ఆ భా 3 3 301 to 3 3 330

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


3_3_301 వ. దాని నాశ్వాసించి ధర్మరాజు భీమున కిట్లనియె.

3_3_302 క. ఈ రాజపుత్త్రిఁ దోడ్కొని దారుణ పాషాణ దుష్పథంబులఁ జనఁగా నేర మిది నడువ నోవదు భూరిభుజా యనిన ననిలపుత్త్రుం డంతన్.

3_3_303 క. అగ్రజు ననుమతమున న త్యుగ్ర నిశాచర సమేతు నుడుమార్గగు వీ రాగ్రణి ఘటోత్కచుం దన యగ్రసుతుం దలఁచె ధీరు హైడింబు వెసన్.

3_3_304 క. అతఁడును రాక్షస సైన్యా న్వితుఁడై తత్క్షణమ వచ్చి నిర్జర వరస మ్మితులకుఁ బ్రణమిల్లెం దన పితృవరులకు బ్రాహ్మణులకుఁ బెద్దయు భక్తిన్.

3_3_305 వ. ఇట్లు మ్రొక్కి పని యేమని ముకుళిత హస్తుం డయు తన ముందర నున్న కొడుకుం గౌఁగిలించుకొని భీముండు వాని కిట్లనియె.

3_3_306 తే. అబల యిది భవన్మాత నిత్యాధ్వగమన ఖిన్నయైనది గజరాజ ఖేలగమన దీని నీ వెత్తికొని చనుదెమ్ము మాస మీపమున నని సుతు నియమించె నపుడు.

3_3_307 వ. వాడును బితృవచన చోదితుండై యిమ్మార్గం బతి పరుష శిలా విషమంబు పాదచారుల కగమ్యంబు గావున మిమ్మందఱ నెత్తికొని యశ్రమంబున నరిగెద నని ధౌమ్య పాండవ ద్రౌపదులం దా నెత్తికొని బ్రాహ్మణుల నెత్తి కొనందన రాక్షస బలంబులం బంచె రోమశుండు సిద్ధగతి నరిగె నిట్లందఱు గగన మార్గంబునం జని గంగాతీరంబున నర నారాయణాశ్రమం బైన బదరీ వనంబుఁ గని రాక్షసస్కంధావతీర్ణులై యందు.

3_3_308 క. లలిత మధు స్రవఫలమును విలసిత మృదు పత్రతతులు వృత్తస్కంధం బులు నవి చలితచ్ఛాయలు గల బదరీతరులఁ జూచి కడు విస్మితులై.

3_3_309 వ. సురసిద్ధముని సేవితం బయిన భాగీరథిం జూచి యందుఁ గృతస్నానులయి నియమవ్రతంబులు సలుపుచు సమాధియోగంబున మైనాక శైలంబును హిరణ్యశృంగంబును బిందు సరంబునుం జూచి బదరీ వనంబునం దాఱు దివసంబులు నివాసంబు సేసి యుండు నంత నొక్కనాఁడు.

3_3_310 చ. అలఘుల గంధమాదన మహాధరణీధరసాను రత్న వే దులఁ బవమాన నందనుఁడు ద్రోవదియున్ విహరించుచున్నచో లలిత సహస్ర పత్ర కమలంబులు సమీర విధూతమై మహీ తలముపయిన్ వడింబడియెఁ దద్దయుఁ బొల్పుగ వారి ముందటన్.

3_3_311 వ. ఆ సౌగంధిక కమలంబుఁ జూచి దాని యపూర్వ రమణీయత్వంబునకు ననన్య కుసుమ సాధారణం బయిన సౌరభ్యంబునకు నోటువడి ద్రుపదరాజపుత్త్రి ముదిత చిత్తయై యక్కటా యిది యొక్క పువ్వ యయ్యు నపూర్వంబై మనోనయనానందకరం బైనది యిట్టి కుసుమంబులు కడుం బెక్కులు గావలదె యవి కురంగటం గ లవేని తెచ్చియిచ్చి నాకు మనః ప్రియంబుఁ జేయుమని యప్పుడ యప్పువ్వు ధర్మరాజు కడకుం గొనిపోయె నిట భీముండు దాని యభిమతంబుఁ జేయం గడంగి రుక్మపుష్ఠంబైన ధనుశ్శ్రేష్ఠంబును నాశీవిషోపమానంబు లైన బాణంబులు ధరియించి యక్కమలంబు దెచ్చిన గాడ్పున కభిముఖుండై గంధమాదనంబున వివిధ రత్న బంధుర కందర కదళీషండ దర్శనంబులను మందాల మందిర సుగంధి గంధ సహస్పర్శనంబులను నలికుల కోకిలాలాప శ్రవణంబులను సర్వర్తుకుసుమ సురుచిర గంధాఘ్రాణంబులను నతి మధుర ఫలాస్వాదనంబు లను బద్ధ ప్రమోద హృదయుం డగుచుఁ దన కెదిరి వచ్చు మృగంబులం దాఁకి గజంబు నెత్తి గజంబుపై వైచుచు సింహంబు నెత్తి సింహంబు పై వైచుచు నల్ప మృగంబులం గరతలప్రహారంబులం బ్రహరించుచు.

- భీముఁడు సౌగంధిక హరణార్థంబు పోవుట - సం. 3-146-292

3_3_312 సీ. గమనవేగంబున ద్రుమలతాజాల సంచాలన సేయుచు శైలగుహల నడఁగి యదృశ్యులై కడు వేడ్కతోఁ దన్నుఁ జూచు ఖేచర సిద్ధ సుర భుజంగ గరుడ గంధర్వ కిన్నర కామినుల చేత మానుగా నభివీక్ష్యమాణుఁ డగుచు మ్రాఁకులు విఱుచుచు వీఁకతోఁ దీగలు పెఱకుచుఁ బదహతిఁ బృథునగేంద్ర

అ. మద్రువ నున్నతంబు లయి నెడలెక్కుచు మదగజంబువోలె మధ్యముండు పవన వైనతేయ పటుజవ యుక్తుఁడై యరిగె గంధమాదనాంతరమున.

3_3_313 వ. ఇట్లరువాఁడు నిజ సింహనాద శ్రవణపరిత్రస్తంబులై యెగసి పఱచు పక్షుల యార్ద్రపక్షంబులఁ జూచి ముందట నాసన్నంబునం గొలను కలువలయు నని యుపలక్షించి యతిత్వరితగతిం జని పవన వశసంచలిత తట మహావన తమాల తాల హింతాల విశాక కదళీదళ వీజ్యమాన శీతల జల పరిపూర్ణంబైన యొక్క సరోవరంబుఁ గని యందుఁ గృతావగాహుండై నవ నలినదళ మృణాలవలయాలంకృతు డగుచు దాని వెలువడి యనేక యోజన విస్తారాయామ రమణీయం బైన కదళీషండంబుఁ జొచ్చి యందు శంఖధ్వానంబుఁ జేసిన.

3_3_314 క. ఆ శంఖ రవంబు మహేం ద్రాశనినిర్ఘోష భీమ మై దిక్కులు నా కాశంబు నిండె నంత గు హాశయుఁడై యున్న హనుమ యను కపి పెలుచన్.

3_3_315 క. దాని విని బెదరి లేచి మ హానాదం బిది మనఃప్రియం బయ్యె మదీ యానుజు శంఖధ్వానము దా నగు నని యెఱిఁగి హృష్టతనురుహుఁ డగుచున్.

3_3_316 వ. భీమునకు మార్గనిరోధంబుగా మహావృభంబు లురులం ద్రోచి యేకాయన పథంబున కడ్డంబుగా శయనించి లాంగూల లీలాచాలనంబుఁ జేసిన.

3_3_317 క. గోలాంగూలోత్తము లాం గూలస్ఫోటనపవంబు ఘోరంబై వా చాలతఁ జేసె నశేష మృ గాని భయం బంద గిరి గుహాంతరమురులన్.

3_3_318 వ. అయ్యపూర్వధ్వని విని భీముండు విస్మితుం డయి చని కదళీషండ మధ్యంబున నొక్క విశాల శిలా తలంబులయి శయనించిన వాని.

3_3_319 సీ. హ్రస్వపీన గ్రీవు నచలితాయత హను నతి చపల స్వభావాభిరాముఁ దను మధ్య కటిచక్రు దహన కణాకార తామ్రోష్ఠు నతి కృశదశనకరజుఁ బృథున విద్యుత్పుంజ పింగాక్షు నుత్తుంగ దృఢ వక్షు నాజాను దీర్ఘ బాహు నుర్ధ్వలాంగూల మత్యున్నత ధ్వజలీలఁ గ్రాలు చునుండ నేకాతం యేగ

ఆ. నిద్రనున్న ధర్మనిర్మలు హనుమంతుఁ జూచి పాండురాజసుతుఁడు వాని నిద్రఁ జెఱుపఁ గడణగి నిజ సత్త్వ మేర్పడ సింహనాద మొప్పఁ జేసె డాసి.

3_3_320 వ. హనుమంతుఁడును మెల్ల మెల్లన మేల్కని జృంభ సంభృత జలార్ద్ర సంచల విలోచనుం డగుచు ననాదరంబున నాతనిం జూచి యిట్లనియె.

3_3_321 తే. అతి జరారోగ భరమున నలసి యొలసి యొదిఁగి సుఖనిద్రమై నిట్టు లున్న వానిఁ గడు మదంబున నేమియుఁ గరుణ లేక యేల బోధించితయ్యా నీ వెఱిఁగి యెఱిఁగి.

3_3_322 వ. తిర్యగ్జాతులు ధర్ము వెఱుంగవు గాక సర్వభూత దయా స్వరూపం బైన ధర్ము వెఱింగెడు వారు మనుష్యుల కారె యిట్టి మనుష్య జన్మంబు వడసి వృద్ధాపసేవ సేయవు గాకేమి ధర్ము వెఱుంగక నిర్దయుండవై మాబోఁటి పేద మృగంబులకు భయంబుగ గర్జిలితి వీ వెవ్వండవు మనుష్య గోచరంబు గాని యివ్వనంబున కేల వచ్చితి సిద్ధగతి లేనివారి కిట వోవ నశక్యం బమృత కల్పంబు లైన యీ ఫలమూలంబు లుపయోగించి క్రమ్మఱుము నీ యందు బద్ధస్నేహుండఁ గాన బుద్ధి సెప్పితి నా పలుకులు చేకొను మనిన భీము డిట్లనియె.

3_3_323 తే. క్షత్త్రియ ప్రవరుంజడ విఖ్యాత బలుఁడఁ బాండు తనయుండ గొంతి గర్భంబునందు వాయువరమునఁ బుట్టిన వాఁడ నన్ను భీముఁ డండ్రు భూజనులు కపి ప్రభుండ.

3_3_324 వ. ఏ నిక్కడఁ గార్యార్థినై పోయెద నాకుం దెరు వి మ్మీనినాఁడు దొల్లి శతయోజన విస్తారం బయిన సముద్రంబు లంఘించి లంకకుం బోయిన హనుసంతు నట్ల నిన్ను నీ పర్వతంబు లంఘించి పోదు ననిన హనుమంతుఁ డతండేమి కారణంబున సముద్ర లంఘనంబుఁ జేసె నెఱుంగుదేనిం జెప్పు మనిన వానికి భీముం డిట్లనియె.

3_3_325 క. అలఘుం డిక్ష్వాకు మహా కుల వీరుడు రాఘవుండు గురు వచనంబునన్ సలుప వనవాసియై తన లలనం గోల్పడియె నట్టె లంకేశ్వరచేన్.

3_3_326 క. సీతాన్వేషణ పరులై నీతిఁ గపి ప్రవరు లరిగి నిరతంబుగ సం పాతి యను పక్షిచేత మ హీ తనయ సువార్త లెల్ల నెఱిఁగి కడంకన్.

3_3_327 క. వారలు వారిధి గడవఁగ నేరక తారున్న యెడ ననిల సత్త్వమునన్ వారిధి లంఘించె మహా వీరుఁడు హనుమంతుఁ డనఁగఁ విందుఁ గపీంద్రా.

3_3_328 వ. ఏను హనుమంతు నంతియ బలపరాక్రమంబులు గలవాఁడ నా పౌరుషంబుఁ జూపుదునే యనిన నవ్యక్తహాసముఖుం డగుచు నన్నా యేను ముదిసిన వాఁడ లేవ నోపం బోయెదవేని నాతోఁకం బాయంద్రోచి పొమ్మనిన మెచ్చక తమవామ కరంబున నెత్తం బోయి వశంబు గాక.

3_3_329 ఉ. ఏపున రెండు చేతులను నిమ్ముగఁ బట్టి యమర్చి యెత్తగా నోపక మొగ్గతిల్లఁబడి యుద్గతఘర్మ జలార్ద్ర దేహుఁడై కాపురుషుండుఁ బోలె నిజ గర్వము దక్కి యడంగి యుండెఁ జిం తాపరుఁడై వృకోదరుఁడు దద్దయు లజ్జ నధోముఖంబుతోన్.

3_3_330 వ. ఇట్లక్కపివరు లాంగూలంబుఁ గదల్ప నోపక భీముండు కృతప్రణాముండయి నిన్నెఱుంగక నా పలికిన దురుక్తంబులు సహింప వలయు నీవు కపి రూపధరుండ వైన సిద్ధుండవో గంధర్వుండవో దేవవరుండవో నాకెఱింగింపు మనిన హనుమంతుండు భీముం జూచి నగుచు నేను గేసరి క్షేత్రంబున వాయుభట్టారకునకుం బుట్టినవాఁడ నీ చెప్పిన హనుమంతుండ నీవు నా యనుజుండవు దొల్లి రఘుకులేశ్వరుం డయిన రామదేవుండు రావణుం డను రాక్షసుచేత నపహృత భార్యుండై సుగ్రీవాది వానరుల నసంఖ్యాత సంఖ్యల వారిం దనకు సహాయులం జేసికొని సేతుబంధనంబున సముద్రంబు లంఘించి సమరంబున రావణు వధియించి యందు నా కెలసంబునకు మెచ్చి.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com