Jump to content

ఆ భా 2 2 1 to 2 2 30

వికీసోర్స్ నుండి

--రానారె 23:05, 26 ఆగస్ట్ 2006 (UTC)


శ్రీమదాంధ్ర మహాభారతము

సభాపర్వము - ద్వితీయాశ్వాసము


2_2_1

శ్రీరమణీప్రియ, ధర్మవి

శారద, వీరావతార, సౌజన్యగుణా

ధార, భువనైకసుందర

వీర, శ్రీరమ్య, బుధవివేక నిధానా.


ధర్మజుండు కృష్ణున కర్ఘ్యం బిచ్చుట


2_2_2


వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పెనట్లు రాజసూయమహో

త్సవంబు నొప్పును ధర్మరాజు నిత్యతయును స్తుతియించి నారదుం

డాపదంబున సకలరాజసమూహంబును రాజలోకంబులో మనుష్యసామా

న్యుం డయియున్న జగన్మాన్యు జనార్ధనుం జూచి తొల్లి బ్రహ్మాదిసురగణ

ప్రార్థితుం డయి యఖిల మహీభారావతరణార్థంబు నారాయణుండు

యదువంశంబున నుదయించుటయు నయ్యయిక్షత్రియకులంబుల సుర

దైత్యదానవయక్ష రాక్షసగంధర్వాదులయంశావతారంబులుందలంచి భవి

ష్యత్భారతరణంబునకు సంహృష్టహృదయుం డయి యుండునంత.


2_2_3


క. శాంతనవుఁడు భీష్ముండు ప్ర, శాంతుఁడు దత్క్రతువు సూచి సంతుష్టుండై

యంతకతనూజునకు ధృతి , మంతున కత్యంతదర్మమతి కిట్లనియెన్.


2_2_4


మత్తకోకిలము. స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును నిష్టుఁడున్

భూతలేశుఁడు సంయుజుండును బూజనీయులు వీరిలోఁ

బ్రీతి నెవ్వఁడు సద్గుణంబులఁ బెద్ద యట్టిమహాత్ము వి

ఖ్యాతుఁ బూజుతుఁ జేయు మొక్కని గౌరవాన్వయవర్ధనా.


2_2_5


వ. అనిన నట్టివాఁ డెవ్వండు నా కెఱిఁగింపు మనిన ధర్మరాజునకు భీష్ముం

డిట్లనియె.


2_2_6


సీ. రోదసీకుహరంబు రుచిరాంశుతతిఁజేసి యర్కుండు వెలిఁగించునట్టు లమృత

సందోహనిష్యంద చంద్రికఁజేసి శీతాంశు డానందించునట్లు సకల

జనులకుఁ దనదైనసదమలద్యుతిఁజేసి తనరంగఁ దేజంబుఁ దనుపుఁ దాన

చేయుచు నున్నసత్సేవ్యుండు పుండరీకాక్షుండుగృష్ణుఁ డనాదినిధనునఁ


ఆ. డబ్జనాభుఁ డుండ నర్ఘ్యంబునకు నిందు,నర్హు లొరులు గలరె యజ్ఞపురుషు

నఖిలలోకపూజ్యు నచ్యుతుఁ బూజింపు,మధిప!యదియ చూవె యజ్ఞఫలము.


2_2_7


వ. అనిన భీష్మవచనంబున నప్పుడు సహదేవోపనీతం బయినయర్ఘ్యం బర్హ

ణీయుండయిన వాసుదేవునకు శాస్త్రదృష్టవిధానంబున ధర్మతనయుం

డిచ్చిన దానిం జూచి సహింపక శిశుపాలుం డుపాలంభనపరుం డయు

యధోక్షజు నాక్షేపించుచు ధర్మరాజున కిట్లనియె.


-: శిశుపాలుండు ధర్మరాజు నాక్షేపించుట :-


2_2_8



మ. అవనీనాధు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్ మహీ

దివిజుల్ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయుదు

ర్వ్యవసాయంబునఁ గృష్ణుఁ గష్టచరితున్ వార్ష్ణేయుఁ బూజించి నీ

యవివేకం బెఱిఁగించి తిందఱకు దాశార్హుండు పూజార్హుఁడే.


2_2_9


చ. కడుకొని ధర్మతత్వ మెఱుఁగంగ నశక్యము ధర్మబాహ్యు ని

న్నొడఁబడ నిష్టు డై కఱపి యుత్తము లుండఁగ వాసుదేవుఁ డ

న్జడునకుఁ బూజ యి మ్మని విచారవిదూరుఁడు భీష్ముఁ డెంతయున్

వెడఁగుఁదనంబునం బనిచె వృద్ధులబుద్ధులు సంచలింపవే.


2_2_10


చ. ఇతనికిఁ గూర్తురేని ధన మిత్తు రభీష్టము లైనకార్యముల్

మతి నొనరింతు రిష్టుఁ డని మంతురుగాక మహాత్ము లైన భూ

పతులయు విప్రముఖ్యులసభన్ విధిదృష్టవిశిష్ట పూజనా

యతికి ననర్హు నర్హుఁ డని యచ్యుతు నర్చితుఁ జేయఁ బాడియే.


2_2_11


సీ. ఈతని వృద్ధని యెఱిఁగి పూజించితే వసుదేవుఁ డుండంగ వసుమతీశ!

ఋత్విజుం డని విచారించి పూజించితే ద్వైపాయనుం డుండ ధర్మయుక్తి

యాచార్యుఁడని వినయమునఁ బూజించితే కృతమతుల్ ద్రోణుండుఁ గృపుఁడు నుండ

భూనాథుఁ డనియెడుబుద్ధి బూజించితే యాదవుల్ రాజులే యవనిమీఁదఁ.


ఆ. బూజనీయు లైనపురుషులలోపల

నెవ్వడయ్యెఁ గృష్ణుఁ డిట్టు లేల

పూజ్యు లయినవారిఁ బూజింప నొల్లక

భీష్ము పనుపుఁజేసి బేల వయితి.


2_2_12


చ. పురుషవిశేషనిత్తముఁడు పూజ్యుఁడు రాజులలోన నీయుధి

ష్ఠిరుఁ డని నీగుణాళి ప్రకటించి మనంబులలోన ధారుణీ

శ్వరులు భవన్మఖంబునకు వచ్చిన నందఱ కివ్విధంబునం

బరఁగ నవఙ్ఞ సేయు టిది పాడియె ధర్మువె ధర్మనందనా!


2_2_13


క. నీ వెఱుఁగక యిచ్చిన నిది

నా విషయమె యని మనంబునం దలఁపక ల

జ్జావిరహితుఁడయి యర్ఘ్యము

గోవిందుఁడు గొనియెఁ దనకుఁ గొనుటుచితంబే.


2_2_14


క. చనఁ బేడికి దారక్రియ

యును జెవిటికి మధురగీతియును జీఁకున క

త్యనుపమసురూపదర్శన

మును జేయుటఁ బోలుఁ గృష్ణుఁ బూజించుటిలన్.


2_2_15


ఉ. ఈయవనీశ్వరప్రవరు లిందఱు నిన్ను నగంగ నిట్లుగాఁ

జేయుదె ధర్మరా జనువిశేషసమాఖ్య నిరర్థకంబుగా

ధీయుత ! యంచు ధర్మజ నదీసుత కృష్ణుల నెగ్గు లాడుచుం

బోయె సదంబు వల్వడి సపుత్త్రబలుండయి చైద్యుఁ డల్కతోన్.


2_2_16


వ. ఆశిశుపాలుపిఱుందన చని ధర్మనందనుండు వానిం బ్రియవచనంబుల

ననునయించుచు నిట్లనియె.


2_2_17


క. భూరిగుణోన్నతు లనఁ దగు,వారికి ధీరులకు ధరణి వల్లభులకు వా

క్పారుష్యము చన్నె మహా,దారుణ మది విషముకంటె దహనము కంటెన్.


2_2_18


ఉ. ఆదిజుఁ డైనబ్రహ్మయుదయంబున కాస్పదమైనవాఁడు వే

దాదిసమస్త వాఙ్మయములందుఁ బ్రశంసితుఁ డైనవాఁడు లో

కాది త్రిలోకపూజ్యుఁ డని యాత్మ నెఱింగి పితామహుండు దా

మోదరుఁ జెప్పెఁ బూజ్యుఁ డని యుక్తమ కా కిది యేమి దోసమే.


2_2_19


క. పరమార్థ ప్రతిభఁ దమో,హరు నచ్యుతు భీష్ముఁ డె ఱిఁగిన ట్లెఱుఁగఁగ నీ

కరిది శిశుపాల! పెద్దల,చరితం బల్పులకు నెఱుఁగ శక్యమె యెందున్.


2_2_20


క. గురుఁ డని సమస్తలోకో,త్తరుఁ డని నీకంటె వృద్ధతములైన నరే

శ్వరు లచ్యుతునర్చన నెడఁ,గర మభినందింప నీకుఁ గా దనఁ దగునే.


2_2_21


వ. అని యా శిశుపాలుం బట్టువఱుచు చున్నంత ధర్మరాజునకు భీష్ముం

డిట్లనియె.


-: భీష్ముఁడు శిశుపాలుని నిందించుట :-


2_2_22


ఉ. పాలితదుర్ణయుండు శిశుపాలుఁడు బాలుఁడు వీని నేల భూ

పాలక నీకుఁ బట్టువఱుపన్ మఱు ధర్ము వెఱుంగ వీనికిం

బోలునె రాగకోపపరిభూతమనస్కున కల్పరాజ్యల

క్ష్మీలలనాంధబుద్ధి కనిమిత్తమహత్పరివాదశీలికిన్.


2_2_23


వ. అని ధర్మరాజును వారించి శిశుపాలుంజూచి భీష్ముం డి ట్లనియె.


2_2_24


చ. అవినయబుద్ధి వై హరికి నర్ఘ్య మయోగ్యమ యంటి వీవు మూ

ర్ఖవు శిశుపాల యింకఁ బలుకన్ వలసెన్ సభలోన నున్న యీ

యవనిపు లెల్ల నాతనిదయం బరిముక్తులు వానిచేత నా

హవజితులుం దదీయశరణార్ధులుఁ గా కొరు లయ్య చెప్పుమా.


2_2_25


తే. ఉత్తమ ఙ్ఞానవృద్ధు నానుండె నేని

బాలుఁడయ్యెను బూజ్యుఁడు బ్రాహ్మణుండు

క్షత్రియుఁడు పూజ్యుఁ డమితవిక్రమసమృద్ధి

నుర్విపతులలో నధికుఁడై యుండెనేని.


2_2_26

క.ఈ రెండు కారణముల ము

రారాతియ యర్ఖ్యమునకు నర్హుఁడు జగదా

ధారుండు మాక కాదు స

దారాధ్యుఁడు విష్టపత్రయావాసులకున్.


2_2_27


క.వృద్ధు లొకలక్ష యున్నను

బుద్ధియె యెవ్వరికి వారిఁ బూజింసంగా

నిద్దరణీశులలో గుణ

వృద్ధని పూజంచితిమి త్రివిక్రము భక్తిన్.


2_2_28


క. పూజితుల తృప్తు లగుదురు

భూజను లొరు లచ్యుతుండు పూజితుఁడగుడుం

దేజమున జగత్తిత్రయముఁ

బూజిత మయి తృప్తిఁ బొందుఁ బుణ్యసమృద్ధిన్.



2_2_29


సీ. బుద్ధియు మనమును బురుషుండు నవ్యక్త మగుచున్న ప్రకృతియు నంబరంబు


ధరణియు దరణియు దహనుండుఁ జంద్రుండు గాడ్పును దిక్కులుఁ గాలములును

దాన యై జంగమస్ధావరాత్మక మైన సకలభూత ప్రపంచంబు నెల్లఁ

దానదివ్య శక్తిమైఁ దాల్చినసర్వాత్ము సర్వభూతేశ్వరుసర్వవంద్యు


ఆ. నధికయోగనిష్ఠితాత్మకు లగుమహా

యోగివరులు తత్వయుక్తిఁ జేసి

యెఱిఁగినట్లు నీకు నెఱుఁగంగఁ బోలునే

యనుచు భీష్ముఁ డన్న యవసరమున.


2_2_30


చ. ఎడపక యర్ఘ్య మచ్యుతున కిచ్చితి మిచ్చిన దీనికిం దొడం

బడ మని దుర్జనత్వమునఁ బల్కెడువీరుల మస్తకంబుపై

నిడియెద నంచు దాఁ జరణ మెత్తె సభన్ సహదేవుఁ డట్టిచో

నుడిగి సభాసదుల్ పలుక కుండిరి తద్దయు భీతచిత్తులై.

"https://te.wikisource.org/w/index.php?title=ఆ_భా_2_2_1_to_2_2_30&oldid=3186" నుండి వెలికితీశారు