ఆ భా 2 2 151 to 2 2 180

వికీసోర్స్ నుండి

వ. జూదం బన్నది పురాణంబులయందును వినంబడు దీన దోషంబు లేదు సుహృద్ద్యూతంబున దేవతలు (ధర్మంబు) దేవసాయుజ్యంబు వడయుదురు గాన దీనిం బ్రవర్తింప శకుని కానతిచ్చి యిందులకు ధర్మనందను రావింప వలయు ననిన ధృతరాష్ట్రుండు పెద్దయుం బ్రొద్దు చింతించి యెట్టకేనియు దాని కొడంబడి విదురుం బిలిపించి వాని కిట్లనియె. 151

చ. అనుపమరత్న కాంచనచయాంచిత మీసభ దీని ధర్మనం దనుఁ డనంఘుడు దానుఁ దనదమ్ములు నిందుల కేఁగుదెంచి చూ చినఁ గడు సంతసం బగు విశిష్టజనస్తుత! నీవు వానిఁ దో డ్కొని చుదెమ్ము భుసురసఖున్ బుధబంధు జనారంజనున్. 152

వ. ఇట్టి విచిత్రరత్న సభావేదికాతలంబున నతండును దుర్యోధనుతోడం బ్రొద్దువోక సుహృద్ద్యూతంబుఁ బ్రవర్తించు ననిన విని విదురుండు విషణ్ణ హృదయుం డయి మాయాదురోదంబు దురర్థంబుగాఁ జింతించి దీని నుడిగిన నుభయపక్షంబులకు ల గ్గగు నని పెక్కు మాఱులు వారించి. 153

విదురుఁడు ధర్మరాజుం దోడ్కొని వచ్చుట

క. అవిలంఘనీయ మీదు ర్వ్యవసాయం బనుచు సత్యవచనుఁడు ధర్మా ర్థవిదుం డప్పుడు ధృతరా ష్ట్ఱ విధాతృనియోగమున కొడంబడి యంతన్. 154

క. ఇంద్రప్రస్థ పురంబున కింద్రగురు ప్రతిభుఁ డరిగి యింద్రసమానుం జంద్రయశు ననుజసహితు నృ పేంద్రుని ధర్మసుతుఁ గాంచె నెంతయుఁ బ్రీతిన్. 155

వ. అతనిచేత నభ్యర్చితుం డయి కుశలం బడిగి నిజాగమన ప్రయోజనం బెఱింగించిన విని విదురునకు ధర్మతనయుం డిట్లనియె. 156

సీ. పుత్త్ర వత్సపుఁడు విచిత్ర వీర్యాత్మజుఁ డార్యుంజు ధృతరాష్ట్రుఁ డాదరించి నిన్ను నియోగించె నన్నుఁ దోడ్కొని తేర నీవును వచ్చితి నెమ్మితేడ లాలితా పుర్వ సభా లోకంబుల యందు జూదంబు కార్యంబె చెపుమ జూదంబు కతమున భేదంబు గాకుండ నేరదు మా లోన నీనియోగ

ఆ. మనఘమాకలంఘ్యమయినట్లు ధృతరాష్ట్రు పనుపుసేయ నీకుఁ బాడియదియ యనుచు విధి నియుక్తుఁడయు యప్డు విదురుతో నేఁగ నిశ్చయించె నిందుకులుఁడు. 157

క. అనుజులు ద్రుపదాత్మజయును ననుచర ముఖ్యులును ధౌమ్యుఁడాదిగ విద్వ జ్జనులును దోఁ జనుదేరఁగ నినసన్నిభ తేజుఁ డరిగె నిభపురమునకున్. 158

వ. అందు దుర్యోధన దుశ్శాసనాది పుత్త్ర శతంబుతే భీష్మ శకుని సైంధవ కర్ణ గౌతమ ద్రోణాశ్వత్థామ సోమదత్త సమేతుం డయి యున్న ధృతరాష్ట్రునకు భనుమతీ ప్రభృతిస్నుషా పరివృతయయి తారకాపరివృత యయియున్న రోహిణియుం బోలెనున్న గాంధారీ దేవికిఁ గురువృద్ధ జనులకు నతివినయంబున ననుజ సహితుండయి ధర్మతనయుండు మ్రొక్కె నంత ద్రుపదరాజ నందనయు గాంధారికి మ్రొక్కిన నక్కోమలిం జూచి గాంధారి కోడండ్రెల్లను విస్మిత లయి. 159

( ఈ సీసము తర్వాతఁ గొన్ని వ్రాఁత ప్రతులలోఁ గల యధిక పాఠము.

వ. ఇట్లు కృతనిశ్చయుండై ధర్మతనయుండు దివ్యాంబరాభరణ మాల్యగంధంబుల నలంకృతుండై ప్రయాణార్థంబు భూసురనికరంబులకు బహు రత్న సువర్ణంబులు దానంబు లిచ్చి మంగళ తూర్య నాదంబులును విప్రాశీర్వాదంబులును మాగధమంజుల గానంబులును వందిజన వాక్య సంతానంబులును విలసిల్లుచుండ మందిరంబులు వెడలి యనేక మణిమయ ప్రభాభాసురంబైన కాంచన రథారోహణంబు చేసి కుంతీ ద్రౌపదులను దోడనచనుదేర నరిగి యన్నరనాథుండు నాగనగర ప్రవేశంబు చేసి సౌరజననయనానందంబు సేయుచుం జని రాజగృహ ద్వార సమీపంబున.

క. పరమోదారుఁడు ధర్మజుఁ డరదము డిగి చనియెఁ బ్రీతి ననుజులు దానున్ సురుచిర విభవస్ఫురణను* గురుతర మైనట్టి కొలువు కూటంబునన్ )

  • సురవిభవస్ఫురణంబున.

తే. అఖిల లావణ్య పుంజంబు నబ్జభవుఁడు మెలఁతగా దీనియందు నిర్మించెనొక్కొ కానినాఁ డిట్టి కాంతి యే కాంతలందు నేల లేదని సామర్ష హృదయ లయిరి. 160

వ. ఇట్లు పాండవ కౌరవు లతి ప్రణయ గౌరవంబున నద్దివసంబు సలిపి రంతఁ బ్రభాతంబ. 161

ఉ, ఆధృతరాష్ట్రు చేసిన యనర్ఘ మణిప్రకారాను బద్ధశో భాధృతి నొప్పుచున్న సభ పార్థివముఖ్యుఁడు ధర్మజుండు దు ర్యోధనుఁ డర్థిఁ జూపఁగ సహోదర వీరులుఁ దనుఁజూచి ల క్ష్మీధరముర్తి యెంయును మెచ్చె మనంబునఁ దద్విభూతికిన్. 162

వ. అయ్యపుర్వ సభామణి కుట్టిమంబున నందఱు సుఖాసీను లయి యిష్ట సంభాషణాది క్రీడావసరంబున నున్నంత దుర్యోధనుండు యుధిష్ఠిరున కిట్లనియె. 163

క. అనఘ! సుహృద్ద్యూతం బిం దొనరింతము ప్రొద్దు వోకయును నగు జూదం బునకుం బ్రియుఁడవు దక్షుఁడ వన విందుము నిన్నుఁ బ్రీతి నక్షజ్ఞులచేన్. 164

వ. అనిన వానికి ధర్మతనయుం డిట్లనియె. 165

తే. క్షత్త్ర నీతి క్రమంబులుగావు సూవె నికృతియును జుదమును ధర్మనిత్యులైన వారికీ రెండు వర్జింప వలయు నెందుఁ బాపవృత్తంబు జూదంబు పార్థివులకు. 166

ఆ. కుటిల మార్గులయున కుత్సితకితవుల తోడఁ గడఁగి జూద మాడఁ జనదు దానఁ జేసి యర్థధర్మ వివర్జితు లగదు రెట్టివారు జగములోన. 167

వ. మఱియు మాయాద్యూతంబున జయించుట మహాపాతకం బనియును ధర్మద్యూతంబున జయించుట ధర్మయుద్ధంబున జయించునంతియ పుణ్యంబనియును నసితు డయిన దేవలుండు చెప్పె ననిన నయ్యుధిష్ఠిరునకు శకుని యిట్లనియె. 168

క. ద్యూతకలా కుశలుండగు నాతఁడు లోకజ్ఞుఁడును మహామతియును వి ఖ్యాతుఁడు నగు సత్క్షత్త్రియ నీతివిదుఁడు దగనె దాని నిందింపంగన్. 169

క. బలహీను లయిన వారలు బలవంతుల నొడుచునపుడు బహుమాయల న చ్చలమునఁ జేయుట యెందును గలయదియ జయంబ కాదె కర్తవ్యమిలన్. 170

వ. జూదంబున కీ వోడుదేని యుడుగు మనిన నాతనికి ధర్మరా జిట్లనియె. 171

ధర్మరాజూ శకునితో జూదం బాడుట

క. బలవద్ద్యూతార్థముగాఁ బిలువంబడి మగుడ నగునె పెక్కులు పలుకుల్ పలుకంగ నేల యని య త్యలఘుఁడు ధర్మజుఁడు జూద మాడఁ గడంగెన్. 172

వ. ఇట్లు జూదంబున నయ్యెడు దోసం బెఱింగియు దైనానుశాసనంబున ధర్మజుఁడు జూద దాని కభిముఖుం డయి చందన కర్పూర కస్తూరీ పరిషిక్తం బయిన ద్యూతరంగంబునందు ముందఱ గంధ పుష్పార్చితంబు లయిన యభిమతాక్షంబు లమరిచికొనియున్న సౌబల వివింశతి చిత్రసేన వికర్ణులం జూచి వీరిలో నెవ్వఁడు నాతో జూదం బాడెడు వాఁడనిన నాతనికి దుర్యోధనుం డిట్లనియె. 173

తే. అనఘ! మా మామ శకుని నాకై కడంగి జూద మాడెడి నీతోడఁగాదు నాక యీతఁడొడ్డిన ధనరాసు లెవ్వియైనఁ బోఁడిగా నీకు నీఁగలవాఁడ నేను. 174

వ. అని తనచేతి యనర్ఘ రత్నకటకంబు లొడ్డిన నన్యులకయి యన్యులు జూదం బాడుట యెంతయు విషమం బనుచు ధర్మతనయుండు సాగరావర్త సంభవంబు లయిన పరార్థ్య మణిహారంబు లొడ్డెనిట్లు సుహృద్ద్యూతంబు ప్రవర్తిల్లు నదియైన నచ్చోటికి వచ్చి భీష్మ ధృతరాష్ట్ర విదుర కృప ద్రోణాశ్వత్థామలు విచిత్రోచ్చాసనస్థు లయి దానిం జూచుచుం బ్రహృష్ట హృదయులయి యుండిరంత. 175

తే. అభిమతాక్షముల్ దొల్చి మాయావిదుండు సుబలరాజాత్మజుఁడు ధర్మసుతు జయించె నొడుతు నే నింక నని వెండియును గడంగె శకునితో జూద మాడ నా శశికులుండు. 176

వ. ఇట్లు యుధిష్ఠిరుండు బద్ధమత్సరుం డయి పెఱిగి యొండొండ యొడ్డుచు నిష్కసహస్ర భరితానేకాయుత కుండమండితంబు లయిన సువర్ణ భాండాగారంబులును, వజ్రవైదూర్య మరకత మౌక్తి కనీల ప్రవాళ పద్మరాగాది వివిధ శుద్ధ విపుల రత్న పరిపూర్ణంబు లైన రత్న భాండాగారంబులుం, బ్రత్యేకంబ పంచ ద్రోణ కాంచన సంచితంబు లయిన చతుశ్శత నిధులును మణికింకిణీ జాలాలంకృతంబు లయిన యసంఖ్యాతహయయూధంబులును, జాతరుప వరూథంబులుం, గనక కక్ష్యాకుథసనాథంబు లయిన మదాంధగంధసింధుర సందోహంబులుం, బరార్థ్యరత్నభూషితంబు లయిన యోషిత్సహస్రంబులును, ననుదినాతిథిజన భోజనపాత్ర హస్తులయిన శతసహస్ర పరిచారకులును నర్జునునకు జిత్రరథుం డిచ్చిన గంధర్వహయంబులందొట్టి దుగ్ధపాన శాలితండులఖాదనంబులం బెరుఁగుచున్న జాత్యశ్వా నేకాయుతంబులు, నజావి గోమహిష ఖర రాసభనివహంబులు నొక్కొక్క యొడ్డునన యొడ్డి యోటుపడినం జూచి విదురుండు ధృతరాష్ట్రునకు రహస్యంబున నిట్లనియె. 177

క. ఖలుఁ డీదుర్యోధనుఁడె గ్గుల తోడన యుద్భవిల్లె గామాయు రుతం బులు వించె దుర్నిమిత్తం బులు పెక్కులు పుట్టె వీని పుట్టిన వేళన్. 178

వ. తొల్లి యెన్నండును బాపంబుం బొరయని మహాభిష భీమసేన ప్రతీప శంతనుల కులంబు దుర్యోధను కారణంబునం బాపభుయిష్ఠంబుగా నున్న యది యొక్కని కారణంబునఁ గులంబున కె గ్గగు నేని వాని దూషించి కులంబు రక్షించుట ధర్మం బని శుక్రుండు చెప్పెఁ గులరక్షణార్థం బంధక యాదవ వృష్టివీరులు కృష్ణునియాగించి కుల దూషకుం డైన కంసుని వధిపించిరి గావున. 179

మత్తకోకిలము. వాసవాత్మజుఁ బంపుమిప్పుడ వాఁడు ధర్మవిదుండు నీ శాసనంబున నిగ్రహించు విచారదూరు సుయోధనున్ భూసతీశ్వర! దీన నీ కులమున్ మహీ ప్రజయున్ గత త్రాసవృత్తి సుఖంబు వొందుఁ ప్రధానవిగ్రహ మేటికిన్. 180


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com