ఆ భా 3 5 361 to 3 5 390

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


3_5_361 వ. అనిన యనంతరంబ కర్ణసౌబలులు ధృతరాష్ట్రు తోడ దేవా యట్లయినం దడయక దుష్ట మృగ నాశనంబులు గో గణ సంరక్షణంబును జేయుటకు భవత్సూను దుర్యోధను నియోగింపు మనిన నతండు గొండొక విచారించి యిట్లనియె.

3_5_362 మ. తగు గోరక్ష మొనర్ప దుష్ట మృగ విధ్వంసంబు నూహింప మే లగు నైనన్ వినుఁ డవ్వనాతంరమునం దాసక్తిమై నున్న వా రు గరిష్ఠాత్ములు పాండురాజ తనయుల్ రూఢ ప్రతాపాఢ్యు ల ట్లగున్ మీగమనంబు నా మదిఁ బ్రియంబై తోఁప దెబ్భుంలన్.

3_5_363 చ. వనమున కేఁగి వందురిన వారని మీ రవశ్యముం జెనకఁ దలంతు రప్పురుష సింహులు భూరి తపో నిధుల్ మనం బునఁ గలుషించి రేనియుఁ దపో మహిమన్ మిము నిర్దహింతు రొండె నతులిత శాస్త్ర శక్తిని వడిం దనునుమాడుదు రాజి నందఱన్.

3_5_364 క. మున్నును మీ చేతఁ గడున్ బన్నము వడి నొచ్చినారు పార్థుడు మిమ్ముం గన్నంత నలుగ కుండునె పన్నగరిపు సన్నిభుండు పవనజుఁ డాత్మన్.

3_5_365 వ. అదియునుం గాక.

3_5_366 చ. ఒకరుఁడ ధాత్రియంతయును నోర్చెఁ గృతాస్త్రుఁడు గాక యుండియుం బ్రకటిత బాహు విక్రముఁడు ఫల్గునుఁ డిప్డు మహేంద్రుపాల న త్యకుటిల దివ్యబాణ విదుఁడై యెలమిం జనుదెంచె నట్టి వా నికి నెదురంగ శక్య మగునే రణభూముల నింక నేరికిన్.

3_5_367 తే. చెనకి మీరు వారికిఁ గీడు సేయుటయును వారు మీ కెగ్గ సేఁతయు వగవ మేలు గాదు వలసిన ఘోష రక్షణ మొనర్పఁ దగిన వారలఁ బుత్తము దడయ కందు.

3_5_368 వ. అని యొడంబడ కున్న నయ్యూంబికేయునకు శకుని యిట్లనియె.

3_5_369 ఉ. పాలిత విక్రమోన్నతులు పాండు తనూజులు వారి కప్రియం బేల యొనర్తు మే మధిప యే మటు సేసితి మేనియుం బ్రతి జ్ఞాలపితుండు ధర్మజుఁడు సత్యము దప్పునె తమ్ము లేల త చ్ఛీల మతిక్రమింతు రిది సిద్ధము నమ్ముము నెమ్మనంబునన్.

3_5_370 క. మాకును జిత్తంబుల మృగ యాకౌతుక మతిశయిల్లినది గోగణ ర క్షాకరణము గార్యం బటె యే కీడును నేల పొందు నిందు మహీశా.

3_5_371 క. అనిన నతఁడు గొండొకవడి మనమున నూహించి బుద్ధిమంతుల రై గో ధనము నరసి తడయక రం డని వారికి నెట్టకేల కనుమతి యిచ్చెన్.

3_5_372 ఆ. ఆ క్షణంబ కౌతుకాతిశయవ్యగ్ర హృదయుఁడైన ఫణ ధరేంద్రకేతు నాజ్ఞఁ గరిపురంబునం దెల్ల ఘోషింపఁ బడియె ఘోషయాత్ర ప్రకటలీల.

- దుర్యోధనుఁడు ఘోష యాత్ర వోవుట – సం. 3-228-23

3_5_373 సీ. అంతఁ బ్రహృష్టాత్ముఁడై లలితాంబరా భరణాంగరాగ విస్ఫురిత మూర్తి నొప్పారి విభుఁడు సహోదరులును గర్ణ గాంధారులును బ్రియ బాంధవులును సముచిత వాహన సైన్య సేతులై కొలువంగ నెడలె నుజ్జ్వల విభూతి నాందోళికాది వాహనములఁ దత్ప్రియ ప్రమదలు బహు సహస్రములు ననిరి

ఆ. కడఁగి పౌరు లెల్లఁ గైసేసి పడఁతులుఁ దారు నడచి రతి ముదంబు తోడఁ బ్రకట శకట వైశ్య పణ్యాంగనాది సం కులత నుల్లసిల్లె ఘోషయాత్ర.

3_5_374 వ. మఱియు నమ్మహీపతి పయనంబున కనురూపంబుగా నెనిమిది వేలు రథంబులు మువ్వది వేలేనుంగులుఁ దొంబదివేలు గుఱ్ఱంబులు శత సహస్ర సంఖ్య కాల్వురుం గల మహా సైన్యంబు తోడ నడిచె మృగయాకుశలు లైన మృగయులును విటవిదూషక వంది వైతాళికాది జను లనేకు లనుగమించి రిట్లు గప్యూతిమాత్రం బగునేల యరిగి యచ్చట విడిసి యద్దినశేషంబును రాత్రియుం గడిపి మఱునాఁడు వివిధ గిరి గహనంబు లతిక్రమించి ఘోషంబులున్న వనంబు సొచ్చి యం దొక్క రమణీయ ప్రదేశంబున శిబిరంబు గావించి యమ్మనుజేంద్రుండు.

3_5_375 సీ. నానా సహస్ర సంఖ్యానంబు లై సంతతానంద విగత భయత్వలీల నక్కాననమున నేదిక్కు సూచిన నతి సంకులంబుగఁ గుంద శంఖ చంద్ర హార నీహార డిండీర పటీర ముక్తా హార హీర సంకాశములును గాదంబ కాలేయ కాదంబినీ నీల జాల తమాలికా సన్నిభములు

తే. ప్రౌఢ బంధూక పల్లవ భాసితములు వికచ కాంచన చంపక విస్ఫుటములు నైన వర్ణంబు లొప్ప నేత్రాభిరామ భంగి నలరారు గోకదంబులఁ గనియె.

3_5_376 వ. కని తదీయ సమృద్ధికకి సంతసిల్లుచు గోపాల జనంబులు సవినయంబుగాఁ దన్నుం గాంచిన నాదరించి వారు దనకు నగ్గోవుల పేళ్లును లక్షణంబులు నేర్పడ నెఱింగించు చుండఁ బేరువేఱ వత్సంబులు వత్సతరంబులు మహోక్షంబులు ధేనువులు దర్ణకంబులు మొదలైన గో విశేషంబుల నాలోకించుచు నయ్యై విధంబులఁ బసికిం దగిన రక్షణంబు గావింప నర్హజనంబుల సవిశేషంబుగా నియోగించి మఱియును.

3_5_377 క. గోపాల సమన్వితుఁజై యా పొలమునఁ దిరిగి గోరసాస్వాదనలీ లా పరితృప్తి దలిర్చె మ హీపాలుఁడు నెమ్మితోడ నిష్టులుఁ దానున్.

3_5_378 వ. తదనంతరంబ గాయక నర్తకాదులు వంది మాగధ జనంబులుం గనిన నాదరించి వారికి నభిమత ధనంబు లొసంగి మగయా వినోదంబునకుం దొడంగి.

3_5_379 మ. హరిణ వ్రాతిములం గలంచుచు నుదగ్రానేకపశ్రేశిఁ జె చ్చెర బంధించుచు నుగ్ర సింహనివహచ్ఛేదైక సక్రోధబం ధురతం బేర్చుచుఁ బ్రస్ఫురన్మహిష శార్దూలోద్ధత క్రోడని ర్భర పాతంబు లొనర్చుచుం దిరిగె భూ పశ్రేష్ఠుఁ డక్కానలోన్.

3_5_380 వ. మఱియు ననవరత సురభి సరసీరుహ ప్రకర కీర్ణంబు లగు జలాశయంబు లాలోకించుచు నతి మనోహర ప్రసూన ఫల భరిత పాద పవనాభ్యంతరంబుల విహరించుచు మన్మథ మయూర మధుకర కీర కోకిలాలాప కోలాహలంబు లాకర్ణించుచుఁ గ్రమంబునం బరిజన సమన్వితుం డై ధార్తరాష్ట్రుండు ద్వైత వన సరోవరంబు సేరం జనియె నంత నట ధర్మనందనుండు తత్సమీపంబు మునిజన సహాయుండై వన్యంబు లగు మూప ఫల విశేషంబులు సాధనంబులుగా సద్యస్కందం బను యజ్ఞంబు సేయుచుండె నప్పుడు దుర్యోధనుండు నిజ భృత్య జనుల నక్కొలని దరిం గ్రీడా గృహంబులు నిర్మింప నియోగించిన.

3_5_381 క. వారును సంభ్రమమున న వ్వారిరుహాకరము పొంత వదలక క్రీడా గారములు గట్టఁ దొడఁగుడు వారించుచు బాఱుతెంచి వడి గంధర్వుల్.

3_5_382 వ. ఇది చిత్రసేనుం డను గంధర్వ పతికిం గ్రీడార్థంబు కల్పితం బైనది గావున మీ రిక్కొలను సేరక తొలంగి పోవునది యనిన వారు మగుడం జని దుర్యోధనునకుఁ జెప్పుటయు నతండు రణదుర్మదులైన సైనికులం గొందఱం బంచిన నరిగి వారలు గంధర్వులు కిట్లనిరి.

3_5_383 మ. బలియుండా ధృతరాష్ట్ర సూనుఁడు మహాబాహుండు దుర్యోధనుం డలఘుం డీ కమలాకరంబునకుఁ గ్రీడార్థంబు గౌతూహలం బెలయంగాఁ బ్రియ కామినీ సహితుఁడై యే తెంచుచున్నాఁడు మీ ర్వల దిందుండఁ దొలంగి పొం డనవుడున్ వారుద్ధత క్రోధులై.

3_5_384 వ. ఒండొరువుల మొగంబులు సూచి పెలుచ నవ్వి వారల కిట్లనిరి.

3_5_385 క. ఎదిరిం దన్ను నెఱుంగఁడు మదమునఁ బ్రాణంబుఁ దనదు మానముఁ గోల్పో మదిఁ దలఁచినాఁడు మీవృపుఁ డిది యేటికిఁ జెనఁటి చెయ్వు లన్నియు నిచటన్.

3_5_386 వ. బుద్ధిమంతుల రై యూరక చనుట లెస్స యనుం డనినం గ్రమ్మఱి చని వారు కురుపతికిం దద్వచనంబుల తెఱం గతంయుం జెప్పుటయు నతండు రోషావేశ వివశుండై తమ్ముల దొరలం జూచి మీ రిందఱు మీమీ సైన్యంబుల తోడం గూడి కడంగి దుర్వినీతు లైన గంధర్వుల గర్వంబు మాన్పి సరోవరం బాక్రమించు నది వారికి సహాయుం డయి సురగణ సమేతంబుగ నింద్రుండు ననుదెంచె నేనియు నవలీల జయించునది యని నియోగించిన.

3_5_387 క. అతుల చతురంగ సేనా న్వితు లయి ధృతరాష్ట్ర సుతులు నిరతిశయరయో ద్ధత సిహనాద బధిరీ కృతదిఙ్ముఖు లగుచుఁ జనిరి గినుక యెలర్పన్.

3_5_388 వ. ఇట్లు ననుదెంచు కురు వీరుల కడ్డంబు వచ్చి కొందఱు గంధర్వులు ప్రియపూర్వకంబుగా నిట యేల వచ్చెదరు మీకు మా తోడి విద్వేషం బేటికి నిలువుం డనినం బెలుచ నార్చి సేనాగ్రచరులు వారల మీఁదం బ్రచుర శస్త్రాస్త్ర పాతంబు సేయం దొడంగినం దొలంగి చని యా గంధర్వు లా క్షణంబ చిత్రసేనునకు నంతయుఁ జెప్పి పుచ్చినం బ్రబల రోషరంజితాననుండై యతండు.

3_5_389 క. చనుఁడు రయంబున నా దు ర్జనులం గౌరవులఁ బొదివి సమయింపుఁడు మీ రని బహు సహస్ర సంఖ్యులఁ బనిచెను గంధర్వ వరులఁ బ్రకటిత బలులన్.

3_5_390 వ. ఇట్లు వనిచిన.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com