ఆ భా 3 1 211 to 3 1 240

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


క. భవదాజ్ఞానిగళంబునఁ దవిలి పరాక్రమము విడిచి ధరణీశ్వర నీ యవరజు లిడుములఁ బడి కడుఁ జివికిరి చెళఁబడిన సింహశిశువుల భంగిన్. 211

ఆ. పరనరేంద్ర మకుట పద్మరాగద్యుతి నరుణ మగు భవత్ప దాబ్జయుగము పురుష ధాతుశిలలపై నిప్పు డరుగుట నరుణ మయ్యెఁ బర్వతాంతరముల. 212

క. అనవరత సౌఖ్యసంపదఁ బెనుపొందుచు నుండు మీకు భీకరకాంతా రనివాసాయాసంబుల ననఘా యిబ్భంగి నవయ నలమట వొడమెన్. 213

వ. నిత్యంబునుం బదివేవురు బ్రాహ్మణులు బ్రహ్మవిదులు బసిండి తళిగల నిష్టాన్నంబులు గుడిచి తృప్తులయినం దద్భుక్త శేషం బుపయోగించుచుండు నీకు వన్యమూల ఫలాశనంబు లుపయోగించుచు వన్యులయందుఁ గ్రోధంబు విడిచి యునికి యుచితంబు గాదు. 214

సీ. పదివేల గజముల బలమున విలసిల్లు ననిలసుతుండు గాఱడవిలోనఁ గ్రుమ్మరి కాయలుఁ గూరలు దిని పేదవడినఁ జూచియు దీర్ఘబాహుయుగళుఁ డయ్యును బాహుసహస్రంబు కలిగిన యర్జునుకంటె బలాఢ్యుఁ డగచు నేకవేగంబున నేనమ్ము లొక్క యమ్మంసిన విధమున నేయ నేర్చు

ఆ. నర్జునుండు వనమృగావలిఁ గలిసి యి ట్లున్నఁ జూచియును సుఖోచితాత్ము లైన కవలు దీనులై యున్నఁ జూచియు నుపశమంబుఁ దాల్చి యుండఁ దగునె. 215

వ. క్షమయును దేజంబును నయ్యయి కాలంబులఁ బ్రయోగింప నేరని రాజనకుం బ్రజానురాగ ప్రతాపంబులు లేవను నీయర్థం బితిహాసంబున వినంబడు క్షమాతేజంబులలోన నెయ్యది విశేషంబు దానిన నిర్ణయించి చెప్పు మని బలీంద్రుండు దొల్లి తన పితామహుండయున ప్రహ్లాదు నడిగిన నాతండు బలీంద్రున కిట్లనియె. 216

ఆ. ఘమయ తాల్చి యుండఁ జన దెల్లప్రొద్దుఁ దే జంబ తాల్చి యుండఁ జనదు పతికి సంతతక్షముండు సంతతతేజుండు నగుట దోష మందు రనఘమతులు. 217

వ. అది యెట్లనిన నిత్యక్షమాన్వితుం డయినవానికి భృత్యులు వెఱవక యవమానంబు సేయుదు రర్థంబులయం దధికృతు లయినవారలి ధనంబు లపహరించి దర్పంబు సూపుదురు మఱి నిత్యతేజోధికుం డైనవాఁ డతి క్రూరదండంబున సర్వజన సంతాపంబు సేయుచు గృహగతం బైన సర్పంబును బోలె నెప్పుడు నుద్వేగకరుం డగుం గావునఁ గాలోచితంబులుగా క్షమాతేజంబులు గల్పించునది యథాకాలకల్పిత క్షమాతేజుం డైన వానికి నుభయలోకసిద్ధి యగునని బలీంద్ర ప్రహ్లాద సంవాదంబు సెప్పి వెండియు ద్రౌపది యిట్లనియె. 218

తే. ఆది నపరాధ మొక్కటి యైన నదియు నల్ప మైనను క్షమియించు నదియుఁ గాక చెనసి యుపరాధములు పెక్కు సేయుచున్న పాపకౌరవ్యులకు సహింపంగ నేల. 219

క. ఇది తేజంబున కవసర ముదిత క్రోధుం వగుమ యొక్కించుక దు ర్మదు లగు సుయోధనాదుల నదయుల వధియింతు రుగ్రులై నీ తమ్ముల్. 220

వ. అనిన ధర్మరా జిట్లనియె. 221

సీ. క్రోధంబు పాపంబు గ్రోధంబుననచేసి యగుఁ జువ్వె ధర్మకామార్థ హాని గడుఁ గ్రోధి గర్జంబు గానండు క్రుద్ధుండు గురునైన నిందించుఁ గ్రుద్ధుఁడైన వాఁ డవధ్యులనైన వధియించు మఱి యాత్మఘాతంబు సేయంగఁ గడఁగుఁ గ్రుద్ధుఁ డస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి క్రోధంబు దాల్చుట గుణమె చెపుమ

ఆ. యెఱుక గల మహాత్ముఁ డెఱుకయ న్జలముల నార్చుఁ గ్రోధమను మహానలంబు గ్రోధ వర్జితుండు గుఱుకొని తేజంబు దాల్చు దేశకాల త్త్వ మెఱిఁగి. 222

క. క్షమ గలవానికిఁ బృథ్వీ సమునకు నిత్యంబు విజయ సంసిద్ధి యగున్ క్షమి యైన వాని భుజవి క్రమము గడున్ వెలయు సర్వకార్య క్షమమై. 223

వ. తేజః ప్రభవంబు లైన యమర్ష దాక్షిణ్య శౌర్య శీఘ్రత్వంబు లను నాలుగు గుణంబులు భమావంతునంద వీర్యవంతంబు లగుఁ దొల్లి కశ్యపగీత లైన గాథలయం దీయర్థంబు వినంబడు వినుము వేదంబులు యజ్ఞంబులు శౌచంబును సత్యంబును విద్యయు ధర్మువు సచరాచరం బయిన జగమంతయు క్షమయంద నిలిచినవి తపస్స్వాధ్యాయయజ్ఞకర్తలయు బ్రహ్మవిదులయుం బడయు పుణ్యగతులు క్షమావంతులు వడయుదు రదియునుం గాక కృష్ణ ద్వైపాయన బీష్మ విదుర కృప ద్రోణ సంజయ ప్రభృతులు నాయుపశమంబ కీర్తింతు రుపశమహీనుం డయిన దుర్యోధను కారణంబున ధార్తరాష్ట్రుల కెల్లం బ్రళయంబగుననిన ద్రౌపది వెండియు నిట్లనియె. 224

మధ్యాక్కర. క్షమయంద చిత్తంబు నిల్పి నిర్గతకల్మష బుద్ధిఁ గ్రమమున ధర్మువునంద వర్తిల్లు కరుణాత్ము నిన్ను నమర ధర్మంబు రక్షించుఁ బ్రీతితో నని శత్రులందు సమబుద్ధి సేయంగఁ జననె నీకు నజాతశత్రుండ. 225

ఆ. ధర్మదూరులైన ధార్తరాష్ట్రులయం ద ధర్మువేమి సేయు ధరణినాథ నికృతిపరులయందు నికృతిసేయనివారు వారి నికృతిఁ జేసి వధ్యు లండ్రు. 226

క. ఆర్యులకు విహీనతయు న నార్యుల కున్నతియుఁ జేసి యవినీతుఁడవై కార్యము దప్పితి నీకు న నార్యులు చుట్టములె యార్యు లరులె విధాతా. 227

వ. అని విధాకృతి ధర్మువు నాపేక్షించు ద్రౌపదిం జూచి ధర్మరా జిట్లనియె నాస్తికుల యట్లు ధర్మాభిశంకినివై దైవదూషణంబు సేసెడు శిష్ట చరితంబయిన ధర్మంబు నధిక్షేపించుచున్న దుర్మతికిం బ్రాయశ్చత్తంబు లేదు ధర్మువు దప్పక నిత్యులై జీవించుచున్న మైత్రేయ మార్కండేయ వ్యాస వసిష్ఠ నారద ప్రభృతులం బరమ యోగధరులం బ్రత్యక్షంబ చూచెదము వీరెల్ల నన్ను ధర్మపరుం డని మన్నింతు రన్యు లన్యాయంబు సేసి రేనియు నే నేల ధర్మువు దప్పుదు. 228

క. ధీరమతియుక్తిఁ జేసి వి చారింపఁగ నిక్కువంబు సర్వజనస్వ ర్గారాహణసాపానం బారఁగ ధర్మంబ చూవె యతిరమ్యంబై 229

వ. తపస్స్వాధ్యాయ బ్రహ్మచర్య దానధర్మ యజ్ఞంబులను పుణ్యకర్మంబు లఫలంబు లగునేని వీని నేల ఋషిగణంబులు సేవింతురు నీ జన్మంబును ధృష్టద్యమ్ను జన్మంబును బుణ్యకర్మ ఫల సద్భావంబునకు నిదర్శంనంబులు గావె మఱి పుణ్యకర్మ ఫలంబులు గలయట్ల పాపఫలంబులును గలవు తొల్లి బ్రహ్మ దన పుత్రులకుం గర్మఫల సద్భావంబు సెప్పె నందుఁ గశ్యపుండు ధర్మ ప్రబోధనంబునం జేసి పుణ్యఫల ప్రాప్తుండయ్యె విధాతృనియోగంబునం బుణ్య పాప ఫలంబు సంప్రాప్తం బగు విధాతృ ననుగ్రహంబునన కాదె పుణ్యకర్మంబులు ప్రవర్తించి మర్త్యుల మర్త్యత్వంబును బొందుదు రని విని ద్రౌపది యిట్లనియె. 230

ఆ. కర్మఫలము లేదు కర్మఫలాప్తికిఁ గారణంబు విధియుఁ గా దనంగ నంత యెఱుక లేనె యార్తనై విధి చెయ్ది కలసి పలికితిం బ్రియంబుదప్పి. 231

వేదశాస్త్రములును విధివిధానములును నప్రమాణ మను దురాత్మకులకుఁ బుణ్యగతులు లేమి భూనాథ యెఱుఁగని దానఁ గాను ధర్మతత్త్వయుక్తి. 232

వ. తొల్లి నీతిమంతు లయిన బ్రాహ్మణులు మదీయ జనకునకుం జెప్పంగ వింటి నెఱుక గలవారికిం గర్మంబు గర్తవ్యంబు గర్మరహితు లయి స్థావరంబుల యట్లు జనులు జీవింపనేర రల్పఫలంబు నైనను గర్మంబుఁ బ్రవర్తించుచున్న వారిం జూచెదము దైవ మానుషంబులు గర్మఫల ప్రాప్తికి నిమిత్తంబులు పురుషుండు మనంబున నర్థసిద్ధి నిశ్చయించి కర్మంబునందుఁ గృతోత్సాహుండు గావలయు నట్టివారికి దైవంబు సహాయం బయి కర్మసిద్ధి గావించు. 233

మధ్యాక్కర. తిలలందుఁ దైలంబు గాష్ఠములయందుఁ దిరముగా నగ్ని గలుగు టెఱింగి యుపాయపూర్వము గడఁగి తత్సిద్ధి యలయక యుత్సాహవంతుఁడు వడయు న ట్లనుత్సాహ మొలసి దైనపరుఁ డిది వడయంగను నోపునె యెందు. 234

మధ్యాక్కర. కడు నిమ్ముగా బీజములు సల్లి కర్షకుం డున్నఁ దడయక వర్షంబు గురిసి కావించుఁ దత్ఫలసిద్ధి నడుమఁ బర్జన్యుఁ డనుగ్రహింపనినాఁ డేమి సేయుఁ గడఁగి చేయం గలవానిఁ జేయుము గాక కర్షకుఁడు. 235

వ. కర్మఫలంబులు దైవమానుష సిద్ధంబు లయిననుం బురుషోత్సాహ సముపార్జితంబు లయిన నవి సుస్థిరంబు లయి సురక్షితంబు లయి వర్తిల్లు ననీహమానుం డయు దైవపరుం డయునవాఁడు నీరిలోని యానపాత్రంబునుబోలె నవసన్నుండగుం గావునఁ గర్మఫలసిద్ధి నిశ్చయించి యుత్సాహవంతుండ వయి నీ యనుజుల పరాక్రమంబునం బరుల జయించి మనయందలి యర్థకృశత్వం బపనయింపు మనిన యాజ్ఞ సేని వచనంబుల కను గుణంబుగా భీమసేనుండు ధర్మరాజున కిట్లనియె. 236

- భీమసేన ధర్మరాజుల సంవాదము -

మ. పితృపైతామహ మైన రాజ్య మరినిర్భేద్యంబు గాండీవిచే నతిగుప్తంబు బలారి కైనను నహర్యం బిట్టిదానిన్ సుదు ర్మతి నన్యార్థము సేసి నీకుఁ జనునే మర్త్యేశ యుగ్రాటవిన్ వ్రతముల్ సల్పుచు ధర్మలేశ చరణవ్యాసక్తి నిట్లుండఁగన్. 237

క. ఆమిషము సింహములచే గామాయును గొన్నయట్లు కువలయరాజ్య శ్రీ మనచేఁ గొని కౌరవుఁ డేమని తలఁచు నొకొ బుద్ధి నిష్టులుఁ దానున్. 238

క. దుర్మతులను దుర్జనులను ధర్మస్థితి నోర్వఁ దగునె ధరణీశ్వర దు ష్కర్ములగు ధార్తరాష్ట్రుల పేర్మి యడంగింపఁ గడఁగు పృథుభుజ శక్తిన్. 239

వ. ధర్మకామప్రభవం బయి సర్వార్థసాధనం బయిన యర్ధంబు విడిచి మిత్త్రుల కప్రియంబు నమిత్త్రులకు హర్షంబునుంగా మునివృత్తిం జేకొని ధర్మువు ధర్ము వనుచు ధర్మువునందు చిత్తంబు నిలిపి దుర్బలునట్లు నిర్వేదింపఁ దగునె. 240


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com