Jump to content

ఆ భా 3 1 001 to 3 1 030

వికీసోర్స్ నుండి

శ్రీ మదాంధ్ర మహాభారతము అరణ్య పర్వము - ప్రథమాశ్వాసము

క. శ్రీ కీర్తి శ్రీ వల్లభ లోక జనస్తుత్య సర్వలోకాశ్రయ ర త్నాకర పరివృత సకలధ రాకాంత జితారి రాజరాజనరేంద్రా. 001

పాండవుల వనగమనము సం 3-1-8

వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె నట్లు పాండవులు నిజాయుధంబులు ధరియించి కృష్ణాసహితులై యత్తరము మించి యరిగిన నింద్ర సేనాదులైన మూలభృత్యులు పదునాలుగు వేల రథంబులతోడి సుభద్రాభిమన్యు ప్రతి వింధ్యాదులం దోడ్కొని వారిపిఱుందన యరిగి రంత నప్పాండవులం జూచి పౌరులెల్లఁ బరమ దుఃఖితులై. 002

క. చనునె యధర్మద్యూతం బున నిట్టుల పాండురాజపుత్త్రులఁ బ్రభులన్ వనగతులఁ జేయ దుర్యో ధన ధృతరాష్ట్రులకు విగత హృదయులకున్. 003

క. క్రూరతరధార్తరాష్ట్రుని కారము వారింప రైరి గాంగేయుఁడు న బ్భారద్వాజుఁడుఁ గృపుఁడును దారుఁడు విదురుండు నేమిదలఁచిరొ బుద్ధిన్. 004

సీ. కర్ణ జయద్రథ గాంధారు లాప్తులై యుండంగ లోభి దుర్యోధనుండు రాజుగా నీతనిరాజ్యంబునం దెట్టు లుండగ నేర్తు మీ యుర్వి నింక నేది ధర్మువు ప్రజ నెవ్వరు గాతురు పరమ ధార్మికు లైన పాండు సుతుల యరిగిన చోటిక యరుగుద మని వారి పిఱుఁదన చని పాప భీతమతులు

ఆ. వీరులార మమ్ము విడిచి మీకరుగంగఁ జనునె మాకు నొండు శరణ మెద్ది సాధులకు నవసాధు సహవాసమునఁ బాపం సంప్రయోగ మగుట సందియంబె. 005

క. తిలలును నీళ్ళును వస్త్రం బులుఁ బుష్ప సుగంధ వాసమున సౌరభముం బొలు పెసఁగఁదాల్చుఁ గావున నలయక సత్సంగమమున నగు సద్గుణముల్. 006

వ. సాధు సమ్మతంబు లైన గుణంబుల నొప్పి జన్మ విద్యాకర్మంబులం బ్రశస్తులరై యార్యవృత్తుల రై నసీ సహవాసంబున నుండి ధర్మపరులమై కృతార్థుల మగుదుము దష్కృతంబులయం దనారంభు లయ్యును జనులు దుర్జనోదర్శన స్పర్శన సంభాషణ సహాసనంబులం జేసి ధర్మవిహీను లగుదురు గావున నేము దుర్యోధను రాజ్యంబున నుండ నోపము మాయను గమంబున కొడంబడ వలయునని కృతాంజలులైన నప్పౌరులం జూచి ధర్మ తనయుం డిట్లనియె. 007

క. మాయందు లేని గుణములు మీ యనురాగముఁ జేసి మిగిలి వెలింగెన్ మీ యనుగతి మాకు నభి ప్రాయము వనవాస దుఃఖ భర మోపుదురే. 008

తే. వలవ దుడుగుండు మీరని వారినెల్లఁ గరుణఁ బాండవ జ్యేష్ఠుండు గ్రమ్మఱించెఁ బౌరు లట్టు నివర్తింపఁబడి నిరంత రార్తనాదులై యరిగిరి హస్తిపురికి. 009

వ. ఇట్లు పాండవులు గృతప్రస్థానులై గంగాతీరంబునం బ్రమణాఖ్య వటంబున విడిసి గంగా స్నానంబు సేసి నాఁటి పగలును రాత్రియు నందయుండి రంతఁ బ్రభాత సమయంబున. 010

చ. పరువడి నగ్నిహోత్రములు బంధులు శిష్యులుఁ దోడరా మహీ సురవరు లెల్లఁ బాండు నృప సూనులయొద్దకుఁ బ్రీతి నేఁగుదెం చిరి బహువేద ఘోషములఁ జేని నిరస్తసమ స్తకిల్బిషో త్కరు లగుచున్న ధన్యులు జగత్పరిపూజ్యులు బ్రహ్మసమ్మితుల్. 011

వ. ఇట్లు దమతోడన వనవాసంబు సేయ నిశ్చయించి వచ్చిన విప్రుల నతి ప్రీతి గౌరవంబున నర్చించి తదాశీర్వాదంబుల నభినందితుం డై ధర్మతనయుండు వారల కిట్లనియె. 012

క. అపహృత సర్వస్వుల మై సపత్నుల నికారమునఁ బ్రచండాటవిలో విపుల ఫలశాకమూలము లుపయోగించుచును నిష్ఠనుండెడు మాతోన్. 013

క. రానేల వచ్చి నవయం గానేల నివాసములకుఁ గ్రమ్మఱి చనుఁ డు గ్రానేకప శార్దూలభ యానక వనవాస మర్హ మగునే మీకున్. 014

వ. అనిన విని బ్రాహ్మణులు పరమ దుఃఖితులై మీర కాని మాకు నొడుగతి లేదు మమ్ము ననన్య శరణ్యుల విడుచుట ధర్మంబు గాదు. 015

ఆ. ఆశ్రితులను భక్తు లగు వారి నెప్పుడు నన్యులైన విడువ రట్టి విప్ర వరుల భక్తి పరుల వసుధేశ మీయట్టి ధార్మికులకుఁ విడువఁ దగునె చెపుమ. 016

వ. అస్మత్పోశణోపాయచింత సేయవలదు వన్యమూలఫలంబులు నేను తెచ్చికొని యుపయోగించుచు జపహోమాది పుణ్యక్రియల మీకుం బ్రియంబు సేయుచునుండెద మధర్మవర్తు లయి మీ కపకారంబు సేసిన ధార్తరాష్ట్రుల రాష్ట్రంబున నుండ నోప మనిన వారల రాక కొడంబడి. 017

తే. ఇష్టమృష్టాన్నములఁ దొల్లి యెల్ల ప్రొద్దుఁ దృప్తులగుచున్న వసుమతీ దేవవరులఁ గానలందు శాకాశనుల్ గాఁగనెట్లు సూడనోపుదునని ధర్మసూనుఁ డపుడు. 018

శౌనకుఁడు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట సం 3-2-14

వ. శోకమూర్చితుండై మహీతలంబుపయిం బడిన యాతని నాశ్వాసించి శౌనకుండను బ్రహ్మర్షి దొల్లి యాత్మ వ్యవస్థానార్థంబు జనక గీతంబులయిన శ్లోకంబుల యర్థంబులు యుధిష్ఠిరున కిట్లనియె. 019

క. శోకభయస్థానంబు ల నేకంబులు గలిగినను విహీనవివేకుం డాకులతఁ బొందునట్లు వి వేకము గలవాఁడు బుద్ధి వికలుం డగునే. 020

క. శారీరమానస మహా దారుణ దుఃఖములఁ జేసి తఱిఁగి శరీరుల్ క్రూరతరబాధఁ బొందుదు రారెంటిని జెఱుతు రాద్యు లమలిన బుద్ధిన్. 021

వ. వ్యాధిశ్రమా నిష్టసంస్పర్శనేష్ట వివర్ణంబు లను నాల్గింటం బుట్టి శారీర దుఃఖంబు లాశు క్రియాది ప్రతియోగంబుల నుపశమిల్లు మఱి స్నేహజంబులయిన మానస దుఃఖంబులు జలంబుల నగ్ని యుపశమిల్లునట్లు విమలజ్ఞానంబునం జేసి యుపశమంబునం బొందు. 022

క. స్నేహా వమగ్నుం డయి దేహి మహాదుఃఖముల నధృతిఁ బొందును దుః ఖాహతుఁడు శోకతావని మోహియగున్ స్నేహ మూలములు రాగాదుల్. 023

వ. కావున బంధుమిత్ర ధనసంచయంబుల వలని స్నేహంబు విడుచునది పద్మ పత్రంబు నీరం బొందనియట్లెఱుక గలవారి నెట్టియెడలను స్నేహంబు వొందదు స్నేహంబున రాగంబును రాగంబునం గామంబును గామంబునం గ్రోధంబును గ్రోధంబునం దృష్ణయు వర్తిల్లు. 024

క. అది సర్వదోషముల కా స్పద మది దురిత క్రియాను బంధంబులకున్ మొదలు నిరంతర దుఃఖ ప్రద మని దలఁచి తృష్ణఁ బాతురు సుమతుల్. 025

వ. మఱియుఁ దృష్ణాతురుం డర్థలోభంబునఁ గోటరస్థం బయిన యనలంబులంజేసి దగ్ధం బగు వృక్షంబును బోలె వినాశంబునం బొందు నర్థాసక్తుం డైనవాఁడు శుభంబులు వడయ నోపండు మృత్యువు వలనం బ్రాణులకు భయంబు గలుగున ట్లర్థ వంతులకు రాజచోర స్వజనజలానలంబుల వలన భయంబు నియతంబు. 026

తే. జలములందు మత్స్యంబులు చదలఁ బక్షు లామిషం బెట్లు భక్షించునట్లు దివిరి యెల్లవారును జేరి యనేక విధుల ననుదినంబును భక్షింతు రర్థవంతు. 027

క. అర్థమ యనర్థమూలం బర్థమ మాయా విమోహ నావహము నరుం డర్థార్జన దుఃఖమున న పార్థీకృత జన్ముఁ డగుట పరమార్థ మిలన్. 028

వ. అట్టి యర్థంబు వలన దర్ప కార్పణ్యమాన భయోద్వేగంబుబు పుట్టుఁ గావున నర్థోపార్జన చింత సేయవలదు రూప యౌవన ధన విభవ ప్రియసంవాసంబు లనిత్యంబు లగుట నందు బుద్ధిమంతులు విమోహింప రనిన నమ్మునివరునకు ధర్మతనయుం డిట్లనియె. 029

సీ. ఆత్మోపభోగార్థ మర్థలాభేచ్ఛ నా కెన్నండు లేదు మహీసురాగ్ర గణ్యుల నత్యుగ్ర కాననాంతరమున నెవ్విధంబున భరియింతు నొక్కొ యని యిప్డు వగచెద ననవద్యగుణయుక్తి ననఘ మాయట్టి గృహస్థతతకిఁ బోష్యుల నెయ్యెడఁ బ్రోవక యుండను విప్రుల నతిథుల వృథయ పుచ్చఁ

ఆ. జనునె నిజ ధనంబు సంవిభాగించి యీ వలయు సాధురక్ష వలయుఁ జేయ నభిమతాశ్రమంబు లందు గృహస్థాశ్ర మంబ కాదె యుత్తమంబ వినఁగ. 030


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com