ఆ భా 2 2 241 to 2 2 270

వికీసోర్స్ నుండి

వ. అనినం బ్రహ్లాదుండు భయంపడి కశ్యపుకడకు జని విరోచనసుధన్వులు తన్ను వివాదనిర్ణయం బడిగిన విధంబును జెప్పిన విని వానికిం గశ్యపుం డిట్లనియె. 241

తే. సాక్షియును ధర్మదర్శియు *సాక్షిధర్మ విధులు దప్పంగఁ జెప్పిననధమవృత్తి వరుణపాశహస్రంబు వానిఁగట్టి పాయునేఁటేట నొక్కొకఁ డాయతముగ 242 ( * సాక్ష్య విధులు దప్పఁగాదు తప్పినను నధర్మయుక్తి సభలయందుఁ దప్పుగాఁ జెప్పిరేని యధర్మవృత్తి )

వ. ధర్మం బధర్మవిద్ధం బయు సభకు వచ్చిన దానిం దీర్పనిసభ్యు లధర్మ విద్ధులగు దురు మఱి సభ్యులు కామక్రోధంబులు విడిచి యధర్మంబు నాపనినాఁ డయ్యధర్మంబునం దొక్కపాదంబు సభ్యుల నొక్కపాదంబు భూపతిఁ దక్కినయది గర్తనుం బొందు సమంజసులైన సభ్యులచేత విధ్యుక్తంబయ్యెనేని నధర్మంబు కర్తనుం బొదు గావున ధర్మంబు దప్పక చెప్పవలయు ననినం బ్రహ్లాదుండు ధర్మమతి యై విచారించి తనకొడుకు కంటె గుణ శ్రేష్ఠుఁడుగా సుధన్వుం జెప్పినఁ బుత్త్ర స్నేహంబు విడిచి ధర్మువు దప్పక చెప్పి తని ప్రహ్లాదు బ్రశంసించి సుధన్వుం డరిగెఁ గావున మీరును ద్రౌపదీ ప్రశ్నంబునందు ధర్మబుద్ధి సేయుండని విదురుండు పలికిన దుర్యోధను భయంబున సభ్యులెవ్వరుం బలుక రయిరి ద్రౌపదియు నట్లు సకలక్షత్త్రియ సమక్షంబున దుశ్శాసను చేతం బరిభవింపంబడి దుఃఖితయయి. 243

సీ. అవ్విధంబున నొప్పి యాస్వయంవరమునాఁ డఖిల భుపతులచే నట్లు సూడఁ బడి పాండవుల ధర్మపత్ని నై గోవిందు చెలియలనై వీనిచేత నిట్లు పరిభూత నగుచు సభా మద్యమున మహీపతులచేఁ జూడంగఁబడితి నింత వడుదునె యిపుడు నా పలుకుల కెవ్వరుఁ బ్రతివచనం బేల పలుకరైరి

ఆ. ధన్యురార యే నదాసినే దాసినే యెఱుఁగఁ జెప్పి పనుపుఁ డెల్ల దాని ననుచు వనరుచున్న నాపగాసుతుఁడు శాం తనవుఁ డిట్టు లనియెఁ దానిఁ జూచి. 244

వ. అవ్వా నీ ప్రశ్నంబునకు నుత్తరం బయ్యుధిష్ఠిరుఁడు సెప్పవలయుఁ గాని నాఁడు ధర్మసూక్ష్మత యెవ్వరికిని నెఱుంగ గహనంబు, దీనిఫలంబు వేగంబ యిక్కురుకుల పాంసను లనుభవింతు రని పలుకుచున్న యవసరంబున నక్కోమలిం జూచి నగుచు. 245

తే. తరుణి యేవురకంటె నొక్కరుఁడ భర్త యగుట లగ్గు జూదంబున నాలినోటు వడని వానిఁగా దఁగు భర్తఁ బడయుమింక ననుచు రాథేయుఁడుల్ల సమాడెనంత 246

ఉ. అమ్ముదితన్ విభీతహరిణాక్షిఁ గలాపవిభాసి కేశ భా రమ్మున నొప్పుదానిఁ దనరమ్య థూరుతలంబు నెక్కఁగా రమ్మని సన్నసేసె ధృతరాష్ట్ర సూతాగ్రజుఁ డప్డు దాని దూ రమ్మునఁ జూచి కౌరవకురంగ మృగేంద్రుఁడు భీముఁ డల్కతోన్. 247

క. లయ సమయ దండధరని ర్దయుఁడై ధరణీశు లెల్లఁ దన పలుకులు వి స్మయ సంభ్రమ భయ సంభృతు లయి విను చుండగ నిట్టు లనియెన్ సభలోన్. 248

ఉ. ధారుణి రాజ్యసంపద మదంబునఁ గోమని గృష్ణఁ జూచి రం భోరు నిజోరుదేశమున నుండఁగఁ బిల్చిన యిద్దురాత్ము దు ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాతభ గ్నోరుతరోరుఁ జేయుదు సుయోధను నుగ్ర రణాంతరంబునన్. 249

వ. అని సర్వజన భయానక క్రోధావేశ వివశుం డయి యాయుధంబు లున్న వలనికి దృష్టులు సలుపుచు నగ్రజుమొగంబు సూచుచున్న భీమసేను నతి రౌద్రాకారంబు సూచి భీష్మ విదుర ద్రోణాదు లిది కోపంబున కవసరంబు గా దని యాతనిం బ్రశాంత చిత్తుం జేసి రంత. 250

క. ధృతరాష్ట్రు నగ్నిహోత్రా యతనంబున నఱచె వఱళు లగ్నులు శాంత ద్యుతు లయ్యెఁ గౌరవ స్త్రీ తతిహృదయము లధిక శోకతప్తము లయ్యెన్. 251

క. క్రూరాత్మకు లై దుష్పద వీరతు లగు ధార్త రాష్ట్ర వీరుల శయ్యా గారముల నెగసె నెంతయు ఘోరంబుగఁ గాక ఘూకఘూత్కారంబుల్. 252

క. అట్టి మహోత్పాతంబులు పుట్టినఁ గృప విదుర కలశభూ శాంతనవుల్ నెట్టన ధృతరాష్ట్రజులకుఁ బుట్టె నరిష్ట మని రిష్టమునఁ దమలోనన్. 253

వ. అంత నంతయు నెఱింగి గాంధారి విదురుం దోడ్కొని ధృతరాష్ట్రు కడకుఁ బోయి పాండవ పరాజయంబును ద్రౌపది పరిభవంబును దుర్నిమిత్తోత్పత్తియుం జెప్పిన విని ధృతరాష్ట్రుండు దుర్యోధనుం బిలిచి యిట్లనియె. 254

చ. పరమ పతివ్రతన్ సభఁ దపస్వినిఁ బాండవ ధర్మపత్ని ధ ర్మరత నయోనిజం బ్రకృతి మానవ భామినిఁ గాఁ దలంచి దె ప్పరములు వల్కఁగాఁ దగునె బాల్యము నాదిగఁ దుష్టభావనం బెరిఁగితి నీ నిమిత్తమునఁ బెద్దయు దుఃఖితులైరి పాండవుల్. 255

వ. వారల వలన నీదురాగ్రహం బుడుగు మని కొడుకును భంగించి సకర బాంధవ హితంబు సేయం దలంచి ద్రౌపదిని రావించి శాంత వచనంబుల నిట్లనియె. 256

ధృతరాష్ట్రుండు ద్రౌపది గోరిన వరంబు లిచ్చుట

క. సుందరీ! నా కోడండ్రు ర యం దభ్యర్చతవు నీవ యతిముదమున నీ కొందఁగఁ బ్రియంబు సేసెద నిందుముఖీ! వేఁడు మెద్ది యిష్టము నీకున్. 257

వ. అనినం బాంచాలి యిట్లనియె. 258

ఆ. కరుణతోడ నాకు వరము ప్రసాదింప బుద్ధియేని లోక పూజితుండు మనువిభుండు ధర్మతనయుండు దాస్యంబు వలనఁ బాయవలయు వసుమతీశ! 259

వ. అట్లయినం గురుకుమారులు గురువృద్ధ జనలాలితుం డై పెరిఁగిన ప్రతి వింధ్యు దాసపుత్త్రుం డన కుందురు రిదియ నా యిష్టం బనిన నిచ్చితి నింక రెండవ వరంబు వేఁడు మనిన ద్రౌపది యిట్లనియె. 260

క. నెమ్మిని ధర్మజు నలువురు దమ్ములుఁ దమ యాయుధముల దమవర్మవరూ థమ్ములయుఁ దోడ సకల హి తమ్ముగఁ బాయంగ వలయు దాస్యము వలనన్. 261

వ. అనిన ధృతరాష్ట్రుండు నీ కోరినం వరం బిచ్చితి నింక మూఁడవ వరంబు వేఁడు మనిన ద్రౌపది యుట్లనియె. 262

ఆ. వైశ్యసతికి నొక్కవరము సత్క్షత్త్రియ సతికి రెండు శూద్రసతికి మూఁడు విప్రసతికి నూఱు వేఁడఁ జన్వరములు గాన యింక వేఁడఁ గాదు నాకు. 263

వ. ఆనిన ధృతరాష్ట్రుండు కోడని గుణంబులకు ధర్మం బెఱుంగుటకు సంతసిల్లి *యనుజ సహితుం డయిన యుధిష్ఠిరు రావించి నీవు సర్వ సంపదలు స్వరాజ్యంబును నొప్పుగొని యెప్పటియట్ల యింద్రప్రస్థ పురంబున కరిగి సుఖంబుండుము నీకు ల గ్గయ్యెడు మని వెండియు. 264

* కొందఱు తాటాకులలో నున్నదని చెప్పెడు నమూలమును సందర్భ శుద్ధి రహితమగు నధిక గ్రంథముః- ( “వరంబు వేఁడం గాదేని నీకు మేలగు తెఱం గెయ్యది చెప్పు మనుటయు ద్రౌపది యిట్లనియె వీరిలో నొక్కరు నాతో జూదం బాడ నియోగింపుం డనిన ధృతరాష్ట్రుండు శకునిం బిలిచి ద్రౌపదితో నొక్క యొడ్డొడ్డి యాడు మనిన నక్షంబులు దెచ్చి యిచ్చి నీకిష్టంబైన యొడ్డొడ్డమనిన ద్రౌపదియును నత్యంత శుచిర్భూతయయి నీళ్ళును నక్షంబులుఁ బుచ్చుకొని తమతండ్రు లగు మాద్రేయులం దలంచి నమస్కరించి నాకుఁ బ్రతికూలంబుగాక పాండవులను నన్నును గెలిపించి శత్రులం ద్రుంచు విధంబుగా నాకు ననుకూలురు గావలయునని మ్రొక్కి యడ్డసారంబులు పుచ్చుకొని శకుని కిట్లనియె.

క. ఈ సభ యెల్లను జూడఁగఁ దాసత్వము సేయఁ గాని దాసత్వమునం జేసి మీతోడఁ బోరఁగ గాసిల్లినచోట నేను గ్రమ్మఱఁ దివుతున్.

ఆ. నీవ యోడితేని నిరతంబు నేవుర దాసవృత్తి వాసి తద్ద యరుగు నట్టు లొడ్డు నొడ్డి యాడంగఁగ డఁగును యనిన శకుని యిట్టులనియె మగుడ

ఆ. ఆడి యోడి పోవుడది ధర్మువే వారి కనిన నాతి యిట్టులనియె నతని కోప మదియు నిలుపఁ గొలఁదియే వాయుజు గురుడిదాసితను గణంగినట్లు

వ. అనిన దుర్యోధనుండు ద్రౌపది పలికినయట్ల మా కోపంబులు వారి కోపంబులు నడువ బ్రహ్మాదులకు గొలఁది యగునె యదియ యొడ్డుగా నొడ్డియాడు మనిన శకునియు నవుంగాక యని యొడ్డొడ్డిన నక్కోమలికి వరదులైన మాద్రేయులు ద్రౌపది గెల్చునట్లుగాఁ బడిన.

క. ఇంక నొకయొడ్డు వినుమా శంకిత దివ్యాంబరములు శరములు రథముల్ కంకటములు భూషణములు లుకొని నీ నొడ్డియాడు మున్నతమతివై.

క. అని యట్టు లొడ్డి యోడిన మనమునఁ గౌరవులు వెఱచి మానుమ యనుచున్ వనిత గొనిన సారెలు గడు ననయంబును గెల్వనిచ్చు నశ్రమలీలన్.

వ. అని వారించిరి ద్రౌపదియు దన పురుషులకడకు వచ్చియున్నంత ధృతరాష్ట్రుం డనుజ సహితుం ...

తే. నీవు నిత్యంబు వృద్ధోపసేవఁ జేసి యెఱుఁగు దెల్ల ధర్మంబుల నెఱుక లేక కడఁగి నీ కెగ్గు సేసె నా కొడుకు దీని మఱచునది నీకు నేనొండ్లుగఱపనేల 265

క. మనమున వేరమిఁ దలఁపమి యును నక్షమచిత్తుఁ డగుటయు గుణముల కై కొని దోషంబులు విడుచు టయును నుత్తముఁ డయిన పురుషు నుత్తమ గుణముల్. 266

వ. ఏను బుద్ధిలేక జూదం బుపేక్షించితి నల్ప బుద్ధి సత్త్వుం డయిన వృద్ధు నన్నును మీ తల్లియయిన గాంధారినిం దలంచి దుర్యోధనాదులు సేసిన దుర్నయంబులు సేకొన కుండునది సర్వశాస్త్రవిదుం డయిన విదురుండు మంత్రిగా సర్వధర్మవిదుండ వైన నీవు రక్షకుండవుగా నిక్కురురులంబులకు లగ్గగునని ధర్మరాజుఁ బాండురాడు రాజ్యంబునందు సమర్పించిన. 267

తరలము. తరుణి ద్రౌపది యిట్లు పాండవ ధార్తరాష్ట్రులదైన భీ కర పరస్పర కోపవేగము గ్రన్నఁ బాచి విపత్తి సా గర నిద్ధమగ్నుల నుద్దరించెఁ బ్రకాశకీర్తుల ధీరులం బురుష సింహములన్ నిజేశులఁ బూని తద్దయుఁ బ్రీతితోన్. 268

సీ. దాని నంతయు భీమసేనుండు విని రాజ్యసంప్రాప్తి పాండవ సత్తములకు సతి కారణంబున ధృతమయ్యె నను నింతకంటెను గష్టంబు గలదె యొండు పేర్మి నపత్యంబునఁ గర్మంబు విద్యయు ననునవి తేజంబు లట్టె తగిన పురుషున కెందును నిరతంబు మిక్కిలి తేజంబు కర్మంబు దీని విడిచి

ఆ., యలుకగఁడె పురుషుఁడని కోపఘూర్ణిత రక్తనేత్రుఁడై పరాక్రమమున శత్రువరుల నుగ్రసంగరంబునఁ జంపి కుతల రాజ్యమెల్లఁ గొందుననుచు. 269

వ. మృగమధ్యంబున నున్న సింహంబునుబోలె ననజమధ్యంబున నున్న యాతనిం గరంబున వారించి ధర్మరాజు ధృతరాష్ట్రు శాసనంబునం దమ్ములుం దానును ద్రౌపదీ సహితంబు గాంచన రథారూఢుండై యింద్రప్రస్థ పురంబున కరిగిన నిట దుశ్శాసను చేత నంత వృత్తాంతంబును విని దుర్యోధనుండు కర్ణ శకుని సైంధవులతో విచారించి ధృతరాష్ట్రు పాలికింజని యిట్లనియె. 270


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com