ఆ భా 3 4 391 to 3 4 416
వోలం సురేష్ కుమార్
- మార్కండేయుఁడు ధర్మరాజునకు మధుకైటభుల చరిత్రము సెప్పుటు – సం. 3-194-13
3_4_391 సీ. అధిప తొల్లి జగత్త్రయంబు నేకావర్ణవమై యుండఁగా నప్డు హరి యొకండ భాసుర భోగీంద్ర పర్యంకమున భవ్య యోగ నిద్రా సుఖ యుక్తి నలగ నతి దీర్ఘ మగు కాల మరిగెఁ బదంపడి దైత్యు లిద్దఱు మహోదాత్త బలులు మధుకైటభులు నాఁగ మథిత శాత్రవు లేఁగుదెంచి యప్పరమాత్ము దివ్యనాభి
ఆ. కమలమున వెలుంగు కమలాసనుని గని దర్ప దోష నిహతిఁ దలరవ్రేయ నతఁడు భీతినొంది యాక్రోశమొనరించె నాది పురుషు నన్ను నరయు మనుచు.
3_4_392 ఉ. ఆతెఱఁ గాత్మఁ గాంచి కమలాక్షుఁడు మేల్కని ఘోరవిక్రమో పేతుల దైత్యసింహుల నపేతభయాత్ములఁ జూచి మీర లి ట్లీతని నుక్కునం బఱుప నేల భవద్బల శౌర్య యుక్తికిం బ్రీతుఁడ వైతిఁ జెచ్చెర నభీష్టవరంబులు వేఁడుఁ డిచ్చెదన్.
3_4_393 తే. అనినఁ గలకల నవ్వి యయ్యసురవరులు నీవు మాకేమి యిచ్చెదు నీకు మేము వరము లిచ్చెద మడుగుము వలచితేని ననిన వారల కిట్లను నవ్విభుండు.
3_4_394 క. సత్యవ్రతులార వరం బత్యంత ప్రీతి మిమ్ము నడిగెద లోక ప్రీత్యర్థముగా నాచే మృత్యువునం బొందుఁ డిపుడ మీరలిరువురున్.
3_4_395 వ. అనిన వార లొండొరువుల మొగంబులు చూచికొని యా చక్రధరున కిట్లనిరి.
3_4_396 చ. నగినగియేనియున్ విను జనార్థన యెన్నఁడు బొంకు పల్క మ త్యగణిత విక్రమైరు బలధైర్య సమగ్రుల మెల్ల భంగిఁ గా లగతి దొలంగఁ ద్రొవఁగఁ దలం బగునే యగుఁగక నీకు మె చ్చుగ నిదె ప్రాణ మిచ్చెదము స్రుక్కుము చావున కార్మ నేమియున్.
3_4_397 ఆ. చంపెదేని మమ్ము జలములు లేని దే శమునఁ జంపవలయుఁ గమలనాభ నిక్క మింతవట్టు నీ చేత మడియంగఁ దగుదు మనిన నగుచు నగధరుండు.
3_4_398 వ. త్రైలోక్యంబును జలమయంబగుట నాలోకించి.
3_4_399 క. పరమేశుఁడు దనయూరులు పరపుగ నొనరించి వానిపైఁ దచ్ఛిరముల్ పరుషతరశిత సుదర్శన ఖరధారా నిహతిఁ జేసి గ్రక్కునఁ దునిమెన్.
3_4_400 తే. పరగ నమ్మధుకైటభాసురుల సుతుఁడు సువ్వె ధరణీశ ధుంధుఁడన్ శూర వరుఁడు వాఁడు వరగర్వమునఁ జేసి వాఁడి మిగిలి యమరపతిఁ దొట్టి వేల్పుల నభిభవించె.
3_4_401 వ. అని చెప్పి యమ్మునీంద్రుం డిట్లనియె నట్లు బృహదశ్వు చేత ననుజ్ఞాతుండై కువలాశ్వుండు శుభ దినంబున నుదంక పురస్సరంబుగాఁ గృత ప్రస్థానుండై.
3_4_402 తరలము. దనుజ నిర్మథనైక తత్పరతా విజృంభణ మొప్ప స ద్వినుతేజుఁడు ఘోర సంగర విక్రమోత్సవ లీలమై ఘనభుజాబల భూరిదుర్వహగర్వ సంగ్రహు లైన నం దను లనేక సహస్ర సంఖ్యులు దన్నుఁ గొల్వ నుదగ్రుఁడై.
3_4_403 మ. చతురంగ ధ్వజినీపద ప్రవిహతిన్ సర్వంసహా చక్ర మా తతకంపంబుగ నేఁగె నప్పుడు దగం దైత్యాది యారాజునం దతులం బైన నిజాంశ శక్తి సొనిపెన్ హర్షించి రింద్రాది దే వతలున్ సన్ముని ముఖ్యులున్ నృపతి కైశ్వర్యోన్నతిం జేయుచున్.
3_4_404 ఆ. మొరసె దివ్యతూర్యములు నందనద్రుమ సురభి కుసుమవృష్టి గురిసెఁ గలయ వప్రతీపభంగి యగుమందపవనవి చేష్టితంబు గర మభీష్ట మయ్యె.
3_4_405 క. గగనమున సుర విమానము లగణితముగఁ గ్రందుకొనియె ననుకూలములై మృగపక్షిగతులు శోభన మగు టేర్పడఁ జెప్పె నజ్జనాధిపుయాత్రన్.
3_4_406 వ. ఇట్లు సని కువలాశ్వుండు సముద్రతీరంబున విడిసి నిజపుత్త్రుల నానాస్త్ర శస్త్రజ్ఞుల ననేక సహస్ర సంఖ్య లగ వారల నవారిత జవసత్త్వుల నవ్వాలుకా పులిలఖననంబు సేయ నియోగించిన.
3_4_407 మ. నరనాథోత్తమునందనుల్ గడఁగి నానాశూల కూద్దాల ము ద్గర కాష్ఠాదుల నయ్యుదగ్రసికతౌఘం బంతయున్ సప్త వా సరమున్ వాయక పాయ గ్రొచ్చి నడుమన్ సంసుప్తుఁ డై యున్న యా సుర వైరిం గని రుగ్రనిశ్వసన నిష్ఠ్యూతాగ్ని కీలావృతున్.
3_4_408 చ. ఆడరి నిశాత పట్టిస గదాసి పరశ్వథ శూలహస్తులై తడయక వారలందఱును దానవుదేహము వీఁక వ్రేసియుం బొడిచియు నొంప నెంతయును బ్రొద్దున కయ్యసురాధముండు బి ట్టొడలు గదల్చి నీల్గి వివృతోగ్ర ముఖుం డయి యావులించినన్.
3_4_409 ఉ. భోరున విస్ఫులింగములు వొడ్మఁగఁ దన్ముఖనేత్రనాసికా ద్వారములందు వెల్వడియె దారుణ వహ్ని శిఖాకలాపముల్ వారక యందు మ్రందిరనివార్యులు రాజకుమారు లందఱున్ ఘోరత సాగరుల్ గపిలు కోపమున న్నశియించు చాడ్పునన్.
3_4_410 వ. ఇట్లు దృఢాశ్వ కపిలాశ్వ భద్రాశ్వులు దక్కం దక్కిన కొడుకులందఱుఁ బొడ వడంగినఁ గడంగి గినుకం గువలాశ్వుండు సంహారసమయ సప్తాశ్వుండునుం బోలె నుజ్జ్వలుం డయి కదియుటయు నద్దానవుండు క్రోథ సంరంభమున సముస్థితుండై యొక్క శూలం బెత్తికొని కవిసె నప్పు డమ్మహీవిభుండు దదీయ దేహజనితంబై మండుచున్న యనలం బాత్మీయ యోగవిద్యా ప్రభవం బగు జల ప్రవాహంబునం బ్రశాంతంబు గావించి బ్రహ్మాస్త్రంబు ప్రయోగించిన.
3_4_411 క. ఆ దివ్యాస్త్ర జ్వలనము భూదిగ్గగనములు వెలుఁగఁ బొదివి మహోగ్రం బై దానవేంద్రు దేహము బూదిగ నొనరించెఁ జిత్రముగ నొకమాత్రన్.
3_4_412 వ. అంత.
3_4_413 క. సురశత్రుఁడైన ధుంధునిఁ బరిమార్చితి వీవు జగదభయకారివి భూ వర ధుంధుంమారుఁ డనఁగాఁ బరఁగు మనిరి సురలు మునులు పార్థివముఖ్యా.
3_4_414 వ. ఇట్లు ప్రసన్నులై యింద్రాది దేవతలు నుదంక ప్రముశ సంయమివరులును నమ్మహీవరు నభినందించి నీకెయ్యది యిష్టంబు వేఁడు మనిన నతండు బ్రాహ్మణ భక్తియు ననవరత దానశీలతయు విష్ణునితోడి సఖ్యంబును వరంబులుగాఁ దనకుఁ గోరిన నట్లయొసంగి వారలందఱు నిజ నివాసంబుల కరిగిరి కువలాశ్వుండును విజయోల్లాస భాసితుండై పురంబున కరిగి సముజ్జ్వల సామ్రాజ్య సౌఖ్యంబుల బరగె నని మార్కండేయుండు ధర్మరాజునకు గువలాశ్వుండు ధుంధుమారుం డైన విధంబు సెప్పె నని వైశంపాయనుండు జనమేజయున కెఱింగించిన తెఱంగు.
3_4_415 క. చరమ యుగ చరిత ధర్మ స్థిరీకరణ చతుర చరిత ధీ గుణలీలా పరికర పరిచితనయ వి స్తర వితరణ వివరణైక దానవినోదా.
3_4_416 మాలిని. కరివరకిరి కూర్మక్ష్మాధరాధీశతుల్యో ద్ధరణ గుణ ధురీణోద్ధండ బాహార్గళాగ్ర స్ఫురిత నిఖిల గోత్రాభోగ భాగైకభోగా తరుణచిరమూర్తీ ధర్మ తంత్రాను వర్తీ.
గద్యము. ఇది సకల సుకవి జనవినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునందారణ్య పర్వంబున యక్ష యుద్ధంబును గబేర దర్శనంబును నర్జునాగమనంబును బాండవుల కడకు నింద్రుండు ననుదెంచుటయు నర్జునుండు నివాత కవచ కాలకేయ పౌలోమ వధ ప్రకారం బెఱింగించుటయు నాజగరంబును బాండవులు గామ్యక వనంబునకు వచ్చుటయుఁ గృష్ణ మార్కండేయాగమనంబును బ్రాహ్మణ ప్రభావంబును సరస్వతీ గీతయు వైవస్వతు చరితంబును గల్పాంత ప్రకారంబును యుగధర్మ కీర్తనంబును వామ్యాశ్వ హరణంబును నింద్రద్యుమ్నో పాఖ్యానంబును ధుంధుమార చరితంబును నన్నది చతుర్థాశ్వాసము.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com