ఆ భా 3 4 271 to 3 4 300

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_4_271 చ. వదన భుజోరు పాదముల వర్ణ చతుష్టయమున్ యుగాదియం దొదన సృజింతు ఋగ్యజుష సూక్తులు సామము నయ్యధర్వమున్ విదితముగా మదీయ ముఖ వీథుల నుద్భవ మొందు నన్నియుం దుదిఁ బరివర్తన క్రమ విధూతములై ననుఁ జేరుఁ గ్రమ్మఱన్.

3_4_272 క. అనహంకృతు లక్రోధను లనసూయులు సంగరహితు లధ్యాత్మవిదుల్ ఘన సత్యాత్మకులు మహా మునులు ననుం గొల్తు రెపుడు మోక్షాపేక్షన్.

3_4_273 తే. అఖిల నక్షత్ర తారాగ్రహములు గగన పవన దిశలును మత్స్య రూపములు వినవె సకల రత్నాకరంబులు శయ్యగాఁగ నిత్యసుఖ లీలమై శయనింతు నేను.

3_4_274 క. దానము సత్యంబు తపో జ్ఞానాహింస లనఁ బరగు సాత్త్విక గుణ సం తానముఁ గామ క్రోధా జ్ఞానంబులు మన్మయములు సంయమివర్యా.

3_4_275 క. విను మింకఁ బెక్కమాటలఁ బనియేటిలి జగమునందుఁ బ్రకటితముగఁ గ ల్గినయదియు నేనలేనిది యును నేన సునిశ్చితముగ నుహింపు మెదన్.

3_4_276 ఉ. ఎప్పుడు ధర్మహాని యగు నెప్పు డధర్మము మీఱుఁ గ్రూరులై యెప్పుడు దైత్యు లుబ్బుదురు హీనతఁ బొందుదు రెప్డు వేల్పు లే నప్పుడు సత్కులీనుల గృహంబుల నుద్భవ మొంది లీల మై నెప్పటియట్ల నిల్పుదు సురేంద్రుల నంచిత ధర్మ పద్ధతిన్.

3_4_277 క. సితరక్త నీల పీత ద్యుతి విలసిత రూపములఁ జతుర్యుగముల నే నతి ధృతిఁ జరియించి సమం చిత ధర్మ స్థాపనంబు సేయుదు ననఘా.

3_4_278 మత్తకోకిలము. కాలచక్రము నిర్వికల్పము గాఁగ నేననయింతు ను న్మీలితక్రమ విక్రమైక సమృద్ధినై లయ విక్రయా వేళ నింతయు సంహరింతుఁ బ్రవృద్ధయోగ బలోల్లస త్కాల రూపము దాల్చి దుర్వహగర్వ నిర్వహ బుద్ధినై.

3_4_279 క. నా తెఱఁ గంతయు నిప్పుడు చేతోముద మొదవ నీకుఁ జెప్పితిఁ ద్రిజగ ద్ధాత యగు పితామహుఁడు సు జాతుఁడు నా యెడలఁ జక్ర సగబాలు సుమీ.

3_4_280 వ. నారాయణాభిధానుండ నైన యేను బాల రూపంబున శంఖచక్ర గదాధరుండనై యేకార్ణవంబునందు మహాయుగ సహస్ర సమయం బయిన కాలంబున యోగనిద్రా పరవశుండనై యుండుదు నిట్టి దారుణ కల్పాంతంబు సూచి నీవు భీతుండ వగు టెఱింగి నీ వలననియను గ్రహంబున నాత్మగుప్తంబులైన సకల లోకంబులు గనుపట్టి తెఱంగుఁ గావించితి నీవింక నిశ్శంక హృదయుండవయి వలసిన యెడం జరియింపుము మదీయ నాభి కమల కర్ణికాశయనుం డయి యున్న చతురాననుండు మేల్కని సృజియించు లోకంబు లేర్పడు జూచెదనని యానతిచ్చి యద్దేవుం డచ్చోటన యంతర్హితుండయ్యె నత్యంత విచిత్రంబైన యీ వృత్తాంతంబు నాకు ననుభవ గోచరంబైన యది.

3_4_281 శా. నా కమ్మైఁ బొడసూపెఁ దాను గృపతో నాకందు నేఁడియ్యెడన్ నీకున్ గాదిలిచట్టమై సచివుఁడై నెయ్యంబుమై నున్న పు ణ్యాకారుం గమలాచతాక్షుఁ గరుణైకాయత్తు నత్యుత్త శ్లోకుం గృష్ణునిఁ గంట నాసుకృతముల్ శోభిల్లెఁ బక్వంబులై.

3_4_282 క. ఈ దేవదేవు కరుణం గాదే కురునాథ నిర్వికారుఁడనై నిః ఖేదుఁడనై యుండుదు దే వాది వివిధ భూత విలయ మయ్యెడు నపుడున్.

3_4_283 తే. అనఘ యిద్దేవు సన్నిధి యగుటఁ గాదె నాకుఁ బూర్వవర్తన కధనంబు నందు బోధ మిప్పుడు గలిగె నిప్పుణ్యుఁ బరమ పురుషుఁ బ్రభవిష్ణుఁ గృష్ణుని శరణు సొరుము.

- మార్కండేయుఁడు ధర్మరాజునకుఁ గలియుగ ధర్మంబలు సెప్పుట – సం. 3-188-5

3_4_284 వ. అనిన విని ధర్మనందనుం డనుజ సహితుండై కృష్ణునిం బ్రశంసా వచనంబుల నభినందించి మార్కండేయుం జూచి మునీంద్రా భవత్ప్రసాదంబున నత్యద్భుత కథాశ్రవణ పరితోషితుల మైతిమి కలియుగంబున సకల ధర్మలోపం బగునని చెప్పుదురు తత్ప్రకారం బెఱింగింపవేయనిన నతం డతని కిట్లనియె.

3_4_285 క. కృతయుగమునందు ధర్మువు చతురంశంబులను బరగఁ జను నది త్రేతన్ ద్రితయమున నొక్కఁడొకఁడుగఁ బ్రతియుగమునఁ దఱుఁగఁ దొడఁగుఁ బాళులు వరుసన్.

3_4_286 వ. అట్లగుటం జేసి ధర్మంబు కలియుగంబునఁ గరంబు దుర్లభం బయి పాది మాత్రావశిష్టం బయి యుండుఁ దత్ప్రవర్తనం బాకర్ణింపుము.

3_4_287 సీ. సత్యంబు నరులకు సంక్షిప్తమగు సత్యహాని నాయువు గడు నఱిగిపోవు నాయువు దఱిఁగిన నల్పంబు విద్య లల్ప విద్యను మోహంబు మిగులు మోహంబు వలనఁ బై ముసురు లోభంబు లోభావేశమునఁ గామ మగ్గలించుఁ గామంబు పెంపునఁ గడఁగుఁ గ్రోధంబు క్రోధంబున వైర మెంతయును బెరుఁగు.

ఆ. వైరమున నశేషవర్ణులు నన్యోన్య పీడసేయుచును విభిన్న బుద్ధి నొక్కఁడొకని మేర నుండక వర్ణ సం కరము సేయఁ గలరు కలి యుగమున.

3_4_288 క. జప నియమ స్వాధ్యాయ ప్రపంచములు విడువఁ గలరు బ్రాహ్మణులు జనా ధిప శూద్రులు విపుల తపః క్షపితులు గాఁగలరు వినవె కలి కాలమునన్.

3_4_289 మ. వివిధ వ్యాఘ్ర మృగోరగాకులములై విస్తీర్ణ శూన్యాటవీ నివహాభీలములై యరాజకములై నిర్మూల ధర్మంబులై ద్రవిళాభీర తురుష్క బర్బర పుళింద వ్యాప్తి దుష్టంబులై భువిలో నెల్లెడఁ బాడగున్ జనపదంబుల్ దద్యుగాంతంబునన్.

3_4_290 క. క్షత్త్రియ జాతులు శూద్రచ రిత్త్రంబున శౌర్యమును సిరియు దేజంబున్ మైత్త్రియును లేక చెదరి ధ రిత్త్రీశ్వర శూన్యులై చరించెదరు ధరన్.

3_4_291 క. రస గంధ ద్రవ్యంబులు పస చెడు సస్యంబు లల్ప ఫలములగు మహిం బసిపాఁడి దఱుఁగుఁ దరువులఁ గుసుమ ఫలంబులును గరముఁ గొంచెంబు లగున్.

3_4_292 క. అరులు మిగులఁ గొని రాజులు నరులకు నెంతయును భయ మొనర్తురు ధరణీ సురులు గడఁగి వాణిజ్యముఁ గరిసనమును జేయఁగలరు కలి యుగ వేళన్.

3_4_293 సీ. పాషండ దర్శన బహుళంబు లయ్యెడు వర్ణాశ్రమంబులు వసుమతీశ తవిలి శరీరంబుఁ దద్దయుఁ బ్రోతురు పుణ్యఫలంబులు బొంకు లనుచుఁ గాలంబుతోఁ గూడఁ గలుగవు వానలు పొల్లులై బీజముల్ వొలిసి పోవుఁ గ్రయ విక్రయంబులఁ గపటంబు దఱచగుఁ గడఁగి యిల్లజసొమ్ము లడఁచి కొండ్రు

ఆ. సాధుచరితు లైన జనులు దర్గతుల రో గములఁ దెగురు రల్ప కాలమునన పాపపరులు లగ్గుఁ బరమాయువును నరో గతయు సిరియుఁ బొందఁ గాంతు రెందు.

3_4_294 క. ఉఱవగు నారికె పంటలు గొఱియల పాఁడియును దఱచగుం బురుషులకుం దెఱవలు సుట్టము లయ్యెద రెఱచియు భుజియింతు రర్థి నెల్ల జనంబుల్.

3_4_295 క. పితృదైవన కార్యంబుల నితరేతర భోక్త లగుదురు రెల్ల యెడలఁ గు త్సిత దేశ కాల పాత్ర ప్రతతియ వర్తించు దైవపైతృక విధులన్.

3_4_296 క. హేతుప్రత్యుయ వాద వి చేతసులై వేదనింద సేయుచును మఖ వ్రాతంబులు వ్రతములుఁ బెడఁ బాతురు దుర్మార్గ కర్మ పరులై విప్రుల్.

3_4_297 మ. వనితా దుర్బల దీన బంధుజన సర్వస్వాపహారుల్ సుహృ జ్జన మాతా పితృ పుత్త్రహంతలు యదృచ్ఛా కర్మశీలుర్ ధరన్ జన సంపూజితులై చరింతురు వినష్ట శ్రీకులై విప్రు లా జనులంజేరి పరిగ్రహించెద రవజ్ఞాపూర్వ దుర్విత్తముల్.

3_4_298 మ. ధరణీ రక్షణ మాచరింపక నృపుల్ దర్పంబునం బశ్యతో హరులై సాధుల ద్రోఁచి చేకురు తదియ స్త్రీ ధన క్షేత్రముల్ హరియింప గలవారు దారుణ తరంబై పెల్లు చెల్లుం బర స్పర వైరంబు ధరాతలేంద్రులకు విశ్వ ప్రాణి నాశంబుగన్.

3_4_299 క. సుతుఁ డవమానించు జనకుఁ బతి నవమానించు భార్య పడఁతులుఁడ బతులున్ మతి నొండొరువుల మెచ్చక సతతముఁ జరియింతు రిష్ట సంచారములన్.

3_4_300 క. నడవవు దేవ పితృ క్రియ లుడుగును వేదార్థ సమ్యగుప దేశంబుల్ గడఁగు మహా మోహతమము పుడమి సమస్తంబుఁ గుజన భూయిష్ఠ మగున్.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com