ఆ భా 3 5 121 to 3 5 150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_5_121 ఆ. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవె వార లరిగి యింక నైన నమ్ముదుసళ్ళ యు దగ్రశోక వహ్ని నార్పవయ్య.

3_5_122 క. నీ యధ్యయనమ్మును సుకృ తాయాసము నిష్ఫలంబులై చను గురుసే వాయుక్తి లేక తక్కినఁ జేయుము నా పలుకు మేలు సేకుఱు నీకున్.

3_5_123 వ. అనినఁ గౌశికుం డతని కిట్లనియె.

3_5_124 క. ఇది యట్టిద నీ చెప్పిన సదమల హిత వాక్యభంగి సకలము వింటిన్ వదలక యిమ్మెయిన చరిం చెద గురు జనములకుఁ బ్రీతిఁ జేసెద ననఘా.

3_5_125 క. నాదైన భాగ్యవశమునఁ గాదే నీ తోడి చెలిమి గలిగెం బరమా హ్లాద మనస్కుఁడ నైతి శు భోదయముల కెల్ల నింక యుక్తుఁడ నైతిన్.

3_5_126 క. పాపకృతం బగు దుర్గతి మోపుఁ గనక యుండ ననుఁ బ్రబోధాత్మకలీ లా పరిణతుఁ గావించితి నా పాలిటి వేల్ప వీవ నరనుత చరితా.

3_5_127 చ. అనుపమ మెట్టి వారలకు నందదు ధర్మ పథంబు ధాత్రిలో విను పదివేవురం దొకఁడు విశ్రుత ధర్మ పరాయణుండు గ ల్గునొ కలుగండొ సందియము గోరి సనాతన ధర్మ మూఁది యె వ్వనికిని నీకుఁ బోలె బుధ వత్సల యిట్లు చరింప వచ్చునే.

3_5_128 చ. నినునొక శుద్రుఁగాఁ దలఁప నేర గుణాకల నీ చరిత్రముం గన మది నద్భుతం బొలసెఁ గావున నెయ్యది కారణంబుగా నొనరఁగ నిట్టి జన్మమును నొందితి చెప్పుము భూతబావివ ర్తనములయందు నీకు విదితంబులు గానివి గల్గ వెమ్మెయిన్.

3_5_129 వ. అనిన నతనికి ధర్మవ్యాధుం డిట్లనియె.

- ధర్మవ్యాధుఁడు గౌశికునకుఁ దన పూర్వ జన్మ వృత్తాంతంబు సెప్పుట – సం. 3-205-21

3_5_130 క. జనసుత నీ వెయ్యది యడి గినఁ దెలుపుట నా కవశ్యకృతము గాదే విను చెప్పెదఁ బూర్వభవం బున నేనొక బ్రాహ్మణుండఁ బుణ్య చరితుఁడన్.

3_5_131 వ. వేదవేదాంగ పారంగతుండనై యుండుదు నాకుం బ్రియసఖుం డైన యొక్క రాజపుత్త్రుతోడి సంగతించేసి ధనుర్వేదంబును నభ్యసించితి నొక్క నాఁ డమ్మహీపతి వేఁట వోయిన నేనును నతనితోడన చని వనంబునం బెక్క మృగంబుల నేయుచుండ నందొక్క బాణంబు దృణ లతాంతరిత దేహుండైన మునివరు నొక్కరుందాఁకిన నతఁడు హాయనుచుఁ బడియె నంత నేనును.

3_5_132 ఆ. డాయఁ బోయి తీవ్రసాయక విద్ధుఁడై పొరలుచున్న విప్రవరునిఁ జూచి తలఁకి యనునయంపుఁ బలుకులు పలికినఁ గినిసి యిట్టు లనియె మునివరుండు.

3_5_133 ఆ. బ్రాహ్మణుండవయ్యుఁ బాప ప్రవృత్తవై శూద్రకర్మమునకుఁ జొచ్చి తీవు గాన నిక్కువము మృగవ్యాధ జన్ముండ వగుము మీఁద ననియె ననిన నేను.

3_5_134 చ. ఎఱుఁగక తప్పు సేసితి సహింపఁగదే కడు దుర్భవంబునం బఱుపకు మయ్య నావుడుఁ గృపన్ మునినాథుఁడు దప్ప దివ్విధం బెఱుకు కులంబునందు జనియించియు ధర్మువు లెల్ల నిమ్ముగా నెఱిఁగెదు తల్లిదండ్రులకు నెంతయుఁ బ్రీతి యొనర్తు భక్తితోన్.

3_5_135 వ. గురుశుశ్రూషం జేసి నీకుఁ బరమశోభనం బగు జాతి స్మరత్వంబునుం గలుగు నపరజన్మంబున బరమ బ్రాహ్మణుండ వయ్యెద వని యనుగ్రహించిన నవ్విప్రుని దేహంబునందు నాఁటిన బాణంబు మెత్తన పెఱికి యతనిం దదీయాశ్రమంబునకుం జేర్చితి నా చేసిన పుణ్యంబున నమ్మహాత్ముండు నపాయంబు వొందం డయ్యె నాకు నిట్టి జన్మంబు నొందవలసె నని చెప్పినం గౌశికుం డిట్లనియె.

3_5_136 తే. జన్మ మిట్టిది చరితంబు చందమిట్టి దెన్నఁడును నిట్టి చోద్యమే నెందుఁ జూడ నింక జన్మాంతరము దాఁక నేల యిపుడ పుణ్య చరితమై నీవు విప్రుఁడవ కావె.

3_5_137 ఆ. పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యును నిజము శూద్రుకంటె నీచతముఁడు సత్యశౌచ ధర్మశాలి శూద్రుండయ్యు నతఁడు సద్ద్విజుండ యనిరి మునులు.

3_5_138 క. అనయంబు నాత్మకర్మం బున నతినీచ మగుభవముఁ బొందవలసె నే యని నీవు నిరంతరమును మనమున దుఃఖింప వలదు మహిత చరిత్రా.

3_5_139 చ. నిజగుణ దోష కర్మముల నెట్టన మేలును గీడు వచ్చుఁ ద త్ప్రజనిత సౌఖ్యదుఃఖములఁ బ్రాజ్ఞులు దుల్యమనస్కులై మనో రుజలును దేహజంబు లగు రోగములున్ హితధర్మకర్మ భే షజముఁ జేసి పాపుదురు సర్వము సాత్త్విక దృష్టిఁ జూచుచున్.

3_5_140 క. ప్రియములు వాయుటయును న ప్రియములు వెసఁ బొందుటయు బెల్లుగ నగుఁ ద త్క్రియలందు మూఢమతికి హృ దయ తాపము వాయదెపుడుఁ దరికొను చుండున్.

3_5_141 తే. వగతుమన్న నెవ్వారికి వగవఁ జనదు చిత్తమున నేమిటికి సంతసింప రాదు కాన గతమునందును ననాగతమునందు వగవరార్యులు సంతోష వంతులగుచు.

3_5_142 క. వగపునఁ దేజోహీనుం డగు నాత్మహిత క్రియలకు నక్షముఁ డగు న వ్వగపు దొఱఁగి యుద్యోగము దగఁ జేయఁగఁ గలుగు సంచితములగు శుభముల్.

3_5_143 వ. కావున భూతంబుల సదసత్ప్రకారంబులు గనికొని ధీరుండవై యుండు మనిన నా ధర్మవ్యాధుండు మహాత్మా నీ చెప్పిన యంతవట్టు నిదర్శనంబులుగాఁ గొని యేను నిఃఖేదుండ నై యున్నవాఁడ భవిష్యత్కాల సద్భావంబునందు సమాహితుండ నై యుండువాఁడ ననయె నంత నా భూ దేవుండు.

3_5_144 చ. అతులిత పుణ్యమూర్తివి కృతాత్ముఁడ వెందును నీవు ధర్మ మూ ర్జితముగ నెప్పు డేమఱక చేయుచు నుండుము నిత్యశోభన స్థితి వెలుఁగొందు మేను భవదీయ సమాగతిఁ జేసి ధర్మసు స్థితమతి నైతి నన్ననుమతింపు గుణాకర పోయి వచ్చెదన్.

3_5_145 వ. అని వానికిం బ్రదక్షిణంబు సేసి వీడ్కొని చని కౌశికుండు నిజ జననీ జనకుల కతి భక్తి శుశ్రూష సేసి కృతార్థుం డయ్యెం బాండవోత్తమా నీ యడిగిన తెఱంగునం బతివ్రతా మహాత్మ్యంబు బితృ శుశ్రుష విశేషంబును హీనవర్ణుండయిన వాఁడు ధర్మంబు సలుపు నుపాయంబును జెప్పితి ననిన విని ధర్మ తనయుండు సంతసిల్లి మఱియు మార్కండేయు నిట్లని యడిగె.

3_5_146 తే. అగ్నిదేవుండు తొల్లి మహాతపంబు సేసె నని నిందు నదియేల చేసె ననఘ యంగిరసుఁ డేమి కతమున నగ్నియయ్యె నగ్నులెన్ని విధంబుల నతిశయిల్లు.

- మార్కండేయుఁడు ధర్మరాజునకు నంగిరసుం డగ్ని యైన తెఱంగు సెప్పుట – సం. 3-207-5

3_5_147 వ. ఇంతయు వినవలతు ననిన నమ్మహాముని యిట్లని చెప్పె నగ్నిదేవుండు దేవతలతోడి యలుకం జేసి హవ్యంబులు వహింప నొల్లక వనంబునకుం జని బహుకాలంబు ఘోరతపంబు సేయుచు నత్యంత కృశుండై యాత్మగతంబున.

3_5_148 చ. అలుకమెయిం దొలగి విపినాంతర భుమికి వచ్చి యిట్లు నే వెలుఁగక యున్నచో భువన వృత్తము సర్వము నిల్చు నిల్చినన్ జలరుహసూతి వేఱొకనిఁ జయ్యన నగ్ని పదంబునందుఁ దా నిలుపక యున్నె నేనిచట నిల్చుట పోలదు పోయెదన్ వెసన్.

3_5_149 వ. అని తలంచి తపంబు సాలించి నిజ పదంబున కున్ముఖుం డయి చనిచని యంతకుమున్న బ్రహ్మనియోగంబునం ద్రిలోకంబులకు నగ్నియై వెలుంగుచున్న వాని నధిక తపో విజృంభితు నంగిరసుం గని భయంపడి యెప్పటియట్ల మగిడిపోవునెడ నంగిరసుం డతని పాలికిం జనుదెంచి యిట్లనియె.

3_5_150 చ. అనఘ జగత్త్ర యార్చితుఁడవై తిమిరాపహుండ వై తగన్ వనరుహ గర్భుచేఁ బ్రథమ వహ్ని పదంబునఁ గల్పితుండ వై తనరుదు రమ్ము నీదగు పదంబున నేనిటు లుండ నోడుదున్ ఘనముగ నీవు నీ పదము గైకొనవే యనికల్ప భావనన్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com