ఆ భా 3 4 001 to 3 4 030

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


శ్రీ మదాంధ్ర మహాభారతము ఆరణ్య పర్వము - చతుర్థాశ్వాసము

3_4_001 క. శ్రీ రాజరాజకుల ని స్తార సుధాహార హీర సన్నిభ కీర్తీ శ్రీ రమణ ధనుర్విద్యా పారగ కోదండపార్థ పార్థివ తిలకా.

3_4_002 వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నట్లు పాండవులు నర నారాయణ స్థానంబునఁ గొన్ని దినంబు లుండి యొక్కనాఁడు ధర్మతనయుండు దమ్ముల కిట్లనియె.

3_4_003 మధ్యాక్కర. ఏనేఁడు లగుదెంచె నర్జునుం డేఁగి యింత కేతెంచుఁ బూని దివ్యాస్త్రముల్ వడసి యమ్మహాభుజు భూరిసత్త్వు నానత రిపువర్గుఁ జూడఁ గాంతు మిం దంచు బ్రాహ్మణుల తో నేఁగె నుత్తర మించి ధర్మనిత్యుఁడు ధర్మజుండు.

3_4_004 వ. ఇట్లు గంధమాదన పుణ్యతీర్థావలోకన పరులయి పాండవు లరిగి పదియేడగు దివసంబున వృషపర్వుం డను రాజర్షి యాశ్రమంబు గని యం దతిప్రీతి నాతనిచేతఁ బూజితు లయి యేడు దివసంబులు వసియించి బ్రాహ్మణుల నెల్ల నందు నిలువం బనిచి వృషపర్వోపదిష్ట మార్గంబున ధౌమ్య రోమశ ప్రభృతి కతిపయ బ్రాహ్మణ వరులతోఁ జని యష్టమ దివసంబున.

3_4_005 క. విమల స్ఫాటికహాటక రమణీయదఠీనిరంతర శ్వేతనగేం ద్రము మాల్యవంతమును ను త్తమచరితులు సూచు చరిగి తద్విపినమునన్.


3_4_006 క. చలదళిపుంస్కోకిల కుల కలరవముఖరితలతాంత కమ్రఫలాళీ లలిత మహీరుహ మాలా మిళితోద్దేశముల విశ్రమించుచు లీలన్.

3_4_007 వ. అందు విహరించుచున్న నొక్కనాఁడు శ్వేతకి యను పుణ్యనదివలన మారుతానీతంబులైన తమ ముందటం బడిన పంచవర్ణ సురభి కుసుమంబులం జూచి యందఱు విస్మయం బంది రంత నేకతంబున నొక్క శశికాంత శిలా తలంబుపయి నున్న భీమసేనునకు ద్రుపదరాజ పుత్త్రి యిట్లనియె.

3_4_008 క. ప్రకటనగఁ దొంటి సౌగం ధిక కనకాబ్జముల కంటె దివ్య సుగంధా ధిక కుసుమము లివి దద్దయు సుకుమారము లిట్టివానిఁ జూచి యెఱుంగన్.

3_4_009 వ. ఇప్పువ్వులు నాకుఁ దెచ్చి యిచ్చి మనః ప్రియంబు సేయు మనిన భీముండు తత్క్షణంబ చని చక్రవాళ నగ సమున్నతం బయిన గిరిశృంగం బెక్కి యందు వివిధరత్న రచితరమ్య ప్రాకార పరివృతం బయిన వైశ్రవణు నివాసంబు గని శంఖధ్వానంబు సేసిన.

3_4_010 క. దాని విని యక్ష రాక్షస సేనలు పఱతెంచి భీమసేను మహాసే నానీ సన్నిభుఁ దాఁకిరి నానాయుధధరులు దారుణధ్వను లెసఁగన్.

3_4_011 క. వాయుప్రేరితశిత సాయక ముఖ దళిత రాక్షస ప్రకరబృహ త్కాయాభ్రగళిత శోణిత తోయంబుల నవనిధర నదులు గడు నిండెన్.

3_4_012 ఉ. ఉక్కఱి యిట్లు మధ్యము మహాగ్ర శరంబుల కోర్వనోప కా రక్కసు లెల్ల నాహవపరాజ్ఞుఖులైంవ గడంగి భీముఁ దా నెక్కటి దాఁకె దిక్కరి సహింపక సింహము దాఁకు నట్టులం దక్కజుఁ డుద్యతాయత గదాయుధుఁడై మణిమంతుఁ డల్కతోన్.

3_4_013 క. ఆ రాక్షసు నతి వీరుఁ గు బేరసఖుం బవనసుతుఁ డభేద్యుఁడు నిజ దు ర్వారతర శాతసాయక ధారావర్షమునఁ గప్పె దారుణ భంగిన్.

3_4_014 క. గద ద్రిప్పి భీముఁ మీఁదను వదలక మణిమంతుఁ డలిగి వైచిన నది వి ద్యుదిత ప్రభా నిభంబై పది దిశలు వెరుంగ భీము పైఁ బఱతెంచెన్.

3_4_015 క. దానిఁ దననిశిత బాణ వి తానంబున జర్జరీకృతముఁ జేసె మరు త్సూనుఁడు గుహ్యకరాక్షస సేనల కెల్లను భయంబు సేయుచు నలుకన్.

3_4_016 క. ఘనుఁ డమ్మణిమంతుఁడు కాం చనదండోద్భాసియైన శక్తి మరున్నం దను మీఁద వైచెనది యా తని భుజ పార్శ్వమ్ము దాఁకి ధారుణిఁ బడియెన్.

3_4_017 చ. గదఁ గొని భీముఁ డంత లయ కాలకృతాంతుఁడ పోలె నేల గ్ర క్కదల నదల్చి నకంపితుఁడై మణిమంతుఁ డాజి దు ర్మదుఁడు త్రిశూల మెత్తికొని మధ్యముపై ననలస్ఫులింగముల్ సెదరఁగ వైచె దానిఁ జెరిచెన్ ఘనుఁ డగ్గద చేత భీముఁడున్.

3_4_018 వ. ఇట్లు తనశక్తి శూలంబు లశక్తి నిహతంబైనఁ బరిత్యుక్తమదుండై మణిమంతుం డంతరిక్షమున కెగసిన.

3_4_019 క. పోవకు పోవకు మనుచు మ హా వీరుఁడు గద యమర్చి యమ్మణిమంతున్ లావరఁగ వైచె నగ్గద తో వాఁడును బడియెఁ బ్రతిహతుండై నేలన్.

3_4_020 క. పోర మణిమంతుఁ డిట్లు స మీరణ సుతుచేతఁ బ్రాప్తమృతుఁడై పడినన్ వారక పఱచిరి భయమున నారాక్షసు లార్తనాదులై తూర్పునకున్.

3_4_021 వ. అట ధర్మరాజు భీముండు పోయినవలను ద్రౌపదిచే నెఱింగి యార్ష్టిషేణుం డను మునివరునాశ్రమంబున ధౌమ్య ద్రౌపదీ ప్రభృతులంబెట్టి రోమశ నకుల సహదైవయుతుండై తద్గిరిశృంగం బెక్కి కుబేరసదన సమీంపంబున నిజ గదాఘాత పాతిత మణిమదాది రాక్షస దారుణ మధ్యంబున నున్న మధ్యము నొద్ధకుం జనియె నంత.

3_4_022 క. హతశేషులైన రాక్షసు లతిరయమునఁ బాఱి చెప్పి రప్పుడ యలకా పతికి సవిస్తరముగ నిజ మతిఁ బవనజు విక్రమంబు మణిమద్వధయున్.

3_4_023 వ. దాని విని కుబేరుండు విస్మితుండై యాత్మగతంబున.

3_4_024 క. తలకక మును సౌగంధిక ములు గొని యిప్పుడును దర్పమున నిందుల పు వ్వులు గొని మణిమత్ప్రభృతుల బలువుర వధియించె నెట్టి బలియుఁడో యనుచున్.

3_4_025 వ. సుర గరుడ గంధర్వ యక్ష రాక్షస సహితుండయి యక్షప్రభుం డరుగుదెంచి పాండవులం గని వారిలోన గదా కృపాణ బాణ బాణాసన ధరుం డయు రణ కాంక్షనున్న మహావీరు మారుతాత్మజుం జూచి పరమప్రీత చిత్తుం డయిన.

3_4_026 ఆ. అక్కుబేరునకున్ మహామతుల్ పాండవుల్ మ్రొక్కి రంత ధర్మమూర్తియైన ధర్మతనయుఁ జూచి తద్దయు దయతోడ నిట్టు లనియెఁ గిన్నరేశ్వరుండు.

3_4_027 వ. ఆయ్యా నీ యనుజుండు మత్ప్రియ సఖుండైన మణిమంతు వధియించి నా కపకారంబు సేసె నని లజ్జింప వలవ దది యగస్త్యు శాపనిమిత్తంబున నయ్యెనని భీమసేను డాయం బిలిచి నీ చేసిన సాహసంబు నా కుపకారంబు గావున నిన్ను మెచ్చితి ననిన నక్కుబేరునకుం గృతాంజలి యయి ధర్మతనయుం డిట్లనియె.

3_4_028 ఆ. ఇట్టి శాప మమ్మునీంద్రుడు దానేల యిచ్చె దాని నాకు నెఱుఁగఁ జెప్పు మనిన విస్తరించి యమరాజ సతునకు నక్కుబేరుఁ డిట్టు లనుచుఁ జెప్పె.

3_4_029 వ. తొల్లి కుశావతి యను పుణ్యనదీ తీరంబున నమరు లెల్ల సత్త్రయాగంబు సేయుచుండి నన్ను రావించిన నేనును బుష్పక విమానారూఢుండనై త్రిశత మహా పద్మ సంఖ్యల యక్షరాక్షస బలంబుతో గగనగతి నందులకుఁ బోవు నెడ నూర్ధ్వబాహుండై యమునా తీరంబున నుగ్రతపంబు సేయుచున్న యగస్త్య మహాముని మీఁద నా ప్రియసఖుం డైన మణిమంతుం డెఱుంగక నిష్ఠీవనంబు సేసిన నలిగి యమ్మునివరుండు నా కిట్లనియె.

3_4_030 ఆ. నీవు సూచుచుండ నీ యిష్టుఁ డిమ్మణి మంతుఁ డిపుడు దనదు మదము పేర్మి నన్ను నరయ కుమిసె నామీఁద కష్టదు ర్మదుఁడు పొలియ నొక్క మనుజు చేత.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com