ఆ భా 3 3 211 to 3 3 240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_3_211 ఆ. కోరి యొక్క కొడుకుఁ గొడుకుఁగా నేనెట్లు నమ్మియుండ నేర్తు నాకు సతులు శతము గలిగియుండ సంతాన మల్పమై యునికి మీకుఁ జూడ నుచిత మగునె.

3_3_212 వ. అనిన వానికి ఋత్విజు లిట్లనిరి.

3_3_213 తే. ధరణినాథ నీ భార్యాశతంబునందుఁ బరక నుర్వురు పుత్త్రులఁ బడయ నీకు నభిమతంబేనిఁ దగుఁ దగదనక నీవు కడఁగి మాచేయఁ బంచిన క్రతువు సేయు.

3_3_214 వ. ఈ జంతుం బశువుగా వధించి తద్వపాహవ్యంబుల హవ్యవహునిం దనిపిన దాన నీ నూర్వురు భార్యలకు నుర్వురు కొడుకులు పుట్టుదు రం దగ్రజుండైన జంతుండు సౌవర్ణ లక్షణ లక్షిత సవ్యపార్శ్వుండై యుదయించు నని చెప్పి ఋత్విజుల చేత సోమకుండు ననుజ్ఞాతుండై.

3_3_215 క. తనయుఁ బశువఱిచి తద్వనఁ గొనివేల్చినఁ జూచి యార్తకురరీనాదం బున నేడ్చిరి కడు నడలుగఁ దనుమధ్యలు నుర్వురును సుత స్నేహమునన్.

3_3_216 క. ఇమ్ముగఁ దద్ధూమాఘ్రా ణమ్మున గర్భములు దాల్చి నాతులు నవమా సమ్ములు నిండుగఁ గనిరి ము దమ్మున జంతు ప్రముశ సుత ప్రకరమ్మున్.

3_3_217 వ. అందు జంతునకు నందఱు నెప్పటియట్ల తల్లులు సమస్నేహలై యుండు బుత్త్రులు నూర్వురుం బెరిఁగి సమర్థులై యున్నఁ బెద్ద కాలంబునకు ఋత్విజుండు పరలోకగతుండై ఘోర నరకానలంబున నెరియుచునుండె నంత సోమకుండును దేహత్యాగంబు సేసి యమరలోకంబున కరుగువాఁడు ముందట నరకానల పచ్యమానుం డయ్యెడు ఋత్విజుం జూచి యిట్లేల తీవ్ర దుఃఖోపహతుండ వైతి వని యడిగిన వాఁ డిట్లనియె.

3_3_218 ఆ. అవనినాథ నీకు నార్త్విజ్య మొనరించి చూవె యిట్టి నరక పావకమునఁ బడినవాఁడ నీకు బహుపుణ్య లోకముల్ గలవు నన్నుఁ గావవలయుఁ గరుణ.

3_3_219 వ. అనిన సోమకుండు ధర్మరాజు పాలికిం జని తచ్ఛాసనంబునం బుణ్యలోకంబులకుం బోవుచుండి యిట్లనియె.

3_3_220 క. నా కారణమున ఋత్విజుఁ డేకాంతము నరక గతికి నేఁగెను వానిం దోకొని పోయెద నని శుభ లోకంబున కరిగెఁ ద్రిదశలోక స్తుతుఁడై..

3_3_221 వ. ఇట్లు యజ్ఞపుత్త్రుం డైన సోమకుండు దన తపోయజ్ఞ ఫలంబున ఋత్విజు నరక విముక్తుం జేసి పుణ్యలోకగతుం డయ్యె నిందుఁ దొల్లి ప్రజాపతి సహస్ర వార్షికంబైన యిష్టాకృతంబను సత్రయాగంబుఁ జేసె నాభాగుండైన యంబరీషు డిందు యజ్ఞంబులం జేసి పరమ సిద్ధికిం జనియె నిది నహుషు యజ్ఞదేశం బిందు దశపద్మసంఖ్యధనంబుల నాతండు సదస్యులం బూజించె నిది సార్వభౌమ యజ్ఞస్థానం బిది యయాతి యజ్ఞాయతనంబు వాని సవనంబున కింద్రుండు వచ్చె నిదోహామహ్రదం బిది నరనారాయణాశ్రమం బిది ప్లక్షావతరణం బను యమునాతీర్థం బిందు దేవతలును ఋషులును సారస్వత యాగంబుఁ జేసి రిది దేవర్షియైన సంవర్తుచేత రక్షితం బిందు భరతుం డనేక యాగంబులు సేసి సర్వలోకంబులుం జూచె నీవు నిందుఁ గృతస్నానుండవై సర్వలోకంబులు జూడు మనిన ననుజ సహితుండై ధర్మతనయుం డత్తీర్థంబున స్నానంబుఁ జేసి రోమశున కిట్లనియె.

3_3_222 శా. దేవర్షి ద్యుచరాహి లోకములు నాదిత్యాశ్వినీ లోకముల్ దేవాధీశ్వరుఁ జూచితిన్ మఱియు నద్దేవేంద్రునొద్దన్ సగాం డీవోద్దామ మహాభూజార్గళుఁ గిరీటిన్ సవ్యసాచిన్ జయ శ్శ్రీవిభ్రాజితుఁ బార్థు జూచితి జగత్సేవ్యా మునీంద్రోత్తమా.

3_3_223 వ. అనిన రోమశుండు వెండియు ధర్మరాజున కిట్లనియె.

3_3_224 క. ఇది దక్షుమఖస్థానం బిదియు సరస్వతి యనంగ నిలఁ బరగు మహా నది యిందుఁ ద్రితశతతితోఁ ద్రిదశజ్యేష్ఠుండి సేసెఁ దివిరి సుఖంబుల్.

3_3_225 వ. ఇది పంచ యెజన ప్రమాణం బైన ప్రజాపతి యజ్ఞవేది యిందు దేహత్యాగంబు జేసి మర్త్యల మర్త్యత్వంబుం బొందుదురు తొల్లి సరస్వతి నిషధ దేశంబున భూమి సొచ్చి యిచ్చమసోద్భేదంబునందుఁ గానంబడియె నిది సింధుతీర్థం బిందు లోపాముద్ర నగస్త్యుండు ప్రతిగ్రహించె.

3_3_226 తే. ఇదియు విష్ణు పదంబు దా నిది విపాశ యిదియుఁ గాశ్మీర మండలం బిది వితన్త మిదియు మానస ద్వార మిం దిందువంశ పరశురాముండు మును హంసపథముఁ జేసె.

- శిబి యను రాజర్షి చరిత్రంబు రోమశుఁడు ధర్మరాజునకుఁ జెప్పుట - సం. 3-13-15

3_3_227 వ. ఇక్కొలనం జైత్రమాసంబునందు మహామునులచేత బూజితుండై యుమాసహితుం డీశ్వరుండు వారికి బ్రత్యక్షం బగుటయు నరుంధతీ సహితుండై వశిష్టుం డిందుల వసియించె నిది భృగుతుంగం బను పర్వతం బిందు నుశీనరపతి శిబి యనువాఁడు దొల్లి యజ్ఞంబు సేయుచున్న నింద్రాగ్నులు వాని మహాగుణంబు లెఱుంగ వేఁడి యింద్రుండు శ్యేనంబైన నగ్ని కపోతంబై శ్యేనభయంబునఁ బఱతెంచి శిబి మఱువు సొచ్చిన దాని నెగిచికొని వచ్చి శ్యేనంబు శిబి కిట్లనియె.

3_3_228 ఆ. నిన్ను సత్యధర్మనిర్మలుఁ గా విందు నట్టినీకుఁ బాడియయ్య యిప్పు డతిబుభుక్షితుండనై యున్న నాకు నా హార విఘ్న మిట్టు లాచరింప.

3_3_229 వ. సర్వభుతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు నిది నాకు భక్ష్యంబు గాని నాఁడు బుభక్షావేదనం జేసి ప్రాణవియోగం బగు నట్లయిన నా పుత్త్రులు భార్యయు జీవింప నేర రొక్కకపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస సేయుట ధర్మ విరోధంబు.

3_3_230 క. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధసేయు ధర్మువు నైనన్ ధర్మముగా మదిఁ దలఁపరు ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్.

3_3_231 వ. ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి యను వేద వచనంబు గలదు గావున దీని నా కాహారంబుగా నిమ్మనిన దానికి శిబి యిట్లనియె.

3_3_232 తే. ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను నాశ్రయించె నాశ్రితు నెట్టి యధముఁడయిన విడువఁ డనినను నేనెట్లు విడుతు దీని నాశ్రిత త్యాగమిది ధర్మువగునె చెపుమ.

3_3_233 వ. నీవు పక్షివయ్యును ధర్మ మెఱింగినట్లు పలికితి శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొం డెద్ది నీయాఁగని దీనన కాని యొంట నుపశమింపదే నీయత్నం బాహారార్థం బేని యిప్పు డివ్వనంబున మృగ మహిష వరాహ ఖగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద నిక్కపోతంబు వలన యాగ్రహం బుడుగుము దీని నే నెట్లును విడువ ననిన శ్యేనం బిట్లనియె.

3_3_234 ఆ. నాకు విహిత భక్షణం బిది యిప్పక్షిఁ బూని కావ నీకు బుద్ధియేని యవనినాధ దీనియంత నీ మాంసంబు దూఁచి నాకుఁ బెట్టు తొలఁగ కిపుడ.

3_3_235 చ. అనిన ననుగ్రహించితి మహావిహగోత్తమ యంచు సంతసం బున శిబి తత్క్షణంబ యసిపుత్రిక నాత్మ శరీర కర్తనం బనఘుఁడు సేసిచేసి తన యంగమునం గల మాంస మెల్లఁ బె ట్టినను గపోత భాగము కడిందిగ డిందుచు నుండె నత్తులన్.

3_3_236 క. దానికి నచ్చెరువడి ధర ణీనాథుఁడు తనువునందు నెత్తురు దొరుఁగం దాన తులయెక్కె నంతన్ వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనులా.

3_3_237 వ. శ్యేన కపోత రూపంబులు విడిచి నిజ రూపంబుల జూపి నీ ధైర్యశౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు గావున నీ కీర్తి నిత్యంబై శబ్దబ్రహ్మంబు గలయంత కాలంబును వర్తిల్లుచు నుండెడుమని శిబికి వరంబిచ్చి యింద్రాగ్నులు చని రిది యమ్మహా పురుషు పుణ్యస్థానంబు మఱియు ననవరత ఫలవృక్షంబులు గలయది యౌద్దాలకియైన శ్వేత కేతు తపోవనం బిందు సరస్వతి మనుష్య స్త్రీ రూప ధారిణియై శ్వేత కేతుని సేవించె మాతుల భాగినేయులైన యష్టావక్ర శ్వేతకేతు లింద యుగ్రతపంబుఁ జేసి రనిన నం దష్టావక్రు మహాత్మ్యంబు విన వలతు నని యడిగిన యుధిష్ఠిరునకు రోమశుం డిట్లనియెఁ దొల్లి యేకపాదుండను మునివరుండు తనవిద్యా విభవంబున సుజాత యనుదాని వివాహంబై వనంబున ఘోరతపంబు చేయుచు ననవరతంబును శిష్యుల వేదంబులు చదివించుచున్నఁ బెద్దకాలంబునకు సుజాత గర్భిణియైనఁ దద్గర్భంబున నున్న యర్భకుండొక్కనాఁడు తండ్రి కిట్లనియె.

- రోమశుఁడు ధర్మరాజునకు నష్టావక్రు చరితంబు చెప్పుట - సం. 3-132-8

3_3_238 క. ఎడఁబడక యహోరాత్రులు వడిఁగొని చదివింప నిట్లు వలయునె శిష్యుల్ గడు నిద్రలేమి నెంతయు జడమతులై చదువు దప్పఁ జదువుచు నుండన్.

3_3_239 వ. అని యుపాలంభించి పలికిన నలిగి యేకపాదుండు నీవధ్యయంబునకు వక్రంబుగాఁ బలికితివి గావున నెనిమిది వంకలు గల శరీరంబుతో జన్మింపుమని కొడుకునకు శాపంబిచ్చిన.

3_3_240 ఆ. అగ్నికల్పుఁడై మహాత్ముఁడు కడుపునఁ బెరుఁగుచుండె నంత సరసిజాక్షి ప్రసవకాలమైనఁ బది కొక్క నాఁడిట్టు లనియెఁ బ్రసవ భారమునకు వెఱచి.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com