ఆ భా 3 2 141 to 3 2 170

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


- చేది పురంబున సుదేవుఁ డను బ్రాహ్మణుఁడు దమయంతి నెఱుంగుట - సం. 3-65-5

3_2_141 క. జగతీ చక్రమునంగల నగర మహాగ్రామ పట్టణంబులు కలయన్ జగతీ దేవోత్తము లి మ్ముగ రోసిరి నిఖిలదేశముల కరిగి వడిన్.

3_2_142 వ. అందు సుదేవుం డను బ్రాహ్మణుండు చేదిపతి యైన సుబాహు పురంబునకుం జని పుణ్యాహంబు సేయింపం బోవు బ్రాహ్మణులతో రాజగృహంబు సొచ్చి యంతఃపురంబున సునందా సహితయై యున్నదాని ధామజాల నిబద్ధం బైన యగ్ని ప్రభయునుం బోలె నీలాభ్ర సంవృతంబైన చంద్రరేఖయుంబోలె బహుపంక నిమగ్నం బైన మృణాళియుం బోలె నేర్పడ కున్ననుం దదీయ భ్రూయుగమధ్యగతం బైన సూక్ష్మ లక్షణం బిమ్ముగా నిరీక్షించి దాని దమయంతిఁగా నెఱింగి యాత్మగతంబున నిది పతి విముక్తయై శుష్క ప్రవారయైన నదియునుం బోలె శూన్యకమలయైన నళినియుం బోలె నపేత చూతం బైన వనభూమియుం బోలె నొప్ప కుండియుఁ దన పతివ్రతా గుణంబునం జేసి యొప్పుచున్న యది.

3_2_143 తే. అనపహార్యంబు తేజోమయంబు సర్వ గుణములకు నలంకారంబు గురుతరంబు భామలకుఁ బతిభక్తియ పరమమైన భూషణం బిట్టివే పెఱభూషణములు.

3_2_144 వ. రోహిణికిఁ జంద్రసమాగమంబునుం బోలె దీనికి భర్తృసమాగమం బెన్నం డయ్యెడునో తుల్యశీలవయో రూపాభిజాత్యులైన నలదమయంతు లొక్కటనుండం జూచి విదర్భేశ్వరుం డెన్నఁడు కృతార్థుం డయ్యెడునో యంచు నల్లనల్ల నడాయవచ్చి దమయంతి కిట్లనియె.

3_2_145 తే. అవ్వ నీ తల్లిదండ్రుల కాత్మజులకు బంధుజనులకుఁ గుశలంబు భామ నీదు కుశల మెఱుఁగునంతకు వంతగూరి వగచు చున్న వారు వారికి వంత యుడుగునింక.

3_2_146 వ. దేవీ యేను భవద్భ్రాతృ సఖుండ సుదేవుం డను బ్రాహ్మణుండ విదర్భేశ్వరుండు నీ యున్నచో టెఱుంగం బెక్కండ్రు బ్రాహ్మణులం బుచ్చిన నిందులకు వచ్చి నా పుణ్యంబున నిన్నుం గంటి ననిన దమయంతి వాని నెఱింగి తన పుత్త్రులఁ దల్లిదండ్రుల బాంధవుల బ్రత్యేకంబ యడిగి యశ్రుజలంబు లురుల నేడ్చుచున్నంజూచి యేలకో యిప్పుడు సైరంధ్రి యేడ్చుచున్న యది యని సునంద తన జననికిం జెప్పి పుచ్చిన.

3_2_147 క. చనుదెంచె నంతి పురమున వనితా నివహంబుతోడ వారిజదళలో చన రాజమాత నృపనం దన యగు దమయంతి కడకుఁ దద్దయు వేడ్కన్.

3_2_148 వ. ఇట్లు వచ్చి తమలో మాటలాడు చున్న బ్రాహ్మణుని దమయంతిం జుచి రాజమాత బ్రాహ్మణున కిట్లనియె నయ్యా యిది యెవ్వని కూఁతురెవ్వని భార్య యేమి కారణంబునం దన భర్తను బాంధవులనుం బాసి పుణ్యవ్రంతబులు సలుపుచున్నయది నీ వె ట్లెఱింగి తిక్కోమలి నామంబేమి యని యడిగిన సుదేవుం డిట్లనియె.

3_2_149 మధ్యాక్కర. నలినాక్షి యిది విదర్భేశు తనయ పుణ్యశ్లోకుఁ డైన నలు దేవి దమయంతి సుమ్ము విధి కారణమ్మున రాజ్య చలితుఁడై నిజ నాథుఁ డరిగిన దోన చనియె నవ్వార్త వెలయంగ విని వీరి రోయఁ బంచె భూవిభుండు బ్రాహ్మణుల.

3_2_150 వ. ఏ నిందులకు వచ్చి మీచేత సురక్షితయై యున్న యిక్కోమలిం జూచి దీని భ్రూమధ్యంబునం బద్మప్రభం బై విభూత్యర్థంబుగా విధాతనిర్మితంబైన పుణ్యలక్ష్మంబు పాంసుపటలచ్ఛన్నం బై యున్న నుపలక్షించి మా రాజపుత్త్రింగా నెఱింగితి ననిన సునంద శుద్ధోదకంబున దాని భ్రూ మధ్యంబు గడిగిన నది విస్పష్టం బగుడు నందఱు నాశ్చర్యంబందు రంత.

3_2_151 సీ. ఆనంద భరితాత్మ యై రాజమాత యక్కమరాక్షిఁ బ్రీతితేఁ గౌఁగిలించి కొని తల్లి నీవు నా కూఁతుర వేను నీ జననియుఁ బేర్మి దశార్ణ రాజ తనయల మదియు విదర్భేశుపతి యయ్యె నే వీరబాహున కింతి నైతి ననిన నయ్యవ్వకు నతివినయంబుతో నలు దేవి మ్రొక్కి సునంద నెత్తి

ఆ. కొని కరంబు నెమ్మిఁ గొన్ని దినంబు లం దుండి యిట్టు లనియె నొక్కనాఁడు దేని యిదియు నదియు ధృతి నాకుఁ బుట్టిన యిండ్ల కడు సుఖంబ యిందునందు.

3_2_152 వ. అయినను దల్లిదండ్రుల ననుజుల నాత్మజులం జూడ వేడుక యైనది విదర్భకుం బోయెద నానతిమ్మని కృతాంజలి యైన దమయంతి నతి స్నేహంబున సుబాహుజనని సుత ప్రేషిత జలంబుతో సువర్ణ మణిమయ విమానోపమాన యానంబున సునిచి పుచ్చిన.

- దమయంతి నలు నెడఁబాసి విదర్భాపురంబు సేరుట - సం. 3-66-22

3_2_153 ఉ. భామ విదర్భకేఁగి తన బంధు జనంబుల యొద్ద నుండియుం గోమలి దేహసౌఖ్యములకున్ వెలియై మలినార్ధ వస్త్రమున్ భూమిరజంబు నంగమునఁ బొల్పగు చుండఁగ నుండె జీవిత స్వామి నిజేశుఁ జూచు దివసంబుల కోరుచు సువ్రతంబుతోన్.

3_2_154 వ. ఇట్లు భర్తృ వియోగాతురయై దమయంతి ప్రాణంబు భరియింప నోపక యొక్కనాఁ డేకాంతంబునఁ దన జనని కిట్లనియె.

3_2_155 క. శో కాపనోదిఁ బుణ్య శ్లోకుని నలు రోయఁ బనుపు శుభచరితుఁ దదా లోకన విహీననే పర లోకకృతావాస నగుదు లోకం బెఱుఁగన్.

3_2_156 వ. అనిన నదియును గూఁతు నభిప్రాయంబు భీమున కెఱింగించిన నాతండు నలు మార్గణంబున ఋజుమార్గు లయిన బ్రాహ్మణుల నియోగించినం దనపతి నన్వేషింప నరుగు బ్రాహ్మణులకు దమయంతి యిట్లనియె.

3_2_157 ఆ. నైషధేశ్వరుండు నలుఁ డిప్పు డసమర్థుఁ డగుటఁ జేసి తన్ను నన్యు లెఱుఁగ కుండ నుండుఁ గాన యురుసభాంతరముల కరిగి యిట్టులనుఁడు మీరు.

3_2_158 సీ. నిత్యసత్యుండవు నీ సతి వంచించి దాని వస్త్రార్ధంబు దఱిగి నీకుఁ బరిధానముగఁ జేసి పాడియే పోవంగ భార్య భర్తవ్యనాఁ బరగు ధర్మ మది మిథ్యయయ్యె నీ యందు నీకిట్టి నిర్దయ బుద్ధిఁ జేకొనఁ దగునె యట్టి సాధ్వికిఁ గరుణఁ బ్రసన్నుండ వగుమని యెల్లచోఁ బనికిన నెవ్వఁడేనిఁ

ఆ. బలుకు వడఁగ నోడి ప్రతివచనం బిచ్చు నతఁడు నలుఁడుగాఁ బ్రియంబుతోడ నెఱిఁగి నన్ను నతని కెఱిఁగించి తోడ్కొని రండు రానినాఁడు రం డెఱింగి.

3_2_159 వ. అని బంచిన బని పూని బ్రాహ్మణులు దమయంతి కఱపిన పలుకులెల్ల సభలం బలికి యెందునుం గానక వచ్చి రందుఁ బర్ణాదుం డను బ్రాహ్మణుండు దమయంతి కిట్లనియె నేనయోధ్య కరిగి నీ కఱపిన పలుకు లెల్ల ఋతుపర్ణు సభం బలికిన నొక్క పురుషుండు కుఱుచ చేతుల వాఁడు ఋతుపర్ణు నొద్ద నూఱుగద్యాణంబులు జీవితంబు వాఁడు శీఘ్ర యాన కుశలుండు సూద క్రియా నిపుణుండు విరూపాంగుండు బాహుకుం డను నశ్వ శిక్షకుండు విని నేకతంబ కనుంగొని వెలువెల నగుచు దీర్ఘనిశ్వాసపురస్స రుండై యిట్లనియె.

3_2_160 ఆ. పురుషునందు దోషపుంజంబు గలిగిన నెఱిఁగి యెద సహించు నేని భార్య పురుషునం దభీష్ట భోగంబు దేహాంత రంబునందు ధర్మరతియుఁ బడయు.

3_2_161 వ. అని యొండెద్దియుం బలుకక తన నివాసంబునకు బోయె నని చెప్పిన విని దమయంతి బెద్దయుం బ్రొద్దు చింతించి నలుండు గాని వాఁడు ప్రతివచనం బేల యిచ్చు నింకను వలను గల వారలం బంచి యాతని నిమ్ముగా నెఱుంగ వలయు నని నిజ జనని యనుమతంబున సుదేవి రావించి వాని కిట్లనియె.

3_2_162 క. నన్నెఱిఁగి తెచ్చినట్లు జ గన్నుతు నలు నెఱిఁగి తెమ్ము కౌశలమున వి ద్వన్నుత సర్వగుణ సం పన్నుండవు నీవ బుద్ధిఁ బరికింపంగన్.

3_2_163 క. అరుగు మయోధ్యకు దేశాం తర విప్రుఁడవై రవివ్రతాపోన్నతు ను త్తర కోసలేశు భాంగా సరినిం గను మనఘ సమరసము ఋతుపర్ణున్.

3_2_164 వ. మఱి విదర్భా విభుం డగు భీముండు నలు రోయం బంచి యెందునుం గానక యింకను దమయంతికిఁ బుస్స్వయంవరంబు రచియింపం బోయిన నందులకు భూవలయంబునం గల రాజు లెల్లను బోయెద రని యతి త్వరితంబుగా ఋతుపర్ణునకుం జెప్పు మని పంచిన సుదేవుం డయోధ్యా నగరంబునకుం బోయి ఋతుపర్ణుం గాంచి విదర్భా పురంబున దమయంతీ ద్వితీయ స్వయంవరం బెల్లియె యయ్యెడు నని చెప్పిన విని ఋతుపర్ణుండు బాహుకు జూచి నాకు దమయంతీ స్వయంవరంబుఁ జూడ నొక్కనాఁటన విదర్భకుం బోవలయు నీ యశ్వ శిక్షా నైపుణ్యంబుఁ బ్రకాశింపు మనవుడు నట్ల చేయుదు నని నలుండు దన మనంబున దుఃఖించి.

3_2_165 ఆ. అడవిఁ దన్నుఁ బాసి యరిగిన నలిగి కా కున్నె యిట్లు సేయ నువిద గడఁగె నెట్లయేనిఁ గూర్తు రింతులు మాకని విశ్వసించువారు వెడఁగు లెందు.

3_2_166 ఆ. సాధ్వి నాకుఁ గూర్చు సంతతి గలయది చెలువ యిట్టులేల చేయు నైన నెఱుఁగ వలయు దీని నే ఋతుపర్ణుతోఁ బోదు నని నలుండు బుద్ధిఁ దలంచి.

3_2_167 వ. తొల్లి వార్షేయుండు దెచ్చిన తన రధంబునందు నిజ హయంబుల బూన్చుకొని వచ్చిన ఋతుపర్ణుం డా రథం బెక్కునప్పుడు హయంబులు మ్రొగ్గినం జూచి యప్పేద గుఱ్ఱంబు లతిదూరం బెట్లు పోవ నోపు నొండు గుఱ్ఱంబులం బూన్పు మనిన బాహుకుం డిట్లనియె.

3_2_168 క. అవనీశ యీ హయంబులు పవన గతిం బఱచుఁ బ్రొద్ద వడకుండఁగ నేఁ డ విదర్భకు ననవుడు విని కువలయపతి మెచ్చి బాహుకున కిట్లనియె.

3_2_169 వ. అట్లయిన నీ హయ తత్త్వ కౌశరం బెఱింగి నీకు నభిమతం బొనరింతు నని రథం బెక్కి బాహుక వార్ష్ణేయ సహితుం డయు యరుగు వాఁడు.

3_2_170 మధ్యాక్కర. ఎదురను దవ్వులఁ జూచిన పొడవులెల్లఁ దత్క్షణమ కదియఁగా నవ్వి యెంతయును దవ్వయి కనఁబడఁ బిఱుఁద నిది దినేశ్వరు రథమో యనూరుఁడో యితఁడంచు నపుడు హృదయమునను గడు విస్మయం బందె నిక్ష్వాకుకులుఁడు.


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com