ఆ భా 3 5 091 to 3 5 120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_5_091 క. స్వర్గ నరకంబు లింద్రియ వర్గ సమాచరణమునన వచ్చును వినవే స్వర్గమగుఁ దన్నివారణ దుర్గతి యగుఁ దన్నిరోధ దుర్బలత మెయిన్.

3_5_092 చ. అరదము దేహమింద్రియము లశ్వము లాత్ముఁడు సూతుఁ డమ్మహా తురగచయంబు ధైర్యమను తోరపుఁ బగ్గములన్ దృఢంబుగా నురవడిఁ బోక యుండ వెరనొప్పఁగఁ బట్టినవాఁడు సేమపుం దెరువున నేఁగు నప్పరమధీరుఁడు సువ్వె యుదారుఁ డయ్యెడన్.

3_5_093 తే. ఇంద్రియంబులు దివిచిన యెడక పాఱు చుండు మనసెప్డుఁ దద్వేగముడుపకున్న నెడలి చెడిపోవు బుద్ధి యుదీర్ణ పవన హతిఁ బయోనిధిలోఁ గల మవియు నట్లు.

3_5_094 క. ఏనింద్రియములు మనసును బూని తన వశంబయైన బురుషుండు గదా ధ్యాన సమాధి సమగ్రుఁడు వానిం గీర్తింతు రవరవరులున్ మునులున్.

3_5_095 వ. అనిన నవ్విప్రుండు సత్త్వరజస్తమో గుణంబుల తెఱంగెఱింగింపు మనిన నెఱు కిట్లనియె.

- ధర్మవ్యాధుఁడు కౌశికునకు సత్త్వరజస్తమో గుణంబుల తెఱంగెఱింగించుట – సం. 3-203-3

3_5_096 క. అతినిందితము తమోగుణ మతిబోధ మయంబు సత్త్వమనయంబుఁ బ్రగా శత నొప్పు నుభయగుణమి శ్రతఁ బరగు రజోగుణంబు సన్నుత చరితా.

3_5_097 మ. అసుఖాకారత నిద్ర దైన్యము విమోహం బక్షమత్వంబుఁ దా మస భావంబులు రాగ లోభ జడతా మానంబు లూహింప రా జస వృత్తంబులు ధైర్య శాంతి కరుణా సంతోష విద్యదు లిం పెసఁగన్ సాత్త్విక చేష్టితంబులు నిజం బిట్లాత్మఁ గన్మిన్నియున్.

3_5_098 చ. అనఘుఁడు సాత్త్వికుం డగు మహాత్ముఁడు బోధనిరూఢి సర్వముం గనికొని లోకవృత్తములు గావని రోసి సమస్త సంగభం గ నిరతుఁడై తొఱంగు మమకార వికార మహంక్రియాచ్యుతిం బనుపడి సంయక ప్రకట భావన నుత్తమ శాంతి గైకొనున్.

3_5_099 వ. సత్త్వగుణ నిబద్ధుం డగునేని శూద్రుం డైనను జన్మాంతరంబున వైశ్యత్వంబు నొంది క్రమంబున రాజభూసుర భావంబులు భజించి భవ విముక్తుం డగునని చెప్పిన నమ్మహీదేవుం డమ్మహానుభావు నభినందించి.

3_5_100 తే. దేహమున ధాతు సంశ్రయదీప్తుఁ డగుచు వహ్నియెట్లుండు శరీర వాయువులకు నెలవు లెయ్యని యవి నాకు నిశ్చయముగఁ జెప్పు మనుటయు నిట్లని చెప్పె నతఁడు.

3_5_101 సీ. ముర్ధ దేశమునకు వర్ధితంబై పర్వు నాత్మాగ్ని నాభి దదాశ్రచంబు శిరమునఁ బావకాంతరమునఁ జరియించుఁ బ్రాణుండు భూతాత్మ భావుఁడతఁడు వరుసఁ బ్రాణాపాను లిరువును నయ్యగ్ని వెలిఁగింతు రనపేత వృత్తు లగుచు గుద వస్తితలము లాస్పదములుగా వహ్ని పరిగతుం డగుచు నపానుఁ డుండు

తే. గడఁగి విణ్మూత్ర నిర్గమ కారి యతఁడు కర్మబలయత్న కారయై కంఠ తలము నందు దా నుండు వర్తించు నఖిల దేహ సంధులందును వ్యానుండు సంచరించు.

3_5_102 క. విను ప్రాణాపానులు న య్యనలుఁడు బ్రాపుగ సమానుఁ డన్నరన విపా చనుఁ డగుచు నాభిదేశం బున నుండును సకల ధాతు పోషక వృత్తిన్.

3_5_103 క. ఇది పరమ యోగదర్శన విదితం బిప్పాటఁ బవనవిదులైన మునుల్ వదలక యభ్యాస విధిన్ ముదమున ధరియింతు రాత్మ మూర్ధ తలమునన్.

3_5_104 వ. ప్రాణాపాన సమాహితుండై సకల దేహంబులందును జరియించు చున్న పావకుండు జీవాత్ముండుగా నెఱుంగు మతండు జలంబుల నున్న కమల పత్త్రంబునుం బోలె దేహంబునం దుండియు నిర్లేప స్వరూప దీపితుం జయి వెలుంగు చుండు నిట్టి జీవాత్ముం కదా పరమాత్ముండు.

3_5_105 చేతన హరిత క్షేత్రముఁ జేతన ముం బొరయఁ జేయు జీవత్మ దశో పేతుఁజు పరమాత్ముఁడు వి ఖ్యాతుఁడు త్రైలోక్య సంప్రకల్పనుఁ డనఘా.

3_5_106 క. భూతములయందు వెలిఁగెడు భూతాత్ముని నెఱుఁగుదురు ప్రబుద్ధులు నిత్య జ్యోతిర్మయు నవ్యయు న ద్వైతం బగు బుద్ధి సూక్ష్మ ధర్మము వలనన్.

3_5_107 వ. అని మఱియుఁ గౌశికునకు ధర్మవ్యాధుండు బ్రహ్మ విద్యా ప్రభావంబు తెఱంగు సంప్రయోగ రహస్యంబు దెలియ నిట్లనియె.

3_5_108 సీ. తెలివి నొందిన బుద్ధిగల మహాత్ముండు శుభాశుభ కర్మములందుఁ జొరఁడు క్రమమున సౌఖ్యదుఃఖము లాదిగా నశేష ద్వంద్వముల యందు సమత నుండు విను మట్టి పుణ్యున కొనరింప వలయు కార్యం బెఱింగించెద ననుదినంబు నియతాశియును జితేంద్రియుఁడునై పూర్వరాత్రమ్మున నపరరాత్రమ్మునందు

తే. యోగధారణ నిరతుఁడై యుండ వలయు నపుడు బోధ దీపంబున నాత్ము నాత్మ యందుఁ గనుచు నివాత దీపాను కారి యై వెలుంగుచు నమృతమయత్వ మొందు.

3_5_109 క. కామంబును గ్రోధంబును నేమఱక జయింప వలయు నెల్ల విధములన్ ధీమహిత యిదియ సతత క్షేమంకర మైన పథము గృత బుద్ధులకున్.

3_5_110 క. నిత్యముఁ గర్మియుఁ గర్మ ఫ ల త్యాగియు నగుట లెస్స లౌల్య వియోగం బత్యుత్తమ యోగము ద త్ప్రత్యయ లక్ష్యుండు సూవె బ్రాహ్మణుఁడు మహిన్.

3_5_111 చ. అరయఁగ జీవితంబు గడు నస్థిర మింత యెఱింగి యాత్మ నె వ్వరిదెసఁ గీడు రోయక ధ్రువం బగు మైత్త్రి భజించి సత్కృపా నిరతుఁడు నిష్పరిగ్రహుఁడు నిత్యతపస్వియు నిత్యతృప్తుఁడుం బరమ శమాన్వితుండు నగు బ్రాహ్మణుఁ డొందు సనాతన స్థితిన్.

3_5_112 వ. నీవడిగిన యఖిల ధర్మంబులు సంక్షేప రూపంబున నెఱింగించితి నింక నెయ్యది వినవల తనినం గౌశికుండు మహాత్మా వినవలయు నవి యెల్లను విశదంబుగా వింటిం బ్రబుద్ధుండ నైతి నీవు సర్వజ్ఞుండ వగుట దెల్లం బయ్యె ననిన ధర్మవ్యాధుం డతని కిట్లనియె.

- ధర్మవ్యాధుఁడు కౌశికునిఁ దన జననీ జనకుల యొద్దకుఁ దోడ్కొని పోవుట – సం. 3-204-3

3_5_113 క. ఏ నిమ్మెయి నుత్తమ వి జ్ఞానోన్నతి వడయుటకు నిజం బగు మూలం బైనది గల దొక ధర్మము భూనుత యది నీకు దృష్టముగ నెఱిఁగింతున్.

3_5_114 వ. అభ్యంతర గృహంబునకు రమ్మని యతనిం దోడ్కొని చని మనోహరంబై చతుశ్శాలంబై వివిధ సౌరభ సంవాసితం బైన హర్మ్యంబునందు మహితా సనాసీను లైన వారిం దన జననీ జనకుల నభిమతాహార పరితోషితు లఁ బరమాంబరాభరణ గంధమాల్యాలంకృత మూర్తుల నతనికిం జూపి తానును దత్పాద ప్రణామంబు సేసని వారలఁ గుశలం బడిగిన నయ్యిరువురుం బుత్త్రున కిట్లనిరి.

3_5_115 సీ. అన్న కుమార నీయట్టి సత్పుత్త్రుండ గలుగ మా కేమిటఁ గడమ సెపుమ నీ చేయు ధర్మంబ నీకుఁ దోడయ్యెడుఁ బరమా యురర్థ సంపదలుఁ గనుము నీ చరిత్రంబున నిఖిల వంశంముఁ బవిత్రత మయ్యె మానుషదేహ మేల ధరియించితో కాని తత్వ మారయఁ దేవత నీవు సందియము వలదు

తే. వాఙ్మనః కర్మములఁ బితృ వత్సలత్వ మొక్కరూపుగఁ జలుపుచు నున్నయట్టి సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్న్యు నొకని నెన్నంగఁ దగుఁ గాక యొరులు గలరె.

3_5_116 వ. అని పలికి రప్పుడు ధర్మవ్యాధుండు వారికిం గౌశికుం జూపి యూ మహాత్ముండు మనలఁ జూచు వేడ్కనిట వచ్చె నని చెప్పిన నా వృద్ధులతనికి సర్హసత్కారంబులు గావించినం గైకొని యతండు వారలఁ గుసలం బడిగె నంత నవ్విప్రునకు లుబ్ధకుం డిట్లనియె.

3_5_117 సీ. జననుత వీరు నా జననియు జనకుండుఁ జూవె వీరలకు శుశ్రూష సేసి యిట్టి పరిజ్ఞాన మేను బ్రాపించితి నమరులఁ బూజింతు రర్థి నెల్ల వారును నొండు దైవంబుల నెఱుఁగ నీ వృద్ధుల నా పాలి వేల్పు లనఘ కమనీయ ఫలపుష్ప గంధభుషణ వస్త్రంబులు మనోహర భక్ష్య భోజ్యములును

తే. వీరి కెపుడు నివేదింతు వేడ్కఁ బుత్త్ర దార సహితుండనై నియతముగ సేవ యాచరింతును వేదముల్ యజ్ఞములు వ్ర తంబులును వీర నాకలు తలఁపు దృఢము.

3_5_118 తే. జనని జనకుఁడు సద్గురుఁ డనలుఁ డాత్ముఁ డనఁగ నియ్యేవురును నే గృహస్థ చేత సుగతివాంఛఁ బ్రసాదితు లగుదు రట్టి వాఁడ చూవె ధర్మాత్ముండు వసుధ మీఁద.

3_5_119 వ. అని చెప్పి యిట్లనియెఁ బతివ్రత పనుపునం జేసి నీవు ధర్మజ్ఞానంబ నా యున్న యెడకుం జనుదెంచిన నప్పతివ్రత వలని యనుగ్రహంబున నీకు నెల్లవియు నెఱింగించితిఁ గాని నీ దెస నాదు చిత్తంబు ప్రియంబడుయుండదు నీ చేసిన యాకార్యం బొక్కటి గల దది యెయ్యది యనిన.

3_5_120 ఉ. ఎంతయు వృద్ధులై తమకు నీ వొకరుండవ తెప్పగాఁగ న త్యంత ముదంబునన్ బ్రదుకు తల్లిని దండ్రిని నుజ్జగించి ని శ్చింతుఁడవై సదాధ్యయన శీలత వార యనుజ్ఞ లేక యే కాంతమ యెమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com