ఆ భా 3 4 331 to 3 4 360

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_4_331 చ. కొలఁకుల వాగులన్ నదులఁ గ్రోవుల బావుల నిర్ఘరంబులం గలయఁగ రోసిరోసి వడిఁ గప్పలఁ గుప్పలుగా వధించుచో నలుగుల మందు భేకనివహంబు గనుంగొని భేక నాయకుం డలఘ తపస్వి రూపమున నా నృపు పాలికి వచ్చి యిట్లనున్.

3_4_332 ఉ. అక్కట లోకమెల్ల నగ నాఱడి కప్పలఁ జంప నేల యిం దెక్కడు పెంపు గల్గుఁ బృథివీశ్వర కోపము డింపు కప్పలం జక్కని చూడ్కిఁ జూడు మిది చాల నధర్మము నావుడున్ విభుం డెక్కడి మాట నా సతికి నెగ్గొనరించెఁ గడంగి భేకముల్.

3_4_333 క. నాయిష్ట వనిత మ్రింగిన మాయపుఁ బుర్వులివి వీని మడియింతు మునీం ద్రా యుడుగుము నీ వనుటయు నాయన యత్యంద దుఃఖితాత్ముం డగుచున్.

3_4_334 వ. ఏను మండుక నాయకుఁడ నాయు వనువాఁడ నమ్మగువ నా కూఁతురు సుశోభన యనునది దానిచేత ననేకులు బేలుపడిరి నీ వెంతవాఁడు వనిన నప్పరిక్షితుం డట్లేని నాకు నమ్మెలఁతుకఁ దెచ్చి యొప్పింపవలయు నని ప్రార్థించిన నతండు నవ్వుచు నవ్వామ నయనం దలంపున రావించి యా రాజునకు నిచ్చి దానిం జూచి కోపించి నీవు గడుంజెట్టవు ప్రసిద్ధులగు రాజులం బెక్కండ్రం జిక్కులం బెట్టితివి గావున నీకుం బుట్టెడు కొడుకులు గపట వర్తను లయ్యెడుమని కూఁతు శపియించి మండూక రాజు నిజేచ్ఛం జనియెఁ బరిక్షితుండును సంప్రాప్త మనోరథుం డయి సుశోభనయందుఁ గ్రమంబున శలుండును నలుండును వలుండును నను మువ్వురు గొడుకుల బడసి యందగ్రజుం డయిన శలు నభిషిక్తుం జేసి తపోవనంబున కరిగె నంత.

3_4_335 క. శలుఁ డొక్కనాఁడు కనకో జ్జ్వల మగు రథమెక్కి వేఁట పని పెక్కు మృగం బులఁ జంపఁగ నొక్క మృగం బలఘతర శరాగ్రవిద్ధమై వెసఁ బఱచెన్.

3_4_336 ఆ. ఇట్లు వఱచుటయును నెంతయు రయమున నమ్మృగంబు వెనుక నరిగి యరిగి యెయిద లేక ధారుణీశుండు సారథిఁ బదరి తేరువేగ పఱపు మనియె.

3_4_337 సీ. అనవుఁడు సూతుఁ డిట్లను దేవ మనమెంత దఱిమిన మృగము దద్దయు జవంబు గలదు రథ్యంబులు గడుగొని కూడంగఁ జాలవు వలవని జాని యేల మన తేరి రహులు వామ్యములైన నమ్మృగ మగపడు లేకున్న నలవి గాదు నావిని వామ్యముల్ నాఁగ నెవ్వి హయంబులు సెప్పుమనియె నబ్భూవిభుండు

తే. వామదేవ మహాముని హరులు వామ్యములు నాఁగఁజను నని వాడుఁ సెప్పె నతని యాశ్రమ మెచ్చట నచటి కిపుడ తేరువోవనిమ్మనియె ధాత్రీ విభుండు.

3_4_338 వ. వాఁడును రథంబు సత్వరంబుగా వామదేవునాశ్రమంబునకు బఱపినం జని యాతండా తపోనిధిం గని నమస్కరించి మునీంద్రా నా చేత నేటువడి యొక్క మృగంబు రయంబునం బఱచె నమ్మృగంబు వధియింప వలయు భవదీయ హయంబుల నీవలయు ననిన నతండు నీవు కృత కార్యుండవై మా హయంబులం దడయక యొప్పింప వలయు నట్లేనిం గొనిపొ మ్మనిన వల్లెయని వామ్యంబులంగొని రథయుక్తంబులం గావించి తదియ జవంబునకు మెచ్చుచు ముహూర్త మాత్రంబునఁ గూడముట్టి మృగంబు సమయించి మగిడి నిజ పురంబునకు వచ్చి.

3_4_339 మత్తకోకిలము. రాజయోగ్యములైన యీ హయరత్నముల్ జవసత్త్వవి భ్రాజితంబులు వానికేటికిఁ బాఱువానికి నంచు నా రాజు రాజస బుద్ధి నంతిపురంబు నందిడఁ బంచె న వ్వాజియుగ్మము వేడ్క నూనిన వాఁడు దోస మెఱంగునే.

3_4_340 వ. అట వామదేవుండును దన యశ్వంబుల శలుండు గొనిపోయి మగుడ నొప్పింపక తడయుట కాత్మగతంబున.

3_4_341 తే. రాజపుత్త్రుండు బలియుండు రాజసుండుఁ గొండికాతండు వేడుకఁ గొనుచు నరిగె నశ్వములఁ గ్రమ్మఱఁగ నిత్తు నను విచార మెవ్విధంబున నతనికి నేల కలుగు.

3_4_342 వ. అని శంకించి నిజ శిష్యు నాత్రేయుం డను వానిం జూచి శలుండు మన వామ్యంబులంగొని పోయి యొక్కమాసం బరుగుదెంచె వాఁడును దనయంతఁ దెచ్చుట గలుగనేరదు నీవరిగి మన తురంగ రత్నంబులం గొని రమ్మని పంచిన నప్పుడ కదలి యయోధ్యా నగరంబునకుం జని.

3_4_343 క. మనుజపతిఁ గాంచి యాతఁడు మునిపతి పుత్తేర నధిప ముఖ్య యిచటి కేఁ జనుదెంచితి మా హయముల నెనసిన నెయ్యంబుతోడ నిమ్మని యడిగెన్.

3_4_344 క. అనవుడుఁ శలుఁ డిట్లనియెం జను నినుఁ బుత్తేగ నతఁడు సాలుడు వీవు గొనిపోవఁ దురంగంబులఁ జనుమీ దుర్భాషణములు సైఁపవు మాకున్.

3_4_345 వ. అనిన నమ్ముని కుమారుండు గ్రమ్మఱి చని గురునకు నవ్విధం బెఱింగించిన వామదేవుండు క్రోధ పరీత చేతస్కుండై శలుని పాలి కరిగి యిట్లనియె.

3_4_346 క. ఇమ్ము నరేశ్వర మా తుర గమ్ముల నీ కార్యమయ్యెఁ గాదే కడు లో భమ్మున నొండుల సొమ్ములు రమ్మనిన్ వచ్చుచనే యెరవు సత మగునే.

3_4_347 క. పరధన హరణము దురితము పరికింపుము వరుణు చేతి పాశంబుల ని ష్ఠురముగఁ గట్టువడకు ని ర్భర నరక కృశాను శిఖలఁ బడకుము మీఁదన్.

3_4_348 చ. అనుటయు నాతఁ డిట్లనియె నాఱడి విప్రుల కేల యశ్వముల్ ఘనతర సత్త్వ మూర్తు లనఁగాఁ దగు నెడ్లను రెంటి నిచ్చెదన్ విను మటుగాక బల్లిదవు వేసడముల్ వలతేని నిత్తు గై కొనుము తగంగ వామ్యములఁ గోరక పొమ్మడాయాస లేటికిన్.

3_4_349 క. అనిన విని యేటిమాటలు వినువారలు నవ్వ నకట విప్రుల ధనముల్ గొనివేఱయొంటి నిచ్చెద నను టిది యేనాఁటి చందమని ముని పలికెన్.

3_4_350 క. పలుకుటయు నలిగి శలుఁడి ప్పలుగుఁ దపసి నంటఁ గట్టి పటుశూలములం బొలియింపుఁ డనుచు భీకర బలుల నియోగించెఁ దనదుపార్శ్వ జనములన్.

3_4_351 వ. అంతయు జూచి వామదేవుండు ఘనరోష భీషణ ప్రహాస దుర్నిరీక్ష్యముఖుం డగుటయు నక్షణంబ ఘోరాకారు లగు రాక్షసు లనేకులు పుట్టి నిశాత శూలంబుల నా భూపాలుం బొడిచి కాలగోచరుం జేసిరి మునీంద్రుడు నిజేచ్ఛం జనియెఁ దదనంతరంబ శలానుజుండు దలుం డనువాఁడు నిజరాజ్య పట్ట బద్ధుండై సుఖంబుండఁ గొండొక కాలంబునకు వామదేవుఁడు ననుదెంచి వానిం గని మహాత్మా నీవు ధర్మపరుండవు ధర్మువు దప్పనొడుదేని మా హయంబుల నిమ్మనుటయు దలుం డలిగి నిజ సమీపంబున నున్న సారథిం జూచి యిట్లనియె.

3_4_352 సీ. కడుఁ గ్రొవ్వి తేఁకువ సెడియె నీ పాఱుండు వీఁకమై నిప్పుడు వీనిఱొమ్ము వ్రయ్యంగ సేసెదఁ జయ్యన విషదిగ్ధ సాయకమును శరాసనముఁ దెమ్ము నావుడు నమ్మహీదేవుండు వగుచు నిట్లనియె నన్నేయఁ దెమ్మనిన విశిఖ మంతఃపురంబున సంతసంబున నున్న యనఘు భవత్సుతుఁ దునుము గాక

తే. యనఁగఁ దదనంతరంబ ఘోరాస్త్రనిహతుఁ డైన బాలునిగొనుచు హాహారవంబు లెసఁగ నంతిపురంబు వారెల్ల వచ్చి రది ధ్రువంబుగఁ గనియును నవ్విభుండు.

3_4_358 వ. అని యివ్విధంబున నతం డేపు దప్పి జోహారు వెట్టుటయుఁ దదీయ బంధు మిత్త్ర జనంబులు భయ సంభ్రమంబులతో నమ్మునినాథు శరణు సొచ్చి యనునయించినఁ బ్రసన్నుంజై యమ్మహాత్ముండు దత్కరయుగ స్తంభనంబు మాన ననుగ్రహించి తదీయ నందను ప్రాణంబు లొసంగె నంత నమ్మహీకాంతుండు భార్యా సహితంబుగా నతనికిఁ బ్రణమిల్లి హయంబులఁ దెచ్చి యొప్పించినం గైకొని వామదేవుం డరిగె నిట్టిది బ్రాహ్మణ ప్రభావంబని చెప్పిన విని.

3_4_359 క. మునిపతికి మ్రొక్కి కుంతీ తనయుఁడు మీకంటె వృద్ధతముఁ డగు పురుషుం డలఘా కలఁడె జగమ్మున నని యడిగిన నాతఁడిట్టు లని యెఱిఁగించెన్.

- మార్కండేయుఁడు ధర్మరాజునకు నింద్రద్యుమ్నుని కథ చెప్పుట – సం. 3-191-2

3_4_360 క. ఘనుఁ డింద్రద్యుమ్నుం డను జనపతి గలఁ డాతఁ డింద్రసదనమున ముదం బున నుండఁగ బహుగాలం బున కాతనికీర్తి లోకమున మాయుటయున్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com