ఆ భా 3 4 091 to 3 4 120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_4_091 ఆ. దివ్యబాణములు తదీయ ప్రయోగముల్ మాకుఁ జూపుమనిన మఘవ సుతుఁడు వేఱువేఱ చూపె వేలుపు లిచ్చిన యస్త్ర శస్త్రములు నిజాగ్రజునకు.

3_4_092 వ. మఱియును.

3_4_093 చ. సురవిశిఖ ప్రయోగములు సూపఁ దొడంగిన నేల దిర్దిరం దిరిగెఁ బయోనిధుల్ గలఁగె దిగ్గజముల్ మద మేది కుందె భా స్కరరుచి మాసెఁ బావకశిఖాతతి తోన యడంగె గాడ్పు లం బరమున నిల్చి రీశ్వరుఁడు బ్రహ్మయు నాదిగ వేల్పు లందఱున్.

3_4_094 వ. అంత సురగణచోదితుండైన నారదుం డర్జును పాలికి వచ్చి యిట్లనియె.

3_4_095 తే. ఎదురులేక దివ్యాస్త్రంబు లిట్లు నీకుఁ బాడియే ప్రయోగింపంగఁ బాండు పుత్త్ర సిద్ధమివి యధిష్ఠానవర్జితము లయ్యె నేని మూఁడు లోకములు దహించు నొగిని.

3_4_096 వ. అని యర్జును వారించి నారదుం డరిగిన నమరులు నిజ స్థానంబుల కరిగి రిట్లు పాండవు లందు పది మాసంబు లుండునంత నొక్కనాఁ డమరకన్యకలు వచ్చి యర్జునున కిట్లనిరి.

3_4_097 తే. వనమునందును బండ్రెండు వత్సరములు నలయ కజ్ఞాత వాసమేకాబ్దకంబు పూని నిర్విఘ్నవృత్తిఁ జల్పుదురు మీరు పగఱ నిర్జింతు రాహవాభ్యంతరమున.

3_4_098 తే. నీ పరాక్రమ బలమున నిఖిల ధరణి రాజ్యభారంబు నీ ధర్మరాజు పూను రఘుకులాధీశ్వరుం డైన రాము కీర్తి యట్ల నీ కీర్తి త్రిజగంబులందుఁ బరగు.

3_4_099 వ. అని యాదేశించి దేవకన్యకలు వోయిన నిట దేవర్షియైన రోమశుండు ధర్మరాజునకు ధర్మాను శాసనంబు సేసి దివంబున కరిగె నంతఁ బాండవు లెప్పటియట్ల ఘటోత్కచ సేనాన్వితులై క్రమ్మఱి వృషపర్వు నివాసంబు సూచుచు బదరీ వనంబున నొక్క రాత్రి వసియించి సుబాహుపురంబునకు వచ్చి యందుఁ దమపరిచారకు లైన యింద్రసేనాదులం గూడి నిజరథారూఢులై ఘటోత్కచుం బోవం బనిచి యింద్ర సేనాదులం గూడి నిజరథారూఢులై ఘటోత్కచుం బోవం బనిచి హిమవత్పర్వతంబు నందు దేవర్షి బ్రహ్మర్షుల యజ్ఞ ప్రదేశంబుల ననేక విధ యూపంబులు సూచుచు నొక్క వర్షం బుండి రంత నొక్కనాఁడు.

- అజకరోపాఖ్యానము - సం. 3-176-5

3_4_100 క. మృగయార్థ మరిగి హిమవ న్నగ భూముల యందుఁ బవన నందనుఁ డొక ప న్నగు చేతఁ బట్టువడి యి మ్ముగ ధర్మతనూజు చేత మోక్షితుఁ డయ్యెన్.

3_4_101 వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

3_4_102 మధ్యాక్కర. పదివేల గజముల బలము గలవాఁడు పౌలస్త్యుతోడఁ గదనంబు సేసి యనేక యక్షరాక్షసుల నిర్జించి యుదిత శౌర్యోన్నతుండైన వాఁడు వృకోదరుఁ డేల పదపడి నిగృహీతుఁ డయ్యెఁ దానొక్క పన్నగు చేత.

3_4_103 వ. అనిన వానికి వైశంపాయనుం డిట్లనియె భీముం డొక్కండ హిమవదుత్తుంగ శృంగోపాంత కాంతారంబుల మృగయాభ్రాంతిఁ బరిభ్రమించు చుండి యతిశ్రాంతుఁ డయి తత్ప్రదేశంబున.

3_4_104 మ. అశనాశావివృతాస్య గహ్వరుఁ గృతాంతాకారు నిశ్వాసధూ మశిఖాధూసరి తోగ్ర దుర్గతరుగుల్మవ్రాతు హారిద్రవ ర్ణ శరీరున్ భృశరూక్ష దర్శను మహానాగ ప్రభుం గాంచె న ర్ధ శశాంక ద్యుతిహారి దారుణ చతుర్దంష్ట్రున్ జగత్త్రాసకున్.

3_4_105 వ. అమ్మహాజగరం బామిషార్థియై భీముం బట్టికొని వాని భుజయుగంబుఁ దన ముఖంబున నంగంబు నిజాంగంబున జిక్కం బంధిచిన నాగాయుత బలుండయ్యును దదంగ సంగంబున దుర్బలుండై మెలంగ నేరక భీముండప్పాము బలవీర్యంబులకు విస్మితుండయి యిది ప్రకృతి సర్పంబుగా దెయ్యది యేనియు నొక్క యద్భుత రూపం బని విచారించుచు దాని కిట్లనియె.

3_4_106 మత్తకోకిలము. ఏను భీముఁడఁ బాండవేయుఁడ నిద్ధతేజుఁడ ధర్మరా జానుజుండఁ బిశాచపన్నగ యక్షరాక్షస వీరులం బూని పోరుల నోర్వ నోపెడు భూరి వీరుఁడ నాగపం చానవాదులఁ బట్టి వ్రచ్చు ననంత బాహు బలాఢ్యుఁడన్.

3_4_107 వ. ఇట్టి నన్నుఁ బట్టి యిప్పాట బంధిచు నట్టి శక్తి యెట్టు లయ్యె నీకు నిది నిసర్గ శక్తి యే వరదానసం సిద్ధియైన యదియె చెప్పు మనిన.

3_4_108 వ. అదియును దిర్యగ్జాతి యయ్యును దన పూర్వ స్మృతి సెడకుండ వరంబుఁ గాంచుటం జేసి వాని కిట్లనియె.

3_4_109 క. ఇది నావర లాభంబున నుదయించిన శక్తి యెట్టి యున్నత బలసం పదు లైన జీవులును నా కెదిరిచి బలహీను లగుదు రివ్వపినమునన్.

3_4_110 ఆ. ఎదురఁ బడిన వాని వదలక శార్దూల శరభ సామజాది సత్త్వతతులఁ బట్టి తినుచు నున్న యట్టి నాకిప్పుడు భక్ష్య మైతి వీవు పాండుపుత్త్ర.

3_4_111 ఆ. శక్రపదవిఁ బొంది సద్బ్రాహ్మణుల కవ మాన మేను జేసి మదము పేర్మి ననఘ యిట్టులైతి నందొక్క మునివరు శాపశక్తిఁ దొంటి శక్తి దఱిఁగి.

3_4_112 వ. అని దుఃఖించిన యజగరంబునకు భీముం డిట్లనియె.

3_4_113 క. కడుకొని కడు దుఃఖములై నెడ నుచితమె యాత్మనింద యెయ్యెడల మనం బెడలక యేకాకృతి నె ప్పుడు నుండుట సూవె పురుషు పురుషార్థ మిలన్.

-ధర్మరాజు భీమసేనుని వెదకఁబోవుట -

3_4_114 వ. పురుషకారంబునం జేసి దైవంబు నివర్తింప నెవ్వరోపుదు రేను మహా బలుండ నయ్యును భవద్గృహీతుండనై యిట్టి యవస్థం బొందితి నాత్మ త్యాగంబునకు వగవ నపహృత రాజ్యానుభోగులై మద్భ్రాతృవరులు దుర్గమం బైన యిప్పర్వత కందరంబునం గ్రుమ్మరు చున్నవారు నన్నుఁ గానక యెంత దుఃఖింతురో యని వగచెద ననుచున్నంత నిట ధర్మ తనయుండు దీప్తం బైన శివారుతంబు విని యతిశంకిత చిత్తుం డయి యనంతరంబ దన దక్షిణ భజాస్పందనం బుపలక్షించి మీఁద లగ్గదు నంచు ననుజ మధ్యంబున ననిలజుం గానక యర్జునం గవలను గృష్ణారక్షణార్ధంబు నియోగించి ధౌమ్యపురోగమ భూసుర వరులతో భీము రోయుచుం దదీయ పాద లలితహలకులిశకల శజలజాదిలక్షణ్లంకృతంబైన పాంసు పథంబునం జని ముందట.

3_4_115 క. గిరి శిఖరా భోగ బృహ త్తర భుజగ శరీర వేష్టిత శరీరుండై భరమునఁ గదలఁగ నేరక పరమ శ్రమ మడర నున్న పవనజుఁ గనియెన్.

3_4_116 క. కని యాత్మగతంబున ని య్యనిలజుఁ డొక పాముచేత నవిచేష్టితుఁడై తన లావు దఱిఁగి ప్రాకృత జనుక్రియ నిట్లున్న వాఁడ సామర్థ్యమునన్.

3_4_117 వ. ఇది యేమి యాశ్చర్యంబొ యనుచు ననిలజుం జూచి దుఃఖితుండై ధర్మజుం డయ్యజగరంబున కిట్లనియె నయ్యా నీవు సర్పరూపంబుఁ దాల్చిన తైత్యుండవో దేవతవో చెప్పు మేను యుధిష్ఠిరుండ ని న్నడిగెద నిమ్మహాభుజు నా యనుజు నామిషార్థివై పట్టితేని నీకు బుభుక్షా నివృత్తి యగునట్లుగాఁ జాలినంత మృగ మాంసంబుఁ బెట్టెద వీని విడువు మనిన ధర్మరాజునకు నయ్యజగరం బిట్లనియె.

3_4_118 సీ. వినవయ్య నహుషుఁడన్ జనపతి నేను మీ పూర్వజులకు నట పూర్వజుండ ననఘ సుత్రామున కెనయగు వాఁడ నైశ్వర్య గర్వంబున నార్యవృత్తి విడిచి వివేకంబు సెడి సహస్రోత్తమ బ్రాహ్మణ ధృతమైన బ్రహ్మరథము నెక్కి బ్రాహ్మణులకు నక్కజంబగు నవమానంబు సేసిన దాన నాకుఁ

ఆ. గలశభవుఁ డగస్త్యుఁ డలిగి యత్యుగ్రాహి వగు మటంచు శాపమప్పుడిచ్చె ముని వరేణ్యు శాపమునఁ జేసి యిప్పాట నవయు చున్నవాఁడ నాఁటఁ గోలె.

3_4_119 వ. విధి విలసితంబు పేర్మి నీకే మని చెప్పుదు.

3_4_120 చ. చదివితి నెల్లవేదములు సత్క్రియ చేసితి నూఱు యజ్ఞముల్ విదితముగా సురేంద్ర పదవీ స్థితిఁ బొందితి దుర్మదంబునం దుదిఁ బెనుబామునై యధిక దుఃఖుఁడనైతి సుఖంబు దుఃఖమున్ వదలక చేయుచోట బలవద్విధి కేమి భరంబు సెప్పుమా.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com