ఆ భా 3 3 241 to 3 3 270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_3_241 క. ధరణిఁగడుఁ బేదవారును బురిటికి ఘృతతైలధాన్యములఁ జెచ్చెర ముం దర సంగ్రహింతు రవి మన కరయగ నతిదుర్లభంబు లర్థములేమిన్.

3_3_242 వ. ఏమిసేయుదు నెవ్విధంబున నీ ప్రసవ క్లేశంబు వలనఁ బాయుదుననిన ఏకపాదుండు ధనార్థియయి జనకరాజుపాలికిఁ జని వాని యజ్ఞంబునందు వరుణపుత్త్రుంజైన వందితో వివాదంబన సేసి యోటువడి జలమగ్నుండై యున్న నిట సుజాత ప్లసూతియై యష్టావక్రుం గనియెఁ దత్కాలంబున సుద్దాలకు భార్య శ్వేతుకేతుం గనియె నిట్లు మాతులభాగినేయు నిద్దళు సవయస్కులై పెరిఁగి పండ్రెండేండ్లొక్కట సుద్దలకుతోఁ జదివి యధ్యయన శూరలై రందు.

3_3_243 తే. తండ్రియనుచు సుద్దాలకుఁ దనకు గరము ప్రీతితో శ్వేతకేతుని భ్రాత యనుచు ననఘచరితుఁ డష్టావక్రుఁ డనుదినంబు నొండెఱుంగక సుఖలీల నుండు నంత.

3_3_244 వ. ఒక్కనాఁ డూద్దాలకు కురునెక్కియున్న యష్టావక్రుం జూచి శ్వేతకేతుండు సహింపక నీవేల మాయయ్య కురు వెక్కియుండె. దీవు మీ యయ్య కురు వెక్కుమని చేయిపట్టి యీడ్చిన నేడ్చుచుం దల్లికడకుం జని యష్టావక్రుం డిట్లనియె.

3_3_245 క. మాయయ్య యెవ్వ రెక్కజఁ బోయిర సెప్పుమని తెల్లముగ నడిగి తన శ్శ్రీయుతుఁడు దండ్రికడకుం బోయెం దన మామ నెయ్యమునఁ దోడ్కొనుచున్.

3_3_246 వ. ఇట్లష్టావక్రుండు దానును శ్వేతకేతుండును జనక రాజు యజ్ఞంబునకుం జని యందు దౌవారిక నివారితలై ముకాంధబధిరపంగు స్త్రీబ్రాహ్మణ సుప్రవేశంబుగచున్న యీరాజద్వారంబున మమ్ము విద్వాంసుల బ్రాహ్మణుల నేల వారించెద రనిన దౌవారికుం డిట్లనియె.

3_3_247 క. అలఘులగు వృద్ధవిద్వాం సులకు మహా యాజ్ఞికులకుఁ జొర నర్హంబై విలసిల్లు యజ్ఞసభ సొర వలవదు చనుఁ డీరు చిఱుత వారల రనిన్.

3_3_248 క. అలయక యేండ్లు గడుం బె క్కులు జీవించుట నరగలుగుటయుం దగువృ ద్ధుల లక్షణమే జ్ఞానము గలఁడేనిన్ బాలుఁ డయినఁ గడువృద్ధు మహిన్.

3_3_249 వ. కృతాధ్యయన శీలుండై యాచారపరుండైన వాఁడు బాలుండయ్యును సర్వజన సంభావనీయుం డగు బాలురని మమ్ము నవమానింప వలవ దేము జనక రాజ సదనంబున దర్పితులైన వేదవాదులతో వాదంబుసేయ సమకట్టి వచ్చినవార మనిన దౌవారికుండు వారి నప్పుడు రాజానుమతుండై లబ్ధప్రవేశుం జేసె నంత.

3_3_250 సీ. జనకు భూపాలుని సంప్రశ్నముల కెల్ల నేర్పడ నుత్తరం బిచ్చి వాని సభయందు భూసురసంఘ మధ్యంబున వరుణ పుత్త్రుండైన వందితోడ వాదంబు చేసి గర్వంబున నాతని నొడిచి తద్విజితులై యువధి నున్న ధరణీసురులఁ దన తండ్రితో నిగ్రహవిముక్తులఁ జేసి సన్ముని కుమారుఁ

తే. డధికతేజుఁ డష్టావక్రుఁ డఖిల లోక పూజితుండైన జనకుచేఁ బుజలంది యేకపాదుఁ దోడ్కొని పేర్మి నేఁగుదెంచె బుధనుతుండు నిజాశ్రమంబునకు నొప్ప.

3_3_251 వ. అని చెప్పుచు నరిగి యిది సమంగ యను పుణ్యనది యిందు భరతుండు రాజ్యాభిషిక్తుఁడయ్యెఁ దొల్లి యింద్రుండు లక్ష్మీప్రాప్తుండై దీని జలోప స్పర్శనంబున బాపవిముక్తుండయ్యె నిది మైనాకకుక్షి యిం దదితి పుత్త్రార్థినియై తపంబు సేసె నిది ఋషిదైవతంబైన కనఖలనగం బిది గంగానది యిందు సనత్కుమారుండు సిద్ధింబొందె నిది యుష్ణగంగ యిందుఁ గృతస్నానులైనం గృతార్థు లగుదు రిది రైభ్యాశ్రమం బిది భరద్వాజాశ్రమం బిందు భరద్వాజసుతుండు యవక్రీతుండు తపోవిద్యా గర్వంబున నపగత జీవుండయ్యె ననిన నది యెట్లని ధర్మతనయుం డడిగిన రోమశుం డిట్లనియె.

- రోమశుఁడు ధర్మరాజునకు యవక్రీతు చరిత్రంబు చెప్పుట - సం. 3-135-12

3_3_252 క. అలఘులు రైభ్యభరద్వా జులు దమలో సుహృతులై విశుద్ధతపో ని శ్చనితమతు లివ్వనంబున నొలసి తపంబొప్పఁ జేయుచుండిరి నెమ్మిన్.

3_3_253 వ. అందు రైభ్యుండు కృతాధ్యయన శూరులైన యర్ధావసువరావసులను తన యిద్దఱు పుత్త్రులతో విద్వత్పూజితుండై యున్న వానిం జూచి సహింపనోపక భరద్వాజ సుతుఁడు యవక్రీతుండు తపోబలంబున నఖిలవేద శాస్త్రాగమంబులు వడయుదు నని సమిద్ధంబైన యగ్నియందు సంధార్యంబు సంధిచుచు నగ్రతపంబు సేయుచున్న దాని సహింపనోపక యింద్రుండు వానియొద్దకు వచ్చి నీవేమి యుద్దేశించి యుగ్రతపంబుఁ జేసెదవనిన శక్రునకు యవక్రీతుం డిట్లనియె.

3_3_254 ఆ. చదువకయును నాకు సర్వ వేదంబులు సర్వ శాస్త్రములును సంభవిల్ల వలయునని తలంచి వదలక నిష్ఠతో నుగ్రతపముఁ జేయుచున్న వాఁడ.

3_3_255 వ. అనిన వానికింద్రుం డిట్లనియె.

3_3_256 క. గురుముఖమునఁ బడయక దు ష్కర తపమునఁ జేసి వడయఁగాఁ బడు విద్యల్ పరమార్థము మదమును మ త్సరమును గావించు నెట్టి సాధుల కైనన్.

3_3_257 వ. ఇది విద్యాపార్జనంబున కుపాయంబు గాదని వారించి వాసవుఁ డరిగిన నుడుగక యవక్రీతుం డెప్పటియట్ల తపంబుఁ జేయుచున్నఁ దదీయ తపస్తప్తమానసుండై వృద్థశ్రవుండు వృద్ధ విప్రరూపంబు ధరియించి యశక్తుండై శోషించిన శరీరంబుతోడ సికతాముష్టి పరంపర నపార గంభీరగంగా ప్రవాహమునందు సేతు బంధంబు చేయుచున్న నవ్విప్రుం జూచి యవక్రీతుంజు నగుచు నిట్లనియె.

3_3_258 క. శతవర్ష వృద్ధుఁ డవు నీ వతికృశుఁడ వశక్యమైన యర్థమునం దా స్థత యేల సేసి కడు దు ర్మతివై తిం కెన్నఁడిది సమాప్తిం బొందున్.

3_3_259 వ. అనిన నింద్రుండు వానిం జూచి యేను నీయట్ల యఘటమానం బైన యర్థంబునందు యత్నంబుఁ జేసెద నని నిజరూపంబుఁ జూపి యిట్లు నిరర్థక ప్రయాసం బేల చేసె దుడుగు మనిన నే నెట్లు నుడుగ నా యభిమతంబు సఫలంబు సేయవలయు నన యవక్రీతుండు శక్రువలనం దన యభిమతంబు వడసి తత్ప్రకారంబుఁ దండ్రికిం జెప్పిన విని భరద్వాజుఁడు కొడుకు గర్వంబు సహింపక దేవగీతలైన గాధల యర్థంబు వానికి నిట్లని చెప్పె.

3_3_260 సీ. బాలధీ యనుముని ప్రవరుండు పుత్త్రశోకాపన్నుఁడై ఘోరమగు తపంబుఁ జేసి వేల్పుల దయఁ జిరజీవిగాఁ బుత్త్రుఁ బడసె మేధావి నాఁబరగు వాని వాఁడు నాయుష్య గర్వమున మునీంద్రుల నెవ్వరి మెచ్చక యేఁగి యొక్క ధనుషాక్షుఁ డను తపోధను నొద్ద గర్వించి పలికిన నలిగి తపస్వి వాని

ఆ. నంతకాంతికమున కరుగంగఁ జేసె గ ర్వంబు చెట్ట యెట్టివారినైనఁ గ్రాఁచుఁ దత్క్షణంబు గర్వంబు గర్వంబు నొడిచి యున్నవాఁడ యుత్తముండు..

3_3_261 వ. కావున నీవు గర్వంబు విడిచి యకోపనుండవై పరమశాంతులైన రైభ్యు కొడుకులతోడ నిర్మత్సరుం వయి యుండుమనిన నట్లు సేయుదు నాకు రైభ్యుండు భవత్సమానుండ యని యవక్రీతుండు తన విద్యా విభవంబ ముని సభల విస్తరించుచు నొక్కనాఁడు రైభ్యాశ్రమంబునకుం జని యందు.

3_3_262 ఉ. కోమలకీరషట్చరణ కోకిలనాద మనోహరంబు ను ద్దామ వసంత పుష్ప భరిత క్షితిజ ప్రకరంబు నైనయా రామమునందుఁ జుచె మునిరాజకుమారుఁడు రైభ్యుకోడలిం దామరసాక్షిఁ గృష్ణయనుదానిఁ బరావసు భార్యఁ బ్రీతితోన్.

3_3_263 ఆ. దానిఁ జూచి మదన తప్తుఁడై తనయభి ప్రాయ మెఱుఁగఁ జెప్పెఁ బంకజాక్షి కదియు శాపభీతి నప్పటికొడఁబడి నట్లు పలికి పెలుచ నరుగుదెంచి.

3_3_264 క. తమ మామకుఁ దద్వృత్తాం తమునంతను దెలియఁ జెప్పి తరుణి విలోలా క్షములందు బాష్ప సలిలో ద్గమముగఁ దల వాంచియుండెఁ గడుఁ గోపమునన్.

3_3_265 వ. రైభ్యుండు నయ్యవక్రీతున కలిగి నిజకోపనలశిఖాయమానైక జటావలంబనకరుండై హుతాశమనందు వేల్చి యయ్యగ్న కుండంబునందు.

3_3_266 క. లలితాంగిఁ బడసెఁ దనకో డలి రూపముకంటెఁ గడు బెడంగగు రూపో జ్జ్వలకాంతి గలుగుదానిం బొలఁతుక నొక్కర్తు నతితపో వీర్యమునన్.

3_3_267 వ. మఱియు నొక్కజట యవలంబించి వేల్చిన నందు వికృతదంష్ట్రా కరాళంబైన ముఖంబుతో శూలహస్తుండైన యొక్క రాక్షసుండు పుట్టె నయ్యిద్దఱు ముకుళిత హస్తులై మాకం బనియేమి యని యడిగిన నవినీతుండైన యవక్రీతు వధియింపుం డని పంచిన.

3_3_268 క. ఆ తరుణి మున్ను చని మద నాతరుఁడై వికృత చిత్తుఁడై యున్న యవ క్రీతు కరకమండలువుం బ్రీతిఁ బ్రబోధించి కొనియె బెడఁగుగ నంతన్.

3_3_269 క. అపహృత కమండలుండై యపవిత్రుండగుటఁ జేసి యధికతపో వీ ర్య పరిక్షయ మగుడును నా తపస్విసుతు రాక్షసుండు దడయక తాఁకెన్.

3_3_270 వ. వానికి వెఱచి వఱచి యవక్రీతుండు మహానదులు గొలంగులు సొచ్చిన నవి శుష్కంబులైనఁ దన జనకు నగ్ని హోత్రంబు జొచ్చు నంత.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com