ఆ భా 3 5 181 to 3 5 210

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


3_5_181 ఆ. అసుర వీఁక నొక మహా చలశృంగంబు విఱిచి వైచె నమరవిభుని మీఁద గోత్రవైరి ఘోర కులిశాభిహతి వ్రయ్య నడిచె దానిఁ జదల నదరు లెగయ.

3_5_182 వ. ఇట్లు దన సాధనంబులు విఫలంబులైనం దలంకి దానవుం డక్కన్నియ దిగ విడిచి పఱచిన నింద్రుండు దానింజేరం జని నీ వెవ్వరిదాన వీరక్కసు చేత నెట్లు పట్టువడి తనిన నది యతని కిట్లనియె నయ్యా యే నరిష్టనేమి యను ప్రజాపతి కూఁతుర దేవసేన యనుదాను దైత్యసేన చెలియల నేనును మా యప్పయుం గేళి కౌతుంకంబునఁ దండ్రి యనుమతంబు వడసి సఖీ జనం సహితంబుగా వెడలి యిమ్మానస నగంబు సానుదేశంబులం గ్రుమ్మరుచుండు గేళి నామధేయుం డైన యీ యసురాధముండు.

3_5_183 క. పలుమాఱు వచ్చి తన దు ర్విలసితములు మాకుఁ జూపు వేడుక దోఁపన్ బలుకును మేలమునఁ జెనకఁ దలఁచుఁ గదియు మదనకదనదళిత హృదయుఁడై.

3_5_184 తే. వాని చేష్టలన్నియు దైత్యసేన కభిమ తంబులై యుండు నాకు నెంతయును దుస్స హముల వినవె యిమ్మెయిన యక్కమల నయనఁ గోరి దానవుఁ డెలయించి కొంచుఁజనియె.

3_5_185 తే. అంతఁబోక వెండియువచ్చి యింతసేసె నద్దురాత్ముఁ నన్ను మీదైన కరుణఁ దొడరి దుఃఖసాగరమునఁ బడుట దప్పె ననిన నయ్యింద్రుఁ డనియె నయ్యతివఁ జూచి.

3_5_186 క. విను దక్షతనూజులు మా జననియు మీతల్లియును నిజంబుగ మా కీ వను జవయితి వనజానన యొనరంగా వేఁడు నీకు నొక వరమిత్తున్.

3_5_187 వ. అనిన దేవసేన దేవేంద్రున కిట్లనియె.

3_5_188 తే. అనఘ మా తండ్రి యొక్కనాఁ డతి ముదమున నన్ను నుపలాలనము సేసి నాతినీవు ప్రథితపౌరుషుఁడగు భర్తఁ బడయుదనియె నట్టివానిని నీవు నాకరయ వలయు.

3_5_189 చ. అనిమిష దానవేంద్రులకు నైన నజయ్యుఁడు నుగ్రవైరి బం జనుఁడు త్రిలోక రక్షణ వశంవదుఁడున్ భవ దిష్ట మిత్రుఁడున్ ఘన గుణకీర్తనుండు నగు కాంతునిఁ గోరెద నా మనోరథం బు నెరయ సంఘటించి సురపుంగవ నన్నుఁ గృతార్థఁ జేయవే.

3_5_190 వ. అనిన నింద్రుండు దీనికిం బతి యెవ్వం డగునొకో యని కొండొక విచారించునెడ నమ్ముహూర్తంబు రౌద్రనామకం బయి సోమసూర్య సంగమ కారణంబయిన యమావాస్యాముఖం బై యుండం బూర్వ సంధ్యా రాగ రక్తాంబుద ప్రతిబింబ పటలపాటలితోదకం బైన జలనిధి సమీపంబున నమరాసుల సమర సంకులంబుగా నరుణకిరణుం డుదయించుచుండఁ దత్కాలంబున భృంగ్వంగిరః ప్రముఖు లైన మునులు వేల్చు హవ్యంబులు మోచికొని హవ్య వహనుండు సూర్యమండలంబు ప్రవేశించుచుండం గనుంగొని యిది సూర్యసోమాగ్ని సమాగసం బయిన రౌద్రనామక ముహూర్తంబు గావున సూర్యసోమాగ్ని తేజంబున జనియించిన వాఁడు దీనికిఁ బ్రియుండు గావలయు నని మనంబున నిశ్చయించి యతం డాక్షణంబ.

3_5_191 క. బాలం దోడ్కొని యబ్జజు పాలికిఁ జని మ్రొక్కి త్రిదశపలుఁడు దేవా యీ లలనకుఁ దగు వరునిఁ గృ పాలుఁడవై యొసఁగు మనినఁ బద్మజుఁ డనియెన్.

3_5_192 ఉ. దీపిత విక్రమాస్పదుఁడు దీనికి వల్లభుఁ డయ్యెడుం ద్రిలో కీ పరిరక్షణక్షముఁడు గీర్తితమూర్తి యొకండు వాఁడ మీ యాపద లెల్లఁ బాపుటకునై ధృతిఁ బూను నశేష దేవసే నాపతి భావమున్ విబుధ నాయక శీఘ్రమ భావ్య మింతయున్.

3_5_193 వ. అనినం బ్రీతుండై పితామహు వీడ్కొని యింద్రుండు ననియె దదనంతరంబ వసిష్ఠ ప్రముఖులైన సప్త మహామును లమావాస్యాహోమంబు సేయ సమకట్టిన నసరు లందఱు నందుల హవిర్భాగంబులు గొనుటకు నాసన్ను లగుటయు.

3_5_194 క. ఆహవనీయ ముఖంబున నాహూతుండై హుతాశుఁ డమ్మును లిడఁగా నాహుతులు గొని దివిజసం దోహమునకు వరుస నొసఁగఁ దొడఁగెం బ్రీతిన్.

- అగ్నిదేవుండు మునిపత్నుల గామించుట – సం. 3-213-42

3_5_195 సీ. ఆ సమయంబున నమ్మునీంద్రుల భార్యలందఱు సుస్నాన మొందఁ జేసి రమణీయ మాల్యాంబర విభూషణాద్య లంకారంబు లొనరించి గారవమునఁ జనుదెంచి పతులకు సన్మతిం బరిచర్య సేయుచు మెలఁగంగ వాయుసఖుఁడు మెలఁతల వాలిక మెఱుఁగుఁ గన్నులయొప్పుఁ దెలినవ్వు మొగముల విలసనంబు

తే. నండబెడంగులు నన్నువనడుములందు వెలయు వళులభావంబులు వలుఁదచన్నుఁ గవల నిక్కును నేర్పడఁ గని కరంగి మదనమార్గణ విదళిత హృదయుఁ డయ్యె.


3_5_196 వ. ఇట్లు వికలేంద్రియుండై వైశ్వానరుం డమ్మునిపత్నులయందుఁ దగిలిన డెందంబు మగిడింప నేరక వారలం గదియ నప్పళించి గార్హపత్య కుండంబునం దావేశించి.

3_5_197 చ. అతివలు దన్నుఁ జేరుటకు నాసపడుం బొరిఁ జేరుచోట నా యత విలసచ్ఛిఖాగ్రముల నల్లన వారల నంటుఁ గౌతుకం బతిశమై తదంగలత లాదటఁ గౌఁగిటఁ జేర్పఁ గోరుఁ గ పిత ధృతియై కలంగుఁ గడుఁ బెల్లగురాగ రసంబు ముంపఁగన్.

3_5_198 వ. అంత నమ్మునీంద్రుల హోమవిధి సమాప్తం బగుటయు జాతవేదుండు మదన వేదనాభరంబు సహింప నోపక నిర్జనం బయిన వనంబునకుం జని మునిపత్నీ సమాగసంబు దుర్లభంబుగా వగచి వెగడంది శరీరంబు దిగవిడువ సమకట్టునెడ దదీయ వల్లభయైన స్వాహాదేవి దత్ప్రకారం బంతయు నెఱింగి యతనికిం బ్రియంబు సేయునదియై సప్తమునులలో నంగిరసు భారయ శివ యను దాని రూపంబు గైకొని చని యేకతంబ యున్న హుతాశనుం గనుగొని యిట్లనియె.

3_5_199 తే. అంగిరసు భార్య నేను శివాభిధాన ననఘ నాకును నాతోడియంగనలకు నను దినంబును నతి మనోహి విలాస మైన నీ మూర్తి పైఁ గోర్కి యడరియుండు.

3_5_200 ఉ. నీ మదిచంత మిట్టిదని నిక్క మెఱుంగక నే మజస్రముం గామశరాహతిం గలఁగి కాఱియ వొందుదు మాత్మలందు నీ కామము మా దెసం గలిమి కౌతుకచేష్టలయం దెఱింగి యు ద్దామ మనోరథ ప్రచలిత స్థితి నందఱముం గ్రమంబునన్.

3_5_201 చ. నినుఁ గవయం దలంచి యిట నెమ్మిమెయిం జనుదెంచినార మిం పునఁ జెలు లెల్లఁ దొల్త ననుఁ బొమ్మని పంచిన వచ్చితిన్ మనం బనవర తానురాగముగ నంగజ కేళి భజింపు మింక నొం డని యెడసేసితేనిఁ గుసుమాస్త్రుఁడు సైఁపఁడు నన్నుఁ బావకా.

3_5_202 వ. అనిన సంతసిల్లి యగ్ని దేవుండు దానిం గైకొనియె నదియును నతని నభిమత భోగంబులం బ్రీతునిం జేసి తదియ తేజో ధాతువు ధరియించి యచ్చోటు వాసి యాక్షణంబ గరుడియై గగనంబునకు నెగసి యతి త్వరిత గమనంబున శ్వేత పర్వతంబునకుం జని యం దొక్కయెడ శరవణ స్తంబసంవృతంబైన కాంనకుండంబు నందు నిజ భర్త శుక్లంబు సంగ్రహించి మఱియును.

3_5_203 క. మునిపత్నుల రూపులు గై గొని యిట్టుల వరుసఁ బుష్పకోమలి ప్రియుఁ బ్రీ తునిఁ జేయుచు రేతస్కం దన మొనరించుచును వచ్చెఁ దత్కలశమునన్.

3_5_204 తే. విను పతివ్రతా తిలకమై వెలయునట్టి యయ్యరుంధతి రూపంబు నలవరింప నెట్లు నేరద కాని యయ్యింతి యున్న యువిద లార్వురు రూపులు నొనరఁ దాల్చె.

3_5_205 వ. ఇవ్విధంబున నాఱు మాఱులు ప్రస్కందితం బైన యగ్ని తేజంబున.

- కుమార స్వామి యవతారము – సం. 3-211-17

3_5_206 క. ఆదిత్యనిభుఁడు విపుల ద్వాదశ బాహుఁడు షడ్వదనుఁ డఖిల దిశా రోదోంతరంబు వెలుఁగ మ హోదారుండై కుమారుఁ డుదయం బయ్యెన్.

3_5_207 వ. ఇట్లు శుక్ల పక్షంబునం బాడ్యమియందు వీర్యనిషేకంబును విదియ యందు గర్భవ్యక్తియుఁ దదియ యందు మాత్రావిర్భావంబునుం జతుర్థి యందు సకలావయవ సంపూర్ణతయునై పేర్చి త్రిపుర దహన సాధనం బైన హరుకార్ముకం బమ్మహీధరంబునందు నిక్షిప్తంబై యున్నదానిం బుచ్చు కొని గుణధ్వని సేసిన నమ్మహోధ్వని విని కలుషించి యైరావత సుప్రతీకంబులను దిగ్గజంబు లయ్యగ్ని భవు మీఁదం బఱతెంచిన నమ్మహాభుజుం డా రెంటినిం బెనఁచి పట్టి రెండుచేతుల ధరియించి తన సహజం బైన శక్తి యొక్క కేలం గ్రీడార్థకలితం బైన కుక్కుటం బొక్కకేలను బరిపూర్యమాణనినదంబైన శంఖంబు గరద్వయంబునం దాల్చి హస్తయుగళంబున గగనంబు వ్రేయుచుం బాణియుగ్మంబు వక్త్రంబుల నిడికొని బాల్యోచితంబు లైన యంగుళి చర్వణంబులు పొరిఁబొరి నొనరించుచు నిశితసాయకంబునం గ్రౌంచ పర్వత విభేదనంబు సేసి పటుశక్తి పాతంబున శ్వేతశైల శృంగ భంగంబు గావించి చెలంగి యాఱు ముఖంబుల నొక్కపెట్ట యార్చినం బ్రళయభైరవారావ భీషణంబైన తదా ఘోషణంబున.

3_5_208 మ. కులశైలంబులు గ్రక్కునం గదలె దిక్కుల్ వ్రయ్యలయ్యెన్ మహీ వలయం బంతయు దిర్దిరం దిరిగె దేవవ్రాతముల్ సాధ్వసా కులతం బొండెఁ బయోధు లన్నియును సంక్షోభించె సప్తాశ్వు స ప్తులు బిట్టుల్కి రథంబు నల్ దెసలకుం బోనీడ్చె సంభ్రాతమై.

3_5_209 అట్టి మహోత్పాతంబులు పుట్టినఁ గని మునులు లోకములకు శుభముగా నెట్టన శాంతిక విధుల ప్పట్టున నొనరించి రాత్మ భావన పరులై.

3_5_210 వ. అ సమయంబునం జైత్ర రథ వన నివాసులైన జనులందఱుం గూడి యంగిరస ప్రముఖ మునీంద్రుల భార్యలకు నగ్నిదేవు వలన బుట్టిన బాలుండు లోకంబులకు నిట్టి యనర్థంబు సేయం దొడంగె నని యాక్రోశించిన నయ్యపవాదంబునకు రోసి యా సప్తమునులలోన వసిష్ఠుండు దక్కఁ దక్కిన యార్వురుఁ దమ వనితల బరిత్యజించిరి మఱియును గొందఱు జనులు వీ రేమి సేయుదు రిన్ని పోకలం బోయినది వహ్ని భార్యయ కాక యని పలుకం జొచ్చిరంత నమ్మహామునుల పాలికిఁ బావకాంగన ననుదెంచి యిట్లనియె.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com