Jump to content

ఆ భా 3 2 171 to 3 2 200

వికీసోర్స్ నుండి

--రానారె 17:14, 6 సెప్టెంబర్ 2006 (UTC)


3_2_171 వ.

వార్ష్ణేయుండును బాహుకురథంబు గడుపు నేర్పున కచ్చెరువడి యాత్మగతం

బున.


3_2_172 క.

ఈతండు శాలిహోత్రుఁడొ

మాతలియో నలుఁడొ యొరులు మానవులు జవో

పేతముగ నిట్లు రథహయ

నీతి యెఱుంగుదురె ధారుణీవలయమునన్.


3_2_173 వ.

వయోవిద్యావైభవంబుల నతండు నలుం బోలియు వికృతరూపధరుం

డయినకారణం బేమియొ మహాపురుషులు దైవనియుక్తులై ప్రచ్ఛన్న

వృత్తి నుండుదురు వారి నెఱుంగం బోలునె యనుచుఁ జనునప్పుడు

ఋతుపర్ణుండు దనయుత్తరీయంబు జారి భూతలంబుపయిం బడిన మలంగి

చూచి బాహుకా వార్ష్ణేయుండు వోయి యుత్తరీయంబు దెచ్చునంతకు

రథగమనం బించుక మందంబు సేయు మనిన బాహుకుండును నయ్యా

నీయుత్తరీయంబు వడిన యెడ యిచ్చోటికి నొక్కయోజనంబుగలదు దాని

వార్ష్ణేయుం డెట్లు దే నేర్చు నని రథగమనవేగమహాత్మ్యంబు సెప్పుచు

ననేకదేశంబులు గడచి చనియొక్క యెడ నగణ్యపర్ణ ఫలాశాఖాలంకృతం

బయిన విభీతవృక్షంబు గని రంత ఋతుపర్ణండు బాహున కి ట్లనియె.


3_2_174 ఆ.

ఎల్లవారు నెఱుఁగ రెల్లవానిని భిన్న

విషయు లెల్లవారు విద్యలందుఁ

దొలఁగకే నెఱుంగుదును దృష్టిమాత్రన

సకలమైన వస్తుచయము సంఖ్య.


3_2_175 వ.

ఇవ్విభీతకంబున ఫలపర్ణసముదాయసంఖ్యఁ జెప్పెద విను మీరెండుశాఖలం

గలపర్ణఫలంబులు పదివేలు నొక్కండు దక్కినశాఖలం గలయవి రెండువేలుం

దొంబదే ననిన బాహుకుండు విని వీని నెన్నికాని నిశ్చయింప నేర నని

తనరథంబు నిలిపి యావృక్షం బాక్షణంబ యురులం ద్రోచి యయ్యై

శాఖలం గలయాకులుం బండులు నెన్నిన ఋతుపర్ణుండు సెప్పిన యన్ని

యయిన నచ్చెరువడి యవ్విద్య నాకు నుపదేశింప వలయు నని యడిగిన

ఋతుపర్ణుం డి ట్లనియె.


3_2_176 క.

ఇది యక్షహృదయ మనఁగా

విదితం బగువిద్య దీని విద్యుక్తముగా

మది నెఱుఁగు నరుఁడు సంఖ్యా

విదుఁ డగు దుష్కృతకళంకవిషముక్తుఁడగున్.


3_2_177 చ.

సకలగుణప్రసిద్ధుఁ డగు సర్వహితుం డగుఁ జూవె యంచు బా

హుకునకుఁ బ్రీతితోడ విధియుక్తముగా నుపదేశ మిచ్చె న

త్యకుటిలబుద్ధి నక్షహృదయంబుఁ గరంబు రయంబుతో విద

ర్భకుఁ జనువేడ్కఁ జేసి ఋతుపర్ణుఁడు పూర్ణమనఃప్రసన్నుఁడై.


3_2_178 వ.

ఇట్లు నలుండు ఋతుపర్ణువలన నక్షహృదయంబు వడసి సంతుష్టుండై నీకు

నశ్వహృదయం బిచ్చెదఁ బరిగ్రహింపుమనిన ఋతుపర్ణుం డట్లచేయుదు నది

యంతకు నీయంద యుండనిమ్ము నావలసినప్పుడు గొందు ననియె నంత

నయ్యక్షహృదయసామర్ధ్యంబున నప్పుడు.


-: నలుండు గలిచేత విముక్తుండయి విదర్భకుఁబోవుట :-


3_2_179 క.

నలుఁ దొల్లి యాక్రమించిన

కలి గర్కోటకవిషంబు గ్రక్కుచు నొడలన్

వెలువడి నలునకు విహితాం

జలియై తన్నెఱుఁగఁ జెప్పెఁ జంచలుఁ డగుచున్.


3_2_180 ఆ.

వానిఁ జూచి నలుఁడు దానల్గి శాపమీ

నున్నఁ గలి యెఱింగి నిన్నుఁ బొంది

యహివిషంబుచేత ననిశంబు దగ్ధుండ

నైతి నింక నాకు నలుగ వలదు.


3_2_181 వ.

నిన్నును నీచెలువను గీరతించిన జనంబులు నావలనిభయంబుఁ బొరయరు

నాకుం గరుణింపు మనిన నలుండు గోపం బుడిగెఁ గలియు నవ్విభీతకవృ

క్షంబు నాశ్రయించె నది మొదలుగా విభీతకం బప్రశస్తం బయ్యె నట్లు

నలుండు వికృతరూపమాత్రంబు దక్కఁ దక్కినదుష్కృతంబులవలన

విముక్తుండై రథం బెక్కి యతివేగంబున ఋతుపర్ణవార్ష్ణేయసహితుండై

విదర్భకుం జనియె నంత సాయాహ్నంబున.


3_2_182 క.

మానుగ ఋతుపర్ణుఁడు భీ

మానుఙ్ఞాతుఁ డయి చొచ్చె నాప్రోలు రథ

ధ్వానంబు మ్రోయుచుండఁగ

నానాదిఙ్ముఖములను ఘనధ్వనివోలెన్.


3_2_183 సీ.

దమయంతి యారథధ్వని విని యిది నలురథఘోషమని యనురాగమొంది

నలు నిషధేశుఁ బుణ్యశ్లోకు లోకోపకారకుఁ జూడంగఁ గాంతు నేఁడు

ఘనభుజుఁ జూడంగఁ గాననినాఁడుఁ దద్భుజపరిరంభణోద్భూతసుఖముఁ

బడయనినాఁడును బ్రాణముల్ విడుతు నేనని తలంచుచుఁ గమలాయతాక్షి


ఆ.

యారథాధిరూఢుఁడై వచ్చు ఋతుపర్ణుఁ

జూచి యప్పు డధికశోకతప్త

యగుచు నుండె నంత నాఋతుపర్ణుండు

భీముఁ గానవచ్చెఁ బ్రియముతోడ.


3_2_184 వ.

భీముండును వానిం బూజించి యొక్క రమ్యహర్మ్యంబున విడియించిన

ఋతుపర్ణుం డప్పురంబున స్వయంవరం బనుశబ్దంబు మొదలుగా వినం

గానక యాత్మగతంబున.


3_2_185 క.

ధరణిఁగలరాజు లిట యె

వ్వరు వచ్చినవారు లేరు వైదర్భి యొరున్

వరియింప నంత ధర్మే

తరచరితయె యనుచు నుండెఁ దద్దయు లజ్జన్.


3_2_186 వ.

బాహుకుండును రథశాల రథాశ్వంబుల బంధించి రథసమీపంబున విశ్ర

మించియుండె నంత దమయంతి బాహుక వార్ష్ణేయులతోడ వచ్చిన ఋతు

పర్ణుం జూచి విఫలమనోరథయై యుండనోపక కేశిని యనుదానిం బిలిచి

ఋతుపర్ణు నయోధ్యాపతింగా వార్ష్ణేయు నూతపుత్రుంగా నెఱింగించి

బాహుకుం డనువాఁడెవ్వండో వానియందు నాహృదయంబు ముదితం

బగుచున్నయది మన పర్ణాదునకుఁ బ్రతివచనం బిచ్చినవాఁడు వాఁడ

కావలయువాని కడకుం బోయి యెఱింగి రమ్మని పంచిన నదియును

బోయి బాహుకుం గని దమయంతి నీకుశలం బడుగఁ బుత్తెంచె నిందుల

కేమికారణంబున వచ్చి తనిన దానికి బాహుకుం డి ట్లనియె.


3_2_187 క.

ప్రియమున దమయంతి పున

స్స్వయంవరము సేయఁ గడగి సకలక్షత్త్రా

న్వయవీరుల రావించిన

నయనిధి ఋతుపర్ణుఁ డొక్కనాఁటన వేడ్కన్.


3_2_188 క.

వినవె శతయోజనంబులు

సనుదెంచె నయోధ్యనుండి సరి నిందుల కా

తని రథసారథి నై యే

నును వచ్చితి నతనితో మనోవేగమునన్.


3_2_189 వ.

అనిన మూఁడవవాఁడెవ్వఁడని యడిగిన నక్కేసినికి బాహుకుం డి ట్లనియె.


3_2_190 క.

నలురథచోదకుఁ డతఁ డ


త్యలఘుఁడు వార్ష్ణేయనాముఁ డనవుడు వాఁ డ

న్నలభూపాలకు పోయిన

వల నెఱుఁగండొక్కొ యనిన వాఁ డిట్లనియెన్.


3_2_191 వ. వార్ష్ణేయుండును నలుపుత్రుల విదర్భేశ్వరునొద్దఁ బెట్టిపోయి నడుమ

నలురాజ్యభ్రంశంబు విని ఋతుపర్ణుం గొవిచియుండె నాతండును నలు

నెఱుంగఁడు.



3_2_192 క.

నలుతో నొక్కట నరిగిన

నలినాయతనేత్ర భీమనందన యొండెన్

నలుఁడొండె నెఱుఁగుఁగాక

న్నలునొరులకు నెఱుఁగఁ గారణము గలదె మహిన్.


3_2_193 వ.

అనిన విని కేశిని యిట్లనియె.


3_2_194 సీ.

అడవిలో వస్త్రార్ధహారియై దయలేక ప్రాణేశ్వరుఁడు దనుఁ బాసి చనిన

నాటివస్త్రార్ధంబు నలినాక్షి యిప్పుడు బరిధానముగఁ బాంసుపటల మలిన

మగుచున్న తనువుతో ననయంబు జడగొన్న యలకావలులతోడ నవనితలము

శయనంబుగా ధర్మచారిణి దమయంతి యనఘవ్రతం బిట్టు లాచరించు


ఆ.

చున్న దనిన నవిరళోద్గతబాష్పపూ

ర్ణంబులైన లోచనంబు లెఱుక

వడకయుండ వదనపద్మంబు వాంచితా

నొండువలను సూచుచుండెనలుఁడు.


3_2_195 వ.

కేశినియును బాహుకుపలుకులు నాకారంబును దమయంతి కెఱింగించిన

నది యాతని నలుంగా శంకించి యింకను వాని కడ కేఁగుము వాఁడు

ఋతుపర్ణు వంటలవాఁడటె పచనసమయంబున వానిచరితం బిమ్ముగా

నెఱింగి రమ్మని పంచిన నప్పుడ చని కేశినియు బాహుకు నందుల

దైవమానుషనిమిత్తాద్భుతక్రియలు సూచి వచ్చి దమయంతి కిట్లనియె.


3_2_196 క.

అతని చరితంబు సెప్పఁగ

నతిమానుష మపగతప్రయాస మదృష్ట

శ్రుతపూర్వము పరమార్థమ

యతనిని వేల్పనఁగ వలయు నంబుజనేత్రా.


3_2_197 సీ.

వినవమ్మ తృణముష్టిఁ గొని వాఁడు వీచుడు నందగ్ని యుదయించి యతని వంట

లమరు నంతకు నింధనము లపేక్షింపక యుడుగక మండుచు నుండు మఱియుఁ

గడఁకతో నంజుళ్ళు గడుగంగ సమకట్టి జల మపేక్షించుడు సంభవిల్లి

కుంభముల్ నిండి దివ్యాంభః ప్రవాహ మక్షయ మగుచుండుఁ దత్క్షణమచూడ


ఆ.

నతని కరతలద్వయావమర్దితములై

కందియును మహాసుగంధకుసుమ

తతులు దొంటియట్ల తమకంపు విడువక

యుండు నతని తేజ మున్నతంబు.



3_2_198 వ.

అనిన విని దమయంతి వెండియుఁ గేశినిం బంచి బాహుకువండిన నంజుళ్ళు

దెప్పించి యాస్వాదించి బాహుకు నందు నలులక్షణంబులు గలుగు టెఱిం

గియు నూఱడ నోపక వాని పాలికిం గొడుకునుం గూఁతునుం గేశిని

తోడం బుచ్చిన నక్కుమారులం జూచి.


3_2_199 ఆ.

వశము గాక బాష్పవారి యొల్కుచునుండఁ

గొడుకుఁ గూఁతు నెత్తికొని నలుండు

హర్షపులకితంబు లయిన నజాంకంబు

లందు వారినునిచి యాదరమున.


3_2_200 వ.

అక్కేశినిం జూచి యిక్కుమారు లిద్దఱు నాకొడునుం గూఁతునుం

బోలిన వీరినెత్తికొని దుఃఖించితిననితన్నేర్పడ కుండంబలికి దానికిట్లనియె.