Jump to content

ఆ భా 3 3 091 to 3 3 120

వికీసోర్స్ నుండి

3_3_091 వ. దానికి వెఱచి యాతండు బ్రాహ్మణులఁ బరమభక్తి నుపాసించి యీ యనావృష్టిదోషం బేమి కారణంబున నయ్యె దీనికిం దగిన ప్రతీకారం బెద్ది యని యడిగిన వానికిం బ్రసన్నులై బ్రాహ్మణు లిట్లనిరి.

3_3_092 క. కడు దర్పితుఁడని నిన్నున్ విడిచిరి బ్రాహ్మణులు వారు విడుచుచు నమరుల్ విడిచిరి దానన వర్షము దడసె భవద్దేశమునకు ధరణీ నాథా.

3_3_093 ఉ. శాంతుఁడు ఋష్యశృంగుఁడను సన్ముని యున్న యెడన్ ధరిత్రికిన్ సంతత వర్షణంబగు భృశంబుగ నట్టివరంబు దొల్లి వృ త్రాంతకుచే దయం బడసె నమ్ముని గావున ఋశ్యశృంగు వే దాం తసువేది రాఁబనుపు మంగమహీశ్వర్ నీదు నేర్పునన్.

3_3_094 వ. అనిన విని రోమపాదుండు దనచేసిన బ్రాహ్మణావమానంబునకుం దగిన ప్రాయశ్చిత్తంబుఁ జేసి బ్రాహ్మణ వచనంబున నపుడ బుద్ధిమంతులతో విచారించి విదగ్ధ వేశ్యాంగనలం బిలువం బంచి మీ నేర్చు విధంబుల ఋశ్యశృంగుం బ్రబోధించి యిట తోడ్కొని రండని పంచిన.

3_3_095 క. ఆ వేశ్యాజను లధికర సావహభక్ష్యమును విలసదనులోపనమా ల్యావళులుఁ గొనుచు నరిగిరి నావాశ్రమమునకు నమరనారుల లీలన్.

3_3_096 వ. అట విభాండకుండును యథాకాలం బగ్నిహోత్రంబు వేల్వం దనపుత్త్రు ఋశ్యశృంగు సమర్పించి వన్యఫలాహరణార్థంబు వనంబున కరిగిన యవసరంబున నందొక్క జరద్వేశ్య దనకూఁతు నభినవ యౌవన విలాస విభాసిని నమ్ముని పుత్త్రు పాలికిం బుచ్చిన దానిం జూచి ఋశ్యశృంగుండు సంభ్రమంబున.

- ఋశ్యశృంగుఁడు వేశ్యను ముని కుమారునిఁగా భావించుట -

3_3_097 మధ్యాక్కర. ఎందుండి వచ్చితి ఋషికుమార యేనెన్నఁడు నిట్టి సుందరాకురు మునిసుతు నేఁదొల్లి చూచి యెఱుంగ నిందుండు మీవని కృష్ణమృగ చర్మ కృతకుశాసనము నందుండఁ గాఁ బనిచె ఋషియనుబుద్ధి నత్తన్విఁ బ్రీతి.

3_3_098 వ. మఱియు నర్ఘ్యపాత్యాది విధులను వన్యస్వాదు ఫలదానంబు లం దాని కతిథి పూజ సేయనున్న నది యమ్ముని వరున కిట్లనియె.

3_3_099 క. మా యాశ్రమ మిందులకున్ న్యాయవిధీ ముఁడు యోజనంబులు గల దే బోయెద నీవును విజయం చేయుము యందులకుఁ జెలిమి సేయుము నాతోన్.

3_3_100 వ. అట్లేని నీచేత సత్కారంబు గొందు ననిన ఋశ్యశృంగుం డట్లు సేయుదు నని దాని నాతిథ్య విధానంబునం బూజించి తనకు దాని యిచ్చిన దివ్యగంధ మాల్యంబులును సరస భక్ష్యపానంబులును విచిత్ర వస్త్రంబులు బరిగ్రహించిన నదియును.

3_3_101 క. మువి ముందటఎ గందుకన ర్తన మృదు గీతములయందుఁ దన కౌశల మె ల్లను జూపి విరచితాలిం గనయై మునిపతికి ముదము గావించె మదిన్.

3_3_102 వ. ఇట్లు ఋశ్యశృంగుం బ్రబోధించి వేశ్యాపుత్త్రి యరిగిన దాని పోయిన వలను సూచుచు ఋశ్యశృంగుం డగ్నిహోత్రంబు వేల్వ మఱచి విపరీత బుద్ధియై యున్న నంత నడవినుండి వల్యఫలంబులు గొనివచ్చి విభండకుండు గొడుకుంజూచి యిట్లేల చింతాపరుండవై యగ్నిహోత్రంబు వేల్వక కాలాతిక్రమంబు సేసితనినఁ దండ్రికి ఋశ్యశృంగుం డిట్లనియె.

3_3_103 సీ. కాంచనపర్ణుండు గడురూపవంతుండు గమ్మని జడలతో ఘనము లగుచు ననయంబు వట్రులగు రెండు పిండంబు లురమున విలసిల్లుచుండ నఱుత వెలుఁగుచు జపమాల వ్రేలంగ నున్నవ నడుమును వడఁకంగ నడచునపుడు కలహంస కూజిత కలనాద మెసఁగ నా పాలికి నేఁ డొక్క బ్రహ్మచారి

ఆ. వచ్చి పోయె వాని వదనంబు వలన వె ల్వడు సుగంధి మధుర భాషితంబు పొలుచు వినఁగ సమదపుంస్కోకిలాలాప చారు వగుచు హృదయ సమ్మదముగ.

3_3_104 క. ఆ ఋషి కుమారు కట్టిన చీరలు నతి మృదులములు విచిత్రమును మనో హారము వాని బృహత్కటి భారమునం దొక్క కనక పట్టము వెలుఁగున్.

3_3_105 క. పవన సమీరత మధుసం భవ వివిధ ప్రసవ సౌరభముఁ బోలి ముని ప్రవరుని తనువునయం దు ద్భవమై రమ్యమయి సౌరభము విలసిల్లున్.

3_3_106 మఱియు నక్కుమారుం డొక్క యెఱ్ఱని ఫలంబు దనదక్షిణ పాశి తలంబున నందంద చఱచుచు నది నేలంబడి యెగయం బోయున వలనికి వ్రాలుచు వాతావధూతం బైన బాల వృక్షంబునుం బోలె నొప్పుచున్న నమ్మునిపుత్త్రునందు నా హృదయము దద్దయుం దగిలినయది.

3_3_107 ఉ. నన్నునుఁ గౌఁగిలించుకొని నా వదనంబునకున్ నిజాస్య మా సన్నముఁ జేసి యొక్క మృదుశబ్దము సేసె మనోహరంబుగా నెన్నఁడు నట్టిశబ్దము మునీశ్వర మున్ విని యే నెఱుంగ న య్యిన్నువ బ్రహ్మచారి ముఖ మంబురుహంబు సమంబు సూడఁగన్.

3_3_108 వ. నా యిచ్చిన వన్యస్వాదు ఫలంబు లాదరించి యారగింప కమ్ముని కుమారుం డమృతోపమానంబులైన ఫలంబులు నతి మధురంబు లైన పానీయంబులు నాకు నిచ్చిన నుపయోగించితి.

3_3_109 క. తనచేతి పుష్పములఁ జ ల్లిన నంతటఁ జెదరి యవి యళిప్రకరనిషే పన మొప్ప నున్న యవి యి వ్వనకుసుమము లట్లు గావు వరగంధంబుల్.

3_3_110 వ. నాకు నమ్మునిపుత్త్రు నాశ్రమంబునందు వానితో నొక్కటఁ దపంబు సేయుచుండ నిష్టంబనినఁ గొడుకు పలుకులు విని విభాండకుండు విస్మితుండై తపస్వుల తపంబులకు విఘ్నంబులు సేయ ననేక రూపులయి రాక్షసులు వనంబునం గ్రుమ్మరు చుండుదురు తజ్జనదత్తంబు లయిన పానీయంబు ల పేయంబు లతి సుగంధులయిన కుసుమంబులు మునులకు వర్జనీయంబు లని కొడుకుం బ్రబోధించి యెప్పటియట్ల వల్య ఫలంబులు దేర నరిగిన.

3_3_111 క. చనుదెంచి తరుణి మునినం దనుచిత్తంబునకు వైకృతము జేసె విలా సినుల సహాలాప సహా సన సహయానములు బంధసమములు గావే.

3_3_112 వ. ఇట్లు ఋశ్యశృంగుండు విలాసినీ మోహితుండయి తండ్రి కెఱింగింపక సుచరిత్రంబయిన తనయాశ్రమంబు విడిచి మనుష్యయోగంబునం దగిలి యక్కోమలి పిఱుందన చని యంగదేశంబు సొచ్చి యందు రోమపాదునాదేశంబున రాజాశ్రయం బను వనంబున నుండునంత.

3_3_113 మత్తకోకిలము. అమ్మునీశు నివాసశక్తిఁ దదంగదేశమునందు మే ఘమ్ములెల్ల వలంకులం గడుఁ గ్రమ్మి సర్వజన ప్రమో దమ్ముగాఁ బ్రభవద్బృహజ్జల ధార లొప్పఁగ వృష్టిఁ జే సె మ్మహా నదులున్ మహాసరసీవరంబులు నిండఁగన్.

3_3_114 వ. ఇట్లు ఋశ్యశృంగు నాగతంబున నంగ విషయంబున నవగ్రహదోషంబు నిస్తంబైన సంతసిల్లి రోమపాదుండు తనకూఁతు శాంత యనుదాని నత్యంత కాంతిమతి నమ్మునివరునకు వివాహంబు సేసి.

3_3_115 క. అనుభోగయోగ్యములుగా ధనరాసులు భూషణములు దాసీనివహం బును గాంచనమయ శయ్యా సనములు మునికిచ్చె హృదయ సంతోషముగాన్.

- విభాండకుఁడు ఋశ్యశృంగుని వెదకుచు వచ్చుట - సం. 3-113-11

3_3_116 వ. మఱియు గోసహస్రంబు లనేకంబు లిచ్చి గోకులసంకులంబుగా ఘోషంబులు దేశంబునెల్ల నిలిపి నిత్యసత్కారంబుల ఋశ్యశృంగునకుఁ బ్రియంబు సేయుచుండె నంతనట విభాండకుండు దనయాశ్రమంబునఁ గొడుకుం గానక యెల్లదేశంబులు రోయుచు నంగదేశంబునకు వచ్చి గోగణ సంకీర్ణంబైన యొక్క ఘోషంబునందు గోపసత్కృతుండై యొక్కదివసంబు వసియించి యిది యెవరిఘోషం బని గోపాలకుల నడిగిన వార లిట్లనిరి.

3_3_117 క. యతినాథ వినవె యిది నీ సుతుఘోషం బిదియకాదు చూడ ననేకా యతఘోషంబులు గల వు న్నత గూణునకు ఋశ్యశృందునకు నిద్ధరణిన్.

3_3_118 వ. అనిన విని విభాండకుండు సంతసిల్లి ఋశ్యశృంగు తొఱ్ఱుపట్ల విశ్రమించుచు రోమపాదు పురంబునకు వచ్చి యందు శాంతా సహితుండై ఋశ్యశృంగుం జూచి సంతుష్ట హృదయుండై తన గొడుకుం గోడలిం దోడ్కొని నిజాశ్రమంబున కరిగె నందు వసిష్ఠున కరుంధతియు నగస్త్యునకు లోపాముద్రయు ముద్గలునకు నాలాయిని యైన యింద్రసేనయం బోలెఁ దనకుఁ బరమభక్తి యుక్తయై శాంత పరిచర్య సేయుచుండ ఋష్యశృంగుండు సుఖంబుండె నని చెప్పిన నా కౌశిక హ్రదంబున నందఱు నభిషిక్తులై యేనుఱు మహానదుల సమాగమస్థానం బయిన గంగా సాగర సంగమంబుఁ జూచుచు సముద్ర తీరంబునం జని కళింగ దేశంబున వైతరణి యను మహానదిం గని రంత రోమశుండు ధర్మరాజున కిట్లనియె.

3_3_119 క. ముని దేవరులు యజ్ఞము లొనరించిరి తొల్లి దీని యుత్తరతీరం బున నిది పూణ్యాస్పదమై తనరును యజ్ఞావభృథ శత స్నానములన్.

3_3_120 వ. మఱియు సకల యజ్ఞంబుల యందును బ్రశస్తంబయిన పశుభాగంబు పశుపతికి దేవతలును ఋషులును నిందుఁ గల్పించి రీ తీర్థంబాడిన వారు దేవయాన గతులగుదు రనినం గృష్ణా సహితుండై ధర్మతనయుండు దమ్ములుందానును వైతరణీ స్నానంబు సేసి రోమశుం జూచి మునీంద్రా నాకు భవత్ప్రసాదంబున నఖిల లోకంబులుం గాననయ్యె వైఖానసుల వేదాధ్యయన శబ్దంబులు విననయ్యె ననిన విస్మితుండై రోమశుండు వైఖానసనివాసం బిందులకు ముప్పదివేల యోజనంబులు గలదు వారల యధ్యయన శబ్దంబులు వింటివి గావున నీవు దివ్యుండవంచు నరిగి యనవరత ఫలాలంకృతంబైన యొక్క వనంబు గని యిందుఁ దొల్లి స్వాయంభువుం డైన విశ్వ కర్మ యజ్ఞంబు సేసి.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com