ఆ భా 1 8 091 to 1 8 120

వికీసోర్స్ నుండి


1_8_091 మానిని. తమ్ములుఁ దానును ధర్మ తనూజుఁడు తత్క్షణ సంభృత సంభ్రముఁ డై యమ్ముని నాథ వరేణ్యునకున్ వినయమ్మున మ్రొక్కి సమున్నత పీ ఠమ్మున నుంచి యథా విధి పూజ లొడంబడఁ జేసి మునీశ్వర నె య్యమ్మున నీ విట వచ్చుటఁ జేసి కృతార్థుల మైతిమి యిందఱమున్.

1_8_092 వ. మా పుణ్యంబునం జేసి భవద్దర్శనంబు సంభవించె నని పరమ ప్రీత హృదయులై పలికి పరమ భక్తిం బాంచాలి మ్రొక్కించి యున్నంత నందఱ నాశీర్వచనంబుల నభినందించి వారల కుశలం బడిగి నారదుండు ద్రౌపదిం బోవె బనిచి వారేవురకు నేకాంతంబున నిట్లనియె.

1_8_093 సీ. సర్వధర్మజ్ఞుల రుర్వీశ పూజ్యుల రన్యోన్య నిత్య సౌహార్ద యుతుల రగణిత గుణ యుక్తిఁ బొగడంగఁ దగు వారలిట్టి మీ కేవుర కిపుడు ద్రుపద సుత యొక్కతియ ధర్మమతి ధర్మపత్ని యై నది యీ క్రమంబు లాకాగమంబు లందు విరుద్ధ మీ సుందరి కారణంబున మీకు విప్రీతి పుట్టకుండ

ఆ. నుండవలయుఁ బ్రియ సహోదరుల్ దొల్లి సుం దోపసుందు లొక్క యువతి కడరి విగ్రహించి యసుర వీరులు దమలోనఁ బొడిచి మృత్యు నిలయమునకుఁ జనిరి.

1_8_094 క. అనిన నది యెట్టు లని యమ తనయుఁడు గడు వేడ్క తోడఁ ద న్నడిగిన నా తనికిఁ దదీయానుజులకు నిన సన్నిభుఁ డమ్మునీంద్రు డిట్లని చెప్పెన్.

- సుందోప సుందోపాఖ్యానము – సం. 1-210-1

1_8_095 వ. తొల్లి దితి పుత్త్రుం డైన హిరణ్యకశిపు వంశంబున నిసుంభుం డను వానికి సుందోపసుందు లన నిద్దఱు గొడుకులు పుట్టి నియతాత్ము లయి తపంబునన కాని సర్వంబునం బడయం గాదని యేక నిశ్చయులై వింధ్యా చలంబున కరిగి నిగృహీతేంద్రియు లై నిదాఘకాలం బెల్లఁ బంచాగ్ని మధ్యంబున నిలిచి వాన కాలంబును శీతకాలంబును జలాశయంబుల వసియించి మఱియు వాయు భక్షులు నేక పాద స్థితులు నూర్ధ్వబాహులు నధోముఖులును నై పెద్ద కాలంబు తపంబు సేసిన.

1_8_096 సీ. వారి దారుణ తపో వహ్ని దాహంబున వింద్యాద్రిదరుల నావిర్భవించి యత్యుతచ్చ మయి ధూమమాకాశ మెల్లను గప్పిన నమరులు గరము వెఱచి రత్నంబులను వధూరత్నంబులను జేసి తత్తపో విఘ్న విధాన నిరతు లయి ప్రబోధింపంగ నలవి గాకున్నఁ దోయజు గర్భు పాలికి నరిగి యసుర

ఆ. వరుల తపముఁ జెఱువ వలయు నావుడుఁ గమ లాసనుండు త్రిభువనార్చితుండు సుహరితంబు పొంటె సుందోపసుందుల కడకు వచ్చె వరము కరుణ నీఁగ.

1_8_097 వ. ఇట్లు పితామహుండు సుందోపసుందుల తపంబునకు మెచ్చి సన్నిహితుండయి మీ కిష్టం బైన వరం బిచ్చెద వేఁడు డనిన వారలు వారిజాసనునకు ముకుళిత కరకమలు లయి దేవా మా యిష్టంబు దయసేయ మీ కిష్టంబేని మాకుఁ గామ రూపత్వంబును గామగమనత్వంబును సకల మాయావిత్వంబును నన్యులచేత నవధ్యత్వంబును నమరత్వంబును బ్రసాదింపుం డనిన.

1_8_098 ఆ. కవల భవుఁడు వారి కమరత్వ మొక్కటి దక్కఁ గోర్కులెల్ల నక్కజముగఁ గరుణ నిచ్చె నిట్లు సరసిజ గర్భుచే వరము వడసి యసురవరులు పెఱిగి.

1_8_099 క. అనుపమ రాజ్య విభూతిం దనరి జగద్విజయ కాంక్ష దైత్యులకు ముదం బొనరఁగ నకాల కౌముది యనునుత్సవ మొప్పఁ జేసిరగణిత బలులై.

1_8_100 క. సుర గరుడోరగ కిన్నర పురములు వడిఁ జూఱకొనుచు భూలోకమునం బరగిన రాజర్షి మహీ సుర వరులకు బాధ సేయుచును గర్వమునన్.

1_8_101 క. ద్విజవర వినిర్మితము లగు యజన స్వాధ్యాయ కవ్య హావ్య తపో దా న జపంబులఁ బితృ దేవత లజస్రమును తృప్తు లగుదు రని కడు నలుకన్.

1_8_102 వ. పుణ్యవంతుల నిత్యనైమి మిత్తి క కర్ంబులకు విఘ్నంబులు సేయుచు సింహ వ్యాఘ్ర గజ రూప ధరులై వనంబులం దిరుగుచు ముని పల్లియలు సొచ్చి మునులకుఁ బ్రాణ భయంబు సేయుచున్న వారల క్రూర కర్మంబులకు వెఱచి వేల్పులును మునులును బురాణముని యైన బ్రహ్మపాలికిం జని కృతాంజలు లయి జగంబులకు సుందోపసుందులు సేయు నుపద్రవంబులు సెప్పిన విని విశ్వ గురుండు విస్మింతుం డయి వార లన్యుల చేత వధ్యులు గారు గావున పరస్పర యుద్ధంబునఁ బంచత్వంబుఁ బొంద వలయునని విచారించి విశ్వకర్మ రావించి రూప లావణ్యవతి యైన యొక్క యువతి సృజియుంపు మని పంచినఁ బ్రసాదంబని మ్రొక్కి యప్పుడు.

1_8_103 పృథ్వి. తిలాణు మణి కోటి సంఘటిత దివ్య దేహంబుతోఁ దిలోత్తమ యనంగ నొక్క యువతీ లలామంబు ను త్పలాక్షి నొనరించె సర్వగుణ భసి రూపక్రియా కలా విదుఁడు విశ్వకర్మ తన కౌశలం బేర్పడన్.

1_8_104 వ. అదియును సురేంద్ర ప్రముఖ బృందారక ముని బృంద పరివృతుం డై యున్న పరమేష్ఠికిం బరమ భక్తిం బ్రణమిల్లి పనియేమి యని ముందట నిలిచిన నరవింద సంభవుండా సుందరిం జూచి సుందోపసుందులను దైత్యులు దర్పితులయి జగంబుల కహితంబులు సేయుచు వింధ్యాచల కందరంబున నున్నవారు వారలిద్దఱు నీ కారణంబునం దమలో నొండొరలతోఁ బొడిచి దండధరు పురంబున కరుగునట్లుగాఁ జేయు మని పంచిన వల్లెయని.

1_8_105 సీ. అబ్జజు వీడ్కొని యది దేవ సభకుఁ బ్రదక్షిణం బొనరించెఁ దత్క్షణంబ తద్రూప సౌందర్య దర్శన లోలుఁ డై యజుఁడు నాలుగు దిక్కులందుఁ దనకు గావించుకొనియె ముఖంబులు మఱి రెండు కన్నులఁ జూచినం గాదు తృప్తి యని సురేంద్రుండు సహస్రాక్షుఁ డయ్యె నయ్యమరులు కామ మోహాంధు లైరి

ఆ. ముదిత యిట్లు సర్వ మోహిని యై మర్త్య భువమునకు మెఱుఁగుఁ బోలె నొప్పి యరుగుదెంచె సుందరాంగి వింధ్యాచల విపిన దేశ మెల్ల వెలుఁగుచుండ.

1_8_106 క. అమ్ముదితఁ జూచి యన్నయుఁ దమ్ముఁడు నొక్కట మనోజ తాడితు లై రా గమ్మున నన్యోన్య స్నే హమ్ములు చెడి దృష్ట్లు నిలిపి రయ్యువతి పయిన్.

1_8_107 క. ఘను లయ్యిరువురు నేకా సన భోజన యాన నిలయ శయన క్రియలం దనరెడు వా రేక స్త్రీ వినిహిత కాము లయి రపుడు విధి నియమమునన్.

1_8_108 క. ఇది నా వల్లభ యిది నా హృదయేశ్వరి యనుచుఁ గోరి యిరువురు మదనో న్మదు లయి పరిగ్రహించిరి తదీయ కమనీయ సవ్య దక్షిణ కరముల్.

1_8_109 వ. ఇట్లు వట్టుకొని.

1_8_110 క. సుందరి మా యిద్దఱలో నిం దెవ్వరి వలతు చెప్పు మీ వనవుడుఁ బూ ర్ణేందు ముఖి వారి కను మీ యం దెవ్వఁడు వొడిచి యొడుచు నతనిన వలతున్.

- సుందోపసుందు లొండొరులతోఁ బోరి చచ్చుట –

1_8_111 క. అనవుడుఁ నిద్దఱుఁ దమలోఁ బొనుపడ కొండొరుల తోడ భుజబలు లలుకన్ ఘనవజ్ర తనులు దాఁకిరి తనరఁగ నటఁ గొండ గొండఁ దాఁకిన భంగిన్.

1_8_112 క. విపరీత మతని సుందుఁడు నుపసుందుఁడు దాఁకి పొడిచి రొండొరు తోడం గుపితాత్ము లయి తిలోత్తమ నెపమున దృఢ ముష్టిఘాత నిర్ఘాతమున్.

1_8_113 క. అన్యోన్య ప్రియ భాషణు లన్యోన్య హితైషు లసుర లన్యుల పోలెన్ మన్యుపరి ప్రేరితు లై యన్యోన్యాభిహతిఁ జనిరి యమ పురమునకున్.

1_8_114 క. ఇంతుల నిమిత్తమున ధృతి మంతులుఁ బొందుదురు భేదమతి గావునఁ మీ రింతయు నెఱింగి యొండులు చింతింపక సమయ మిందు సేయుఁడు బుద్ధిన్.

- నారదు ప్రేరితు లయి పాండవులు సమయము సేయుట – సం. 1-201-27

1_8_115 సీ. అనిన నారద మహాముని పల్కు చేకొని దమలో నొడంబడి విమల బుద్ధి నేవుర యందును ద్రోవది ప్రీతితో నొక్కొక్క యింటఁ దా నొక్కయేఁడు క్రమమున నుండను గమలాక్షి యెవ్వరి యింటఁ దా నుండె నయ్యింటి వలనఁ బెఱవారు చనకుండ నెఱుఁగక చనిరేని వెలయఁగఁ బంద్రెండు నెలలు తీర్థ

ఆ. సేవ సేయుచును విశేష వ్రతంబులు ధీరవృత్తిఁ జలుపువారు గాను సన్మునీంద్రు నొద్ద సమయంబు సేసిరి రాజనుతులు పాండురాజ సుతులు.

1_8_116 వ. ఇట్లు హితోపదేశంబు సేసి నారదుం డరిగినం బాండవులు దమచేసిన సమయ స్థితిం దప్పక సలుపుచుఁ సుఖంబుండఁ గొండొక కాలంబున నొక్కనాఁడొక్క బ్రాహ్మణుండు మ్రుచ్చులచేతఁ దన హోమ ధేనువు గోల్పడి వచ్చి యాక్రోశించిన నశ్రుత పూర్వం బయిన యయ్యాక్రోశంబు విని విస్మితుం డయి విజయుండు విప్రుల కయిన బాధ దీర్పక యుపేక్షించుట పాతకం బని యప్పుడ యవ్విప్రు రావించి యిది యేమి కారణం బని యడిగిన నర్జునునకు విప్రుం డిట్లనియె.

1_8_117 క. యమ తనయు ధర్మరాజ్యము తమ రాజ్యమ యని మహా ముదంబున విప్రో త్తము లున్న చోట నే బ న్నము వడి కోల్పడితి గోధనము మ్రుచ్చుల చేన్.

1_8_118 సీ. వదలక మ్రుచ్చుల వధియించి నా హోమ ధేనువుఁ గ్రమ్మఱఁ దెచ్చి యిమ్ము జననుత దాని వత్సంబు నిన్నటఁ గోలె నుడుగక యఱచుచు నున్న యదియ బలుకుల కెడ లేదు బాణాసనము గొని చనుదెమ్ము నా తోడఁ జట్ట ననిన ద్రౌపదీ సహితుఁ డై ధర్మరాజాయుధా గారంబునందున్నఁ గార్ముకంబుఁ

ఆ. బుచ్చికొనఁగఁ దనకుఁ బోలమి యెఱిఁగియు విప్రునార్త రవము వినఁగ నోప కర్జునుండు నిజ శరాసన గ్రహణార్థ మాయుధాలయమున కరిగె నపుడు.

1_8_119 క. ధరణీ సురవరులకుఁ గడు సెర గై నెడ నెఱిఁగి యెడయుఁ జేయుదురె మహా పురుషు లని నరుఁడు విలు గొని యరిగెను మ్రుచ్చుల పిఱుంద నవ్విప్రు పనిన్.

1_8_120 వ. ఇట్లరిగి యర్జునుం డతి వీరులయిన చోరుల వధియించి బ్రాహ్మణునకు గోధనంబు నిచ్చి క్రమ్మఱి వచ్చి ధర్మరాజునకు మ్రొక్కి లోకంబుల మర్యాదలు విచారించి రక్షించుచున్న మనయందు మర్యాద భంగం బయ్యె నను నింత కంటె దుర్యశం బొండెద్దియు లేదు గావున నాకు ద్వాదశ మాసిక వ్రతంబు సలుప వలయు నని పోవ సమకట్టి యున్న నర్జునునకు యుధిష్ఠిరుం డిట్లనియె.