Jump to content

ఆ భా 1 8 271 to 1 8 300

వికీసోర్స్ నుండి

వోలం సురేష్ కుమార్


క. ఉఱుముచు మెఱుముచుఁ బిడుగులు వఱలఁగ నలుగడలఁ బడ నవారితవృష్టుల్ గుఱుకొని కురియఁగఁ బంచెను మఱియును నయ్యనలుమీఁద మఘవుం డలుకన్. 270

క. పాండుసుతుఁ డంత నానా కాండసహస్రముల నేసి ఘనముగఁ జేసెన్ ఖాండవగృహమున ఖండా ఖండలధారలకుఁ దూఱఁగాకుండంగన్. 271

వ. ఇట్లు కావించిన, 272

తే. దాని వెల్వడనేరక తద్వనంబు జీవులెల్లను బావకశిఖలఁ జేసి దగ్ధు లగుచున్నఁ దక్షకతనయుఁ డశ్వ సేనుఁ డను భుజంగము మగ్నిశిఖల కపుడు. 273

ఆ. వెఱచి తల్లిఁ దోఁకఁ గఱపించుకొని దివిఁ బఱచు వానిఁ జూచి పార్థుఁ డలిగి వానితల్లి శిరముతోన తత్పుచ్ఛంబు దునిసి యగ్నిశిఖలఁ దొరఁగ నేసె. 274

వ. వెండియు నశ్వ సేనునేయ సమకట్టిన యప్పార్థునకుఁ దత్క్షణంబ మోహిని యను మాయ గావించి యమరేంద్రుఁ డశ్వసేను విడిపించి యందుఁ దక్షకుండు దగ్ధుం డయ్యెను కా వగచి కడు నలిగి. 275

- ఇంద్రుండు కృష్ణార్జునులతోఁ బోరుట - సం. 1-218-13

ఉ. ఆనరుమీఁద ఘోరనిశితాశని వైచె నఖండచండఝం ఝానిలజర్జరీకృత మహాజలధారలతో నిరంతరా నూనపయోధర ప్రకరముద్ధత మై హరిదంతరంబులన్ భానుపథంబు నొక్కమొగిఁ బర్వి భయంకరలీఁ గప్పఁగన్. 276

ఉ. అన్నవవారివాహనివహమ్ములఁ జూచి భయప్రసన్నుఁ డై యున్న హుతాశనున్ విజయుఁ డోడకు మంచును మారుతాస్త్ర మ త్యున్నతచిత్తుఁ డేసె నదియున్ విరియించె రయంబుతో సము త్పన్నసమీరణాహతి నపారపయోదకదంబకంబులన్. 277

వ. అంత, 278

సీ. బలవైరి కృష్ణుపైఁ బార్థుపైఁ గడునల్గి పంచినఁ గలయంగ బన్ని కడఁగి సురగరుడోరగాసురసిద్ధగంధర్వు లార్చుచుఁ దాఁకి యుగ్రాహవంబు సేసిన నమరులఁ జెచ్చెరఁ బార్థుండు భంజించె దనదివ్యబాణశక్తిఁ జక్రధరుండును జక్రబలంబున గరుడోరగాసురఖచకవరులఁ

ఆ. దత్క్షణంబ విగతదర్పులఁ జేసె న య్యిద్దఱకు సురాసురేశు లెల్ల భీతు లగుట చూచి పెద్దయు విస్మిత హృదయుఁ డయ్యె సురగణేశ్వరుండు. 279

వ. మఱియును వారల బల పరాక్రమంబు లెఱుంగ వేఁడి శక్రుండు శిలావర్షంబుఁ గురియించిన. 280

క. నిశితశర వర్షమున ను గ్రశిలా వర్షమ్ముఁ జిత్రగతి నస్త్రకలా కుశలుఁడు నరుఁ డశ్రమమునఁ బ్రశాంతిఁ బొందించె నమరపతి వెరఁగందన్. 281

క. కొడుకు భుజవిక్రమమునకుఁ గడు సంతసపడియుఁ దృప్తి గానక చల మే ర్పడఁగ హుతాశను నార్పం గడఁగి మహారౌద్రభంగి గౌశికుఁడు వడిన్. 282

చ. అరుదుగ దివ్యరత్న నివహంబులఁజేసి వెలుగుచున్న మం దరశిఖరంబు నెత్తుకొని తద్దహనార్చు లడంగునట్లుగాఁ దెలకఁగ వైచినం దపనతేజుఁడు పాండుసుతుండు దాని జ ర్జరితము సేసె వజ్రమయశాతశిలీముఖచండధారలన్. 283

క. ధరణీధరు చక్రమునకుఁ బురుహూతనూజు బాణముల కనిలో నె వ్వరు మార్కొననోపరు సుర గరుడోరగ సిద్ధసాధ్య గణములలోనన్. 284

వ. అంత నొక్క యశరీరవాణి పాకశాసనున కిట్లనియె. 285

క. పరమమును లయిన తొల్లిటి నరనారాయణులు కృష్ణనామంబుల ను ర్వక నుదయించిరి నీ క య్యిరువుర పేర్మియును వింతయేది విజేంద్రా. 286

చ. అలఘులు కృష్ణపార్థులు మహాత్ములు యాదవకౌరవాన్వయం బులు వెలుఁగించుచున్న నృపపూజ్యులు వీరల నీకు నోర్వఁగా నలవియె వీరు దొల్లియు సురాసురయుద్ధము నాఁడు దైత్యులన్ వెలయఁగ నోర్చి యున్న రణవీరులు గావుట మున్నెఱుంగవే. 287

వ. నీ యిష్టసఖుం డయిన తక్షకుం డిం దుండక ముందకన కురుక్షేత్రంబున కరిగి ఖాండవ ప్రళయంబునకుఁ దప్పె ఖాండవం బగ్నిచేత దగ్ధం బగు నని తొల్లి బ్రహ్మ వచనంబు గలుగుటంజేసి యిది హుతాశనున కశనం బయ్యె నింక దీనికి వగవం బని లేదనిన దాని విని సురపతి సురగణంబులతో మరలిన. 288

క. బలయుతులు మనుజసింహులు నలిఁ గృష్ణార్జునులు సింహనాదముల వియ త్తలమును దిక్కులు బధిరం బులుగాఁ జేసిరి త్రిలోకములు భయ మందన్. 289

వ. అట్టి యవసరంబున నముచి యనుదనుజుననుజుండు మయుం డనువాడు ఖాండవంబు వెలువడ నేరక తక్షకు గృహంబునఁ బరిభ్రమించుచున్నంతఁ దన్నగ్ని చుట్టుముట్టిన నచ్యుతుండును జంపవచ్చిన నతిభీతుం డయి యర్జును మఱువు సొచ్చిన. 290

క. శరణాగత రక్షణ త త్పరుఁడు ధనంజయుఁడు మయుని ప్రాణము గాచెం గరుణను శరణాగతు లగు పురుషుల రక్షించునంత పుణ్యము గలదే. 291

తే. మయుఁడు నశ్వ సేనుండును మందపాల సుతులు నలుగురు శార్జ్గకు లతులదావ దాహభీతి కయ్యార్వురుఁ దప్పి రన్య జీవులెల్ల నం దపగత జీవు లైరి. 292

- మందపాలో పాఖ్యానము - సం. 1-220-1

వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె. 293

క. మయభుజగ మోక్షణము ని నిర్ణయముగ నెఱిఁగితి నెఱుంగ నా కర్థిత్వం బయినది నలుగురు శార్జ్గకు లయిమోక్షణ మెట్లు నిర్మల జ్ఞాననిధీ. 294

వ. అని యడిగిన జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె. 295

క. జనపాల మందపాలుం డను ముని ముఖ్యుండు దల్లి యత్యుగ్రతపం బొనరించె బ్రహ్మచర్యం బున దివ్యసహస్రవర్షములు నైష్ఠికుఁడై. 296

క. అమ్ముని యోగాభ్యాసవ శమ్మున దేహంబు విడిచి చని పుణ్యులలో కమ్ములు సొరఁ గానక వడిఁ ద్రిమ్మరి దేవతలఁ గాంచి ధృతి నిట్లనియెన్. 297

వ. నాకుఁ బుణ్యలోకంబులు లేకుండ నేనేమి దుష్కృతంబు సేసితి నమ్మునీంద్రునకు దేవత లిట్లనిరి. 298

క. ఎంత తపం బొనరించియు సంతానము లేనివారు సద్గతిఁ బొందం గాంతురె నీ తప మేటికి సంతానము వడయు మరిగి సన్మునినాథా. 299

వ. అనిన విని మందపాలుండు మర్త్యలోకంబునకుఁ దిరిగి వచ్చి నాకుం జెచ్చెరం బెక్కండ్రు పుత్త్రుల నెవ్విధంబునం బడయ నగునో యని చింతించి పక్షుల యందు వేగంబ యపత్యంబు పెద్ద యగుటం జూచి తానును శార్జ్గకుం డై జరిత యను లావుకపెంటి యందు రమియించి దానివలన జరితారి సారిసృక్కస్తంబ మిత్ర ద్రోణులను వారల నలువురఁ గొడుకులఁ పరమ బ్రహ్మ విదులం బడసి వారల ఖాండవంబున బెట్టి తన పూర్వ భార్య యైన లపితయుం దానును విహరించుచుఁ నొక్కనాఁడు ఖాండవ దహనోద్యతుం డై వచ్చుచున్న యగ్నిభట్టారకుం గని యగ్ని సూక్తంబుల స్తుతియించి యిట్లనియె. 300


వోలం సురేష్ కుమార్ http://www.volamsite.com