ఆ భా 2 2 091 to 2 2 120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వ. ఇట్లు సకల సుఖోపభోగ విముఖుం డయి యెవ్వరితోడం బలుక కున్న దుర్యోధనుం జూచి శకుని యిట్లనియె. 91

ఆ. ఇన్ని దినము లయ్యె నేటికి నాతోడ నిభపురేశ పలుక విట్టు లేల నీ ముఖంబు దీర్ఘనిశ్వాసధూమసం హతులఁ జేసి కలుష మయినయదియు. 92

క. నా కెఱిఁగింపుము దీని న నేకాగ్రతఁ బొంద నేల యే నుండఁగ న వ్యాకుల భవత్ప్రతాపని రాకృతులు ధరిత్రిలోని రాజులు నీకున్. 93

వ. అంత సంతాపింప నేల యనిన నాశకునికి దుర్యోధనుం డిట్లనియె. 94

దుర్యోధనుని దురాలోచనము

ఉ. నీవును జూచి తట్టి సభనేని వినంబడ దేయుగంబులన్ భూ వలయంబులో నది యపూర్వము సర్వమనోజ్ఞ మిష్టభో గావహమేక్రియం బడసె నయ్య మహాత్ముఁడు దాన నేమి సం భావిత భగ్యుఁ డయ్యెను బ్రభాకర తేజుఁడు ధర్మజుం డిలన్. 95

చ. కడుభయ మంది వానికిఁ దగన్ మఱి వైశ్యులపోలె వశ్యులై పుడమి నతి ప్రసిద్ధు లగు భుపతు లెల్ల మహాధనావళుల్ దడయక తెచ్చి యిచ్చి కరదానము సేయుటఁ బార్థివత్వ మే ర్పడియెఁ బృథాగ్రపుత్త్రునకుఁ బాడవతేజము పర్వె నెల్లచోన్. 96

ఉ. యాదవు చేతి చక్రము భయంకర మై శిశుపాల మస్తక చ్ఛేదము సేసినం గడుఁ బ్రసిద్ధులు శూరులు నైనరాజు ల య్యాదవుముందటన్ జయజయధ్వను లిచ్చిరి గాని వాని శౌ ర్యోదయ వృత్తి కట్టెదుర నోపర యెవ్వరు విక్రమింపఁగన్. 97

చ. అతుల పరాక్రమార్జితము లైన ధనంబుల పేర్మిఁజేసి యు న్నత మగు చున్న పాండు నరనాథ తనూజులలక్ష్మి నా కస మ్మత మయి సూ వెలింగె విను మాతుల మానధనాఢ్యుఁ డైన భూ పతి సహియింప నోపునె సపత్నుల వృద్ధియు నాత్మహానియున్. 98

వ. ఏమిసేయుదము పాండవులలక్ష్మి యెవ్విధంబున మన కపహరించి కొన నగు ననిన దుర్యోధనునకు శకుని యిట్లనియె. 99

క. దీనికి ధృతరాష్ట్రునను, జ్ఞానము వడయుడును మనకు సమకూరు ధరి త్రీనాథ భవదభిప్రా యానుగుణైశ్వర్య మతిశయంబుగఁ బ్రీతిన్. 100

వ. అని యప్పుడ శకుని దుర్యోధనుం దోడ్కొని ధృతరాష్ట్రు నొద్దకుం జని యాతని శరీర కార్శ్య వైవర్ణ్యంబులు సెప్పిన విని యదరిపడి ధృతరాష్ట్రుండు కొడుకు నొడలంటి చూచి కడు దుఃఖితుం డయి యిట్లనియె. 101

సీ. కౌరవైశ్వర్యంబు గౌరవంబున సమర్పిత మయ్యె నీయంద పేర్మితోడ ననుజులు మిత్రులు ననుచరులును నీకుఁ బ్రీతుల కాని యప్రియులు లేరు వివిధోపభోగముల్ దినిజేశునకుఁ గల యట్టుల కలవు నీ కనుభవింప సకల భుపతులుఁ బాయక భక్తియుక్తులై యెలసి నీ పనుపు సేయుదురు పేర్మి

ఆ. నేమిగొఱఁత యయ్యె నిట్లు డయ్యను దను చ్ఛాయ దఱిఁగి యుండ సకలధరణి రాజ్యభోగసుఖ పరాఙ్ముఖత్వముఁ బొంద నేల నీకుఁ గురుకులేశ్వరుండ 102

వ. అనిన విని ధృతరాష్ట్రునకు దుర్యోధనుం డిట్లనియె. 103

క. పాండవుల విభవ మదియా ఖండలు విభవంబుకంటెఁ గడు మిక్కిలి యై యొండొండ పెరిఁగి దిక్కులు నిండెఁ దదీయ ప్రతాపనిర్మలరుచితోన్. 104

క. సామాన్యమై యుత్తరకురు భూములు మొదలుగ సమస్త భూములు విజయ శ్రీ మహిమను సాధించెఁద్రి ధామ పరాక్రముఁడు శక్రతనయుడు బలిమిన్. 105

తే. సఖ్యసంబంధములఁ జేసి చక్రధరుఁడు ద్రుపదుఁడును దక్కఁ దక్కిన నృపతు లెల్ల నరియుఁ బెట్టనివారు లే రఖిల జలధి వలయితక్షోణిలోఁ బాఁడవులకుఁ బ్రీతి. 106

తే. శైలకానన ద్వీపవిశాల మయిన వసుమతీచ్ర మంతయు వారివశమ యేను నొకరాజసుతుఁడ నై యెట్లు దీనిఁ జూడనోపుదుఁ బ్రాభవ శూన్యునట్లు. 107

తే. నన్ను రత్న పరిగ్రహణంబునందు బాండవుండు నియోగించెఁ బార్థివేంద్ర సర్వత్నా కరైక ప్రశస్తరత్న పుజముల కాస్పదము ధర్మపుత్త్రు గృహము. 108

తే. యజ్ఞదీక్షితుఁ డయిన ధర్మాత్మజులకు గౌడకాంభోజపతు లనేక ప్రకార వర్ణకంబళములు శుకవర్ణ వాహ వినహములుఁ దెచ్చి యిచ్చిరి నెమ్మతోడ. 109

ఉ. సాగర సారవారిరుహ శౌక్తిమౌక్తిక విద్రుమద్రుమై లాగురుచందనంబులు ప్రియంబున నిచ్చిరి తెచ్చి యున్నత శ్రీగూణయుక్తిమైఁ బరఁగు సింహళ కేరళ చోళ పాండ్యదే శాగత రాజపుత్త్రులు మహాగుణశాలి కజాతవైరికిన్. 110

ఉ. మందిత సుర్యరశ్మి రుచిమన్మణిహార చయంబుతేఁ గట స్యంధి సుగంధి కానజల సంపద నొప్పెడువాని దేవకీ నందనుఁ డిచ్చెఁ బ్రీతిఁ బదునాలుగు వేలు గజంబులన్ జనా నందనకీర్తి యైనయమనాథ తనూజున కిష్ట మిత్రుఁ డై. 111

క. హరియును గిరీటియును నొం డొరుల కభీష్టములు సలుపుచుండుదురం ద య్యిరువురు నేకాత్ములు జన శరణ్యు లుత్తములు నిత్యసాంగత్యమునన్. 112

వ. మఱియు నయ్యుధీష్ఠిరున కనురక్తుం డయి విరాటుండు రెండువేల గజంబుల నిచ్చె ద్రుపదుండు వేయి గజంబులను బదివేల హయంబులను బదునాలుగువేలు విలాసినీ జనంబులం బదివేవు దాసీగృహస్థుల నిచ్చెఁగురు కుకురోలూక కేకయ కాశ్మీర కాంభోజ గాంధార మద్ర ద్రవిడ మగధ మాళవ కళిం గాంగ వంగ బంగాళ గౌ డాంధ్ర కేరళ కోసలాది మహీపతులునుం బ్రాగ్జ్యోతిషంబున భగదత్తుండును మరుకచ్ఛ నివాసులును జేదిపతులును నాజానేయ బాహ్లికహూణపారసీయ దేశంబులం గలహయంబులం బర్వతనిభంబు లైనయిభంబులను దివ్యాంబరాభరణ భూషితంబు లయిన యోషిత్సహస్రంబులను నపరిమితంబు లయిన యజావి గో మహిషంబులను హిరణ్య రత్న రజత కంబ ళాంబరాదుల నిచ్చిరి మఱియు మేరుమందరమధ్య కీచక వనవాసులైన కుళింద పారద బర్బర తురుష్క టెంకణ కొంకణాధిపతులును వశగతులై హిమశైల రామశైల కురుదేజంబు లైన కౌసుమక్షౌద్ర పాత్రంబులను దివ్యౌషధంబులను నింద్రనీలేంద్రగోపిక చంద్ర నిశిత దీరఘనిస్త్రింశంబులను మణికాంచన ఖచిత గజదంతమయ శిబికాసనంబులను నిచ్చిరి వాసవసఖుం డయున గంధర్వపతి చిత్రరథుం డనువాఁడు నన్నూఱుగంధర్వ హయంబుల నిచ్చెఁ దుంబురుం డను గంధర్వుండు నూఱుహయంబుల నిచ్చె. 113

ఉ. భావిపురాతనాద్యతన పార్థివలక్ష్ములు పాండవేయుల క్ష్మీ విభవంబుతోడ నుపమింప సమంబులుగా వశేషరా జావళిలోన నత్యధికు లైన సపత్నుల పేర్మిఁ జూచి యేఁ జూవె సహింప నోపక కృశుండ వివర్ణుఁడ నైతి నెంతయున్. 114

ఆ. ఒక్క లక్ష భూసురోత్తముల్ గుడిచిన మొనసి తనకుఁ దాన మ్రోయుశంఖ మొక్క నిమిషమేని యుడుగక మ్రోసెన య్యధ్వరోత్సవంబు నన్ని నాళ్ళు. 115

సీ. జన్నంబు చూడంగ సకల భూముల నుండి వచ్చిన రాజన్య వరుల నవని సురులను వైశ్యుల శూద్రుల నాత్మీయబందు సుహృ ద్వీర భట నియోగ జనులను బేదల సాధుల నిత్యంబుఁ దాన పరీక్షించి తగ వెఱింగి యన్నంబు దయఁబెట్టి యందఱుఁ గుడిచిన దనుమధ్య యర్ధరాత్రంబు నపుడు

ఆ. గాని కుడువ దట్టె కమలాక్షి ద్రౌపది యదియుఁ గాక యమ్మహాధ్వరమున నధముఁ డయ్యుఁ గడుఁ బ్రియంబున నభ్యర్చి తుండ కాని వంచితుండు లేడు. 116

క. ధరణి హరిశ్చంద్రుఁడు భా సురయశుఁ డయి చేసె రాజసూయం బదియున్ సరి గాదనియే వగతును సురుచిర విభవమునఁ బాండు సుతు యజ్ఞముతోన్. 117

వ. అట్టి రాజసుయాధ్వరంబున నవబృథ సమయంబునందు బ్రహ్మర్షి రాజర్షి లోకపాల పరివృతుండయిన మహేంద్రుండునుంబోలె నున్న ధర్మతనయు నారదపారాశర్యాది మహాముని సమేతుం డయి ధౌమ్యుం డశేష తీర్థ జలంబుల నభిషిక్తుం జేసిన. 118

సీ. అభిషిక్తుఁ డయిన యయ్యమరాజ సుతునకు సాత్యకి మౌక్తికచ్ఛత్ర మొప్పఁ బట్టె భీముండును బార్థుండు మణిహేమదండ చామరయుగధారుఁ లయిరి కమలనాభుండును గవలును ద్రుపదేశ పుత్త్రుండు వేర్వేఱ భూమిపతుల మూర్ధాభిషిక్తుల మ్రొక్కించు చుండిరి దర్పంబు వెలయంగ దానిఁజూచి

ఆ. యేను మొదలుగా మహీపతు లెల్లను దీప్తి దఱిఁగి యుండఁ దివిరి మమ్ము నగిరి కృష్ణపాండునందన ద్రౌపదీ సాత్యకులుఁ గరంబు సంతసమున. 119

వ. మరియు నయ్యుధిష్ఠిరుండు. 120


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com