ఆ భా 1 8 301 to 1 8 325

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

క. నీ వఖిల ధర్మమూర్తివి నా వీర్య ప్రభవు లయిన నలువురు సుతులన్ లావుకలఁ గరుణఁ గావుము పావక భువనోపకారపర్యాప్తమతీ. 301

వ. అనిన నమ్మందపాలు ప్రార్థన జేసి యానలువురు శార్జ్గకులను నగ్ని దేవుండు రక్షించువాఁ డయ్యెనంత నిట. 302

త. తనయుల నజాతపక్షుల ననలశిఖాభీతి చంచలాత్ముల నెటయుం జననేరని బాలకులను జననియు వీక్షించి శోకసంతాపితయై. 303

క. వీరలఁ దోడ్కొని పోవఁగ నేరను బాలకుల బెట్టి నిర్దయబుద్ధిన్ వీరల తండ్రిక్రియం జన నేరను విధికృతము గడవనేరఁగ లావే. 304

చ. ఇది ప్రళయాగ్నివోలె దెస లెల్లను గప్పఁగ విస్ఫులింగముల్ వదలక వాయుసారథి జవంబునఁ దా నిట వచ్చె నేమిసే యుదు సుతులార యీ బిలము నొయ్యన పోయి చొరుండు దీనిఁ గ ప్పెద ఘనపాంసుజాలముల భీమశిఖావళి దాఁకకుండగన్. 305

చ. కొడుకుల బ్రహ్మవిత్తములఁ గోరిన యట్టుల వీరి నల్వురం బడసితి నిమ్మహాత్ముల నపాయము నొందక యుండఁ బెంచుచున్ నడపుమటంచు నన్ను మునినాథుఁడు మీ జనకుండు పంచి యి ప్పుడ యెటయేనిఁబోయె హుతభుక్ప్రళయంబు దలంప కక్కటా. 306

వ. అని దుఃఖిత యై యున్న తల్లిం జూచి యగ్రతనయుం డైన జరితారి యిట్లనియె. 307

తే. బిలము సొచ్చితిమేని నం దెలుక చంపు నింద యుండితిమేనిఁ దా నేర్చునగ్ని యెలుకచేఁ జచ్చుటకంటె నీ జ్వలనశిఖలఁ గ్రా గి పుణ్యలోకంబులఁ గాంతు మేము. 308

వ. మఱియు మాంసపిండంబుల మయి యున్న మాకు బిల ప్రవేశంబున మూషక భయంబు నియతం బింద యుండిన నగ్నిభయంబు సంశయితం బెట్లనిన. 309

క. జ్వలనంబు వాయువశమునఁ దొల గుడు జీవనము మాకు దొరకొను గృఛ్రం బుల సంశయయుత కార్యం బులు గర్తవ్యములు నియతములు మర్త్యముల్. 310

వ. కావున నీవు మెచ్చినచోటికిఁ బోవనోపము మావలనిమోహంబు విడిచి యరుగు మేము దహనక్లేశంబునం బొందినను నీవు జీవించి పుత్త్రులం బడయనోపుదువు నీ పుణ్యవంశమున మాకు నగ్నిభయంబు దొలంగెనేని నీవు మా యొద్దకు వచ్చి యెప్పటియట్ల రక్షింతు వని కొడుకు లెల్ల మ్రొక్కినం జూచి జరితయు బాష్పపూరితనయన యై యాసన్నతరుగుల్మగహన దహనమహోత్సాహుం డయి వచ్చు హవ్యవాహనుం జూచి ప్రాణభయంబున గగనంబున కెగసి చనె నంత. 311

క. నలుగురు నాలుగువేద మ్ములమంత్రము లొప్ప బ్రహ్మముఖములువోలెన్ వెలయంగ సంస్తుతించుచు నలఘులు మాకభయ మభయి మని రయ్యనలున్. 312

వ. అగ్నిదేవుం డప్పుడు మందపాలు ప్రార్థనం దలంచి యన్నలువురు శార్జ్గకులు నున్న వృక్షంబు భక్షింపక పరిహరించిన జరితయు దానిం జూచి సంతసిల్లి కొడుకుల యొద్దకు వచ్చి సుఖం బుండె నంత నక్కడ మందపాలుండు పురం దరువనంబు దహనుచేత దగ్ధం బగుట యెఱింగి యందున్న జరితను బుత్త్రులం దలంచి యతి దుఃఖితుం డయి లపిత కిట్లనియె. 313

క. తరుణుల నజాతపక్షులఁ జరణంబులు లేనివారి శార్జ్గేయుల న ల్వుర నొక్కతె యెట దోడ్కొని యరుగంగా నేర్చు జరిత యాపద గడవన్. 314

క. మఱచునొకొ మఱవకుండియు నెఱుంగక యుండునొకొ యనలుఁ డెఱిగియు నెడ నే మఱునొకొ పుత్త్రులఁ గావక గుఱుకొని నమ్మంగ నగునె క్రూరాత్మకులన్. 315

వ. అనిన విని లపిత యిట్లనియె. 316

క. నా యొద్దన ప్రార్థించిన వాయిసఖుం డపుడు నీకు వరదుం డయి శా ర్జ్గేయుల నలువురఁ గాతును ధీయుత యని పలికె మఱచితే మునినాథా. 317

వ. ఆవిపి నెయ్యుండ వయి దానియోగక్షేమం బరయం దలంచి తది పులుఁ గెట యేనియుం బఱచుం గా కేమియయ్యెడు వగవకుండు మనిన మందపాలుండు మందస్మితవదనుం డగుచు వసిష్ఠునట్టి పురుషు నైన నరుంధతి యట్టి భార్యయైనను నిర్నిమిత్తంబున స్త్రీ విషయంబునందు సంశయింపకుండ దిది స్త్రీలకు నైజంబ యని పలికి లపిత వీడ్కొని ఖాండవంబునకు వచ్చి పుత్త్ర సహిత యయి కుశలిని యయి యున్న జరితం జూచి సంతుష్టుం డై నిజేచ్చ నరిగె నగ్ని దేవుండు నిట్లు నిర్విఘ్నంబున ఖాండవవనౌషధంబు లుపయోగించి విగతరోగుం డయి కృష్ణార్జునుల దీవించి చనియె నంత. 318

- ఇంద్రుం డర్జునునకు నాగ్నేయ వారుణ వాయవ్యాది దివ్యబాణంబు లిచ్చుట - సం. 1-225-7

క. అతిమానుష మత్యద్భుత మతి దుష్కర మయిన కేశవార్జునకృతి గో పతిచూచి మెచ్చి సురపరి వృతుఁ డయి చనుదెంచెఁ కృష్ణవిజయుల కడకున్. 319

క. అనఘులు నరనారాయణు లన నాదియుగంబునన్ సురాసురనుతు ల య్యును నపుడు మనుజు లగుటను వినయంబున మ్రొక్కి రమరవిభునకునంతన్. 320

వ. ఇంద్రుండు నుపేంద్రార్జునుల నతి స్నేహంబునఁ గౌఁగిలించుకొని యర్జునునకు నాగ్నేయ వారుణ వాయవ్యాది దివ్య బాణంబు లిచ్చి వీని కెప్పుడు నిష్ట సఖుండవయి యుండు మని కృష్ణుం బ్రార్థించి దివ్య విమానారూఢుం డయి దివిజాప్సరోగణ సేవితుం డయి దివంబున కరిగె నిట వాసుదేవార్జునులు మయుం దోడ్కొని మగిడి యింద్రప్రస్థ పురంబునకు వచ్చి ధర్మరాజునకు మ్రొక్కి ఖాండవ దహన ప్రకారంబు సెప్పి మయుం జూచి సుఖంబుండిరని. 321

ఆశ్వాసాంతము

క. జనమేజయ జనపాలున కనఘ చరిత్రునకుఁ బ్రీతుఁ డయి వైశంపా యనుఁ డాదిపర్వ కథ యె ల్లను నిమ్ముగఁ జెప్పె నని విలాసమహేంద్రా. 322

క. అభిమాన మహార్ణవ హరి నిభవిభవ విభాసమాన నిరవద్య రవి ప్రభ రాజమనోహరవై రిభయంకర శౌర్య నృపవరేణ్య శరణ్యా. 323

మత్తకోకిలము. రాజభూషణ నిత్యసత్య సరస్వతీ విలసన్ముఖాం భోజ రాజమనోజ భూజన పూజ్యమాన మహాయశో రాజహంస పయోజినీ వనరమ్య దిఙ్ముఖ విక్రమో ద్వేజితాహిత విష్ణుసన్నిభ విష్ణువర్ధన భూపతీ. 324

గద్యము

ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాది పర్వంబున విదురాగమనంబు గృష్ణ సందర్శనంబును రాజ్యార్థలాభంబును ఖాండవ ప్రస్థ నివాసంబును సుందోపసుదోపాఖ్యానంబును నారదు వచనంబున ద్రౌపదియందు సమయక్రియము నర్జునుతీర్థాభిగమనంబును నులూసీ సమాగమంబును వాసుదేవానుమతుం డయి యర్జునుండు సుభద్ర వివాహం బగుటయు సుభద్రాపహరణంబును హరణహారికయు నభిమన్యు సంభవంబును గాండీవదివ్యరథాశ్వ లాభంబును ఖాండవ దహనంబును నగ్ని భయంబు వలన మయభుజంగ మోక్షణంబును మందపాలోపాఖ్యానంబును నన్నది సర్వంబును నష్టమాశ్వాసము.

శ్రీ మహాభారతము నందలి యాదిపర్వము సమాప్తము.