ఆ భా 3 5 331 to 3 5 360
వోలం సురేష్ కుమార్
3_5_331 ఉ. అన్నలుఁ దమ్ములున్ సతియు నార్తి మెయిన్ బహుదుఃఖగ్నులై యున్న తెఱంగు సూచి విజయుండు యుధిష్ఠిర వాక్య బద్ధుఁడై సన్నతుఁ డుగ్ర పన్నగము చాడ్పున రోజుచుఁ గ్రోధశోకవే గోన్నతి నాత్మ నేమనుచు నుండునొ నాసుతుతప్పు లెన్నుచున్.
3_5_332 క. అక్కట మృదుగాత్రులు గడుఁ జిక్కని మనసులు గుమారసింహులు గవ లిం పెక్కిన సుఖముల కర్హులు స్రుక్కి ననయనోర్చి యునికి చోద్యం బరయన్.
3_5_333 వ. అని పలికి వెండియు.
3_5_334 చ. అనుపమ తేజుఁ డున్నత భుజాగ్రుఁ డుదగ్రుఁడు వైరి నిగ్రహుం డనఘుఁడు వాయుసూనుఁడు నిజాగ్రజు చేసిన సత్యపాశ బం ధనమునఁ జిక్కి తత్సమయ తత్పరుఁడై యిటు ఘోర దుః)ఖ వే దనములు సైఁచెఁ గాక మది తద్దయుఁ గ్రోధమయంబు వానికిన్.
3_5_335 సీ. శకుని కైతవము దుశ్శాసను చేసిన దుష్కర్మమును గర్ణు తులువతనము దుర్యోధనుని దైన దుర్ణయంబును జిత్తమునఁ గిరిశల్యముల్ వోలె నలఁప దావాగ్ని తెఱఁగున దరికొని క్రోధంబు వనవాస మనియెడు వాయుగతుల నంతకంతకుఁ బేర్చి యవయవంబుల నెల్ల మండంగ నెప్పుడు మధ్యముండు
ఆ. మొగము జేవురింప ముడివడు బొమలతో నవుడు గఱచుచును భయంకరముగ నున్న రూపు వాయకుండు నామది వాఁడ మిత్తి నాదు పుత్త్ర మిత్త్ర తతికి.
3_5_336 క. అంతకసుతు హృదయంబున నంత గలుగ నేర దలుక యర్జును మదిలో నంత గలుగ దమ్మారుతి యంతకనిభుఁ డధిక రోషుఁ డనవరతంబున్.
3_5_337 తే. అర్జునానిలప్రేరితం బగుచుఁ బేర్చి వాయు తనయ దావాగ్ని దుర్వార భంగిఁ గర్ణ సౌబల సహితముగా మదీయ పుత్త్ర శత కాననము వెసఁ బొదువకున్నె.
3_5_338 క. అగుఁ గాక కర్మ ఫలములు దగఁ గుడువక పోవ వశమై దైవ కృతంబుల్ మగుడునె కౌరవ్యులకుం దెగు కాలం బయ్యె వగపు తెరు వింకేలా.
3_5_339 క. ఏను వలదన్న జూదము మానఁడ సుతు దుర్ణయంబు మగిడింపక ద ర్మానమునఁ గుల క్షయ సం ధానమునకుఁ దొడఁగితిని విధాతృని చెయిదిన్.
3_5_340 తే. రాత్రి తెగుతల దిన మేల రాక యుండు దినము తెగుదల రాత్రి యే తేరకున్నె పరగ సుఖదుఃఖములు గాల పర్యయమున నెందు మనుజులఁ బొందక యేల యుడుగు.
3_5_341 ఉ. మేలున సంతసిల్లు నెడ మేకొని యాపద లొందు నాపదల్ దూలఁగ భూరి సౌఖ్యములు దోఁచుఁ గృతంబులు దప్ప వెమ్మెయిం బొలఁగ నింతయుం గని బ్రబుద్ధ మనస్కులు ఖేద మోద ని ర్గాళిత ధైర్య సాగరులు గాక సుఖింతురు సర్వ కాలమున్.
3_5_342 చ. సిరికిఁ దొలంగి కానల వసించి కృశించిన పార్థుఁ డట్టె ని ర్జరుల వరంబునం బరమ సమ్మద లీల మహాస్త్ర లాభ వి స్ఫురణముఁ బొంది యద్దివికిఁ బోయి శరీరముతోన క్రమ్మఱన్ ధరణికి వచ్చె నిట్టివి గదా వివిధాద్భుత కర్మ పాకముల్.
3_5_343 క. గాండీవము విల్లటె యా ఖండల నందనుఁడు విల్లు గలవాఁ డటె త త్కాండంబులు దివ్యము లటె యొండేటికి వారి ధనము యుర్వియు సిరియున్.
3_5_344 వ. అని ధృతరాష్ట్రుండు బహు విధంబులగు పలుకులు పలుక విని దుర్యోధనుండు శకునిం జూచి యీ రా జేల యింత భీతుం డయ్యె ననుచు నతండునుం దానును గర్ణ సహితుండై యొక్క వివిక్త ప్రదేశంబునకుం జని కార్యాలోచనంబున నున్న యెడం గర్ణుం డిట్లనియె.
3_5_345 సీ. పాలిత శౌర్యులు పాండవేయులు దుఃఖశీలురై యడవుల పాలు వడిరి థరణీశ తొల్లి యింద్రప్రస్థ పురమున ధర్మనందను పాలఁ బేర్మితోడ శోభిల్లుచున్న విశ్రుత లక్ష్మి నీ బుద్ధి బలమున నిన్నుఁ బెంపొలయఁ బొందెఁ బరువడి దక్షిణ పశ్చమోత్తర పూర్వ దేశస్థు లయిన మహీశు లెల్ల
తే. నీక యరిగాపు లై రిప్డు నిఖిల జలధి శైల కాననన ద్వీప విశాల మయున మహి సమస్తంబు నేలుము మహిమ యెసఁగ లీల నింద్రుండు సురలోక మేలునట్లు.
- కర్ణ శకుని దుర్యోధనులు మంతనంబు సేయుట – సం. 3-226-9
3_5_346 ఉ. జానపదుల్ పురీజనులు సంతతముం బ్రమదం బెలర్ప నీ దైన శుభోదయంబ హృదయంబులఁ గోరుచు నున్న వారు స మ్మానము నొంది కౌరవ సమాజము నిన్ని భజింప భూరి తే జోనిధి వై వెలింగెదవు సూర్యుని చాడ్పున నీవ యిమ్మహిన్.
3_5_347 వ. పాండవు లిప్పుడు పరమ దుఃఖార్తు లగుచు ద్వైత వన సరోవర సమీపంబున నున్న వా రని వింటిమి నీవు సకల సామ్రాజ్య విభవంబు మెఱసి చని యందు నీ తేజంబు ఘర్మ సమయంబు నాఁటి తపను తెజం బై పగతుర కన్నులు గమర నతి దుస్సహం బగునట్లుగాఁ జేయుము దొల్లి నహుష పుత్త్రుం డయిన యయాతియుం బోలె నుజ్జ్వలుండ వై యున్న నిన్నుం జూచి పాండవులు హృదయ ఖేదంబుగా వగచెదరు మిత్ర జన మోదంబును శత్రు జన ఖేదంబునుం గదా సంపదలకుం దగియెడు ఫలంబు.
3_5_348 క. ధన ధాన్య త్త్ర బాంధవ జన లాభంబులును దలఁప సరిగావు సుఖం బునఁ దాను దనరి శత్రులు ఘనతర దుఃఖముల నుండఁ గని యలరుటకున్.
3_5_349 ఉ. నారలు గట్టి కూర లశనంబుగ నుగ్ర వనంబులో విప ద్భారము నొంది వందురిన ఫల్గును నుజ్జ్వల రాజ్య వైభవో దారుల మై కనుంగొని ముదంబునఁ బొందఁగఁ గాంచుకంటె నిం పారఁగ నొండు గల్గునె కృతార్థత యెందును గౌరవేశ్వరా.
3_5_350 తే. అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర గరిమ నొప్పుచున్న నీ దేవుల యొప్పు సూచి ధృతి దఱిఁగి తన్నుఁ దాన నిందించు కొనుచు హృదయమునఁ బాండవాంగన యెరియ వలదె.
3_5_351 వ. అనిన నిది వోలు నాగకేతనుండు సంప్రీతుం డై కొండొక విచారించి రాధేయుం జూచి యిట్లనియె.
3_5_352 క. నా తలఁపును నిట్టిది నీ వే తెఱఁ గెఱిఁగించి తది యభీష్టము మన మా ద్వైత వనంబున కరుగుట భూతలపతి యనుమతింపఁ బోలదు మదిలోన్.
3_5_353 తే. అందుఁ బాండవు లుండుట యాంబికేయుఁ డెఱుఁగు మన మవ్వనంబున కేఁగుటయును గడఁగి పార్థుల తోడి విగ్రహము కొఱక యని యవశ్యంబు వారించు నతఁడు మనల.
3_5_354 వ. అదియునుం గాక.
3_5_355 చ. ఉరతర విక్రమాఢ్యు లనియున్ మహనీయ తపో విశేష సు స్థిరు లనియుం బృథా సుతుల దిక్కునఁ దద్దయు భీతుఁడై నిరం తరమును మానవేంద్రుఁ డెదఁ దాపము నొందుచు మండు నింటె యి క్కురు విభుఁ డింతసేపు గడుఁ గూర్చి విలాపము సేసె వారికిన్.
3_5_356 వ. అతని యొద్దనుండి విదురుండును వారిన పెట్టుఁ చోటు గానక పొగడుచుండు జూదంబు నాఁట నుండియు విదురుండు పాండవ పక్షపాతి యగుట దెల్లం బయ్యె మన విచారించిన యిక్కార్యంబు చిన్న సిన్న యెఱింగె నేనియు నాతం డెల్ల భంగుల విఘ్నంబు సేయుం గావున నిది యంతయు రహస్యంబుగా నొనరించి కొని ధృతరాష్ట్రుండు దీని కనుమతించు తెఱంగెయ్యది యట్టి యుపాయంబు నీవును శకునియు నూహించునది మనము రేప కడ వచ్చి కురు పితా మహుం డైన భీష్మునిఁ గురు వంశోత్తముండైన ధృతరాష్ట్రుని నొడం బఱిచి వెడలుద మని వారి వీడ్కొలిపి దుర్యోధనుం డభ్యంతర గృహంబున కరిగి యా రాత్రి సముచిత ప్రకారంబునఁ గడపెఁ బ్రభాతంబగుటయుఁ గర్ణుండు దుర్యధను కడకుం జని యిట్లనియె.
3_5_357 ఉ. భూతలనాథ యే నొకటి నుపాయము గంటి నిప్పుడా ద్వైత వనంబునందు విదితంబుగ నున్నవి గోకదంబముల్ ప్రీతిగఁ దద్విలోకనము పేరఁ జనం దగు ధారణీశ్వరుం డీ తెఱఁ గైనఁ బొమ్మను నభీష్టముఁ జేకుఱు నెల్ల భంగులన్.
3_5_358 క. నా విని సుబల తనూజుఁడు దేవా నీ యాన యేను దెల్లంబుగ రే యీ వెరవె నెమ్మనమ్మున భావించితి ననియె నంతఁ బ్రహసిత ముఖులై.
3_5_359 వ. ఒండొరుల చెయి సఱచి నవ్వుచు నమ్మువ్వురుం దత్క్షణంబ సమంగ నామధేయుం డయిన గోపాలకు నొక్కనిం గఱపికొని ధృతరాష్ట్రు పాలికిం దోడ్కొని సముచిత ప్రసంగ సేవా విశేషంబుల నమ్మహీ విభు సుముఖుం జేసి యనంతరంబ దేవా ద్వైత వనంబు నందుల కీలారంవంబున నుండి వీఁడె యొక్క గోపకుండు వచ్చె ననిన నతండును వాని కబిముఖుండై పసుల సేమం బడుగుటయు వాఁ డిట్లనియె.
- కర్ణ సౌబలులు ధృతరాష్ట్రు చేత ఘోష యాత్ర కనుజ్ఞ గొనుట – సం. 3-227-2
3_5_360 ఉ. ద్వైత వనంబు నట్టి సుఖ వాసము గోవుల కెందు లేదు ధా త్రీ తలనాథ యిప్పుడు ప్రదీప్తములై సతతంబుఁ బేర్చి గో వ్రాత భయంకరంబు లగు వాలు మృగంబులు సంచరించు మీ కా తెఱఁ గెల్లఁ జెప్పుటకు నై యిట వచ్చితి నేను జెచ్చెరన్.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com