Jump to content

ఆ భా 3 3 271 to 3 3 300

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


3_3_271 ఆ. మునికుమారు నెగిచికొని వచ్చి నిశితశూ లాయుధమునఁ బొడిచి యాసురమున రక్కసుండు చంపి యక్కాంతయును దాను నరిగె రైభ్యు కడకు నక్షణంబ.

3_3_272 వ. రైభ్యుండును వానికి భార్యగాఁ గృత్తి నిచ్చె నంత నిట భరద్వాజూండు వనంబునుండి వచ్చి తనకెప్పుడుం బ్రత్యుత్థానంబుఁ జేయునగ్ను లప్పు డడంగియున్న నచ్చెరువడి గృహపాలకుం డైన శూద్రువలన నంత వృత్తాంతం బెఱింగి నిహంతుం డైన పుత్త్రుం జూచి దుఃఖితుండై.

3_3_273 ఆ. రైభ్యుఁ డధిక కోపరతుఁ డంటి నమ్ముని యాశ్రమంబు దెసకు నరుగ వలన దంటి వినఁగ నొల్లవైతి నా పలుకులు గర్వితునకు బుద్ధిగాననగునె.

3_3_274 వ. అని ప్రలాపించుచు భరద్వాజుండు వాని దహించి పుత్త్రశోకదహనంబు సహింప నోపక తద్దహనంబున దేహత్యాగంబుఁ జేసె నంత బృహద్ద్యుమ్నుం డను రాజు సత్రయాగంబుఁ జేయుచుండి రైభ్యపుత్త్రుల నర్థావసు పరావసులం దనకు ఋత్విజులంగా వరియించిన నయ్యిరువురుఁ దండ్రిసే ననుజ్ఞాతులై వాని యజ్ఞంబు నడుపుచుండి యొక్కనాఁడు పరావసుండు నిజాశ్రమంబునకు వచ్చువాఁడు వేగుఁబోక చీకఁటి నడవిలో నేకతంబ తనకు నెదురుగా వచ్చు రైభ్యు నెఱుంగక మృగంబగా వగచి నిజ ప్రాణ భయంబున వధియించి పదంపడి యెఱింగి పరమ దుఃఖితుండై ప్రేత కార్యంబులు దీర్చి బృహద్ద్యుమ్ను సత్రంబునకు వచ్చి తన చేసిన పితృఘాతం బగ్రజునకుం జెప్పి యిట్లనియె.

3_3_275 తే. నీవు దీని నొక్కరుఁడవు నిర్వహింప నోప వేనొక్కరుండ నయ్యును గడంగి నడప నోపుదుఁ గావున నాతదర్థ మాచరింపుము బ్రహ్మహత్యా వ్రతంబు.

3_3_276 వ. అనిన నర్థావసుం డట్లు సేయుదు నని బ్రహ్మ హత్యా వ్రతంబులు సలుపుచుండెఁ బరావసుండును నొక్కరుండ సత్రయాగంబు జరుపుచుండె నంత నర్థావసుండు బ్రహ్మ హత్యా ప్రాయశ్చిత్తంబులఁ జేసి యా సత్రయాగంబునకు వచ్చిన వానిం జూచి పరావసుండు బృహద్ద్యమ్నున కిట్లనియె.

3_3_277 క. ఇమ్ముని నీయజ్ఞాయత నమ్ముఁ బ్రవేశింపఁ దగఁడు నరనాయక యు గ్రమ్ముగ సలిపెడు శుభ కా ర్యమ్ములకుం బాసి బ్రహ్మ హత్యా వ్రతముల్.

3_3_278 వ. అనవుడు బృహద్ద్యమ్నప్రేరితు లయిన జనుల చేత నుత్సార్యమాణుండయి యర్థావసుం డనియెఁ బరావసుండుగాని యేను బ్రహ్మఘాతకుండఁ గాను వానికై వ్రతంబు సలిపి తత్పాతక విముక్తుఁ జేసితి నని చెప్పిన యర్థావసు యథార్థకథనంబునకు మెచ్చి యగ్నపురోగములైన దేవతలు వాని కిట్లనిరి.

- దేవత లర్ధావసునకు మెచ్చి కోరిన వరంబు లెల్ల నిచ్చుట - సం. 3-139-18

3_3_279 తే. తమ్ము చేసిన దురితముల్ తలఁగఁ బూని ధర్మబుద్ధివై వ్రతములు పేర్మిఁ జలిపి తనఘ నీకు నభీష్టంబులైన వరము లడుగు మిచ్చెద మీ మెచ్చు గడవ నగునె.

3_3_280 వ. అనినఁ దనతండ్రియు భరద్వాజుండును యవక్రీతుండు నెప్పటియట్ల జీవించి యుండను నిజ జనకుండు పరావసుచేత నిహతుండగుట నిస్తరింపను వలయునని ప్రార్థించి దేవతల వరంబున నర్థావసుండు రైభ్య భరద్వాజ యవక్రీతుల సంజీవితులం జేసిన నద్దేవతలకు యవక్రీతుం డిట్లనియె.

3_3_281 తే. ఏను బహువేద శాస్త్రమ్ములెఱిఁగి వ్రతము లెల్లఁ జేయుచు రైభ్యుచే నిట్లు హతుఁడ నైతి నాకంటె రైభ్యున కధిక శక్తి యైన తెఱఁ గెట్టు లనిన నిట్లనిరి సురలు.

3_3_282 క. గురుశుశ్రూష యొనర్చుచుఁ బరమక్లేశమునఁ జేసి వడసివిద్యల్ స్ఫురియించుఁగాక గురుముఖ విరహితముగఁ బడసినవియు వెలయునె యెందున్.

3_3_283 వ. నీవు గురుముఖంబునం బడయక యొండు విధంబునం బడయుటం జేసి నీ యధ్యయన శ్రుతంబులు నిర్వీర్యంబు లయ్యె గురుసంతోష కరుండై రైభ్యుండు బ్రహ్మజ్ఞానం బుపార్జించెం గావున నాతం డిట్టిశక్తి వడసెనని దేవతలు దివంబున కరిగి రిది యవక్రీతు నివాసం బిందు వసియించినవారు దురిత విముక్తు లగుదు రిది కాలశైలం బిది సప్తవిధం బైనగంగ యిది మనుష్యుల కగోచరం బిందయుండి సమాధి శౌచపరులై చూడుం డిది మందరనగం బిందు నానాప్రహరణపాణులై యష్టాశీతిసహస్ర గంధర్వులు కిన్నర కింపురుష సుపర్వులు సురేంద్రునిఁ గొలిచి బోయెద రిందుల కాఱు నూఱుయోజనంబులు గలదు కైలాస పర్వతం బిందుఁ గుబేరుం డుండు నని రోమశుండు సెప్పినం బాండవులు కృతసమాధిశీలురై వానినెల్లం జూచిరంత నంతకసుతుండు భీమున కిట్లనియె.

3_3_284 సీ. దుర్గమం బైన యీ దుర్గమార్గంబున నడవంగ నేర మున్నత రథముల నింద్రసేనాదుల నీ ధౌమ్యవిప్రుల ద్రుపదతనూజను దోడికొనుచు సహదేవుఁడును నీవు చట్టనఁ గ్రమ్మఱుఁ డేనును నకులుండును నేఁగి రోమ శాదేశమునఁ జేసి యఖిలతీర్థంబులు నాడి వచ్చెదము మా యరుగుదెంచు

ఆ. నంత కెంతయును బ్రయత్నంబుతోఁ గృష్ణ గాచియుండుఁ డనిన ఘనుఁడు భీముఁ డనియె నిట్టి రాక్షసాకీర్ణ వనములో నిన్నుఁ బాయనగునె నిమిష మేని.

3_3_285 చ. అనఘచరిత్రు నర్జును మహాభుజు నొక్కనిఁ బాసి వంతఁ బొం దిన యెడ నిట్టిచోట సహదేవుఁడు నేనును గృష్ణయున్ జగ జ్జననుత నిన్నుఁ బాసిన నసహ్యతరం బగు తీవ్రతాప వే దన యగు నీకు మాకు నుచితంబె పరస్పరభేద మెన్నఁడున్.

3_3_286 క. కడు డస్సి నడవనోపని యెడ నీ కమలాయతాక్షి నీకవలను నే దడయక నఱకట నిడికొని కడఁకం గొనివత్తు విషమగహనాంతములన్.

3_3_287 వ. ఈ రథంబులతోఁ బోవ నిమ్ముగాదేని వీని నింద్రసేనాదుల నెందేని బెట్టి పోదమనిన రోమశుం డిట్లనియె.

3_3_288 క. అతుల తపోవీర్యబలో న్నతి పోదము గంధమాదవంబునకు సమా గతు నందుఁ గాంతు మర్జును నతివీరు నుదారు సురగణార్చితుఁ బార్థున్.

3_3_289 వ. అనిన నందఱు సంతసిల్లి యరుగువారు ముందర ననేక సహాయ రథసనాతంబై యపారకిరాత బలసంకులం బైన దానిఁ బుళిందాధిపతియైన సుబాహు పురంబుఁ గని యందు వానిచేతం బూజితులై తమ రథసూత హయనివహంబుల నింద్రసేనాది భృత్యులను సుబాహునొద్దం బెట్టి పాదాచారులై పాంచాలిని బ్రాహ్మణులను రక్షించికొని గంధమాదవంబున కభిముఖులై యరిగి రంత ధర్మతనయుండు భీమున కిట్లనియె.

3_3_290 సీ. అలిగి వజ్రాయుధునైనను బోరిలో నోర్వంగనోపు నత్యుగ్రవీరు జపమునఁ బవనుఁ దేజంబున నాదిత్యుఁ బోలినవాని నంభోజనేత్రు నాయతబహుఁ గృతాస్త్రు సింహ స్కంధు సర్వధనుర్ధరాచార్యు విజయు నిత్యక్షమాన్వితు నీ తమ్ము నర్జును శుభగుణసుందరుఁ జూచునంత

ఆ. కధికతాపతప్తమైనది నా చిత్త మొనర నతనితోడ నొక్కటునికి యెన్నఁడొక్కొ మనకు నిందఱకగు నాతఁ డేల మసలెనొక్కొ యిన్నియేండ్లు.

3_3_291 మ. అనుచుం బార్థవిలోకనంబు మదిలో నర్థింపఁగా ధర్మజుం డనవద్యుల్ గడువేడ్కతో నరిగి తా రప్పాండవుల్ గంధమా దనశైలేంద్రముఁ గాంచి రున్నత బృహద్ధాతుస్థలీ సంహతిన్ ఘన సంధ్యాగమ శంక సన్మునులకుం గావించు దానిన్ మహిన్.

3_3_292 క. నానావర్ణ శిలావిహ గానేక మృగాభిరామ మై భూనారీ నానాభరణ విభూషిత పీనోన్నత కుచముఁ బోలె వెలిఁగెడు దానిన్.

- పాండవులు గంధమాదన పర్వతంబునకుం బోవుట - సం. 3-143-1

3_3_293 క. లలితాచ్ఛ స్ఫటిక శిలా తలములపైఁ బాఱువిమలతర నిర్ఝరిణీ జలపూరములను తారో ల్లలదురుహారాని నుజ్జ్వలం బగుదానిన్.

3_3_294 ఉ. వారలు గంధమాదవ మవార్యబలాఢ్యులు సొచ్చచో మహా మారుత మప్డు వీచె నహిమద్యుతిమార్గము దిఙ్ముఖంబు లన్ భూరుహపత్ర మిశ్ర మయి భూరిపరాగము గప్పఁగా ధరి త్రీరుహ శాఖలున్ విఱిగి త్రెళ్ళఁగ గుల్మలతాలి సాల్పడన్.

3_3_295 చ. కడు వడి గాడ్పుచే విఱుగఁగాఁ బడి త్రెళ్లు మహీపుహాళి చ ప్పుడు విని యందఱుం జెదరి భూమిపయిన్ గగనం బుదగ్రతం బడియెనొ శైలశృంగములు భగ్నము లయ్యెనొ యంచు ధూళి నె క్కడఁ జననేర కొండొరులఁ గానక యుండిరి సంచలాత్ములై.

3_3_296 వ. ఇట్లు మహారేణుపటలం బంధకారంబునుం బోలె నీరంధ్రంబై కప్పినఁ బతితతరువిటపలతా గల్మంబులు కరతలంబులం బాయం ద్రోచుచు విశాల దృఢతరుమూలంబు లాశ్రయించి యగ్నహోత్రంబులతో ధౌమ్య ధర్మజ సహదేవు లొక్కచోట నుద్యద్గదాకార్ముకుం డైన భీమసేనుండును ద్రౌపదియు నొక్కచోట రోమశుండును నకులుండును బ్రాహ్మణులు నొక్కచోటనుగా నందఱు వేఱువేఱ యుండి రంత.

3_3_297 చ. కురిసెఁ బ్రచండవృష్టి ఘనఘోషము లెల్ల కెలంకులన్ భయం కరములుగాఁ గరాళకరకాతతు లొప్పఁ దటిల్ల తాళి వి స్ఫురితముగాఁ బ్రపూర్ణ జలపూరము లన్గిరి కుంజభూరిని ర్ఝరోతటినీతటీనికటసాల చయంబు విమూలితంబుగన్.

3_3_298 వ. అట్లు గాడ్పుతోడివాన పెద్దయుం బ్రొద్దు కురిసి యుడిగిన నందఱు నొక్కచోటికి వచ్చి యెప్పటియట్ల యరుగునెడ నతివిషమ శిలాసంకట పథంబున నడవనేరక ద్రౌపది తొడరి పడి మూర్ఛితయైనం బవనతనయుం డక్కోమలి నెత్తికొని యజినాస్తరణంబు పయిం బెట్టి కదళీదళంబుల వీచుచున్నం గవలు దాని పల్లవతామ్రపాదతలంబు లాయుధాభ్యాసవశం రట్టియవసరంబున ద్రౌపదిం జూజి దుఃఖితుం డయి ధర్మతనయుం డిట్లనియె.

3_3_299 ఆక్కర. అరుణసరోరుహ దళ మృదువు లైన యీతన్వి రమ్య చరణతలంబులు గొడిగరాలపైఁ జనుచున్కిఁ జేసి పరుసంబు లై కడు నెఱ్ఱనైనవి పద్మాజతాక్షి పరగ నాకారణంబునను నీ దుఃఖభారంబు దాల్చె.

3_3_300 సీ. సముచితంబగు మృదుశయన తలంబున శయనించు నిత్తన్వి సదనులాంగి పరుసంపుఱాలపైఁ బడి తీవ్రవేదనఁ బొందినయది మహాపురుషులైన పాండవులకుఁ బ్రియభర్యయై నా పుత్త్రి సుఖముండునని మది సోమకుండు పాయక సంతోష పడియుండుఁ గాకున్నె యని విలాపించు నయ్యమతనూజ

ఆ. నుచిత పచర రచన నూరార్చి రప్పుడు ధౌమ్యుఁదొట్టి సకల ధరణి సురులు మూర్ఛదేఱె నంత ముదిత ద్రౌపది శీత మందపవన సేవ్యమాన యగుచు.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com