ఆ భా 3 2 111 to 3 2 140
వోలం సురేష్ కుమార్
3_2_111 సీ. అర్థరాత్రము నప్పు డందుల కేతెంచె గజయూథములు జలకాంక్షఁ జేసి యంబుధి విమలతోయంబు లాస్వాదింపఁ జనుదెంచు జలధరసమితి యట్ల యచ్చన్పలోన నిద్రాసక్తులైన వారున్న తద్విపములయు గ్రపాద హతిఁ జేసి మర్దితులైరి కొందఱు దంతహతిఁ జేసి భిన్నాంగులైరి కొంద
ఆ. ఱఱచి ప్రాణభీతిఁ బఱచి మహీజంబు లెక్కిరందుఁ గొంద ఱుక్కడంగి చనుప యిట్టిపాటఁ బెనుపఱి యవినీతు సిరియుఁ బోలె నడఁగి విరిసి చనియె.
3_2_112 వ. అట్టి సంక్షోభంబున మరణంబునకుఁ దప్పి దమయంతి యాత్మగతంబున
3_2_113 ఆ. జీవితార్థులైన జీవుల సుఖసుప్తు లైన వారిఁ జంపె నఱవ నఱవ మరణకాంక్షనున్న మగువఁ జంపక నను మఱచె విధికరంబు మందబుద్ధి.
3_2_114 సీ. ఇచ్చన్పతోఁజని యివ్వనక్లేశంబు దలుగురు నని బుద్ధిఁ దలఁచి యున్న నురుతం సార్థపయోరాశి హస్తియూథా గస్త్యుచేఁ బీతమయ్యె నదియుఁ దొలుమేనఁ జేసిన దుష్క-త శక్తి యో వగవక నా స్వయంవరము నాఁడు సురవరు లర్థులై చూచుచు నుండఁగ నలు వరియించిన నాఁటి యెగ్గు.
ఆ. దలఁచి యిట్టి యాపదలు సేసిరో వేల్పు లమర కోపమునన యయ్యె నాకు నివ్వియోగదుఃఖ మింకేమి సేయుదు ననుచు వగచుచుండె నంబుజాక్షి.
- దమయంతి సుబాహుపురంబు ప్రవేశించుట - సం. 3-62-28
3_2_115 వ. ఇట్లు దుఃఖించుచు దమయంతి ప్రభాతంబ హతశేషులైన యచ్చనుపలోని బ్రాహ్మణవరులతో ననవరత ప్రయాణంబులం జేదిపతి పురంబు సొచ్చి జనసంకులం బైన రాజమార్గంబు దఱియవచ్చుచున్న దాని దినకర ప్రభాపటలధూసరిత ప్రభాతచంద్రరేఖయుం బోలె దీప్తి విహీనయై డస్సియు రమ్యాకృతియైనదానిఁ దమయంతిం బ్రాసాదగతయైన రాజమాత దవ్వులం గని తనదాది కిట్లనియె.
3_2_116 తే. జీర్ణమై కడుమాసిన చీరగట్టి ధూళిసరాలకములు దూలుచుండ నబల యున్మత్తవేషిణియైన లచ్చి కరణి నిట వచ్చుచున్నది కంటె దాని.
3_2_117 వ. అక్కోమలియందు నా కతిస్నేహం బై యున్నయది దానిందోడ్కొని రమ్మనిన నదియు దమయంతిం దోడ్కొని రాజమాతయొద్దకుం జనిన నారాజమాతయు దానిం జూచి నీవెవ్వరిదాన విట్లేల దుఃఖావేశ వివశుడై యున్న దానవు చెప్పు మనిన దమయంతి యిట్లనియె.
3_2_118 మధ్యాక్కర. జితవైరి మత్పతి జూదమాడి నిర్జితుఁడయి చనినఁ బతితోడ నీడయుఁ బోలె నేనును బాయక యరిగి యతిబుభుక్షాతురుండైన పతిచేత నవ్వ దైవాను మతిఁజేసి వంచిత నైతి నొక్కచో మఱచి నిద్రించి.
3_2_119 వ. అంతనుండియు నమ్మహానుభావు నేకవస్త్రు ననికేతను నన్వేషించుచు సైరంధ్రీ వృత్తంబు సేకొని వియోగానలంబునం గంది కందమూల ఫలంబుల యాహారంబుగాఁ బ్రొద్దు వడినచోట నివాసంబుగా మృగంబుల సహాయంబుగా వనంబులం బరిభ్రమించితి నని బాష్పజలంబులం బయోధర స్థలపరాగంబు పంకంబు సేయుచుఁ బలుక నేరకున్న యా దమయంతికి రాజమాత యిట్లనియె.
3_2_120 క. నీవుండు ము నాకడ నిం దీవరదళ నేత్ర నీపతిని రోయఁగ భూ దేవోత్తములం బంచెద నావుడు నిట్లనియె భీమనందన నెమ్మిన్.
3_2_111 వ. ఏను సైరంధ్రి నయి యుండియు నుచ్ఛిష్టంబు ముట్టను బదధావనంబు సేయను బరపురుషులతోఁ బలుక నోపఁ బతి నన్వేషించుపొంటె నరిగెడు బ్రాహ్మణులతోఁ బలుకుదు నట్లయిన నీయొద్దన యుండు మని దాని నతిగౌరవంబునం జేకొని యుండఁ దనకూఁతు సునంద యనుదాని సమర్పించిన.
3_2_122 క. అలయక పుణ్యవ్రతములు సలుపుచు జేదీశుపురిని సైరంధ్రియనన్ నలుదేవి యుండె నెదఁ బతిఁ దలఁచుచు దుస్సహవియోగతా పార్దతయై.
3_2_123 వ. అట నలుండు దమయంతిం బాసి దారుణారణ్యంబుతో నరుగువాఁడు ముందట.
3_2_124 చ. అవిరళవిస్ఫులింగ నివహంబుల నభ్ర పథంబు నంటుచున్ దవదహనం బుదగ్రతరుదాహము సేయుచు నున్నఁ జూచి మా నవవతి దాని యంతరమునన్ వినియెన్ నరనాథ నన్ను గా రవమునఁ గావ వేగ యిట రమ్మను నార్త మహానినాదమున్.
3_2_125 క. విని శంకింపక చెచ్చెర ననఘుం డత్యుగ్రతరదవానలసధ్యం బున కుఱికి కనియె దీనా నను కుండలితాంగు నొక్క నాగకుమారున్.
3_2_126 వ. అన్నాగ కుమారుండును నలునకుం గృతాంజలియై యేను గర్కోటకుండను వాఁడఁ గర్మవశంబున నొక్కబ్రహ్మఋషి నుపాలంభించి తచ్ఛాపంబున నెక్కడం గదలనేరకున్న వాఁడ నియ్యెరగలి చిచ్చు సర్వజీవులకు సంహార కారణంబై బేర్చి నలుదెసలం గలయం బర్వి చనుదెంచు చున్నయది యీ యపాయంబు దలఁగు నట్లుగా నుద్ధరింప వలయు నీవు కరాణాత్మకుండవు గావున నిన్ను వేడెద.
3_2_127 క. నాలుగు దిశలను దావ జ్వాలావలి గవిసె మ్రంది చానోప మహీ పాలక నన్నొక సరసీ కూలముఁ జేరంగ నెత్తికొని పొమ్ముదయన్.
- నలుఁడు గర్కోటకుని చేత దష్టుం డగుట - సం. 3-63-7
3_2_128 వ. నన్ను రక్షించిన నీకుం బ్రియంబు సేయ నోపుదు ననిన వానినెత్తికొని పోవం జులుక నై యంగుష్ఠ ప్రమాశదేహుండై యున్న నెత్తికొని నలుం డతి త్వరితగతి నరిగి తాపవర్జితంబైన యొక్క సరోవర సమీపంబున విడువం బోయిన నింకను బదియడుగు లరుగుము నీకు శ్రేయఃప్రాప్తిఁ జేసెద ననిన నడుగు లెన్నికొనుచు నరిగి పదియగు నడుగు నప్పుడప్పాముచేత దష్టుండై తన రూపంబు విడిచి వికృతరూపంబుతో నున్న నన్నలులకుం గర్కోటకుం డాత్మరూపంబు సూపి యిట్లనియె నయ్యా నీవు నా చేత విషపీడితుండ వైతినని దుఃఖింప వలదు నిన్నొరులెఱింగిన నెగ్గగుం గావున వికృత శరీరుం జేసితి నెంత కాలంబు నీశరీరంబున నావిషం బుండు నంతకాలంబునకు నీకు విషోరగరాక్షసపిశాచశత్రు నివహంబు వలని భయంబు లేదు సర్వ సంగ్రామజయంబును భార్యాసంగమంబును నెప్పటి రాజ్యవిభవంబును నగు నీకెప్పుడేని నిజరూపంబు సేకొన నిష్టంబయ్యె నప్పుడ నన్నుం దలంపు మీ వస్త్రంబు నీయొద్దకు వచ్చు దీని ధరియించుడు నిజరూప ప్రాప్తియగు నని వరంబిచ్చి వెండియు నిట్లనియె.
3_2_129 మధ్యాక్కర. ఇలఁ బ్రసిద్ధుఁడు ఋతుపర్ణుఁడనెడు మహాశుఁ డిక్ష్వాకు కులజుండు నీకు సేవ్యుండగు నతనిఁ గొలిచి యందుండు నెలకొని యతనికి నశ్వహృదయ మనెడి విద్యయిచ్చి వెలయ నతనిచేత నక్షహృదయ మన్విద్యఁ జేకొనుము.
3_2_130 వ. మఱియు బాహుకుం డనునామంబుతో సూతవృత్తి నుండు మని హితోపదేశంబు సేసి కర్కోటకుం డదృశ్యుండైనఁ దద్వచనంబున నలుఁ డయోధ్యా పురంబునకుం జని ఋతుపర్ణుం గని యేను బాహుకుం డనువాఁడ నశ్వ శిక్షయందుఁ గుశలుండ నన్న సంస్కారంబులు శిల్పంబులుఁ బెక్కువిధంబుల రచియింప నేర్తు భవత్సేవార్థినై వచ్చితి ననిన ఋతుపర్ణుం డిట్లనియె.
3_2_131 క. నా యొద్దనుండు దేని మ దీయ రథాశ్వములకును ద్రుతిని శీఘ్రముగాఁ జేయుము నావుడు నట్టుల చేయుదు నని నలుఁడు వాని సేవించెఁ దగన్.
3_2_132 వ. ఇట్లు ఋతుపర్ణునొద్ద నశ్వాధ్యక్షుం డయి దుష్టాశ్వంబుల వశంబుఁ జేయుచు నశ్వారోహకుల నారోహణంబుల శిక్షించుచు రసవంతంబుగ నన్నసంస్కారంబు సేయుచు ఋతుపర్ణుచేత నియుక్తులయిన వార్షేయజీవలులు దనకు సహాయులుగాఁ బ్రచ్ఛన్నుండై యుండి యొక్కనాఁడు.
3_2_133 సీ. ఇభరాజగమన నీవెందుల కరిగి తత్యరు కుచభార యెందున్న దాన వబల యెవ్వరి చేత నడవులలోఁ బట్టువడితశనాపేక్షఁ బఱచుచున్న యుగ్రమృగంబుల యుదరంబు లో నున్నదానవే నీ తల్లిదండ్రులొద్ద ధృతి నున్న దానవే దేశాంతరంబుల నున్నదానవె యంచు నదితమదన
ఆ. హతి విమోహితాత్ముఁడై హృదయేశ్వరిఁ దలఁచి రాత్రులెల్లఁ దానమునను నిద్రలేక వంది నిట్టూర్పు లూర్పుచు నుండె నలుఁడు శోక ముత్కటముగ.
3_2_134 వ. అతని ప్రలాపంబు విని యొక్కనాఁడు జీవలుం డత్మగతంబున.
3_2_135 క. అఱపొఱడుకుఱుచ చేతులు నొఱవ శరీరంబుఁ గలిగి యొరులకుఁ జూడం గొఱగా కుండియు మన్మధు నొఱపులఁ బడియెడు నితండు యువతీ ప్రియుఁడై.
3_2_136 వ. వీనిచేత దలంపబడియెడు వనిత వీనికంటె లెస్స కాకున్నె యనుచు బాహుకునొద్దకు వచ్చి నీ తలంచుచున్న భార్యకు నీకు నేల వియోగం బయ్యెనని యడిగిన వానికి బాహుకుం డిట్లనియె.
3_2_137 అ. నన్నుఁ జూచి నగరె నలినాక్షి నాకేల విప్రయోగమేల వినవె తొల్లి యేలయో యెఱుంగ నేను మందప్రజ్ఞుఁ డను భటుండు దనలతాంగిఁ బాసి.
3_2_138 వ. దాని నన్వేషించి యెందును గానక దుఃఖితుండై ప్రలాపించినం దత్ప్రలాపం బేను ననుకరించితి నని చెప్పి యిట్లయోధ్యాపురంబునఁ బ్రచ్ఛన్నుఁడై బాహుక నామంబుతో నలుం డుండె నంత నిట విదర్భేశ్వరుండు నలు రాజ్యభ్రంశంబు విని కూఁతురు నల్లుఁడు నెటవోయిరో యెందున్న వారో యని శోకించి.
3_2_139 క. వారల రోయఁగఁ బంచె న పారబలుం డిష్టులైన బ్రాహ్మణుల సదా చారుల విద్వాంసుల స త్కారంబులఁ దనిపి వారిఁ గడు నెయ్యమునన్.
3_2_140 వ. మఱియు నలదమయంతు లున్నచో టెఱించి వచ్చిన వారికి వెయ్యేసి గద్యాణంబు లిత్తు ననియు వారలం దోడ్కొని వచ్చిన వారికి గోసహస్రంబులు నగ్రహారంబులు నిత్తు ననియుఁ బలికి పంచిన.
వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com