ఆ భా 3 2 021 to 3 2 050

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


వ. నీవు నారీరత్నంబ వాతండు పురుష రత్నంబు గావున మీ యిద్దఱ సమాగమం బన్యోన్య శోభాకరం బగు ననిన విని సంప్రాప్త హృదయ సమ్మదయై దమయంతి దాని కిట్లనియె. 021

మధ్యాక్కర. ఆ రాజు గుణములు నారంఱింగించి నట్టులు నన్ను నారాజులకు నెఱింగించి కరుణ నాయందుఁ గావింపు మారంగ ననుడు నిషధ విషయమున కరిగి యాహంస వీరసేనజునకు దాని గుణ రూప విభవముల్ సెప్పె. 022

వ. అంత. 023

చ. నల దమయంతు లిద్దఱు మనః ప్రభవానల బాధ్యమానులై సలిపిరి దీర్ఘ వాసరనిశల్ విలసన్న వ నందనంబులన్ నలిసళంబులన్ మృదుమృణాళములన్ ఘలసారపాంసులం దలిరుల శయ్యలన్ సలిల ధారలఁ జందన చారుచర్చలన్. 024

వ. ఇట్లిద్దఱు నన్యోన్య రూపగుణ శ్రవణ సంజాతప్రీతులై యుండునంత నంతఃకరణ మనోజాత సంతాప వివర్ణ వదనయైన యాదమయంతిం జూచి భయ సంభ్రమాక్రాంతులై సఙీజను లెల్ల నక్కోమలి వృత్తాంతం బంతయు భీమున కెఱింగించి యిట్లనిరి. 025

సీ. కలహంస పలికిన పలుకులు గుణియించు వడి దాని పోయిన వలను చూచుఁ బలుకదు సఖులతో లలితాంగి మిన్నక యలయుచు నుండుఁ దా ననుదినంబుఁ జారు విభూషణాహార విహార శయ్యాసన భోగంబు లందు విముఖి యయి రేయుఁ బగలు నిద్రయు నెప్పు డెఱుఁగక దమయంతి నలుఁడను ధరణినాథు

ఆ. నంద బుద్ధి నిలిపి కందర్ప బాధిత యగుచు నున్నయది ధరాధినాథ ధరణిపతుల నొరుల నురుగుణాఢ్యుల విన నొల్ల దెంత విభవయుక్తు లయిన. 026

వ. అనిన విని భీము డేమి సేయుదు నెవ్విధంబున నమ్మహీపతి నిట రావింప నగు నోయని చింతించుచు సంప్రాప్త యౌవన యైన కూఁతుం జూచి యప్పుడు. 027

క. ఆ వైదర్భుఁడు నిఖిలధ రావనయములోనఁ గలుగు రాజన్యుల నా నా విషయాధీశ్వరులను రావించెం దత్స్వయంవర వ్యాజమునన్. 028

క. మనుజేశ్వరు లెల్లను బో రన దమయంతీ స్వయంవరమునకు నొప్పం జనుదెంచిరి సైన్యస్యం దనఘట్టన నవనితలము దల్లడపడఁగన్. 029

వ. ఆమసయంబునఁ బర్వతనారదు లను పురాణ మునులు భూలోకం బెల్లం గ్రుమ్మరి యింద్రలోకంబునకు బోయిన నింద్రుండు వారిం బుజించి భూలోకంబునం కుశలం బడిగి యిది యెట్లు ధర్మపరిపాలన పరులై వీరులై రణనిహతులై రాజు లక్షయ లోకసుఖంబు లనుభవింప నతిథులై యిందులకు నింతకాలం బయ్యు దాని కారణం బేమి యని యడిగిన నారదుం డిట్లనియె, 030

క. నరసిద్ధ సాధ్య విద్యా ధరసుర కన్యకలకంటె దమయంతియ సుం దరి దాని సుస్వయంవర మరుదై వర్తిల్లు చున్నయది యిప్డు మహిన్. 031

క. అందులకు ధరణిఁ గల నృప నందను లెల్లను ముదంబునం బోయెడు వే డ్కందములోఁ గలహంబును గ్రందును లేకున్న వారు గడు నెయ్యమునన్. 032

వ. అనిన నింద్రుండును లోకపాలవరులును దదాలోకన కౌతుకంబునం గనకరత్న రమ్య దివ్య విమానారూఢు లయి చనువారు ముందట దమయంతీ స్వయంవరంబు నకుం బోయెడువాని నాదిత్యులలోన విష్ణుండును బోలెఁ దేజోధికుండైన వాని ననన్య సాధారణ రూప విభవంబున రెండవ మన్మథుండును బోని వాని నలుంగని యంతరిక్షంబున విమానంబులు నిలిపి భూతలంబునకు వచ్చి వాని కిట్లనిరి. 033

సీ. నిత్య సత్య వ్రత నిపధైశ నీవు మా కమరంగ దూతవై యభిమతంబు సేయుము నావుడుఁ జెచ్చెర నట్టుల చేయుదు మఱి నాకుఁ జెపుఁడు మీర లెవ్వార లేను మీకిష్టంబున దూత నై యేమియుదు ననిన నతని కమరేశ్వరు డిట్లనియె నే నింద్రుండ వీరు దిక్పాలురు విదితయశులు

ధరణి నొప్పుచున్న దమయంతి సుస్వయం వరముఁ జూచు వేడ్క వచ్చియున్న వార మీవు మమ్ము వారిజాక్షికి నెఱిం గింపు నామధేయ కీర్తనముల. 034

వ. అట్లయిన నక్కోమలి మాయందుఁ దన వలచిన వాని వరియించుననిన నింద్రునకుఁ గృతాంజని యై నలుం డిట్లనియె. 035

ఆ. ఎఱిఁగి యెఱిఁగి నన్ను నాకార్థ సముసేతుఁ బాడి యయ్య యిట్టి పనికిఁ బనుప ననిన మత్సకుండనై యేల చేసెద నంటి చేయకుండ నగునె యింక. 036

ఆ. నిన్ను నిత్యసత్యనిరతుఁగా నెఱిఁగియి క్కార్యమునకు వలను గలుగుటెఱిఁగి పనుప వలసే దూత భావ మపేక్షించి దేవహితము దీనిఁ దీర్పవలయు. 037

వ. ఆయుధీయసురక్షితం బయిన రాజగృహం బెట్లు సొరనగు నని శంకింప వలవదు దమయంతీ నివేశంబు ప్రవేశించు నపుడు నిన్నెవ్వరు వారింపనోడుదు రనిన శక్రువచనంబుల నశంకింతుండయి నలుం డప్పుడ విదర్భా నగరంబునకుం బోయి యొక్కరుండ దమయంతీ గృహంబు సొచ్చిన. 038

- నలుఁడు దమయంతి యొద్దకు దేవదూతయై పోవుట - సం. 3-52-10

సీ. హంసచేఁ దన వినినకంటెను రూపవిభవాతిశయమున వెలయుదాని సురకన్యకల యట్టి సురుచిర శత కన్యకాళిచేఁ బరివృత యైన దాని హృదయేశుఁడైన తన్నెప్పుడు వినుచున్కి నలయ కాశ్వాసిత యైనదాని దమయంతిఁ జూచి కందర్ప శరావిద్ధుఁ డయ్యె నలుం డంత నతనిఁ జూచి

ఆ. యితఁ డపూర్వ మనుజుఁ డెందుండి వచ్చెనో యనుచు నుదరిపడి లతాంగు లెల్ల నాసనములు డిగ్గి యప్పు డభ్యుద్గత లైరి మనములందు హర్ష మెసఁగ. 039

వ. అంత. 040

క. దమయంతి మనోభవనిభు నమరేంద్ర ప్రతిము దినకరాభు సుధారుక్ సము వరుశ సదృశు ధనదో పము నశ్విసమాను నిషధపతిఁ జూచి నలున్. 041

క. వారిరుహ నేత్ర మదన ప్రేరిత యై లజ్జ యుడిగి భీతిల్లక బృం దారకమూర్తికి రాజకు మారున కిట్లనిటయె మందమందమృదూక్తిన్. 042

వ. నీవు మహానుభావుండ వెవ్వండ విందుల కేమి కారణంబున నేకతంబ వచ్చితివిది యత్యుగ్రశాసనుండైన మదీయ జనకుచేత సురక్షితం బగుట నెవ్వరికిఁ జొరనశక్యంబు దీని నెవ్వరు నెఱుంగకుండ నెవ్విధంబునం జొచ్చితివి నాకు మనోజవేదనా వివర్ధనుండ వైన నీ తెరుం గెఱింగింపు మనిన దానికి నలుం డిట్లనియె. 043

ఆ. ఏను దేవదూత నింతి నలుండను వాఁడ నింద్ర దహన వరుణ యములు నీ స్వయంవరంబు నెమ్మితోఁ జూడంగ నరుగుదెంచి నన్ను నబలమున్న. 044

క. నీ యొద్దకుఁ బుత్తెంచిరి మాయం దొక్కరు నభీష్టమతి వరియింపం దోయజముఖిఁ బ్రార్థింపుము మాయందఱకును బ్రియం బమర్పుము ప్రీతిన్. 045

వ. అనిపంచినఁ దత్ప్రసాదంబున నన్యులచేత నలక్షితుంనై వచ్చితి నింద్రాదులకుఁ బ్రియంబు సేయు మనిన నవనత వదనయై దమయంతి దొల్లి హంసచేత నలుని విని వానియందు బద్ధానురాగయై నవయుచున్న యది యపు డతని నలుంగా నెఱింగి తద్వచన శ్రవణ దుఃఖాయమాన మానస యగుచు నిట్లనియె. 046

తరువోజ. ఏనేడ నింద్రాదు లేడ వారలకు నెప్పుడు మ్రొక్కుదు నేను నీధనమ భూనాథ నీ గుణంబులు హంగచేతఁ బొలుపుగా విని మనంబున నిల్పియున్న దాన భవన్నిమిత్తమున నిట్లఖిల ధారుణి నాథ సార్థంబు రావింపఁ గా ని ప్డు వలసె లోకఖ్యాత కీర్తి కరుణించి పతిబుద్ధి గావింపు మిందు. 047

వ. నీవు దీని కొడంబడనినాఁడు రజ్జువిషాగ్ని జలంబుల బ్రాణపరిత్యాగంబు సేనికొందు ననిన దానిం జూచి నలుం డిట్లనియె. 048

మత్తకోకిలము. భూరిసత్త్వులు సర్వరోకవిభుల్ విభూతి సమృద్ధులి ద్దోరు తేజులు నిన్నుఁ గోరుచు నున్న వా రమరోత్తముల్ వారి పాదరజంబుఁ బోలని వాని నన్ను మనుష్యుం సం సారిఁ గోరఁగఁ జన్నె నీకుఁ బ్రసన్నులై సుర లుండఁగన్. 049

క. దేవతల కప్రియంబులు గావించు మనుష్యు లధమగతు లగుదు రిలం గావున వారి కభీష్టము గావింపుము నన్నుఁ బ్రీతిఁ గావుము తరుణీ. 050


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com