ఆ భా 3 5 061 to 3 5 090

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_5_061 వ. ధర్మంబు బహు ప్రకారం బై యుండుఁ దదీయ సూక్ష్మగతి దురవబోధంబు గావున శ్రుతి ప్రమాణంబువలనను వృద్ధాచార నిదర్శనంబులను నెఱింగి కొనునది.

3_5_062 ఉ. భూతహితంబుగాఁ బలుకు బొంకును సత్యఫలంబు నిచ్చుఁ ద ద్భూతభయాస్పదంబగు ప్రభూతపు సత్యము బొంకు నట్ల ప్రా ణాతురుఁ డైనచోఁ బరిణయంబున యందును బల్కు బొంకు స త్యాతిశయంబ యండ్రు మహితాత్మక యిట్టివి ధర్మ సూక్ష్మముల్.

3_5_063 వ. అని తెలిపి మఱియు నతండు.

3_5_064 క. ఒప్పెడునది యైనను గడు నొప్పనియది యైన నిజకులోచిత పథముం దప్పఁ దగ దండ్రు ధార్మకు లప్పని నిజభాగ్యవిహిత మని యుండఁ దగున్.

3_5_065 క. విను పూర్వకర్మ ఫలంబులు దనకు వశముగాక పొందుఁ దఱితో వాని గనుఁగొన నేరక మూఢుఁడు దనకాపదయైన చోట దైవము దూఱున్.

3_5_066 తే. కార్యఫలముల యెడఁ దాన కర్తననుట కడు నెఱుఁగమిఁ జువ్వె తాఁ గర్తయేని తగిలి తనదైన కార్యజాతంబు నెల్లఁ జెడక ఫలియించునట్లుగాఁ జేయరాదె.

3_5_067 వ. అది యెట్లంటేని.

3_5_068 సీ. నీతిమంతులు ధర్మనిరతులు దక్షులు నగువారు సేయు కార్యములు గొన్ని సిద్ధిఁ బొందవు దుష్టచిత్తులు క్రూరులై చేయఁ గొన్ని విశేష సిద్ధిఁ బొందు నూరక యుండంగ నొందుఁ గొందఱు విపులార్థముల్ గొంద ఱాయాస పడియు నిష్ఫలారంభులై నిలుతురు గొందఱు పేదవారికిఁ బ్రజ పెల్లువొడము

తే. నర్థవంతులు గొందఱ కర్థి నధిక దానములు ధర్మములు సువ్రతములుఁ జేయఁ బ్రజలు పుట్టరు విను మిట్టి భంగి సుమ్ము కర్మఫల మాత్మతంత్రంబు గాక యుండు.

3_5_069 క. పురుషుఁడు కర్మాధీనత నరుగక తన వశమ యనిన నాపదలు రుజల్ మరణంబును నివి యేమియుఁ బొరయక యుండంగ బ్రదుకఁ బోలదె చెపుమా.

3_5_070 ఆ. కర్మవశతఁ జూవె కలుగు దేహము దేహ వర్తనంబు కర్మ వశతఁ బుట్టు దేహ పాతమైన దేహస్థుఁడగు జీవుఁ డరుగుఁ గర్మవిహితమైన యెడకు.

3_5_071 వ. అనినం గౌశికుండు జీవుం డెట్టివాఁడని యడిగిన లుబ్ధకుం డిట్లనియె.

- ధర్మవ్యాధుఁడు గౌశికునకు జీవ లక్షణంబు సెప్పుట – సం. 3-200-26

3_5_072 క. విను జీవుండు సనాతనుఁ డనఘుఁడు నిజ కర్మవశత నధ్రువదైహం బునఁ బొందు దేహ పాతం బున నెప్పుడుఁ జెడఁడతండు భూసురవర్యా.

3_5_073 క. ఈ యొడలు విడిచి వేఱొక కాయముఁ గైకొని శరీరి కర్మవశగతిం బోయి సుఖదుఃఖములు గనుఁ బాయక వెండియును దేహబంధముఁ బొందున్.

3_5_074 వ. అనిన విని బ్రాహ్మణుండు లుబ్ధకుని తోడం బుణ్యపాపాను రూపంబు లయి దేహబంధంబు లెట్టి వనిన వాఁ డిట్లనియె.

3_5_075 చ. స్థిర మగు పుణ్యకర్మమున దేవభవం బగుఁ బుణ్యపాప సం కరమున మానుషత్వ మగుఁ గల్మషముల్ పశుకీటభావముం బొరయఁగఁ జేయు నిప్పగిదిఁ బుట్టుచుఁ జచ్చుచు మోహవార్ధిలోఁ దిరుగుచు నుండుఁగాని యొకతీరము సేరఁడు జీవుఁ డెన్నఁడున్

3_5_076 చ. ఇది సకలంబుఁ గాంచి బుధుఁ డెన్నఁడుఁ బాపముపొంతఁబోక ని ర్మదనిహంక్రియాత్ముఁడును మత్సరదూరుఁడు నై చరించు బెం పొదవఁగ ధర్మమార్గమున నొయ్యన ధర్మము తీ పెఱింగి తా వదలఁడు సత్క్రియా విధము వారక యెక్కు డొనర్చు ధర్మముల్.

3_5_077 చ. చిరముగ ధర్మముల్ నడపఁ జిత్తము దేఱుఁ బ్రసన్నచిత్తుఁడై పురవడి నింద్రియార్థముల భంగులు రిత్తలుగా నెఱింగి చె చ్చెర నవి యంతవట్టు నిరసించి తపో దమ సత్య శీలతం బరిణతి నొందుఁ బొందుఁ బిదపం బర మార్థ పద ప్రభావమునన్.

3_5_078 వ. అనిన నమ్మహాద్విజుండు ధర్మవ్యాధున కి ట్లనియె.

3_5_079 ఆ. ఇంద్రియంబు లనఁగ నెయ్యవి నిగ్ర హింపకున్నఁ బాప మేమి దొడరు వాని నిగ్రహించు వానికి నగు ఫలం బెట్టి దనిన నాతఁ డిట్టు లనియె.

3_5_080 క. విను విషయజ్ఞనము నకు ననయంబును మనసు మూల మది కామక్రో ధ నిరూఢ మగుచుఁ బురుషుని ననిశము నెలయించు నింద్రియార్థ క్రియలన్.

3_5_081 సీ. ఇంద్రియార్థంబుల కెలసిన పురుషుండు గాఢ రాగంబునఁ గరఁగు చుండు రాగంబు వలనఁ దిరంబగు లోభంబు లోభియై కరుణకు లోను గాఁడు మఱి సముద్ధత వృత్తి మరుగుఁ బాప క్రియ దగువారు సెప్పెడి తగవు వినఁడు కుజనుల దెసఁ బ్రీతి గొఱలుఁ దుల్యంబులు గాకుండు వాఙ్మనః కర్మభంగు

ఆ. లిహమునందుఁ బుణ్యహీనుఁడై చెడిపోవుఁ బరమునందు దుఃఖ భరమునొందుఁ గాన యింద్రియార్థగతిఁ బోక సాధుసం సర్గఁ జేసి సుగతిఁ జనుట యొప్పు.

3_5_082 వ. ఇంద్రియంబు లన నెయ్యవి యనియు నింద్రియ జయ సిద్ధియు నీవు నన్నడిగితివి తత్ప్రకారంబు బ్రహ్మవిద్యా విషయంబు మాబోఁటి వానికి నవాచ్యంబై యుండు నైనను నావు బ్రాహ్మణ ప్రవరుండవు గావున సద్బ్రాహ్మణ ప్రియం బవశ్య కర్తవ్యంబు పరమ బ్రహ్మవిదు లయిన బ్రాహ్మణవరులకు నమస్కరించి బ్రహ్మవిద్యా ప్రపంచం బెఱింగించెద నవధాన పరుండవై యాకర్ణింపుము.

- ధర్మవ్యాధుఁడు కౌశికునకు బ్రహ్మ విద్యా ప్రపంచం బెఱింగించుట – సం. 3-201-16

3_5_083 తే. అంబరము వాయు నగ్ని దోయమ్ము ధరణి భూతపంచక మిది క్రమంబున మహాత్మ శబ్ధ సంస్పర్శ రూప రసములు గంధ సంయుతంబుగ భూతపంచక గుణములు.

3_5_084 క. ఒనరఁగ నాకస మాదిగ ననులోమముతోడ నిమ్మహాభూతము లే నును బుట్టు నొకటి కొక్కటి యనయముఁ బ్రతిలోమగతి లయంబునఁ బొందున్.

3_5_085 వ. శ్రోత్రంబును ద్వక్కును జక్షువును ఘ్రాణంబును నను నియ్యేనగు నింద్రియంబులు శబ్ద స్రర్శ రూప రస గంధంబు లింద్రియా విషయంబు లై యుండు నింద్రియ పంచకంబునకు నష్ఠంబై మనస్సు ప్రకాశిల్లు సప్తమాష్టమంబులై బుద్ధియు నహంకారంబును వర్తిల్లు సత్వంబును రజస్సును దమస్సును గుణంబులై యుండు నీ చెప్పెంబడిన మహాభూత ప్రముఖ ప్రపంచం బంతయు నవ్యక్తం బను త్త్వంబునం దావిర్భావతిరో భావంబులం బొందుచుండు.

3_5_086 క. అవ్యక్తతత్త్వ మరయఁగ నవ్యక్తంబయ్యు నిట్టిదై లక్ష్యమగున్ సువ్యక్తేంద్రియ భూతా దివ్యవహారార్థ లింగ దృష్టాకృతియై.

3_5_087 వ. అని చెప్పి మఱియు నిట్లనియె.

3_5_088 తే. అనఘ శబ్దాది విషయంబులందుఁ దగిలి యిచ్చఁ జరియించు నెప్పుడు నింద్రియములు బుధుఁడు దత్స్వభావముఁ దన బుద్ధి నెఱిఁగి యేమఱక వానిఁ దగఁ గుదియింప వలయు.

3_5_089 ఉ. ధీరుఁడు నిర్జితేంద్రియుఁడు దెల్లముగాఁ దనుఁ గాంచు భూత వి స్తార నిగూఢ మైన పరతత్త్వముగాఁ దనయందు భుత వి స్తారము నెల్లఁ గాంచు సతతస్ఫుట దర్శనుఁడై సమగ్ర వి స్ఫారతఁ బొంది నిర్మల తపంబులయందుఁ జలింపకెన్నఁడున్.

3_5_090 క. తపమనఁగ సకల విషయ వ్యపేత మగునట్టి బుద్ధివైభవము సుమీ తపమున సుస్థిరుఁడగు యో గవపునకుం గలవె యొండు కర్తవ్యంబుల్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com