ఆ భా 3 5 001 to 3 5 030

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


శ్రీ మదాంధ్ర మహాభారతము ఆరణ్య పర్వము – పంచమాశ్వాసము -.-

3_5_001 క. శ్రీయువతీ ప్రియ నృప నా రాయణ బిరుదాంక భీమ రమణీయ గుణ శ్రీయుత నిర్మల ధర్మ ప రాయణ రవితేయ రాజరాజ నరేంద్రా.

- ధర్మరాజునకు మార్కండేయుఁడు పుత్త్రునకుండఁ దగు గుణంబులం దెల్పుట – సం. 3-196-1

3_5_002 వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నట్లు బహు భంగుల మార్కండేయుండు వివరింపం బుణ్య కథా విశేషంబులు విని సంతుష్ట హృదయుండై కౌంతేయ పూర్వజుండు మఱియు నమ్మునీంద్రున కిట్లనియె.

3_5_003 సీ. సమధిక దర్ప దుర్జయములై నిగిడెడు నింద్రియంబులఁ గురియించి తెచ్చి మనసు పొందున నిడి మన నహంకారం బుపజ్జకుఁ బాపి సద్భక్తి యుక్తి నెరయంగ ననిశంబు నిజ భర్తృ శుశ్రూష యందు సమాహిత యైన వనిత యఖిల లోకోత్కృష్టయని యెప్డు నూహింతుఁ నరయఁ బతివ్రత లైన వారి

తే. చరిత మత్యంత ధర్మ సూక్ష్మంబుఁ గరము దుష్కరము గాదె తలఁప నిర్ధూత దురిత యట్లు గావున వినవేడ్క యయ్యెఁ జెప్ప వయ్య పుణ్యవతీ ప్రభావంబు నాకు.

3_5_004 వ. మఱియుఁ దల్లిదండ్రు లిరువుర యందును బుత్త్రనిమిత్తంబైన యాయాసం బెవ్వరి కెక్కుడు వారలయెడం బుత్త్రుం డెట్టివాఁడు గావలయు హీనయోని జాతుండైన పురుషుండేమి తెఱంగు నడవడిం బరమ ధార్మికుల లోకంబులు వడయు నివి యన్నియు వివరింప నీవ యర్హుండ వనిన నమ్మహాముని యమ్మహీపతి కిట్లనియె.

3_5_005 సీ. జతనంబు మిగుల మాసములు దొమ్మిది యుదరంబునం గరము భరంబుతోడ భరియించి పదపడి ప్రాణసంశయ దశ నొంది పుత్త్రునిఁ గాంచు నెందుఁ దల్లి తపములు యజ్ఞముల్ దానముల్ వ్రతములు దేవతా సజ్జన సేవనములుఁ గావించుఁ బుత్త్రునిఁ గామించి జనకుఁ డి ట్లిరువుర పాటును సరియె తలఁపఁ

తే. దనయుఁ గని తల్లిదండ్రులు దమకు నతఁడు భక్తుఁ డగుటకు ధర్మాను రక్తుఁ డగుట కానపడుదురు విను మట్టి యాస సిద్ధిఁ బొందఁ జేయునతఁడ చువ్వె నందనుండు.

3_5_006 క. జననియు జనకుఁడు నెవ్వని యమ వర్తనమునఁ బ్రియంబు నందుదు రెదఁ ద త్తనయుఁడు ధర్మముఁ గీర్తియు సమానముగఁ బడయుఁ బొందు నక్షయ గతులన్.

- మార్కండేయుఁడు ధర్మరాజునకుఁ బతివ్రతా మహాత్మ్యంబు సెప్పుట – సం. 3-196-20

3_5_007 వ. మఱియు నిజ భర్తృ శుశ్రూష యందు నిత్యాసక్తమయిన పతివ్రతకు నఖిల యజ్ఞ దాన తపః ఫలంబులు సులభంబులగు నొక్క యితిహాసంబు సెప్పెద నందు నీ యడిగిన యర్థం బులన్నియుఁ దేటపడు నాకర్ణింపుము దౌశికుండను బ్రాహ్మణుండు ధర్మతపశ్శీలుఁడు సంతతాధ్యయన తత్పరుండయి యొక్క విశిష్ట గ్రామంబున నుండు నతం డొక్కనాఁడు గ్రామ సమీపంబునం దొక్క వృక్షమూలంబున నాసీనుండై వేదంబులు గుణియించుచుండం దదీయ శాఖాగతంబైన యొక్క కొక్కెర యాతనిపై రెట్ట వెట్టిన నమ్మహాద్విజుం డలిగి చూచుటయు నది యప్పుడ నిశ్చేతనంబై నేలం బడినం గనుంగొని యతండు.

3_5_008 క. అక్కట నా హృదయము గడు నక్కటికము లేనిదయ్యె ననిమిత్తమ యీ కొక్కెర నిటు సేసితి నా కెక్కడి శాంతి యని వికల హృదయుం డగుచున్.

3_5_009 వ. పెక్కు భంగుల వగచి మధ్యాహ్నంబగుటయుఁ గృతాహ్నిక విధానుండై గ్రామంబున కరిగి యందు శుచులైన విప్ర గృహంబుల కరిగి భిక్షాచరణంబు సేయుచు నందొక్క పుణ్యగృహంబు వాకిట నిలిచి ‘బిక్షాందేహి’ యనుటయు నా యింటి యవ్వయు నతి సంభ్రమంబున బిక్ష యిడుటకుం బాత్ర శోధనంబు సేయునెడ.

3_5_010 ఉ. ఆయెలనాఁగ భర్త గడు నాఁకటఁ దూలుచు వచ్చె వచ్చినం దోయజ నేత్ర సంభ్రమముతోఁ దగు పీఠము వెట్టి పాద్యముం బాయక మజ్జన క్రియయు భక్తి నొనర్చి ప్రియోక్తులొప్పఁగా నాయనఁ బ్రీతుఁజేసె రుచిరాన్న రసంబులఁ జేసి చెచ్చెరన్.

3_5_011 చ. కుడిచిన పిమ్మటం గుసుమ కోమలి విస్తృతనం స్తరంబుగా నొడికపు సెజ్జనేసి ప్రియుఁడొయ్యన యందు శయింపఁ దమ్ములం బిడి చరణంబు లొత్తి మదిరేక్షణ యంతటిలోఁ దలంచె ము న్నడరఁగ భిక్షకై నిలిచినట్టి మహీసుర ముఖ్యు నాత్మలోన్.

3_5_012 వ. ఇట్లు దలంచి భిక్ష గొనుచుం జనుదెంచిన నమ్మగువఁ జూచి కౌశికుండు రోషరంజిత లోచనుం డగుచు నిట్లనియె.

3_5_013 క. అడిగిన యప్పుడ చెచ్చెరఁ గడపినఁ బోదవ్వ యేను గడు దుర్మతినై పడఁతి నను నిలిపి భిక్షం బిడక కడు నవజ్ఞ సేసి తేల మదమునన్.

3_5_014 చ. అనినఁ బతివ్రతా తిలక మాతని కిట్లను నయ్య మత్ప్రియుం డనుపమిత క్షుధాకలితుఁడై చనుదెంచిన భక్తి నమ్మహా త్మునకు సపర్య సేయుచు మిమున్ మదిలోనఁ దలంపఁ జాలనై తి నిదియుఁ దప్పుగాఁ గొనకు ధీరత యొప్ప సహింపఁగాఁ దగున్.

3_5_015 వ. అనిన నమ్మహీదేవుం డప్పతివ్రత కిట్లనియె.

3_5_016 ఉ. నీ మగఁడెంత యెక్కుడె మనీషులు భూసురు లింత తక్కువే కోమలి యేల యిట్లు గడుఁ గ్రొవ్వునఁ గానవు లోకవంద్యులన్ భూమి సురేంద్రులన్ దివిజ పుంగవుఁ డాదిగ భక్తిఁ గొల్చుచో నేమియనొక్కొ వారు గడు నెల్లిద మైరిటు నీకు నిచ్చటన్.

3_5_017 క. అవమానితులై ధరణీ దివిజులు గ్రోధాగ్ని శిఖల దీవించి మహా ద్రి వనద్వీపంబులతే నవని నయివఁ బొడవడంతు ర ప్రతికారుల్.

3_5_018 వ. నీవింత నెఱుంగ నొల్లనైతివి గా కేమి యనిన నయ్యంగన యిట్లనియె.

3_5_019 సీ. దేవతాసములు భూదేవతావరు లౌట యేను దన్మాహాత్మ్య మెఱుఁగనయ్య యొక విప్రుఁ డలిగి వయోనిధి జలము లపేయముల్ గాఁగ శపింపఁ డెట్లు దండక విషయంబు దగ్ధంబు సేయెడె యలుకమై నొక్క మహాద్విజుండు వాతాపి యను దైత్యవరు మ్రింగి యఱిగించు కొనఁడె భూదేవుఁ డొక్కొరుఁడు గినిసి

తే. ధరణి మఱియును బెక్కు విధంబులందు బ్రహ్మవిదులైన బ్రాహ్మణ ప్రభుల మహిమ వినమె యెఱిఁగి యెఱింగి సద్వినుత చరిత కొఱనిగొని నెఱ్ఱినే తలఁ గోఁకి కొనఁగ.

3_5_020 వ. నా తెఱంగు సెప్పెద నాకర్ణింపుము.

3_5_021 తే. పతియచూవె నా పాలికిఁ బరమదైవ మేను వాఙ్మనః క్రియలు దద్దిరము యెపుడుఁ గోరి యొనరింతు దీని మిగులఁగ నొండు ధర్మువులు గాననెందును దలఁచి చూచి.

3_5_022 వ. నీ వతి క్రోధనుండ వగుటయు నెఱుంగుదు నీ కోపంబున నొక్క కొక్కెర నిహతం బయ్యెం గాదె యిది మదీయ పాతివ్రత్య మహిమం జేసి కాంచితిం గాన క్రోధంబు గొనియాడుట లగ్గు గా దని యిట్లనియె.

3_5_023 తే. క్రోధ మోహనామకులైన ఘోరశత్రు లిరువు రెరియించుచుండుదు రెపుడు నంత రంగ మయ్యుభయంబు నడంగకున్నఁ గలదె యూరక బ్రాహ్మణ గౌరవంబు.

3_5_024 సీ. ఎవ్వఁడు సత్యంబ యెప్పుడుఁ బల్కు హింసావిదూరుఁడు గురుజన హితార్థి యింద్రియంబుల నోర్చి యెల్లవారలఁ దనయట్ల కాఁ జూచు ధర్మాభిరతుఁడు గామంబు దగులండు కర్మంబు లాఱును సముచిత సంప్రయోజ్యత నొనర్చు నట్టి పుణ్యాత్ముని ననఘ బ్రాహ్మణుఁడని యనిశంబుఁ గీర్తింతు నమరవర్యు

ఆ. లార్జనంబు శమము నధ్యయనంబును బరమధనము నువ్వె బ్రాహ్మణునకు ధర్మగతికి నివియ తగు సాధనంబులు వేద విహిత ముఖ్య విధులు నివియ.

3_5_025 వ. ధర్మంబు బహు మార్గదృష్టం బయి సూక్ష్మం బయి యుండు నీవు కేవల స్వాధ్యాయ పరుండవు గాని ధర్మ సూక్ష్మత యెఱుంగవు గావునం దడయక మిథిలా నగరంబున కరుగు మందు జితేంద్రియుండను సత్యవాదియు మాతా పితృ భక్తుండును నయిన వాఁడు ధర్మవ్యాధుం డను కిరాతుండు నీకు నఖిల ధర్మంబులు నెఱింగించి సంశయచ్ఛేదంబు సేయు నాదేసం బ్రసన్నుండ వగునది వనితలకుం బరిజ్ఞానంబు లేదు గావున వా రెట్టి యపరాధంబు సేసినను సహింప వలయుఁ గదా యనినఁ గౌశికుం డిట్లనియె.

3_5_026 క. నిను దూఱఁ దగదు నీకత మున నా చిత్తము ప్రశాంతిఁ బొరసెఁ బురంధ్రీ జనవినుత పోయి వచ్చెద ననుపమ శోభన సమృద్ధు లయ్యెడు నీకున్.

- కౌశికుం డను బ్రాహ్మణుఁడు ధర్మవ్యాధుని యొద్దకుఁ బోవుట – సం. 3-197-1

3_5_027 వ. అని యాక్షణంబ యమ్మహాద్విజుండు ధర్మవ్యాధ దర్ళమ నాలసుండై కదలి పతివ్రత యెఱుకకు విస్మయంబందుచుఁ దన్నుం గృతాపరాధునింగాఁ దలంచుచు ననేక నగర గ్రామంబు లతిక్రమించి చని యనుపమాన శోభాసనాథం బయిన మిథిలా నగరంబు సొచ్చి రాజ మార్గంబు దఱిసి యచ్చటి జనంబుల ధర్మవ్యాధుం డున్న యెడ నడిగి వా రెఱింగింప నటయేఁగి ముందట నల్పమృగ మాంసఖండంబు లంగడిం బచరించి యమ్ముచున్న వాని ననవరత విక్రయాగత జన సమావృతు నక్కిరాతుం గని యతిజుగుప్సితంబయిన సూనాపణంబు సేర నొల్లక తొలంగి యొక్కయెడ నుండె నంత.

3_5_028 ఆ. వాఁడు నతనిరాక పోఁడిగ నిజబుద్ధి నెఱిఁగి యతనియున్న యెడకు వచ్చి పరమభక్తి మ్రొక్కి ధరణీ సురేశ్వరుఁ గుశల మడిగి ప్రియము గొనలు నిగుడ.

3_5_029 చ. అనఘ నితంబినీతిలకమైన పతివ్రత నాతెఱంగు సె ప్పినఁ జనుదెంచి తీవు ననుఁ బ్రీతిఁ గనుంగొన నీ మనోరథం బును మదిలో నెఱుంగుదుఁ బ్రమోదముఁ బొందితి రమ్మ మద్గృహం బున గని పల్కి తొడుకొని పోయె నతండు మహీసురోత్తమున్.

3_5_030 వ. కౌశికుండును ధర్మవ్యాధు నెఱుక కచ్చెరువంది పతివ్రత యెఱుకయుం దలంచి యిది రెండవు నాశ్చర్యంబు గంటి పొమ్మని తలంచుచుఁ దదీయ భవనంబున కరిగి వానిచేతం బూజితుం డయి యిష్టకథా ప్రసంగంబుననుండి యతని కిట్లనియె.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com