ఆ భా 3 3 361 to 3 3 400

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


3_3_361 వ. దీని తీరంబున దేవర్షి గణంబులు దేవతార్చనంబులఁ జేయుదు రిందులజలంబు లమృతోపమానంబులు మఱి వైడూర్యనాళంబులై యపూర్వ సౌరభంబు లైన కనక కమలంబులు గలుగుటం జేసి యక్షరాక్షసాక్షోహిణీ రక్షితం బగు దీని మహిమం బెఱుంగక యింతదూరంబు వచ్చిన వీరుం డెవ్వండ వేమి కారణంబున వచ్చి తనిన వారికి భీముం డి ట్లనియె.

3_3_362 మత్తకోకిలము. ఏను బాండుసుతుండ భీముఁడ నిద్ధతేజుఁడ ధర్మరా జానుజన్ముఁడ ద్రౌపదీ హృదయ ప్రియం బొనరింపఁగాఁ బూని యిక్కమలాకరంబునఁ బుష్పముల్ గొన వచ్చితిన్ వీనిఁ గొందు నవశ్యమున్ సురవీరు లడ్డము వచ్చినన్.

3_3_363 వ. అనిన వార లిట్లని రయ్యా నీవు దివ్యపురుషుండ వీ సౌగంధిక కమలంబులు గొని యెదని కుబేరున కెఱింగించి తదాదేశంబునఁ గొనుము నీవు ధర్మజానుజుండవు గావున నీకు ధర్మపథంబు తప్పంజన దనిన రాక్షసులఁ గటాక్ష దృష్టిం జూచి భీమసేనుం డిట్లనియె.

3_3_364 క. గిరినిర్ఝరములఁ బుట్టిన సరోవరం బిదియు సర్వసామాన్యముగా కరుదుగ నొక్కనియదియే పరగఁ గుబేరుండు దీనిఁ బడసెనె మొదలన్.

3_3_365 తే. ఉత్తమ క్షత్త్రియుం డేల యొరుల నడిగి వేఁడువాఁడగుఁ దన భుజ విక్రమమున నన్యధనము లుపార్జించి యర్థిజనుల కిచ్చి కీర్తి దిక్కుల వెలయించుఁగాక.

- భీముఁడు యక్షరాక్షసులతో యుద్ధంబు సేయుట - సంత 3-152-12


3_3_366 వ. నాకు మిమ్మును మీ కుబేరుం బ్రార్థించి కాని యిక్కొలని పువ్వులు గొనంగాదొకో యని భీముండు రాక్షసుల నాదరింపక సౌగంధికా వనంబు సొచ్చి కనక కమలంబులుం గొని యుత్తమ వీర్యవంతంబు లైన తత్సలిలంబు లుపయోగించి యనంత బల సంపన్నుండై యున్న నాతనిం జూచి రాక్షసు లలిగి యుద్యతాయుధ హస్తులై తాఁకిన భీముండును భీకరాకారుండై.

3_3_367 చ. తనగదఁ జేసి రాక్షసుల దారుణ శస్త్రచయంబు నశ్రమం బున నతివీరుఁడై విరిచి పోర నిశాచరులన్ బడల్పడన్ ఘనభుజ దండచండహతిఁ గ్రాఁచిన నుక్కఱి రక్కసుల్ కుబే రున కెఱిఁగింపఁ బాఱిరి సరోష వృకోదర భీమ కర్మముల్.

3_3_368 వ. కుబేరుండును బాంచాలీ ప్రియకరంబైన పవనతనయు పరాక్రమారంభంబు విని మెచ్చి దాని నుపేక్షించె నట్లు భీమసేనుండు రాక్షససేన నోడించి సౌగంధిక కమలంబులు గొని తత్తీర కుసుమిత లతాపాద పవనంబున విహరించు చున్నంత నట.

3_3_369 క. వడిఁ బడియెఁ బిడుగు లుడుగక వడఁకె మహీతలము పాంసువర్షము గురిసెం గడు నెఱ్ఱనయ్యె దిశ లే ర్పడకుండె నినుండు తిమిర పటలావృతుఁడై.

3_3_370 వ. ఇట్టి మహోత్పాతంబు లుపలక్షించి విస్మితుండై ధర్మతనయుం డివి భీమాహవపిశునంబులై కానంబడియె నేమఱకుండవలయు నని నాలుగు దిక్కులుం జూచి భీమసేనుం గానక తన సమీపంబున నున్న పాంచాలి కిట్లనియె.

3_3_371 క. ప్రియ సాహసుండు భీముఁడు భయవిరహితుఁ డెందుఁబోయె బహురాక్షస సం శ్రయ మిగ్గిరి గంధర్వా న్వయం సేవ్యం బేకచరుఁడు వాఁ డెయ్యెడలన్.

3_3_372 ఆ. భూరిభుజుఁడు దానె పోయెనో నీ వెట యేని పుచ్చితో నిజేచ్ఛ నతని నని యజాత శత్రుఁ డడిగినఁ బతికిఁ బాం చాని యిట్టు లనియె సంభ్రమమున.

3_3_373 మధ్యాక్కర. ధరణీస నీకు నాయిచ్చిన పసిఁడి తామరపువ్వు గురువాయు వశమున వచ్చినను దానిఁ గొని యిట్టిపువ్వు లరుదు గాన కుఱంగటం గలిగెనేని యర్థిఁ దెమ్మనిన నరిగె నీశాను దిక్కునకు నీ తమ్ముఁ డతి వేగమునను.

3_3_374 వ. అనిన నట్లేని యందఱము వానిపోయిన వలనం బోవుద మని యెప్పటి యట్ల రాక్షస స్కంధారూఢులై గగనగతి నరిగి సౌగంధిక తీరంబున.

3_3_375 చ. అతుల బలాఢ్యు నుద్యతగదాయుధ హస్తుఁ బటుప్రతాపవ ర్ధితయశుఁ బాండునందనుఁ దదీయమహోగ్ర గదా విఘాతదా రిత పృథుయక్షరాక్షస శరీర చయంబులుఁ జూచి విస్మయ స్మితముకు లైరి బ్రాహ్మణ సమేతులు ధర్మసుతాదు లచ్చటన్.

3_3_376 వ. భీమసేనుండును ధౌమ్య ధర్మజ రోమశులకు మ్రొక్కి తనకు మ్రొక్కిన కవలఁ గౌఁగిలించుకొని వైడూర్యనాళంబు లైన కనక కమలంబులు ద్రౌపది కిచ్చి యున్నంత నాతనికి ధర్మరా జిట్లనియె.

3_3_377 ఆ. చనునె నీకు నిట్టి సాహస క్రియఁ జేయ నెల్లవారికంటె నెఱుక గలవు గురుభుజుండ నాకుఁ గూర్తేని చేయకు మయ్య యిట్టిచెయ్య లనఘ యింక.

3_3_378 వ. అని కఱపి యిట్లందఱుం గుబేరోద్యాన వనంబున విహరించు చున్నంతఁ దద్రక్షకులైన యక్షులు వచ్చి.

3_3_379 క. దేవర్షియైన రోమశు దేవేంద్రసమాను నయ్యుధిష్ఠిరు ధరణీ దేవోత్తములం గని విన యావనతులు భక్తి నిట్టు లని రందఱకున్.

3_3_380 వ. మీ రిందు మసల వల దిది యక్ష రాక్షస ప్రచార ఘోరంబని నందుండ నొల్ల పాండవులు తత్సమీపంబున నివాసంబుఁ జేసికొని రాక్షస బలంబుతో ఘటోత్కచుఁ బోవం బనిచి యుండు నంత జటాసురుం డను రాక్షసుండు బ్రాహ్మణ రూపధరుండై యేను వేదవిదుండ ధనుర్వేద విదుం డైన పరశురాము శిష్యుండ ననుచుం బాండవుల సేవించుచన్నంత నొక్కనాఁడు.

3_3_381 ఆ. మృగవిరోధి బలుఁడు మృగయా వినోదార్థ మడవి కనిలతనయుఁ డరిగినట్టి యవసరమున నజ్జటాసురుఁ డాసురాఁ కారవికృత రూపకంబుఁ దాల్చి.

3_3_382 క. చనుదెంచి ద్రౌపదిని యమ తనూజు నకులుం దదాయుధంబులతోఁ బె ల్చన యెత్తికొని మహాజన మునఁ బఱచె మహీసురోత్తములు భయమందన్.

3_3_383 వ. అంత సహదేవుండు భీముం బిలుచుచు వనంబున కరిగె నిట ధర్మతనయుం డధర్మవర్తియైన యసుర కిట్లనియె.

3_3_384 క. దేవాసురాదు లిం దుప జీవింతురు మనుజులకు విశేష సుఖంబుల్ గావించు చునమ్మనుజులఁ గావంగలవార మేము గౌరవ యుక్తిన్.

3_3_385 వ. ఇట్టి మా కపకారంబు సేయుట నీకు లగ్గు గాదు నీవు ధర్ము వెఱుంగవు విశ్వసించిన వారికిం గుడువం బెట్టిన వారికి నెగ్గసేయుట కడుం బాపంబు గావున.

3_3_386 మధ్యాక్కర. మాయావి మయాయుధములు మాకిచ్చి మాతో రణమ్ము సేయు మివ్విధమునఁ బోవఁ దగదంచుఁ జిక్కనై యసుర నాయతబాహుఁడు గరము భరముగా నదిమె ధర్మజుఁడు మాయావి యగువాని గమనవేగంబు మందమై యుండు.

3_3_387 వ. ఇట్లు ధర్మజు నిబిడ పీడన వేదనాభరంబున విగతవేగుండై యరుగు జటాసురున కడ్డంబు వచ్చి సహదేవుం డిట్లనియె.

3_3_388 క. నన్నెఱుఁగవె పాండవుఁడఁ బ్ర సన్న యశోవీర్య యుతుఁడ సహదేవుఁడ న త్యున్నతి యేర్పడ నిప్పుడ నిన్నోర్చెదఁ జక్క నెదిరి నిలువుము పోరన్.

- భీముఁడు జటాసురునితో యుద్ధము సేయుట - సం. 3-154-28

3_3_389 వ. అనుచున్న యవసరంబున ననిల సుతుం డనిల వేగంబున నరుదెంచి జటాసురుచేత నిగృహీతులై గగనగతిం జను ధర్మజు నకుల ద్రౌపదులను మహీతలగతుం డైన సహదేవుం జూచి యయ్యసుర కిట్లనియె.

3_3_390 తే. అతిథివై వచ్చి నీవు మాయందుఁ గుడిచి యసురవై యిట్ల యెగ్గ సేయంగ నగునె యెందుఁ గుడిచిన చోటికి నెగ్గుసేయ రెట్టి దుర్జను లైనను నెఱుక విడిచి.

3_3_391 వ. నీవు బుద్ధిగల వేని వీరిని విడిచి నీ ప్రాణంబులు రక్షించుకొను మట్లు గానినాఁడు బక హిడింబ కిమ్మీరులం జంపినట్లశ్రమంబునం జంపుదు ననిన విని జటాసురుండు వారల విడిచి భీమసేనున కభిముఖుండై.

3_3_392 క. రయమున నీచేత నిహతు లయిన సురారాతులకు రణాంతరమున నీ దయిన రుధిరమున నుదక క్రియఁ జేసెద బక హిడింబ కిమ్మీకులకున్.

3_3_393 క. అనుచుఁ గడు నలిగి మారుత తనయు మహాబాహు నసుర దాఁకె మరున్నం దనున కెడసొచ్చి మాద్రీ తనయులు తత్క్షణమ వానిఁ దాఁకిరి వీఁకన్.

3_3_394 సీ. వాపల నిద్దఱ వారించి భీముండు దాఁకె జటాసురు వీఁకతోడ భీమాసురులకు సంగ్రామంబు గడుఘోర మయ్యె నిర్మూలంబులయ్యె వారి యూరుఘట్టనముల ధారిణీ రుహములు పద ఘట్టనములఁ గ్రక్కదలె ధరణి భూరుహ పాణులై పోరి యాసన్న భూరుహములు వొలిసిన బృహదుదగ్ర

ఆ. శిలలఁ గొంతసేపు చెలఁగి పోరాడి రొం డొరులు పెనఁగి పట్టి పరుషభంగి నుగ్రు లైన వాలి సుగ్రీవు లట్టుల యుద్ధ మొప్పఁ జేసి రిద్ధబలులు.

3_3_395 క. భీమాసుర వీరుల ము ష్టాముష్టి రణచ్ఛటచ్ఛాటా సబ్దం బు ద్దామంబై తద్విపిన మ హా మృగపక్షులకు నతి భయావహ మయ్యెన్.

3_3_396 ఆ. అంత భీమసేనుఁ డంతకాకారుఁడై వాని బలవిహీనుఁ గా నెఱింగి తడయ కపుడు వాని మెడగ్రుంగఁ బిడికిటఁ బొడిచె నసుర ముడిఁగి పడియెఁ బుడమి.

3_3_397 వ. ఇట్లు నిర్ఘాతనిపాత భిన్నోన్నత నీలగిరి శృంగంబునుం బోలె నేలఁ బడిన జటాసురు శరీరం బెత్తి యొక్క విశాల పరుషపాషాణంబు పై జర్జరితంబుగా వైచి వానిం గాలగోచరుంగాఁ జేసిన వాయుపుత్త్రు పరాక్రమంబు ధౌమ్యరోమఖాది మహీసురవరులు వర్ణించి రని వైశంపాయనకథితం బైన కథ రమ్యంబుగ.

3_3_398 క. భూపకులతిలక నృపవి ద్యాపారగ నిత్యసత్యధనధాన్య దయా లాపచతురాస్య ధర్మ వ్యాపార విచార విష్ణువర్థన నృపతీ.

3_3_399 వసంత తిలకము. శ్రీరమ్య రాజకులశేఖర రాజరాజా భూరి ప్రతాప పరిభూత విరోధి వర్గా హారామృతాబ్జహర హాసతుషారకుంద స్ఫారద్యశః ప్రసర పాండుకృత త్రిలోకా.

3_3_400 గద్యము. ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునందారణ్య పర్వంబున దధీచి కథ యును నగస్త్యు మాహాత్మ్యంబును భగీరథు ప్రయత్నంబునుం గంగావతరణంబును ఋశ్యశృంగు చరితంబును బరశురాము చరితంబును గార్తవీర్యు వధయును రామకృష్ణాదుల యాగమంబును సౌకన్యాఖ్యానంబును జ్యవనుండు సంయాతి యజ్ఞంబున నశ్వినుల సోమపీథులం జేసి వారిచేత జవ్వనంబు వడయుటయు మాంధాతృ జన్మంబును సోమకుండు యజ్ఞంబుఁ జేసి పుత్త్రశతంబు వడయుటయు జంతూపాఖ్యానంబును శ్యేన కపోతంబులై యింద్రాగ్నులు శిబి మాంసంబు గొనుటయు నష్టావక్రు మాహాత్మ్యంబును రైభ్య యవక్రీతుల సంవాదంబును భీముండు సౌగంధిక హరణార్థం బరుగుటయు హనుమద్దర్శనంబును రామాయణ కథయును భీముండు గంధమాదనంబునం దుండుకొలనికిం బోయి యక్ష రాక్షసుల వధియించుటయు గంధమాదనంబున నందఱుం గూడుటయు జటాసుర వధయు నన్నది తృతీయాశ్వాసము.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com