ఆ భా 3 1 241 to 3 1 270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వోలం సురేష్ కుమార్


ఆ. బాహుబలము మెఱసి పరుల సంపదలు సే కొనఁగ లావు లేని కుత్సితుండు నియతదుఃఖవృత్తి నిర్వేద పరుఁ డగుఁ గాక నీకుఁ దగునె కౌరవేంద్ర. 241

చ. నరసుత నీ యనుజ్ఞఁ గొని నాఁడ విరోధుల నెల్ల బోరిలో సరభసవృత్తి నుక్కడఁగఁ జంపితిమేని మహోగ్రకాననాత తరముల నుండకుండ నతిదారుణ దుర్మృగ సంగమంబునం బొరయక యుండఁగా మనకుఁ బోలు నమందమనః ప్రియంబుగన్. 242

క. సమయాతిక్రమభీతిని క్షమాయుతుల మైన మనలఁ గౌరవులు పరా క్రమహీనులుగాఁ దలఁతురు సమరోత్సాహంబు విడిచి జడమతి నున్నన్. 243

తే. తగిలి నిత్యంబు నేకాంతధర్మనిరతుఁ డగుట యుక్తమె పురుషుల కట్టివాని వెలయ నర్థకామంబులు విడుచుఁ బ్రాణ విగతు సుఖదుఃఖములు రెండు విడుచునట్లు. 244

సీ. ధర్మకామంబులు దఱుగంగ నర్థార్థి యగువాఁడు పతితుఁడౌ నర్థసేవ నర్థార్థముగఁ జేయు నతఁడుగ్రవనములో గోరక్ష సేయు నక్కుమతిఁ బోలు నర్థధర్మములకు హానిగాఁ గామార్థి యగునాతఁ డల్ప జలాశయమున జలచరం బెట్టు ల జ్జలములతోఁ జెడు నట్లు కామంబుతో హానిఁ బొందు.

ఆ. నర్థధర్మములు మహాబ్ధి మేఘములట్టు లుభయమును బరస్పరోదయమ్ము లిట్లుఁగాఁ ద్రివర్గ మెఱిఁగి సామ్యమున సే వించువాఁడు సర్వవిత్తముండు. 245

వ. భవదాచరితం బైన యీ ధర్మం బర్థకామంబులక కాదు నీకును నీ బాంధవులకును బాధాకరంబు దాన యజ్ఞ సత్పూజలు గావింప నర్థహీననున కశక్యంబు జగంబులు ధర్మమయంబులు ధర్మువునకు మిక్కిలి యొం డెద్దియు లేదయినను నర్థార్థంబు గాని ధర్మువు క్షత్త్రియుల కయుక్తంబు. 246

ఉ. శత్త్రుల నాజి నోర్చుటయు సర్వభయంబులఁ బొంద కుండఁ గా ధాత్త్రిఁ బరిగ్రహించి యుచితస్థితిఁ గాంచుటయుం బ్రియంబుతోఁ బాత్త్రుల కర్థ మీగియును బ్రాహ్మణ పూజయుఁ జువ్వె యుత్తమ క్షత్త్రియ ధర్మముల్ సుగతి కారణముల్ విపులార్థ మూలముల్. 247

వ. కేవల ధర్మాచరణంబు శత్రు జయంబునకు సాధనంబు గాదు నికృతి పరుల యందు నికృతియు వలయుఁ బూర్వభ్రాతలైన యసురుల నమరులు నికృతిన కాదె నిర్జించిరి కావున నీవు సమయ ధర్మరక్షణ వ్రతం బుడిగి శత్రువుల జయింప నుద్యోగింపుము. 248

క. జయశీలి వైన నీకుం బ్రియ మొనరింపంగ నున్న పృథుయశులు ముదా శ్రయు లగుదురు సృంజయ కే కయ యదు పాంచాలురాదిగాఁ గల సుహృదుల్. 249

తే. మిత్త్ర సంపన్నుఁ డైన నమిత్త్రు మిత్త్ర బలముతోడ భేదించి దోర్బలముఁ జలముఁ గలిగి దేశబలంబును గాలబలముఁ గలుగువాని కసాధ్యంబు గలదె యెందు. 250

తే. బలము గలవానిఁ బలువురు బలవిహీను లొక్కటై కూడి నిర్డింతు రుత్సహించి మధువుఁ గొన నుత్సహించిన మనుజుఁ బట్టి కుట్టి నిర్జించు మధుకరకులము నట్లు. 251

వ. శూద్రాన్నంబు నందలి దుగ్ధంబునుం బోలె దుర్యోధను రాజ్యంబు దూష్యంబగుటఁ బౌర జానపద బ్రాహ్మణవరులు నీ కనురక్తు లయి భవద్రాజ్యంబ వలచి యుండుదురు దీని నేల యెడ సేసెదు సర్వాయుధ సనాథం బైన రథం బెక్కి గజపురంబున కభిముఖుండ వై విజయ ప్రయాణంబు సేయుము. 252

మ. ప్రణుతక్షాత్త్ర గుణంబు విక్రమము దర్పం బేర్పడన్ విక్రమ క్షణదానం బొనరింపు మీక్షణమ విఖ్యాతంబుగా సంగరాం గణ మధ్యంబునఁ జేయు మర్జున బ-హద్గాండీవ నిర్ముక్తమా ర్గణ ధారావళి ధార్తరాష్ట్ర కదళీ కాంతార విచ్ఛేదమున్. 253

క. బహు వాహసుభట హస్తిక సహితులు బలవంతు లని విచారింపకు నీ యహితులు మద్బాహు గదా నిహతికి మార్కొనఁగఁ బోర నిలువంగల రే. 254

క. అరివరుల నోర్చి సాగర పరివృతభూచక్ర మెల్లఁ బాలింపు ప్రజా పరిపాలనంబు కంటెను ధరణీశ విశేష మొండు ధర్మువు గలదే. 255

వ. రాజ్య పదస్థుం డైన క్షత్త్రియుండు భూరి దక్షిణంబు లైన యజ్ఞంబుల దేవ బ్రాహ్మణులం దృప్తులం జేసి బ్రాహ్మణులకు నగ్రహారంబులు గోసహస్రంబులు నిచ్చి దురితంబు వలనం బాసి తమోవిముక్తుం డైన చంద్రుండునుబోలె వెలుంగు ననిన భీమసేనునకు ధర్మరా జిట్లనియె. 256

ఉ. నీ వచనంబు ధర్మ్యము వినీతము నీతియుతంబు నిష్టసి ద్ధ్యావహ మత్యుదార మిది యైనను నిప్డు దలంపఁగా విచి రావస రాప్తికిన్ విషయ మైనది కార్య ఫలంబు లెల్ల స ద్భావమునన్ విచార సులభంబుల యండ్రు విచార పారగుల్. 257

క. వనమునఁ బండ్రెం డేండ్లును జనపదమున నెఱుఁగ కుండ సరి నొక వర్షం బును జలుపఁ బూని సత్యము దనరఁగఁ జేసితిఁ బ్రతిజ్ఞ దగ వృద్ధసభన్. 258

చ. అతఘ గుణంబులం దధికుఁ డైన మహాత్ముడు రాగకోపమా యలఁ బడి యక్షమావివశుఁడై యచిరాంశులతా విలాసచం చల మగులక్ష్మి కానపడి సత్యము ధర్మువుఁ దప్పి సత్సభా వలిఁ దగు వారియొద్దఁ దగువాఁ డయి సద్విధి నుండ నేర్చునే. 259

వ. ఏ నెట్లును సత్యసమయం బతిక్రమింప నోప శుభోదయ కాలంబుఁ బ్రతీక్షించి యుండుము రాజ్యంబులుఁ బుత్త్రులును ధనంబును యశంబును సత్యంబునకు సమంబులు గా వనిన భీమసేనుం డిట్లనియె. 260

ఆ. అంతకుండు జనుల కాసన్నఁడై యుండ నిమిష మాత్రమేనని నిశ్చయింపఁ దగని జీవనంబు దద్ద సుస్థిరముగాఁ జేసి కార్య మెడయుఁ జేయఁ దగునె. 261

వ. శరీరికి మరణంబు నియతంబు మరణంబులకు ముందర వైరంబు దీర్పని వాని జన్మంబు నిరర్థకంబు సకల రాజ సమక్షంబునం బరులచేత నట్లు మన పడిన పరిభవంబునకుం బ్రతీకారంబు సేయునంతకు రేయునుం బగలును నా హృదయంబు దపించుచుండు నాకంటె నర్జున నకుల సహదేవులుం గుతీదేవియుం నంతస్తాపంబున నెంతయు సంతప్తు లగుచున్నవారు. 262

క. వీరల దుఃఖము దీర్పక క్రూర నికారులగు రిపులకును ముదముగ మ గ్రారణ్యములో ధర్మువుఁ గారుణ్యముఁ దాల్చి యునికి కార్యమె నీకున్. 263

వ. ఇది బ్రాహ్మణ ధర్మంబు గాని క్షత్త్రియ ధర్మంబు గాదు మను ప్రణీతంబులైన రాజ ధర్మంబులు నీ యెఱుంగని యవి లేను శత్రు సంహారంబు సేయనినాఁ డత్యంత హాని యగు నట్లుం గాక. 264

వ. ఆ బాల వృద్ధ ప్రసిద్ధుండ వై పార్థివసూర్యుండ వైన నిన్నును సిహ సంహననులైన నీ తమ్ములను నెఱుఁగని వారు లేరు మన గూఢభావంబు మేరువు నిగూఢ భావంబునుం బోలె నఘటమానం బిట్లేని నివ్వనవాస క్లేశం బెన్నఁడును మనకుఁ బాయ నేరదు మన మిప్పు డివ్వనమునఁ బదుముఁడు మాసంబులు సలిపితిమి సంవత్సర ప్రతినిధిగా మాసంబులు సేసికొనుట యెందునుం గలయదియ దీన ధర్మ విరోధంబు లేదు విజయారంభంబున కిది యవసరం బనిన భీమసేన పలుకులు విని నిశ్వాస వ్యాకులితో ముఖుండై పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరా జిట్లనియె. 266

క.. క్రమమునఁ బాండిత్యపరా క్రమ దర్పములందుఁ గడుఁ బ్రగల్భుడవు మ ధ్యమ నీ చెప్పినయది కా ర్యమ యయినను ధీరబుద్ధివై విను మనఘా. 267

వ. అల్పోపాయం బైన కార్యంబు సాహసారబ్ధం బైనను దోషంబు లే దిది మహాకార్యంబు సాహస క్రియా సాధ్యంబుగాదు సువిచిరితం బై సిద్ధిం బొందు విచార పూర్వారబ్ధ కార్యంబునకు దైవంబులు ననుకూలం బగుం గావున నిమ్ముగా విచారింప వలయు. 268

సీ. శూరులు ధృతరాష్ట్ర సుతులు దుర్యోధనాదులు దురాధర్షు లందొఱును మనకు నాతతాయులు మఱి యంగభూభుఁడును భూరిశ్రవుఁడు మద్రభూమి పతియు నాదిగాఁ గలవీరు లవిజేయవిక్రము లొలసి తత్సుహృదులై యున్నవారు మనచేత జితు లైన మనుజేశు లెల్లను జని సుయోధని చేత సత్కరింపఁ

ఆ. బడి కడంగి వాని ప్రస్తంవంబున నాజి వేచి ప్రాణములను విడువ నున్న వారు వార లెల్ల వసుధఁ బ్రసిద్ధులు వినఁగ నస్త్ర శస్త్ర విద్యలందు. 269

క. వినవయ్య కర్ణుగర్వం బని నాతఁ డభేద్యకవచుఁ డగుటయు విలునే ర్పును నతని బాహు విక్రమ మును దలఁచిన నాఁడు గన్ను మొగుడదు నాకున్. 270


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com