ఆ భా 3 4 361 to 3 4 390

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_4_361 తే. అమరు లిచ్చోట నుండలే వరుగు మనుచు నుర్విఁ ద్రోచిన నతఁడు నాయున్న కడకు నర్థిఁ జనుదెంచి యిట్లను ననఘ నన్ను నిద్ధ పుణ్యు నింద్రద్యుమ్ను నెఱుఁగు దయ్యా.

3_4_362 సీ. అనుడు నేనిట్లంటి నయ్య నిన్నెఱుఁగంగఁ జాల నయ్యెద హిమ శైల శృంగ వాసియై యుండు ప్రావార కర్ణుండను పేరి ఘూకము గడుఁ బెద్ద యదియు నాకంటె నిన్ను నిర్ణయముగ నెఱుఁగుఁ బొమ్మనుటయు నన్ను రమ్మనియె నతఁడు ఘనరసాయన ఘటికా ప్రయోగంబున దేహ తాపంబు వర్ధిల్లె నందు

తే. గదని రాఁజాల నేనంటిఁ గడఁగి యన్న రేంద్రుఁ డశ్వమై ననుఁ బ్రీతి నెత్తికొనుచు నయ్యులూకము పాలికి నరిగి నన్ను నడిగినట్టుల దానిని నడుగుటయును.

3_4_363 వ. అదియును గొండొక సేపు దలపోసి చూచి యేను నిన్ను నిక్కువంబుగా నెఱుంగనేర నిద్రద్యుమ్మంబను కొలనియందు నాళీకజంఘుం డను పేరి బక వల్లభుండు వసియించు నవ్విహంగంబు నాకుఁ బెద్ద నిన్నెఱుంగు నరుగు మనిన నమ్మనుజపతి నా తోడఁ గూడ నయ్యులూకంబు మోచికొని నాళీక జంఘునొద్దకు జని తన పేరు సెప్పి నన్నెఱుంగుదే యనిన నదియు నే నిన్నెఱుంగం జాల నాకంటెఁ జిరకాల జీవియైన యాకూపారుం డను కచ్ఛపంబు గల దదియును నిక్కొలన నుండు నజ్జలచరము నిన్నెఱుంగం బోలు నడిగి చూతము గాక యని యక్కమఠంబుఁ బేర్కొని యొక్క సందేహంబు నిర్ణయించుటకయి యీ యార్యజనంబులు నిన్ను గుఱించి వచ్చిన వారు నీవు ననుదేరవలయు నని పలుకుటయును.

3_4_364 తే. కొలను వెలువడి చనుదెంచెఁ గూర్మవిభుఁడు వార లడిగి రింద్రద్యుమ్న ధారుణీశు నెఱుఁగుదే యన నదియు నొక్కింత తడవు దలఁచికొని కన్నుఁ గవ నశ్రుజలము లొలుక.

3_4_365 వ. ఎలుంగు రాలుపడ వారలం గనుంగొని యిట్లనియె.

3_4_366 ఉ. అక్కట నే నెఱుంగనె మహా గుణ భూషణు నమ్మాహాత్ము న న్నిక్కడ బెక్కమాఱులు ననేక భయంబులఁ బొందకుండఁగా నక్కటికంబుతోడఁ దగ నాతఁడు గైకొని కాచెఁ గాదె పెం పెక్కిన యన్నరోత్తముని నెన్నఁటికిన్ మఱువంగ వచ్చనే.

3_4_367 తే. అమ్మహాత్ముండు బహువిధ యజ్ఞ దక్షి ణార్థముగ విప్రవరులకు నర్థినిచ్చు గోగణంబుల గొరిజల గ్రొచ్చి యయ్యెఁ గాదె యీ సరోవరము జగన్నుతముగ.

3_4_368 వ. అనిన యనంతరంబ దేవదూతలు విమానంబు గొనుచుఁ జనుదెంచి యింద్రద్యుమ్నుం గని మహాత్మా నీ కీర్తి జగంబునందు శాశ్వతంబై నిలిచె నీకుఁ ద్రిదివనివాసంబు సుస్థిరంబయ్యె నరుగుదెమ్ము విమానం బెక్కుమని వెండియు.

3_4_369 క. తన కీర్తి యెంత కాలము వినఁబడు నిజ్జగమునందు వెలయఁగ నందాఁ కను బుణ్యలోక సౌఖ్యం బున నెంతయు నుల్లసిల్లుఁ బురుషుం డనఘా.

3_4_370 వ. అనిన నమ్మహీకాంతుండు దివిజ కింకరులం జూచి యిమ్ముదుసలి తాపసుని వృద్ధ విహంగంబును గార్యార్థంబు సహాయులుగా దెచ్చితి వీరిని నిజ స్థానంబుల నునిచి వచ్చెద నించుక నిలువుండని వారిచేత ననుజ్ఞాతుం డయి నన్నును నులూకంబును నెప్పటి నెలవులం బెట్టి తానును దేవయానంబున దివంబున కరిగె నని చెప్పినఁ బ్రీతుఁడై వృథా నందనుండు.

3_4_371 క. నీకంటె వృద్ధత ముని గు ణాకర యెఱిగించి తిది మహాద్భుతమని సు శ్లోకుఁడు మునివరునకుఁ బు ణ్యాకృతికిఁ గృత ప్రణాముఁడై కడు భక్తిన్.

- మార్కండేయుఁడు ధర్మరాజునకుఁ గువలాశ్వు చరిత్రము సెప్పుట – సం. 3-192-4

3_4_372 వ. మునీంద్రా యిక్ష్వాకు వంశోద్భవుండైన కువలాశ్వునకు ధుంధుమారుం డను పేరెట్లు గలిగెఁ జెప్పవే యని యడిగిన నతం డిట్లనియె.

3_4_373 ఉ. శంకర సన్నభుండు జన శంకరుఁడున్ కరుణాకరుం డనా తంకుఁ డుదంకుఁ డన్ముని వ్రతస్థితుఁడై మరు భూమియందు ని శ్శంకమతిన్ వసించి యనిశంబును నవ్యయు నచ్యుతున్ మనః పంకజ వేదిపై నిడి తపం బొనరించె ననేక వర్షముల్.

3_4_374 తే. అతని భక్తికిఁ బ్రియమంది యాదిదేవుఁ డంబుజాక్షుఁ డధోక్షజుఁ డక్షరుండు గరుణఁ బ్రత్యక్షమగుటయు గని యతండు ప్రణతి యొనరించి యిట్లని ప్రస్తుతించె.

3_4_375 మత్తకోకిలము. దేవదేవ శ్రుతి ప్రమాణ విధేయ మాధవ జంగమ స్థావరాత్మక మైన లోకము సర్వమున్ భవదీయమా యావిధేయము విశ్వరూపుఁడ వన్యయుండవు నీవ స ద్భావ సుస్థితి నిన్నెఱింగినఁ బాయుఁ బాపము లచ్యుతా.

3_4_376 చ. అనిమిష సిద్ధ సంయమీ విహంగ భుజంగమ ముశ్యు లెల్ల ని న్ననిశముఁ గొల్చి నీ దయఁ గృతార్థతఁ బొందుదు రెందు నీవు నె మ్మనమున సంతసిల్లుదు సమస్త జగంబులు శాంతిఁబొందు నీ కినుకకు మాఱులేదు శివకీర్తిత యీ భువన త్రయంబునన్.

3_4_377 మత్తకోకిలము. విక్రమ త్రయలీల నోలిన విష్టపత్రితయంబుఁ బె ల్లాక్రమించితి క్రూరులైన సురారి వీరులఁ బ్రస్ఫుర చ్చక్ర విక్రమ కేళిఁ ద్రుంచితి సర్వయజ్ఞ ఫలావహ ప్రక్రియాత్ముఁడ వీవు నిశ్చల భక్తి గమ్య జనార్థనా.

3_4_378 వ. అని మఱియుం బెక్కు భంగులం బ్రస్తుతించినం గరుణించి పాంచజన్య ధరుండు వరం బడుగు మనిన నుదంకుడు దేవా భవదీయ దివ్యరూపంబుఁ బ్రత్యక్షంబుగాఁ గంటి నింతకంటె వరం బెయ్యది గల దైనను నా మనంబు నిత్యంబును సత్యధర్మ శమంబుల యందు సుస్థిరంబై నీ యందు దృఢభక్తికంబు గావలయు నిదియ నాకు వరం బనుటయు నద్దేవుండు నీ కోరిన యట్ల యిచ్చితి మత్ప్రసాదంబున నీకుం బరమ జ్ఞాన యోగంబును సిద్ధించు ద్రిలోకహితంబైన కార్యం బొక్కటి నీ చేత సాధితం బయ్యెడు నది యెయ్యది యనిన వినుము ధుంధుం డను దానవుండు జగంబుల కుపద్రవంబు సేయం గలవాఁడు తద్వధార్థంబై నీవు బృహదశ్వుసూనుం డైన కువలాశ్వు నుద్యుక్తుం జేసెద వన్నరేంద్రుండు మత్ప్రసాద లబ్ధంబైన యోగబలంబునం జేసి భవన్నియోగంబున నయ్యసురం బరిమార్ప సమర్థుండగు నవ్విశేషంబునకు నీ వలన నఖిల లోకంబులు సంతసిల్లెడు నని పలికి విష్ణుదేవుండతర్హితుండయ్యె నుదంకుండును బూర్వప్రకారంబునం దపంబు సేయుచుండె మఱియును.

3_4_379 సీ. అనఘుఁ డిక్ష్వాకుఁడీ యఖిల భూచక్రంబు నేలి నాకమునకు నేఁగుటయును నతని నందనుఁడు శశాదుండు రాజయ్యె వాఁడు కకుత్ స్థుఁడన్వానిఁ గనియె నతఁ డనేనసుఁ డను నాత్మజుఁ బడసె నా పృథివీ పతికిఁ బుట్టెఁ బృథఁ డనంగ పృథుఁడు ష్వగుఁడను పేరి పుత్రకుఁ గాంచె నతనికి జనియించె నార్ద్రుఁడనఁగ

తే. నార్ద్రునకుఁ బుట్టె యువనాశ్వుఁ జను తనూజు డాతనికి బుట్టె శ్రావస్తు డను విభుండు దత్సుతుఁడు బృహదశ్వుఁ డా ధరణి పతికి నుగ్రతేజుండు గువలాశ్వుఁ డుదితుఁడయ్యె.

3_4_380 వ. అక్కువలాశ్వునకు నఖిలాస్త్రశస్త్ర విద్యావిశారదులు నధిక సత్త్వసంపన్నులు నైన పుత్త్రు లేక వింశతి సహస్రంబులు పుట్టిరంత బృహదశ్వుండు నిజపుత్త్రుం గువలాశ్వుం బ్రాప్తసంతాను నత్యంత ధర్మాన్వితు నఖిల మహీరాజ్య భారధౌరేయుంగా నభిషేకించి తపోవనంబునకుఁ బోవ సమకట్టి యయోధ్యా నగరంబు వెలువడు నవసరంబున నవ్వార్త విని యుదంకుండు ననుదెంచి బృహదశ్వున కిట్లనియె.

3_4_381 ఉ. నీవు ప్రజాభిరక్షణము నెమ్మి నొనర్పు మరణ్యభూమికిం బోవఁగనేల రాజులకు భూప్రజఁ గాచుటఁ బోలు ధర్మువుల్ భూవక కల్గునే యడవిఁ బోయి వసించినఁ గాని కాదె ర క్షావిధిఁ గాదె సద్గతులు గాంచిరి తొల్లిటి రాజ ముఖ్యులున్.

3_4_382 క. నీ రక్షణంబు కతమున ధారుణి మముబోఁటి సాధు తపసులు నిత్య ప్రారంభ ధర్మ కర్మో ద్ధారు లగుట యదియు నీదు ధర్మువు గాదే.

3_4_383 వ. విను మొక్కయద్భుతంబు సెప్పెద తొల్లి మధుకైటభులనం బ్రఖ్యాతులైన యసురుల తనయుండు ధుంధుం డనువాఁడు మహాబల పరాక్రమ సంపన్నుండు నిజతపోబలంబునం బితామహు వలన వరంబు వడసి దేవదానవ గంధర్వాదులకు నజయ్యుండై చరియించు చుండు నయ్యసుర యిపుడు మదీయాశ్రమ సమీపంబున బహుయోజన విస్తీర్ణంబగు సముద్రవాలు కాపులినతలంబు నందు మహావివరంబు గావించుకొని సుఖంబున నిద్రించుచున్న వాఁడు వాలకాంతరిత శరీరుండైన వాని నిశ్వాస పవనంబు ధూమదహన జ్వాలా భీలం బయి సంవత్సరంబున నొక్కమాటు వెలువడి భూనభోంతరం బెల్లను నిరంతర సికతారజః పటలంబు మాఁటుకొనం జేయుఁ దదీయ వేగంబునఁ దత్సమీప భూమిశైలకాననంబు లేడు దినంబుల దాఁకఁ గంపించు చుండు నిట్టి దారుణత్వంబు కతంబున మాకు మాయాశ్రమంబున నుండుట సంకటంబు గావున నద్దరాత్ము వధియించి మాకును లోకంబులకును హితంబుసేసి కృతకృత్యుండవై మఱి తపోవనంబున కరుగుము.

3_4_384 తే. ఎవ్వఁడమ్మాహాసురు వధియుంచు పనికిఁ బూను నతనికి నాత్మీయ భూరిశక్తి యిచ్చి జయమిత్తునని యానతిచ్చె నధిప యాదరంబున నాకుఁ జక్రాయుధుండు.

3_4_385 వ. కావున.

3_4_386 అతులిత విష్ణుశక్తి సముపాహిత ముర్తివి గమ్ము లెమ్ము సం తత భుజశక్తి నిట్టి యవధాన మొనర్పఁగ నీవ గాని యీ క్షితి నితరుండు లేఁ డధిక కీర్తియుఁ బుణ్యముఁ జేరు నిన్ను నూ ర్జితగుణ యింతవట్టుఁ దగఁ జేయుము గావుము లోక మంతయున్.

3_4_387 వ. అనినం గృతాంజలియై యుదంకునకు బృహదశ్వుం డిట్లనియె.

3_4_388 క. విమలపతి నస్త్రసన్న్యా సము సేసితిఁ దప మొనర్ప సమకట్టితి నిం క మునీంద్ర తపోవన గమ నము దప్పదు నాకు వినుము నా విన్నపమున్.

3_4_389 చ. అనఘుఁడు మత్సుతుండు గువలాశ్వుఁడు వీఁడె మహాబలుండు స జ్జన హితకారి ధైర్యనిధి సంభృతకీర్తి భవత్ప్రియార్థమై జననుత యమ్మహాసురునిఁ జంపుట కోవు నవార్య శౌ ర్థను లగుచున్న పుత్త్రులును దాను నభేద్య క్యవభూజావిభూతితోన్.

3_4_390 వ. నాకుం దపంబున కనుజ్ఞ యీవలయు నని పలికి యక్కార్యంబునకుఁ బుత్త్రు సమర్పించి యమ్ముని చేత నభినందితుండై బృహదశ్వుడు దపోవనంబున కరిగె ననిన విని ధర్మనందనుండు మార్కండేయుతో ధుంధుండు మధుకైటభుల పుత్త్రుం డని చెప్పితి రమ్మధు కైటభులెక్కాలంబు వా రేమియై రని యడిగిన నతం డిట్లనియె.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com