Jump to content

ఆ భా 3 2 051 to 3 2 080

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


వ. అనిన దమయంతి నయనాంతర్గళిత బాష్ప ధారాకలతకపోలయుగళ యగుచుం బెద్దయుం బ్రొద్దు చింతించి నీ యభిప్రాయంబునకు నిరపాయంబయిన యిపాయంబు గంటి నింద్రాదులు నా స్వయంవరంబులకు వచ్చెదరేని వారోసన్నిధిన నిన్ను వరియించెద నట్లయిన నీకు నిర్దోషం బగు ననిన నలుండు లాకపాలురపాలికిం బోయి దమయంతి కిం దన పలికిన విధంబును దనకు దమయంతి పలికిన విధంబు జెప్పె నంతఁ బుణ్యతిథినక్షత్ర శుభముహూర్తంబున దమయంతీ స్వయంవరంబు ప్రవర్తిల్లిన. 051

ఆ. నలున కాని నలినదళ నేత్ర వరియింప దట్టె చూత మనుచు నమరవరులు నలువురును గడంగి నలరూపమున వచ్చి రాస్వయంవరమున కతి రయమున. 052

వ. అంత. 053

సీ. దమయంతి సితపుష్ప దామాభి శోభిత హస్తయై చనుదెంచి యంబుజాక్షి యమ్మహాత్సవ దర్శనాగం రాజన్య నివహంబు నీక్షించి నెమ్మితోడ నలువురు వేల్పులు నలుఁ దొట్టి యప్పుడేకాకారులై యున్న నందు నలుని నేర్పరింపఁగ నేర కింద్రాదులను నలు నెఱుఁగు నుపాయమింకెద్ది యొక్కొ.

ఆ. యనుచు సంశయాకులాత్మయై సురలార నలు నెఱుంగు విధము నాకుఁ జేఁయు డాత్మ రూపధరుల రగుఁడని పరిదేవ నంబు సేసెఁ దనమనంబులోన. 054

వ. దేవతలు దాని పరిదేవనంబు విని కరుణించి యనిమిషలోచనంబులు నస్వేద గాత్రంబులు నొప్ప నవనీతలంబు ముట్టక యాసన్నులై నిలిచి రంత లోక పాలురును భూలోకంబునఁ గలరాలోకంబు నవలోకించుచుండఁ బుణ్య శ్లోకుం డయిన నలు ధర్మ విధానంబున వరియించి దమయంతి తదీయ స్కంధంబున సుగంధి కుసుమ దామకంబు వెట్టిన. 055

క. దేవతల సాధువాదము తో విప్రాశీరవంబుతో బహుతూర్యా రావంబులు సెలఁగెను బా రావారరవంబుఁ బోలె ననివార్యములై. 056

- నలుండు స్వయంవర లబ్ధయైన దమయంతిం బెండ్లియగుట - సం. 3-54-25

వ. ఇట్లపూర్వ స్వయంవర లబ్ధయైన దమయంతి నత్యంత విలాసంబుతో వివాహంబైన యా నలునకు నింద్రుండు వాని యజ్ఞంబులయందు నిజరూపంబుఁ జూపను నగ్నియు వరుణుండును వాని వలచిన చోటన యగ్నిజలంబు లుత్పాదింపను ధర్ముండు ధర్మువునంద వానిబుద్ధి వర్తల్లను వరంబు లిచ్చి దేవలోకంబున కరుగువా రెదుర ద్వాపరంబుతో వచ్చు కనిం గని యెందురకుం బోయెదవని యడిగిన నింద్రాదులకుఁ గని యిట్లనియె. 057

తే. అవనిలో దమయంతీ స్వయంవరంబు విస్తరిల్లుట విని కడు వేడ్కతోడ నేను దమయంతిచే వరియింపఁ బడుదు నని తదర్థినై యరిగెద నాసఁ జేసి. 058

వ. అనిన నందఱు నగి నీవందుల కేలపోయె దది ముందర నిర్వృత్తం బయ్యె నక్కోమలి యొరుల నెవ్వరి మెచ్చక నలుం డను వాని వరియించె ననినం గలి కరం బలిగి యన్నలునకు దమయంతికి రాజ్యవిభవ పరిత్యాగంబును బరస్పర వియోగంబునుం జేసెదనని నిశ్చయించి వాని నక్షరతుంగా నెఱింగి యక్షంబులం జొచ్చియుండ ద్వాపరుం బనిచి నలుసేయుచున్న యశ్వమేధాకికానేక భూరి దక్షిణ మహా క్రతువులయు జపహోమదానాది వివిధ పుణ్యకర్మంబులయుఁ గారణంబునం జొరనవసరంబు గానక యంతరం బన్వేషించుచుఁ బెద్దకాలం బుండి యొక్కనాఁ డతండు కృత మూత్రుండయి జలోప స్పర్శనానంతరంబునం బాదశౌచంబు సేయ మఱచి సంధ్యోపాసనంబు సేసిన నుపలబ్ధావసరుం డయి కలి నలునందుఁ బ్రవేశించి పుష్కరుం డను వాని పాలికిం బోయి తన్నెఱింగించి నీవు నలునితో జూదంబాడి వాని రాజ్యంబును సర్వస్వంబును నొడిచికొమ్మని చెప్పి తానును వానికి విప్రవేషంబున సహాయుండయి యక్షంబులు గొని పుష్కరునితో నొక్కటం జని నలుం గాంచి నీవు మాతోఁ జూదం బాడు మనిన. 059

క. ద్యూతార్థము తత్కితవా హూతుఁ డనై జూద మాడకుండుట ధర్మా పేతం బని యభిముఖుఁడై యాతనితో నలుఁడు జూదమాడఁ గడంగెన్. 060

క. కలధనము లెల్ల నొడ్డుచు నలయక జూదమున విజితుఁ డగుచుండె నిజా ప్తులు వారించిన నుడుగక నలుఁడు కలిప్రేరణంబునను హతమతియై. 061

వ. ఇట్లనేక మాసంబులు దుర్వ్యసనాసక్తుం డయిన యన్నలుండు వివిధ వస్తు వాహన నివహంబు లొడ్డి పుష్కరున కోటు వడంబోయిన నెఱింగి పౌర బ్రాహ్మణ ప్రధానువరులు దమయంతీ పురస్కృతు లయి వచ్చి వారించి కలి సమావేశ పరవశుండైన యన్నలుచేతం బ్రతిహతు లయి పలుకకుండి రంత దమయంతి చింతా క్రాంతా చిత్తయై. 062

ఆ. ఎంతయోటు వడిన నంతియ జూదంబు నందుఁ దగులుఁ జలము నతిశయిల్లు నేమిసేయుదాన నిది యెగ్గునకు మూల మని లతాంగి దుఃఖితాత్మ యగుచు. 063

సీ. అక్షముల్ పుష్కరునందు వశ్యంబులై యునికియు నలునియందొండు విధము లగుటయు నెఱిఁగి నిజాధీశ్వరున కపజయము కా లక్షించి సరసిజాక్షి భర్తయనుజ్ఞ మున్ బడసి వార్షేయుఁడన్ సారథిఁ బిలిచి యీస్యందనమున నింద్రసేనుం డను నిక్కుమారకు నింద్రసేన యన్కూఁతుఁ జెచ్చెరను దోడు

ఆ. కొని విదర్భ కరిగి గుఱుగొని మద్బంధు జనులయొద్దఁ బెట్టి చట్ట రమ్మ యంచు నెమ్మిఁ బుచ్చె నాప్తపురోహిత మంత్రి బాంధవాబిముతము గాఁగ. 064

క. నలుఁజును ధరణీరాజ్యము దలఁగఁగ సర్వంబు నపహృతంబైనఁ గడుం దలరి దమయంతిఁ దోడ్కొని వెలువడియె నశేష రాజ్యవిభవచ్యుతుఁడై. 065

తే. పురము వెలి మూఁడహోరాత్రములు వసించి యున్న నలుపారికెవ్వరు నోడి రరుగ జనవిభుండైన పుష్కరు శాసనమున గలి కృత ద్యూత విద్వేష కారణమున. 066

వ. ఇట్లు సర్వజన సత్కారార్హుం డయ్యును నలుండు విధికృతంబున నెవ్వరి వలనను సత్కారంబు గానక జలంబు లాహారంబుగాఁ దత్పుర సమీపంబున దమయంతీ ద్వితీయుండై యుండి బుభుక్షా పీడ సహింపనోపక హిరణ్య పక్షంబులతోఁ దమముందటఁ దిరుగుచున్న పక్షులంగని యవి భక్ష్యంబు లగునని యప్పక్షులం బట్టికౌన సమకట్టి తన కట్టిన పుట్టంబు వానిపై వైచిన నవి పుట్టంబు తోన గగనంబున కెగసి నగుచు విగత వస్త్రుండైన నలున కిట్లనియె. 067

- నలుండు దమయంతీ సహితుండై యడవికిఁ బోవుట సం. 3-58-25

తే. నీ ధనంబును రాజ్యంబు నికృతిఁగొన్న యక్షముల మేము నీ వస్త్ర మపహరింపఁ బక్షిరూపులమై వచ్చి పార్థివేంద్ర యపహరించితి మని చెప్పి యరిగెఁ జదల. 068

వ. నలుండును వానిం జూచి విస్మయం బంది యీ యక్షంబుల దోషంబునం గాకేమి నాకిట్టి దయ్యె ననుచు దమయంతి కట్టిన పుట్టంబు చెఱంగు గట్టికొనియె నట్లిద్దఱు నేక వస్త్రులయి యొండొరుల మొగంబులు సూచి దుఃఖిచుచొ నలుండు దమయంతి కిట్లనియె. 069

క. ఇది దక్షిణా పథంబున కిదియు విధర్భాపురమున కిది కోసల కి య్యది యుజ్జయినికిఁ దెరువులు మది నిన్నిటిలోన నరుగ మనకెద్దియగున్. 070

క. అడవులలో నాతోఁ గడు నిడుమలు వడనోప వరుగు మిందుముఖీ యి ప్పుడు నీ బంధుజనంబుల కడ కనవుడుఁ దరుణి శోకగద్గద యగుచున్. 071

ఆ. అతని కిట్టులనియె నవనీశ నీవును నేనుఁ జని విదర్భ నిష్టలీల నుండుదము మృగాకురో గ్రవనంబుల కరుగనేల యిడుమ లందనేల. 072

వ. అనిన విని నలుం జవనతాననుండై నీ చెప్పినట్లు విదర్భేశ్వరు రాజ్యంబును మన రాజ్యంబ యేను దొల్లి యధికైశ్వర్యయుతుడనై యందులకుంబోయి బంధుజనులకు హృదయానందంబు సేసి యిప్పుడివ్విధంబున సర్వస్వహీనుండనై యెట్లు పోవనేర్తుననిన దమయంతి యిట్లనియె. 073

తే. అధిక దుఃఖ రోగార్తున కౌషధంబు సురుచిరంబుగ భార్యయ చూవె యెందు నొనర భార్యాసమేతుఁడై యున్నవాని కెంతలయ్యును నాపద లెఱుక పడవు. 074

క. అలసి నెడ డస్సి నెడ నాఁ కలి దప్పియు నైన యెడలఁ గడుకొని ధరణీ తలనాథ పురుషునకు ని మ్ముల భార్యయు పాచుఁ జిత్తమున దుఃఖంబుల్. 075

వ. కావున నిది మదనుజీవితయనియును ననువ్రతయనియు నను కంపనీయ యనియు నన్ను విడువక నాయనుగమంబున కొడంబడుమనిన నట్ల చేయుదుఁ బ్రాణ సమాన వైన నిన్నేల విడుతు నోడకుండుమని నలుండు దనదేవి నాశ్వాసించుచు నొక్కటఁ జని విజనంబైన వినినంబున నొక్క సభం గని యందు విశ్రమించి పరుషధూళిధూసరస్థలంబున శయనించి మార్గశ్రమ నిమీలీత నయనుండై దుఃఖమునఁ గన్నులు వొందకున్న లేచి తన పాదంబుల యంతికంబున నతి క్లేశపరవశయై నిద్రవోయెడు దమయంతిం జూచి. 076

సీ. ధరణి రాజ్యంబుతో ధనమెల్లఁ బరులచే నపహృతంబగుటయు నాప్తమిత్త్ర బంధుజనంబులుఁ బ్రకృతి జనంబుయు విడుచుటయు మహావిపిన భూమిఁ బత్నితేఁ దన పరిభ్రమియించుటయు నప్డు దలఁచి శోకించి యిత్తరుణి దొల్లి మృదుశయనంబున మెలఁతలు మెలపుతో నడుగులొత్తఁగ నిద్ర యనుభవించు

ఆ. కోమలాంగి యిపుడు గుఱుకొని పాంసుల స్థలము నందు నిద్ర దగిలినది యుఁ బంకజాక్షి నాకు భార్యయై యింత దుః ఖంబు వొందె దైవ ఘటనఁ జేసి. 077

వ. ఏను దీని దుఃఖంబు జూడనోప నెటయేనియుం బోయేద నిధి నన్నుంగానక తన బంధువుల యొద్దకుం బోయి దుఃఖంబులం బొరయ కుండునని విచారించి పోవ సమకట్టి యక్కోమలి మేలుకొనకుండ మెల్లన దాని వస్త్రంబునర్థంబు సించి తనకుం బరిధానంబు సేసికొని వెలువడి కొండొకనేల యరిగి దమయంతి ఘనం బైన తన నెయ్యంబను తీఁగం ద్రెంప నేరక క్రమ్మఱి వచ్చి. 078

చ. కలి దమయంతిఁ బాప సమకట్టు పొరిం బొరి వాయ నోపఁ డా లలన నుదీర్ణ సౌహృదబలంబున నిట్టులు రెంటఁ జేసి య న్నలుఁడు విమోహ రజ్జులఁ బెనంగి గతాగతకారి యైన యు య్యెలయునుబోలె నూఱడక యెంతయుఁ బ్రొద్దు వినిశ్చితాత్ముఁడై. 079

తే. బాల నొక్కర్తు నిక్కానపాలు సేసి నిష్ఠురుండ నై యే నెట్లు నేర్తుఁబోవ ననక కలిచేత లాకృష్టుఁడై ననలుఁడు విగతకరుణుఁడై దమయంతి విడిచి చనియె. 080


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com