ఆ భా 3 2 331 to 3 2 356

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


- అగస్త్యుఁడు లోపాముద్రను వివాహంబగుట - సం. 3-95-9

3_2_331 వ. విధ్యుక్తంబుగా నక్కోమలి నగస్త్యునకు వివాహంబుఁ జేసిన నగస్త్యుండు లోపాముద్రం బరిగ్రహించి దాని దివ్యాంబరాభరణంబు లపనయించి వల్కలాజిన ధారిణిం జేసి ధర్మచారిణిం దోడ్కొని చని గంగాద్వారంబునం దపంబు సేయుచు నొక్కనాఁడు.

3_2_332 క. నీ చతరనాభిఁ జపలవి లోచన బృథుజఘనచక్ర లోపాముద్రం జూచి మునీంద్రుడు మన్మథ గోచరుఁడై దానిఁ బ్రీతిఁ గూడఁగఁదివిరెన్.

3_2_333 వ. అదియును మునివరు నభిప్రాయం బెఱింగి లజ్జించి ముకుళిత కరాంబుజయై యిట్లనియె.

3_2_334 క. పతిపత్నిఁ బ్రజార్థముగా ధృతిఁబడయుట యెందుఁ గలయదియు యైనను న న్నతిరుచిరాంబర భూషా న్వితఁ జేసి మనఃప్రియంబు నిర్మింపు దయన్.

3_2_335 క. మునినాథ నీవు ననులే పనమాల్య విభూషణ ప్రసన్నుఁడవై నా కొనరింపు మపత్యోత్పా దన మీఋతు వాసరములు దప్పక యుండన్.

3_2_336 వ. అనిన నాకుఁ దపాధనంబ కాని యొండుధనంబు లేదు నీ కోరిన విధం బెట్లు సేయనేర్తుఁ దపంబునంజేసి సర్వంబునుం బడయ నగునంటేని నేను దపోవ్యయంబు సేయనోప నని యగస్త్యుండు వసుభిక్షార్థియై శ్రుతర్వుండను రాజుపాలికింబోయి వానిచేతం బుజితుండయి యేను ధనార్థినై వచ్చితి నీ పోష్యజనపోషణంబునకు విఘాతంబు గాకుండ మిగులు ధనంబు గలదేని నాకిమ్మని యడిగిన నతండాయవ్యయంబులు సమంబులగుటం జేసి మిగులు లేమి యెఱింగించిన వాఁడును దానును బ్రధ్నశ్వుండను రాజుపాలికిం బోయిన నతండును నయ్యిరువు రం బరమభక్తి బూజించి తదాగమన ప్రయోజనం బెఱింగి తనయందురు నాయవ్యంయంబులు సమంబులగుట యెఱింగించిన.

3_2_337 క. ఇరువురఁ దోడ్కొని తానును నరిగెం ద్రసదస్యుఁ డను జనాధిపు కడకుం గరమర్థితోడ నందఱఁ బురుకుత్స తనూజుఁడతఁడు పూజించి తగన్.

3_2_338 వ. వారలచెప్పి నట్ల తననిర్వాహంబు సెప్పి త్రసదస్యుం డగస్త్యున కిట్లనియె.

3_2_339 క. ఇమ్మణిమతీపురంబునఁ దమ్ముండును దాను నతిముదంబున నుండున్ నెమ్మిని నిల్వలుఁడను వాఁ డిమ్మహి ధనవంతుఁ డతఁడ యెవ్వరికంటెన్.

3_2_340 వ. అతండు మనయభిమతంబు దీర్పనోపునని రాజర్షులు మువ్వురు మహర్షిం దోడ్కొని యిల్వలుపాలికిం జనిన నయ్యిల్వలుండును వారి నాతిథ్య విధానంబుల నర్చించి వాతాపి నెప్పటియట్ల సంస్కరించి యగస్త్యునకు భోజనంబుగా సమర్పించిన.

3_2_341 తే. దానినెఱిఁగి యమ్మువ్వురు ధరణీపతులు మునివరేణ్యున కప్పుడు మ్రొక్కియనిరి విప్రవరులకు భక్ష్యమై వీనితమ్ముఁ డుదరముల నుండి విప్రులనొగిన చంపు.

3_2_342 చ. వలవదు వీని యింబఁగుడువన్ మనకున్ ధనమిచ్చునేని ని మ్ములఁగొని పోదమిప్పుడని మున్నెఱిఁగించిన నమ్మునీంద్రుఁ డ త్యలఘుఁడు వారిమాటకు భయంపడకెంతయుఁ బ్రీతితోడ న గ్గలముగఁ జేసె భోజనము గంఠముదాఁక నకుంఠవీర్యుఁడై.

3_2_343 ఆ. ఇల్వలుండు ననుజునెప్పటి క్రియఁ బిల్వ నెఱిఁగి దాని నమ్మునీశ్వరుండు గడుపుఁ దడవికొనుచుఁ గఱ్ఱనఁ ద్రేఁచిన నసుర జీర్ణ మయ్యె నాక్షణంబ.

3_2_344 వ. ఇల్వలుండును మునివరుశక్తికి భయంపడి విషణ్ణుండయ్యును బ్రసన్నుండపోలెఁ దనవంచన యేర్పడకుండం గృతప్రణాముండై దదాగమన ప్రయోజనం బడిగిన వానికి నగస్త్యుం డిట్లనియె.

3_2_345 సీ. ఈరాజవరులతో నేను ధనార్థి నైవచ్చితి నీకు ద్రవ్యంబు గలుగు టెఱిఁగి నావుడు నటులేని మీ కభిమతమెంత యంతియ ధనమిత్తు ననిన బదివేలు మొదవులు బదివేల గద్దియల్ పసిఁడియు నిమ్మహీపతుల కిమ్మ యొక్కొక్కనికి మఱి యొక్కనికిచ్చిన దానికి రెట్టిగోధనము నొక్క.

ఆ. హేమమయ రథంబు నిమ్ము నాకనిన ని ల్వలుఁడు దత్క్షణంబ తలఁచియిచ్చె నయ్యగస్త్యుచెప్పి నంతధనంబు ము వ్వురు మహీపతులకుఁ గరము నెమ్మి.

3_2_346 వ. మఱియు విరావ సురావము లను నశ్వంబు లంబూన్చిన సౌవర్ణ రథంబును నిరువది వేల మొదలు నిరువదివేల గద్దెల పసిండియు మునివరువ కిచ్చినం దద్రథంబున.

3_2_347 క. మునివర నృపతులఁ దద్గో ధనకాంచనతతుల దత్పతాకినులను నో లిన తాల్చి యగస్త్యాశ్రమ మునకుం దత్క్షణమ రథ్యములు వడిఁ బఱచెన్.

3_2_348 వ. రాజర్షులు నగస్త్యు వీడ్కొని చని రంత నగస్త్యుండు లోపాముద్ర కభిమతం బొనరించి.

3_2_349 సీ. మధ్యాక్కర. పదుగుర బోలెడు సుతుల నూర్వురఁ బడయంగ వలతో పదుగుర నూర్వుర కెనయగుసుతులఁ బడయంగ వలతొ వదలక వేవురు సుతులఁ బడయఁగ వలతొ వేవురకుఁ గదియంగ నుత్తము నొక్కరు వలతొ కమలాయతాక్షి.

3_2_350 వ. అనిన ముదితహృదయయై లాపాముద్ర మునీంద్రున కిట్లనియె.

3_2_351 క. వేవురఁ బోలెడు వాని మ హావీర్యగుణాఢ్యు నొక్క యాత్మజుఁ బడయం గా వలతు నపేతగుణుల్ వేవురు సుతులయ్యు నెందు విఫలము కాదే.

3_2_352 వ. అనిన నీకోరినట్ల గుణవంతుం డయిన కొడుకు నీకు జన్మించునని దానికి గర్భాదానంబు సేసి యగస్త్యుండు దపోవనంబున కరిగె నిట లోపాముద్రయు నేడేండ్లు గర్భంబు దాల్చె నంత నక్కోమలికి.

3_2_353 క. తనయుఁడు దృఢస్యుఁడనఁగా ననవద్యుఁడు వేదములు రహమ్యంబులతో నొనరఁగ జపంబుసేయుచు నినతేజుఁడు పుట్టె భువనమెల్ల వెలుంగన్.

3_2_354 వ. వానికిం దేజస్వియను ఋషి పుట్టి యపారంబున యిధ్మభారంబు వహించుటం జేసి యిధ్మ వాహుం డనంబరగె నిట్లగస్త్యుండు పుత్త్ర పౌత్త్రవంతుండయి తన పితరులం బుణ్యలోకగతులం జేసెనని వైశంపాయనకథిత కథాక్రమం బతి రమ్యంబు గాను.

3_2_355 క. కలి కాల భరత లక్ష్మీ లలనాస్పద వీరగుణ విలాస విరోధి ప్రళయాంతక నిఖిలమహీ వల యోద్వహబాహు విష్ణువర్థన మూర్తి.

3_2_356 పృథ్వీవృత్తము. సమస్త భువనాశ్రయా వినయసత్యనిత్యోదయా సమీహిత గుణక్రియాస్థిర విశాల కీర్తిప్రియా నమన్నృపకిరీట చుంబిచరణద్వయా సంతత క్షమాభరణ రాజరాజ పరగండ భేరుండకా.

గద్యము. ఇది సకల సుకవి జన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబున బృహదశ్వు దర్శనంబును నలోపాఖ్యానంబును నారదాగమనంబును సకల తీర్థ కీర్తనంబును రోమశుం డర్జునకుశల వార్తఁ జెప్పుటయు రోమశ మహాముని యుపదేశంబున ధర్మడు తీర్థాభిగమనంబును నగస్త్యుండు లోపాముద్ర బరిగ్రహించుటయు వాతాపి భక్షణంబును నన్నది ద్వితియాశ్వాసము.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com