ఆ భా 3 6 091 to 3 6 120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_6_091 వ. అనంతరంబ నిరంతరానందమంద మందాయమానమానసుం డగుచు మానవేశ్వరుండు దమ్ములు దొరలు బంధు జనంబులుం బరివేష్టింపఁ బౌరజన దత్తాశీర్వాద జయ జయ శబ్ద శబ్దాయ మాన దిగ్విభాగుం డగుచుఁ బుణ్యాంగనాకర కలిత లలితాక్షత విక్షేపంబులును బటు వందిమాగధ సంకీర్తనంబులును గైకొనుచుఁ బుర ప్రవేశంబు సేసి రాజ మందిర గతుండై ధృతరాష్ట్రునకు గాంధారికిఁ గృప ద్రోణ భీష్ములకుం బ్రణమిల్లి యుల్లంబు వికసిల్లఁ గనకాసనాసీనుం డయ్యె నప్పుడు కర్ణుం డతని కిట్లనియె.

3_6_092 ఉ. భాగ్యము గాదె కౌరవ నృపాల భవన్మఖ మిష్ట సత్క్రియా యోగ్యత నిర్వికల్పముగ నొందె సమాప్తి నశేష ధాత్రియున్ భోగ్యమ నీకు నింక రణభూమిఁ బృథా సుతులన్ జయించి స మ్యగ్యమశాలి వై భువన మాన్య యొనర్పము రాజసూయమున్.

3_6_093 క. అది యెమ్మెయు నగునోయని మదిలో వగవంగ వలదు మగవ తనూజుం గదనంబునఁ జంపక యే పదనఖధావన మొనర్పఁ బార్థివ ముఖ్యా.

3_6_094 తే. అనినఁ గర్ణుఁ గౌఁగిటఁ జేర్చి యన్నరేంద్ర నందనుఁడు నీ సహాయత నాకుఁ గలుగఁ బాండవుల నోర్చు టెంత పని మహాత్మ యని సహోదర సహితుఁడై హర్షమొందె.

3_6_095 వ. అట ధర్మతనయుండు సూత తనయు ప్రతిజ్ఞ విని వాని బల శౌర్య విభవంబును నభేద్య కవచ ప్రభావంబును దలంచి విషణ్ణ హృదయుండై రేలెల్లను గన్ను మూయుట లేక వగచు చుండె నిట దుర్యోధనుండును గర్ణ సౌబల ప్రవర్తిత కార్య ఖడ్గుండై భీష్మ ద్రోణ కృపాదులకును మహనీయులైన మహీసురులకు నను దినంబును బ్రియసత్కారంబులు సలుపుచు ధనంబు దత్తభుక్త ఫలంబుగా వగచి నిరంతర త్యాగ భోగంబుల ననురాగంబు నొందు చుండె ననిన వైశంపాయనునకు జనమేజయుం డిట్లనియె.

3_6_096 క. దుర్యోధను చెఱ దలిగి య వార్య పరాక్రములు పాండవ ప్రభులు మహా శ్చర్య చరితు లవ్వనమున నార్యులు మఱి యెట్టివార లైరి మునీంద్రా.

- ద్వైత వనంబు నందలి మృగ సమూహము ధర్మజు స్వప్నంబు నందు వచ్చి తమ దుఃఖంబు సెప్పుట – సే. 3-244-2

3_6_097 వ. అని యడిగిన నమ్మహాముని యమ్మహీపతి కిట్లనియె.

3_6_098 సీ. ద్వైత వనంబున ధర్మజు డొకనాఁడు నిద్రింపఁగాఁ దద్వనేచరంబు లగునట్టి మగ జాతు లన్నియుఁ గలలోన వచ్చి కన్నుల నశ్రు వారి దొరుఁగఁ దమ్మెఱింగించి యాతని తోడ నిట్లను ధర్మాత్మ మీరు నిత్యంబుఁ గడఁగి చంపంగఁ జంపంగ సమసి యల్పా వశిష్టము లయ్యె నిప్పు డస్మత్కులంబు

తే. లేము బీజ మాత్రము దక్కి యిట్లు వనరు చున్న వారము మీ రింక నొండ గడకు నరిగి మముఁ గావరే కరుణార్ద్ర బుద్ధి ననిన నట్ల కాకని వాని కభయ మిచ్చి.

3_6_099 క. జనపతి మేల్కొని యంతయు ననుజుల కెఱిఁగించె యిట్టులను నబ్దముపై నెనిమిది నెలలుండితి మి వ్వనమునఁ దగు నింక నొండు వలనికిఁ బోవన్.

3_6_100 వ. ఇప్పుడు కామ్యక వనంబు బహు మృగాకీర్ణం బై సరస ఫల భరిత భూరుహ ప్రకరంబై విమల కమలాకరాభిరామంబై యున్న యది యని వింటిమి గావునం గ్రమ్మఱ నందులకుం జని తృణబిందు నాశ్రమంబున వసియించుట లెస్స యనినం దమ్ములు దేవా నీ వెట్లు నిశ్చయించితి మాకు నదియ యిష్టంబని పలికిరి తదనంతరంబ.

3_6_101 క. అనుజన్ములుఁ బాంచాలియు ననుచర వర్గంబు బ్రాహ్మణాలియును దోఁ జనుదేరఁగ సమ్మదముద ఘనతేజుఁడు సనియెఁ గమ్యక వనంబునన్.

3_6_102 వ. ఇట్లరిగి యందుఁ గృత నివాసులై యన్నీరులు శాక ఫల మూలంబులం జేసి దేహయాత్రలు నడుపుచు నొండొరుల యనజడి సూచి యత్యంత మదుఃఖ పరవశులగుచు జూదంబు నాఁడు దమ పడిన పాట్లు దలంచి కలంగుచుఁ గ్రోధ శోకంబులు దమలోన నుపశమించి కొనుచు వర్తిల్లం బదునొక్కండగు నేఁడు సనిన నందఱుం గాలంబు గడగాంచిన వారై వెడవెడ వికసిల్లిన చిత్తంబులతో నుచిత వృత్తంబుల నుండు నంత.

3_6_103 శా. ప్రీతుండై చనుదెంచె నాశ్రిత జనాభీష్ట క్రియాశీలుఁ డు ద్గీతామ్నాయుఁడు నిర్విధూత దురిత క్లేశుండు యోగామృత స్ఫీత స్వాంతుఁ డనంత సంతత సమావిర్భాత కారుణ్య ధా రా తోయన్నపనైక శీలుఁ డగ పారాశర్యుఁ డచ్చోటికిన్.

3_6_104 క. మునిపతి దోదవ్వులఁ గని జనపతి దమ్ములును దాను సంప్రీతి నెదు ర్కొని యర్ఘ్యాది విశేషా ర్చనలం బరితుష్టుఁ జేసె సంభృత భక్తిన్.

3_6_105 వ. కృష్ణ ద్వైపాయనుండును ననవరత వనవాసాయాస కృశ దేహుల నధిక దుఃఖాయమాన హృదయులం దన మనుమలం జూచి వగచి ధర్మ పుత్త్రున కిట్లనియె.

3_6_106 ఉ. కాల విపర్యయంబున సుఖంబును దుఃఖము వచ్చుచుండు నె క్కాలము నేరికిన్ ధ్రువము గాదు సుఖంబును దుఃఖమున్ మహీ పాల బుధుండు దద్వివిధ భంగు లెఱింగి ప్రమోద ఖేద సం శీలుఁడు గాఁడు రెంటను బ్రసిద్ధ పథంబున నప్రమత్తుఁ డై.

3_6_107 క. విను నీవును నాపదలకు మనమున నొక్కింత యోర్చి మహనీయముగా నొనరింపుము తపము దపం బునన కదా సకల సౌఖ్యములు సిద్ధించున్.

3_6_108 క. క్షమయు నహింసయు సత్యము సమతయు నింద్రియ జయంబు శమముఁ బరిత్యా గమును దపో లక్షణములు గ్రమమున నిన్నియును నూర్ధ్వగతి కారణమున్.

3_6_109 తే. ఇందుఁ జేసిన పుణ్యంబు యందుఁ గుడుచు మీఁది జన్మంబునకు నది మేలుఁ జేయుఁ గాన తనశక్తితోఁ గూడ దాన ధర్మ చిర పరాపకారంబులు సేయ వలయు.

3_6_110 వ. అనినం బాండవాగ్రజుండు దన తపంబులలో దుష్కరం బెయ్యది యెద్దాన నధిక ఫలం బగు నని యడిగిన వేద వ్యాసుం డిట్లనియె.

3_6_111 సీ. దాన మూర్జిత ఫలచం బర్థ సాధ్యమై పరగుటఁ గరము దుష్కరము నదియ నరులకు నధిప ప్రాణంబల కంటెను రూపింప నర్థంబు తీపు వినవె యుగ్రంబు లైన యాయుధమున మొనలపై నుఱుకుట యంభోధి దఱిసి చనుట కృషి పాశుపాల్య సంక్లేశంబు నొందుట యడవులఁ గొండల నిడుమ పడుట

ఆ. నవసి యనుదినముఁ బర ప్రేష్యులై యునికి దలఁప నర్థమునకు చూవె యట్టి దుఃఖ లబ్ద మైన యయ్యర్థంబు విడుచు టెవ్విధముఁ గడిఁది గాదె.

3_6_112 శా. అన్యాయార్జిత మైన విత్తమునఁ జేయం బును దానంబు మూ ర్ఖ న్యాయం బది దానఁ జేసి ఫలపాకం బేమియున్ లేదు యు క్త న్యయార్జిత మించుకంత యయినం గాలంబు దేశంబు స మ్మాన్యం బైన తగఁ బాత్రయోగమున సౌమ్య బై ఫలించుం దుదిన్.

3_6_113 వ. తొల్లి ముద్గలుం డను మహా ద్విజుండు సన్మార్గోపార్జితం బైన వ్రీహిద్రోణంబు సత్పాత్రంబునఁ వినియోగించి కాదె పరమ సిద్ధిం బొందె ననిన విని ధర్మ నందనుండు మునీంద్రా ముద్గలుండు వ్రీహిద్రోణం బెబ్భంగి నుపార్థించె నెట్టి పాత్రంబునఁ బ్రతిపాదించె వినవలతుం జెప్పవే యనిన నతం డిట్లనియె.

- వ్యాసుఁడు ధర్మజునకు వ్రీహిద్రోణాఖ్యానంబు సెప్పుట – సం. 3-248-3

3_6_114 క. అతిధి ప్రియుఁడు విశిష్ట వ్రతుఁడు విమస్తరుఁడు సత్యవచనుండు విని ర్జిత విషయేంద్రియుఁడు సము న్నత పుణ్యుఁడు ముద్గలుఁడజు ఘన స్థిర బుద్ధిన్.

3_6_115 వ. పుత్త్రదార సహితంబుగాఁ గురుక్షేత్రంబున వసియించి యుంఛవృత్తి పరాయణుం డై పాడ్యమిం దొడంగి పదునాలుగు దివసంబు లొక్కొక్క గింజయ కా నేరి దూఁమెడు వడ్లు సమకూర్చి పర్వ దినంబున బాకంబు సేయించి దేవ పితృ పూజనంబు లొనరించి యతిథుల కన్నంబు పెట్టి మిగిలిన యన్నంబునఁ దానును బుత్త్రకళత్రంబును దేహయాత్ర నడుపుచు నివ్విధంబునఁ బక్షోపవాస వ్రతంబున వర్తిల్లుచున్నయెడ నొక్క పర్వ దినంబు నందు.

3_6_116 మ. మతి నత్యంత జుగప్సితం బయిన యున్మత్త స్వరూపంబుతో గత వస్త్రుండును ముక్తకేశుఁడు బహుగ్రామ్యోక్తి శీలుండు నై హిత పుణ్యుండు మునీశ్వరుం డతిథి యై యేతెంచె దుర్వాసుఁ డన్ యతి యమ్ముద్గలు పాలికిం బటు బుభుక్షాయత్తతం దూలుచున్.

3_6_117 క. అతనిఁ గని యించు కంతయు మతి ననుమానంబు లేక మానుగఁ బ్రత్యు ద్గతుఁడై యర్ఘ్యముఁ బాద్యము నతిభక్తి నొనర్చి మునికులాగ్రణి నెమ్మిన్.

3_6_118 క. అన్నంబు వెట్టె నతఁడు త దన్నం బంతయును గడుచు యాత్మఁ దనిసి శే షాన్నంబు మేన నిండఁగ సన్నతుఁ డలఁదికొని మగుడిఁ జనియె నిజేచ్ఛన్.

3_6_119 క. మునిపతి పర్వము పర్వం బున మఱియును నరుగుదెంచు ముద్గలుఁడును దా ననశనుఁడై యుండియు న మ్మునివరునకు నొసఁగు నన్నముం బ్రియ మెసఁగన్.

3_6_120 వ. ఇవ్విధంబున నాఱు పర్వంబులు గుడిచి దుర్వాసుండు వాని చిత్తంబున నొక్క కొఱంతయు గానక యద్భుత ప్రమోద మగ్నమానసుండై వాని కిట్లనియె.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com