ఆ భా 3 3 151 to 3 3 180

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


3_3_151 అంతం గార్తవీర్యుని పుత్త్రులు బద్ధవైరులై రామరహితం బయిన జమదగ్న్యాశ్రమంబునకు వచ్చి యందు.

3_3_152 మ. మునులం దిట్టుచుఁ బుష్పవృక్షతతు లుమ్మాలించుచుం గ్రూరులై యనవద్యున్ జమదగ్నిఁ బట్టి బలిమిన్ హారామ హారామ యం చును నాక్రోశము సేయుచుండఁగ మునుల్ శోకింప ధర్మాత్ము న మ్మునిముఖ్యున్ వధియించి రాగ్రహమహామోహాంధులై హైహయుల్.

3_3_153 చ. వఱలఁగ రాముఁడంత ననవద్యుఁడు వచ్చి బహుప్రలాలియై యఱచుచున్న తల్లిని గృతాంత వశస్థితుఁడైన తండ్రి ను క్కఱఁగని తీవ్రశోక పరిఘాత హతుండయి తత్ప్రకార మం దెఱిఁగి ముహూర్తమేనియు సహింపఁగ నోపక కోపదీప్తుడై.

3_3_154 చ. అనఘ ని వీతరాగుఁ గరుణాత్ముఁ బ్రశాంతుని దాంతు నిమ్మహా మునివరుఁ జూచిచూచి యధముల్ వధియించిరి దీనఁ జేసి దు ర్జనులగుచున్న క్షత్త్రియులఁ జంపుదు నంచుఁ బ్రతిజ్ఞ సేసె భూ వినుతుఁడు జామదగ్న్యుఁడతి వీరుఁడు లోక భయంకరాకృతిన్.

3_3_155 వ. ఇట్లు కృతప్రతిజ్ఞుండై క్షత్త్రియుల నెల్ల వధియించి దిగ్ధంతి దంతార్గశాఘాట మహీచక్రంబు సాధించి విధివిహిత విధానాధ్వరుండై కశ్యపునకు నార్తిజ్య దక్షిణగా నఖిల భూవలయంబు నిచ్చి నిస్సంగుండై మహేంద్ర పర్వతంబునం దపోనిత్యుండై యున్న వాఁడని పరశురాము చరితంబు సెప్పిన విని ధర్మజుండును బ్రాహ్మణ సహితుండై మునిగణోపదేశంబునం జతుర్దశినాఁడు పరశురాము జూచి పరమ భక్తిం బూజించి తత్ప్రతి పూజితుండై దక్షిణదిక్కునకుం జని.

3_3_156 క. భూవినుతంబై త్రిభువన పావనమై త్య్రంబక ప్రభవమైన జలౌ ఘావళిఁ బవిత్ర మగు గో దావరిఁ బుణ్యనదిం గనియె దక్షిణగంగన్.

3_3_157 శా. గోదేవక్షితి దేవభక్తి పరుఁడై గోదావరీ స్నాతుఁడై గోదానంబులు హేమదానములుఁ బెక్కుల్ రత్నదానంబులన్ భూదేవోత్తమ పూజ సేయుచు జగత్పూజ్యుఁడు ధర్మాత్మజుం డాదిత్యాభుఁ డనేక తీర్థ శతసేవాసక్త పుణ్యాత్ముఁడై.

3_3_158 వ. ద్రవిళదేశంబున నగస్త్య తీర్థం బాడి యందుఁ దొల్లి యర్జును చేసిన గోసహస్ర దానాది వివిధ దానంబులు విని వానిం బ్రశంసించుచుం జని శూర్పారకంబును తీర్థంబునం బర్వతోత్సేధం బయిన పరశురాము వేదింగని సముద్ర తీరంబునకుం జని ప్రభా తీర్థంబునం బండ్రెండు దినంబులు పవనాంబు భక్షుండై పంచాగ్ని మధ్యంబున ధర్మజుండు దపంబు సేసిన.

3_3_159 ఆ. దాని నెఱిఁగి రామదామోదరులు వృష్టి వరులతోడఁ బ్రీతి నరుగుదెంచి కనిరి సకలతీర్థగమన పరిక్లేశ కృశులఁ బాండుసుతుల విశదయశుల.

3_3_160 క. చీరాజినధారుల నవి కారతపో యుతులఁ జూచి కడుదుఃఖితులై వారజదళాక్షి ద్రౌపది నూరార్చి రుదారహితమృదూక్తుల నొప్పన్.

3_3_161 వ. వారికి ధర్మతనయుండు దమ వనవాస తీర్థ గమనాయాసంబును నర్జును దివ్యాస్త్రలాభంబును నింద్రునొద్ద నాతనియునికియుం జెప్పిన విని రాముండు గృష్ణాదులైన వృష్ణి వరుల కిట్లనియె.

3_3_162 సీ. మతిహీనుఁడై తన సుతుని పల్కులు విని ధృతరాష్ట్రుఁ డీ పాండుసుతులఁ బాప భీరుల నవగత ధారుణీ రాజ్యులఁ జేసి యుగ్రారణ్య వాస గతులఁ గావించె నిది ధర్మువే విచార విహీనుఁడయ్యె భీష్మాదులు నెయ్యమున ని వారింపగా దీని నేరర దృఢ సత్యరతులకు దేవ నిర్మతుల కహిత

ఆ. మాచరించుచున్న నీచ దుర్యోధనా దులకు వర్ధనమును నలఘులైన పాండునందనులకు దండితారుల కప వర్ధనము నిట్లుసేయఁ జననె విధికి.

3_3_163 క. ధరణీతలంబు నిర్ధా ర్తరాష్ట్రముగఁ జేసి యనఘ ధర్మైకధురం ధరు ధర్మతనూజు వసుం ధర కధిపతి జేయకుండఁ దగనే మనకున్.

3_3_164 వ. అనిన బలదేవునకు సాత్యకి యిట్లనియె.

3_3_165 చ. అనుపమ శౌర్యవంతుల రనంత బలాఢ్యుల రీవు నీజనా ర్ధనుఁడును సాంబసారణులు దర్పకవీరుఁడు మండఁ బాండునం దనులు సుయోధనాదు లకృతంబున నిట్లు లనాధులట్ల యి వ్వనమున నుండగాఁ దగునె వన్యఫలాశన హీన వృత్తితోన్.

3_3_166 తరలము. అహితచిత్తవిదారణ క్రియలందుఁ బ్రౌఢములై జగ త్కుహర మంతయు మ్రెయుచుండఁగ ఘోరయాదవసైన్య స న్నహన దుదుభి నాదముల్ గగనంబు దిక్కులు నిండ దు స్సహము లయ్యెడు ధార్తరాష్ట్రుల సైన్య వీర భటాలికిన్.

3_3_167 మ. ఘనమై నీపృథుబాహులాంగల ముఖాఘాతంబుతోడన్ జనా ర్దన శార్జచ్యుత సాయకావలియుఁ గందర్పేషుజాలంబు నీ యనిరుద్ధో గ్రశిలీముఖాలియు మదీయాస్జ్త్రౌఘమున్ ధార్తరా ష్ట్రనికాయోత్తమ కాయ ఖండన పటిష్టం బయ్యెడుం బోరిలోన్.

3_3_168 వ. కేకయ సృంజయ పాంచాల వృష్ణి భోజాంధక వీరులుం గృష్ణానుమతులయి యుద్ధంబున ధృతరాష్ట్రుపుత్త్రులను భీష్మద్రోణకర్ణాదులను వధియింతురు ధర్మరాజు దమ్ములుం దానును సమయాబ్దంబును సలిపి రాజ్యాభిషిక్తుండగు నంతకు నతిరథు నభిమన్యు నఖిల రాజ్యరక్షకుం జేసి యుండుద మనిన సాత్యకి పలుకుల కనుకూలుం డయి వాసుదేవుండు ధర్మరాజున కిట్లనియె.

3_3_169 ఉ. ఈతనిపల్కినట్ల ధరణీశ్వర నీరిపులన్ మహాబలో పేతులఁ బోరఁ జంపుదు రభేద్యులు వీరలు మీకు భూతధా త్రీతలరాజ్య మెల్ల నగుఁ దెల్లము నావుడు ధర్మనందనుం డాతత కీర్తి యిట్లనియె నమ్మురవైరికి సీర పాణికిన్.

3_3_170 ఉ. మీదయ మాకుఁ గల్గఁగ నమిత్రుల నోర్చుట యేమి పెద్ద ధ ర్మోదయనిత్య బుద్ధునలు నుత్తమకీర్తుల నొప్పు ద్రోణభీ ష్మాతుల సన్నిధానమున నమ్మెయిఁ బల్కినవల్కు దప్పఁగాఁ గాదని ధర్మనందనుఁడు గ్రుమ్మఱిచెన్ యదువీర కోపముల్.

3_3_171 వ. యాదవులు పాండవుల వీడ్కొని పోయి రిట పాండవులు సోమమిశ్రిత తోయమైన పయోష్ణియందుఁ గృతస్నానులయియున్న నందు ధర్మరాజునకు రోమశుం డిట్లనియె.

3_3_172 వ. మనుజేంద్ర దీనితీరం బున నృగుఁ డను రాజు యజ్ఞములఁ జేసిన నం దనిమిషవతి తృప్తుండై దనుజుల నోర్చెనటె ఘోరతర శస్త్రములన్.

3_3_173 వ. మఱియు నిందతొల్లి యా ధూర్తరయసుం డైన గయుండు హిరణ్మయంబులయున చషాలస్థాలీ యూపచమసపాత్రీస్రుక్స్రువంబులును దేవస్థాపితంబులయిన యూపంబులు నొప్ప నే డశ్వమేధంబులు సేసి యసంఖ్యాతంబు లయిన ధలంబుల ఋత్విజులను సదస్యులనుం బూజించి సువర్ణమయ గోదానంబు లనేకంబులు బ్రాహ్మణుల కిచ్చి యక్షంయంబు లయిన యింద్రలోక సుఖంబులం బడసెఁ బయోష్టియందుఁ గృతస్నానులైన వారు దేవసాయజ్యంబుఁ బడయుదు రని చెప్పుచుం జని నర్మదా స్నానంబుఁ జేసి వైడూర్య పర్వతంబుఁ గని రోమశుండు ధర్మరాజున కిట్లనియె నిది త్రేతాద్వాపర సంధి యి సరోవరతీరంబు శర్యాతి యజ్ఞ ప్రదేశంబు మఱియు నిందు భృగు పుత్త్రుండయిన చ్యవనుండు శర్యాతియను రాజు కూఁతు సుకన్యయను దాని వివాహంబయి వాని యజ్ఞంబున నింద్రు నాదరింపక యాశ్వినుల సోమపీథులంజేసె ననిన నది యెట్లన యడిగిన ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సవిస్తరంబుగా రోమశుం డిట్లని చెప్పె.

- రోమశుఁడు ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సెప్పుట - సం. 3-122-1

3_3_174 క. ఇక్కొలని సమీపంబునఁ బెక్కగు వేలేండ్లు తపము భృగు సుతుఁడు గరం బక్కజముగ నొనరించెను వెక్కసనియమమున నితవీరాసనుఁడై.

3_3_175 క. అమ్ముని దేహము వల్మీ కమ్మునఁ గప్పంగఁ బడి నిటవల్లీగు ల్మమ్ములుపైఁ బ్రాఁకిన నన యమ్మును నేర్పడకయుండె నవ్వన భూమిన్.

3_3_176 వ. అంతం బెద్దగాలంబునకు శర్యాతి యను రాజు దన చతుస్సహస్ర దేవీ నివహంబతోడఁ దత్సరోవరంబున విహరింప నరిగిన నాతని కూఁతురు సుకన్య యనునది యిష్ట సఖులతోఁ గ్రుమ్మరుచున్న నవ్వల్మీకంబునందు.

3_3_177 క. విద్యుల్లతాంగి భార్గవు నుద్యన్న యనములు మెఱచుచున్నను విలస త్ఖద్యోత ద్యుతులొకొ యని సద్యస్సంజాత బుద్ధి సంభ్రమ యగుచున్.

3_3_178 వ. అప్పుడప్పుట్ట గ్రొప్పించిన నలిగి నిమీలిత నయనుండై చ్యవనుండు శర్యాతి సైన్యంబుల కెల్ల మూత్రపురీష నిరోధంబుఁ జేసిన నది దన సైన్యాపరాధంబున నయ్యెఁ గా వగచి వాఁ డెల్లవారి నడిగి తత్కారణం బెఱుంగ నేరక చింతాపరుండై యున్నఁ దండ్రి కడకు వచ్చి సుకన్య యిట్లనియె.

3_3_179 తే. మిన్నమిడుఁగుఱు లట్టులై మెఱసి రెండు మెఱుగు లొక పుట్టలో నున్న నెఱుఁగ కేను బుట్ట గ్రొప్పించి యా రెంటి పొడవుఁ గాన కుడిగి వచ్చితి విస్మయపడి మనమున.

3_3_180 వ. ఈ సైన్య నిరోధంబున కిది నిమిత్తంబగునో యనిన శర్యాతి యప్పు డా పుట్ట యొద్దకు వచ్చి యందుఁ దపః క్లేశంబునఁ గృతత్వగస్థీ భూత శరీరు నతివృద్ధు భార్గవుం గని నమస్కరించి యిట్లనియె.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com