౌపది సైంధవునితో నిష్ఠురోక్తులు పలుకుట – సం. 3-252-1


3_6_174 చ. ప్రకటిత శౌర్యసారుల న భగ్న పరాక్రమ నిర్జితాహిత ప్రకరులఁ బాండునందనులఁ బాండు యశస్కుల నాత్మ లోఁ దలం పక నను ధిక్కరించెదు నృపాలకులాధము నీదు గర్వదు ర్వికసన మింతఁ బోదు తుది వ్రేఁగగుఁ దక్కుము దుష్ప్రలాపముల్.

3_6_175 మ. హిమనత్పాద వనాంత కేలి రతియై నేపారి కోపారుణ క్రమ నేత్రాంచలమై ప్రభూత మద రేఖంబైన గంధద్విపేం ద్రము డాయం జని సిళ్ళు సూపుట సుమీ ధర్మాత్ము నత్యుగ్ర వి క్రముఁ గౌంతేయు వరిష్ఠు నీవు దొడరంగాఁ జూచు టూహింపఁగన్.

3_6_176 ఉ. శాతన ఖాగ్ర ఖండితలసన్మద కుంజర కుంభ ముక్త ము క్తా తత శైల కందు గుహాంతర సుప్చ మృగేంద్ర కేసర వ్రాతము వేడ్క నూఁచికొన వారక చేరుట గాదె క్రోధ ని ర్ఘాత మహోగ్రు భీముఁ జెనకు దలపోయుట నీకు నెమ్మెయిన్.

3_6_177 మ. చల జిహ్వాగ్ర విలీఢ స్ఫురిత దంష్ట్పాభీషణం బైన బె బ్బులిఁ గోలం గొని వ్రేసి త్రోసి తొలఁగం బోవచ్చినన్ వచ్చుఁ గా క లసత్క్రూర శరాగ్ని దుస్సహుని నగ్గాండీవి నల్గించి యె వ్వలన్ మాన ధనాఢ్యు లై బ్రతికి పోవన్ వచ్చునే యేరికిన్.

3_6_178 ఉ. బోరన విస్ఫులింగములు వొడ్మఁగ నుగ్ర విషంబు గ్రక్కుచుం గ్రూర విచేష్ట నాలుకలు గ్రోయు మహోరగరాజయుగ్మముం జేరి పదాహతిం గినియఁ జేయఁ దలంచుట గా నెఱుంగు దు ర్వారులు మాద్రి పుత్త్రుల కవజ్ఞ యొనర్పఁ దలంచు టేర్పడన్.

3_6_179 ఉ. ఆలము లోన వీఁక నమరాసుర కోటికి నైన దుర్జయుల్ వాలిన వీరు లవ్విభులు వారికి నెగ్గొనరించి పోయి పా తాళము సొచ్చి డాఁగినను దప్పదు మృత్యువు నీకు నక్కటా కాలము నిండె నీ వశము గాదు విధాతృ ని చెయ్డి త్రోవఁగన్.

3_6_180 క. తేలును గర్కటియును దెగు కాలమునకుఁ జూలు దాల్చుగతిఁ బార్థుల యి ల్లాల నయిన నా దెస దు శ్శీలుఁడవై తిది వినాశ చిహ్నము గాదే.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com