ఆ భా 3 6 031 to 3 6 060

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_6_031 క. కర్ణుని యాడిన మాటలు నిర్ణయమున కింత యొప్పునే యిప్పలుకుల్ కర్ణంబులఁ జొనుపుము దుః ఖార్ణవ పారంబుఁ బొందు మవనీ నాథా.

3_6_032 తరలము. కడఁగి బుద్ధి బలంబు నంద యకంటకంబుగఁ జేసి యే బుడమి రాజ్యము సర్వముం దగఁ బుచ్చి యిచ్చిన నిమ్ములం గుడున నేరక దిని నిచ్చటఁ గూలఁ దన్ని శరీరమున్ విడుతుఁగా కని నిశ్చయించెద వెఱ్ఱి వైతె నరేశ్వరా.

3_6_033 ఆ. నీకు వృద్ధ సేవ లేకున్కి యిప్పుడు నాకుఁ దెల్ల మయ్యెఁ బ్రాకటముగఁ గోపమును మనోతాపంబుఁ బొందుచో ధీరుఁ డపుడ యడప నేరవలదె.

3_6_034 తే. పిఱికి తనము నేమఱుటయు నొరువతనము మెత్తఁబాటు ను గార్యంబు నత్తెఱంగు నేరమియు విషయంబులఁ గూరుటయును గలుగుపతికి నుండరు సిరి దొలఁగి పోవు.

3_6_035 వ. కావునఁ గార్యజ్ఞుండ వగుము కార్యజ్ఞానం బెట్టి దనిన.

3_6_036 ఉ. కౌరవనాథ నీకు నుపకారము సేసిరి పాండవేయు ల వ్వీరులయందు నెయ్యమును వేడ్కయు నొప్పఁగ నీ వభీష్ట స త్కారము సేఁత యుక్త మగు గాక ప్రియంపడ నర్హ మైనచో దారుణ శోక వహ్ని పరితాపముఁ బొందుట యిప్డు ధర్మువే.

3_6_037 చ. కృతము దలంచి చితమునఁ గిల్బిష మంతయు నుజ్జగించి స న్మతులఁ బృథా తనూజుల నమానుశ తేజులఁ బిల్వఁబంచి త త్పితృ ధనమైన రాజ్యము నభీష్టముగాఁ దగ నిమ్ము నీకు నీ క్షితి వలయంబునం బరమ కీర్తియుఁ బుణ్యముఁ గల్గు భూవరా.

3_6_038 క. వారలు నీ తోఁబుట్టువు లీ రాజ్యము మీరు వారు నేకంబై పెం పారఁగ నేలుఁడు దీనం గౌరవ కుల నాథ సౌఖ్య గౌరవ మొందున్.

3_6_039 వ. అని శకుని సెప్పుచుండ నగ్గాంధారీ నందనుండు నిజ చరణ సమీపంబునం బడి యున్న దుశ్శాసనుం గ్రచ్చియెత్తి మూర్ధాఘ్రాణంబు సేసి కర్ణ సౌబలులం జూచి మీ రేల నన్నుఁ గాంచెదరు ధర్మైశ్వర్య ధన భోగంబు లందు నా కభిలాషఁబు తేదు ప్రాయోపవేశంబు నందుఁ గృత నిశ్చయుండ వైతి మీరింక నొండు విఘ్నంబులు సేయక యూరక మీ వలయు నెడకుం బొం డనిన వారలు దేవా నీ విధం బిట్టిద యయ్యెనేని మే మెందుఁ జేరెదము నీ తోడి వారము కాక యని రంతం గమరహితుండు పశ్చిమాచల సమీప గతుం డగుటయు నన్నరనాథుండు సురలోక గమన కుతూహతి యై శుచి స్నానంబు సేసి వల్కలంబులు ధరియించి సంధ్యా సమయ సముచితంబు లగు కరణీయంబులు నిర్వర్తించి వివిక్త దేశంబునందు దుర్భాస్తరణంబున నాసీనుండై వాఙ్మియతుండై.

3_6_040 క. క్రమమున బాహ్యేంద్రియ క ర్మము లెల్లను మరల విడిచి సహిత సమాధి క్రమ దశ నుండె నివాత స్తిమితం బై వెలుఁగుచున్న దీపము పోలెన్.

- ప్రాయోప విష్టుండైన దుర్యోధనుని గృత్య పాతాళంబునకుఁ గొనిపోవుట – సే. 3-239-18

3_6_041 సీ. ఆ సమయమూన ము న్నమరేంద్ర విజితు లై యహిలోకములనున్న యసుర వరులు ధృతరాష్ట్ర నందను తెగువ యెఱింగి యాత్మీయ పక్ష క్షయ స్థితికి వగచి యాతనిఁ బిలిపింప నప్పుడు శుక్రాదు లైన భూసుర సమూహముల చేత వేల్మి వెట్టించి వేగంబ యొక కృత్య వెలువడి భీషణ వికృత మూర్తి

ఆ. యేమి పనులు గలిగె నెఱిఁగింపుఁ డనిన వా రిచటి కిపుడు కౌరవేంద్రు ననఘు నుజ్జ్వలాంగు నా సుయోధనుఁ దెమ్ము ప్రా యోపవేశ వృత్తి నున్న వాని.

3_6_042 వ. అని పనిచినం గృత్యయు నా క్షణంబ చని ప్రాయోప విష్టుండై యున్న దుర్యోధను గ్రుచ్చి యెత్తికొని రసాతలంబునకుం దెచ్చి దైత్యులకు సమర్పించినం బ్రీతులై వారు వాని గౌఁగిలించికొని కుశలం బడిగి యిట్లని రయ్యా నీవు శూరుండవు శూర జన రక్షితుండవు భరత కులోద్వహుండ విట్టి సాహసం బేల చేసితివి మఱి యాత్మ ఘాతకునకు లోకంబన నిందయు హినతయు దుర్గతియుం బ్రాపించు లోక విరుద్ధంబులై మూల ఘాతంబులైన కార్యంబుల యందు నీ యట్టి బుద్ధిమంతులు ప్రవర్తిల్లుదురే యట్లు గావున నీ వఖిల ధర్మార్థ యశో భోగ నాశంబైన యీ దుర్విచారంబు విడువుము ధైర్యంబును బ్రతాపంబును బాటింపుము శత్రు జన భంజనంబు సేయుము నావు మనుష్య మాత్రుండవు గావు నీ పూర్వ జన్మ ప్రకారంబు సెప్పెద మాకర్ణింపుము.

3_6_043 ఉ. ఏము తపంబు సేసి పరమేశ్వరు నీశ్వరు బార్వతీ మనః కాముకుఁ గామవైరి నవికారుఁ బూరాంతుఁ బ్రీతుఁ జేసినం గామిత దాయి యైన శితికంఠుఁడు నిన్ను సృజించి యిచ్చె ను ద్దామ దయా విధేయుఁడు ముదంబున మాకు నధీశ్వరుండుగన్.

3_6_044 ఉ. నీ దగు పూర్వ దేహము వినిర్మల వజ్ర విశేష సం పాదిత మస్త్ర శస్త్ర పరిపాట నభేద్యముగాదు నిత్య నిః ఖేదము పుష్ప కోమలము ఖేచర భూచర కామినీ మనో హ్లాదన మిట్లుగా నభవుఁ డర్థి నొనర్చె నుమా సమేతుఁడై.

3_6_045 ఉ. నీవు ధరిత్రిఁ బుట్టుటయు నీకు సహాయము సేయఁ గోరి నా నా విధ దైత్య దానవ గణంబులు రాజ కులంబు లందు స ద్భావన నుద్భవించెఁ బటుబాహులు దివ్య మహాస్త్ర కోవిదుల్ ద్రావిత వైరు లుర్వి భగదత్త పురస్సరు లైన వీరులై.

3_6_046 వ. భీష్మ ద్రోణ కృపాదులు గొందఱు దేవంశ సంభవు లైనను దదీయ భావంబులు రాక్షసావేశంబు నొందెడు దానం జేసి వారు నిర్దయులై విమూఢులుం బోలె నన్యోన్య పరుషంబులు పలుకుచు నలుక మిగులం బుత్త్ర పౌత్త్ర మిత్త్ర భ్రాతృ శిష్య గురు బాల వృద్ధ జన భేదంబులు విచారింపక సమరంబు సేసి దివ్యంబులు మానుషంబులు నైన వివిధాస్త్ర శస్త్రంబులఁ బాండవ పక్ష క్షయంబు గావింపం గలవారు పాండవులు బంధు స్నేహంబు విడిచి తెగువకుం జొచ్చి నీ చంత నిహతు లగుదురు నీ మనంబుల బీభత్సువలని భయంబు గొంత గలదు దాని నెఱింగి నేమును దగు నుపాయంబు దలంచితి మది యెట్లనినఁ గృష్టుచేతం జచ్చిన నరకాసురు వంశంబు గర్ణు నావేశింపం గల యది తత్కారణంబునం గృష్ణార్జునులతోడ బద్ధ వైరుండై యవ్వీరుండు నిజ దివ్యాస్త్రంబులం గృష్ణుల నిద్దఱ నిర్దహించు నివ్విధం బెఱింగి యింద్రుండు పాండవ రక్షణార్థంబు వచ్చి కర్ణు కవచ కుండలంబులు గపట రూపంబున నపహరింప గలవాఁడు మఱియును.

3_6_047 క. క్షితి సంశప్తకు లనఁగా శత లక్ష సహస్ర సంఖ్య జనియిచిరి ద ర్పితులై దనుజును దద్బల తతిచే సమరమున నింద్రతనయుఁడు సిక్కున్.

3_6_048 తరలము. నిహతకంటక మైన యిద్ధరణీతలం బఖిలంబు నీ మహిత శాసన గోచరం బగు మానవేంద్ర ప్రసన్న తా మహిమ నొందుము నీవ తేవవను మాకు నందఱకుం గురూ ద్వహ విషాదము వొందఁ బాడియె దైత్య పక్ష భయంబు గన్.

3_6_049 మ. చను మిం కొండు దలంపు మాను మని యాశ్వాసించి వానిం బునః పురాలింగన మాచరించి యెలమిం బూజించి దైత్యోత్తముల్ జననాథోత్తమ వీడుకొల్పిరి తదాజ్ఞం జేసి యాకృత్యయున్ మును దాఁ దెచ్చిన చోటఁ బెట్టె నధిపున్ మెదంబు సంధిల్లఁగన్.

3_6_050 ఉ. అంత సుయోధనుండు హృదయంబున విస్మయ మంది యంత వృ త్తాంతము స్వప్న వృత్తము క్రియం దలపోసి నిజంబ కాఁగ న త్యంతము నిశ్చయించుచుఁ బృథా సుతులన్ సమరంబు లోన ని ర్జింతున కాక యంచు వికసిల్లె దురాశయ భగ్న బుద్ధి యై.

3_6_051 క. విను జనమేజయ పౌరవ జనవిభుఁ డబ్భంగి రాత్రి చరితం బగు న ద్దనుజ సమాభాషణ మె వ్వనికిని నెఱిఁగింప కుండువాఁ డయ్యె మదిన్.

3_6_052 వ. అంతఁ బ్రభాతం బగుటయు రాధేయుండు సుయోధను పాలికిం జని హేతు మద్వాక్యంబుల నతని కిట్లనియె.

3_6_053 ఉ. చచ్చిన పిమ్మటం గడిఁది శత్రుల నోర్వఁగ వచ్చునే శుభం బిచ్చునె చావు లెందును నరేశ్వర యాఱడి చత్తు నంట దా మెచ్చగు నయ్య యేరికిని మేనికి జీవము గల్గుచోన పెం పచ్చుగ సిద్ధిఁ బొందు విజయార్ధ సుఖంబులు మర్త్య కోటికిన్.

3_6_054 ఉ. కావున శోక దైన్యముల కాలము గా దిది లెమ్ము విక్రమ శ్రీ విలసిల్లు మంచుఁ గురుసింహుని సింహ సమానుఁ జారు శ య్యా వివశాంగు నంగపతి యాదటఁ దా నిరుగేల గ్రుచ్చి సం భావన నెత్తుచుం బ్రణయ భాషల వెండియు వాని కిట్లనున్.

3_6_055 క. మది నర్జునుఁ జూచి భయం బొదవిన యది నీకు వానినుగ్ర రణంమునం బదునాలవ యేఁడు జయిం చెద నాయుధ మంటి ప్రతిన సేసితి నధిపా.

-దుర్యోధనుఁడు ప్రాయోపవేశము మాని కరిపురంబునకుఁ బోవుట – సం. 3-240-40

3_6_056 చ. అనవుడుఁ దత్ప్రతిజ్ఞయు సురారుల వాక్యములుం దలంచి య జ్జనపతి గాఢ నిశ్చయ వశంవదుఁ డై శయనంబు డిగ్గి చ య్యనఁ బయనంబు సేయుఁ డని యప్పుడమాత్యులఁ బంచి యిమ్ములన్ దిన ముఖ కృత్యముల్ సలిపి దీపితుఁడై వెడలెం బ్రియంబు తోన్.

3_6_057 వ. అయ్యవసరంబున.

3_6_058 చ. రయ విచలత్తులంగ మతంరములన్ మదనాగనక్ర సం చయములఁ జంచలచ్చటుల సైనిక మత్స్యములన్ మహోన్నతం బయి కురు రాజ చంద్రునుదయంబున దద్దయు బొంగెఁ బ్రస్ఫుర ద్భయద మనాహర ప్రగట భంగులఁ దద్బలవార్ధి యుద్ధతిన్.

3_6_059 ఉ. చామర పుండరీక విలత్సిత చారు పతాకలం గురువారం గ్రామణి యాత్ర నెంతయును గాంతి వహించె నభంబు శారదో ద్దామ మరాభ మండల సిత స్ఫుట పద్మ వనీ పరిస్ఫుర త్తామరసా కరంబున విధంబున భూచర నేత్ర పర్వమై.

3_6_060 వ. ఇట్లు దుర్యోధనుండు గర్ణ సౌబల సమేతుండై దుశ్శాసనాద్యనూజ గణంబునుం దక్కిన యమాత్యులుం గొలువఁ జెలువు మిగులం జని కరిపురంబు ప్రవేశించి సముచిత వ్యాపారంబుల నుండు నంత నొక్క నాఁడు మంత్ర జన పరివేష్టితుం డై యున్న రాజునకు భీష్ముం డిట్లనియె.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com