ఆ భా 1 3 031 to 1 3 060

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

1_3_31 వచనము

తొల్లి బ్రహ్మశాపనిమిత్తంబున నద్రిక యను నప్సరస యమునయందు మీనయి క్రుమ్మరుచున్నయది యవ్వసువీర్యబిందుద్వయంబు త్రావి గర్భంబు దాల్చిన దశమమాసంబునందు.

(బ్రహ్మశాపం వల్ల చేపగా మారిన అద్రిక అనే అప్సరస ఆ బిందువులు రెండింటిని తాగి గర్భం ధరించింది. పదవ నెలలో.)


1_3_32 తేటగీతి

తెరలవల వైచి జాలరుల్ దిగిచి దాని

యుదరదళనంబు సేసి యం దొక్కకొడుకు

నొక్కకూఁతును గని వారి నొనరఁ దెచ్చి

దాశరాజున కిచ్చిరి తత్క్షణంబ.

(జాలరులు ఆ చేపను పట్టి, దాని కడుపు చీల్చి అందులో ఒక కొడుకును, కూతురును చూసి వారిని తెచ్చి దాశరాజుకు ఇచ్చారు.)


-:మత్స్యగంధి వృత్తాంతము:-


1_3_33 వచనము

అయ్యద్రికయు మానుషప్రసవం బొనరించినం దనకు శాపమోక్షణం బగునని బ్రహ్మవచనంబు గలుగుటంజేసి మీనయోని విడిచి దివ్యవనిత యయి దేవలోకంబునకుం జనియె మఱియును మత్స్యోదరంబునఁ బుట్టిన యక్కొడుకు మత్స్యరాజునాఁ బరఁగి ధర్మపరుం డయి మత్స్యదేశంబున కధిపతి యయ్యె నక్కూఁతును దాశరాజు దనకూఁతుంగాఁ జేకొని పెంచినం బెరుఁగుచు.

(అద్రిక శాపవిమోచనం పొంది దేవలోకానికి వెళ్లిపోయింది. ఆమె కొడుకు మత్స్యదేశానికి రాజు అయ్యాడు. ఆమె కుమార్తెను దాశరాజు తన కూతురుగా పెంచుకోసాగాడు.)


1_3_34 కందము

అంబుజముఖి యక్కన్య ప్రి

యం బొనరఁగ మత్స్యగంధి యనఁగా ధర్మా

ర్థంబుగఁ దనతండ్రి నియో

గంబున నయ్యమున నోడఁ గడపుచు నుండెన్.

(ఆమె మత్స్యగంధి అనే పేరుతో తండ్రి ఆజ్ఞ ప్రకారం యమునానదిలో ఓడ నడుపుతూండేది.)


1_3_35 వచనము

అంత.

(అప్పుడు.)


1_3_36 చంపకమాల

గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వసిష్ఠపౌత్త్రుఁ డు

న్నతమతి శక్తిపుత్త్రుఁ డఘనాశనఘోరతపోధనుండు సు

వ్రతుఁడయి తీర్థయాత్ర చనువాఁడు పరాశరుఁ డన్మునీంద్రుఁ డ

య్యతివఁ దలోదరిం గనియె నయ్యమునానది యోడరేవునన్.

(వశిష్ఠుని మనవడు, శక్తిమహాముని పుత్రుడు, గొప్పవాడు అయిన పరాశరమునీంద్రుడు తీర్థయాత్రలకు వెళుతూ యమునానది ఓడరేవులో మత్స్యగంధిని చూశాడు.)


1_3_37 వచనము

ఇట్లేకతంబ యేకవస్త్రయై యోడ నెక్కవచ్చువారి నిరీక్షించుచున్న సత్యవతిం జూచి యా మునివరుండు దానియందు మదనపరవశుం డై దానిజన్మంబు దన దివ్యజ్ఞానంబున నెఱింగి యయ్యోడ యెక్కి దానితో నొక్కటఁ జని చని.

(ఓడనెక్కేవారికోసం ఎదురుచూస్తున్న మత్స్యగంధిని పరాశరుడు చూసి, మోహించి, ఆ ఓడనెక్కి.)


1_3_38 సీసము

చపలాక్షిచూపులచాడ్పున కెడ మెచ్చుఁ

జిక్కనిచనుఁగవఁ జీఱఁ గోరు

నన్నువకౌఁదీగ యందంబు మది నిల్పు

జఘనచక్రంబుపైఁ జలుపు దృష్టి

యభిలాష మేర్పడు నట్లుండఁగాఁ బల్కు

వేడ్కతో మఱుమాట వినఁగఁ దివురు

నతిఘనలజ్జావనత యగు యక్కన్య

పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడఁగు


ఆటవెలది

నెంతశాంతు లయ్యు నెంత జితేంద్రియు

లయ్యు గడువివిక్త మయినచోట

సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదు రెందుఁ

గాముశక్తి నోర్వఁగలరె జనులు.

(ఆమెకు తన కోరిక తెలిపాడు. మన్మథుడి శక్తిని ప్రజలు ఓర్చగలరా?)


1_3_39 వచనము

ఇట్లు విగతలజ్జాపరవశుం డయి మునివరుండు దనయభిప్రాయం బక్కన్యక కెఱింగించిన నదియును దీని కొడంబడనినాఁడు నా కలిగి యిమ్ముని శాపం బిచ్చునో యని వెఱచి యి ట్లనియె.

(ఇలా ఆ ముని సిగ్గువిడిచి తెలిపిన కోరికకు ఒప్పుకోకపోతే శపిస్తాడేమోనని భయపడి మత్స్యగంధి ఇలా అన్నది.)


1_3_40 తరలము

తనువు మీన్పొల వల్చు జాలరిదాన నట్లును గాక యే

ననఘ కన్యకఁ గన్యకావ్రత మంతరించిన నెట్లు మ

జ్జనకునింటికిఁ బోవ నేర్తుఁ బ్రసాదబుద్ధి యొనర్పు స

న్మునిగణోత్తమ నాకు దోషవిముక్తి యె ట్లగు నట్లుగాన్.

(చేపలవాసన వచ్చే శరీరం గల జాలరిదాన్ని నేను. అదీగాక, నేను కన్యను. నా కన్యకావ్రతం అంతరిస్తే నా తండ్రి ఇంటికి ఎలా వెళ్లగలను? నాకు దోషం కలగని విధంగా అనుగ్రహించండి.)


1_3_41 వచనము

అనిన నమ్మునివరుండు గరంబు సంతసిల్లి నాకు నిష్టంబు సేసిన దాన నీ కన్యాత్వంబు దూషితంబు గా దోడకుండు మని దానికి వరం బిచ్చి నీవు వసువను రాజర్షి వీర్యంబునం బుట్టిన దానవు గాని సూతకుల ప్రసూతవు కావని చెప్పి దాని శరీరసౌగంధ్యంబు యోజనంబునం గోలె జనులకు నేర్పడునట్లుగాఁ బ్రసాదించిన నది గంధవతి యనియు యోజనగంధి యనియుఁ బరఁగి తత్ప్రసాదంబున ననేకదివ్యాంబరాభరణభూషిత యై యమునానదీ ద్వీపంబున నోడ చేర్చి.

(అని అనగా పరాశరుడు సంతోషించి, ఆమె కన్యాత్వం పోకుండా వరమిచ్చి, "నువ్వు వసువుకు పుట్టినదానివి కానీ సూతకులంలో పుట్టలేదు", అని తెలిపి, ఆమెకు యోజనదూరంలో ఉండే జనాలకు కూడా తెలిసేలాంటి శరీరసుగంధం అనుగ్రహించాడు. ఆమె అప్పటినుండి గంధవతిగా, యోజనగంధిగా ప్రసిద్ధిచెందింది. ఆమె ఓడను యమునానదిలోని ఒక ద్వీపానికి చేర్చి.)


1_3_42 తేటగీతి

ఎల్లవారును జూడంగ నిట్టిబయల

నెట్లగు సమాగమం బని యింతి యన్న

నమ్మునీంద్రుఁడు గావించె నప్పు డఖిల

దృష్టిపథరోధి నీహారతిమిర మంత.

(ఇది అందరూ చూసే బాహ్యప్రదేశమని యోజనగంధి అనగా ప్రజల దృష్టి నిరోధించేందుకు పరాశరుడు మంచుచీకట్లను సృష్టించాడు.)


-:శ్రీవేదవ్యాసమునీంద్రుని యవతారము:-


1_3_43 కందము

పరమేష్ఠి కల్పుఁడగు న

ప్పరాశరు సమాగమమునఁ బరమగుణైకా

భరణకు ననవద్యమనో

హరమూర్తికి సత్యవతికి నమ్మునిశక్తిన్.

(పరాశరుడి మహిమ వల్ల సత్యవతికి.)


1_3_44 కందము

సద్యోగర్భంబున నహి

మద్యుతితేజుండు వేదమయుఁ డఖిలమునీం

ద్రాద్యుఁడు వేదవ్యాసుం

డుద్యజ్ఞానంబుతోడ నుదితుం డయ్యెన్.

(గొప్పవాడైన వ్యాసుడు జన్మించాడు.)


1_4_45 కందము

ఆ యమునాద్వీపమున న

మేయుఁడు కృష్ణుం డయి పుట్టి మెయిఁగృష్ణద్వై

పాయనుఁ డనఁ బరగి వచ

శ్శ్రీయుతుఁడు తపంబునంద చిత్తము నిలిపెన్.

(నల్లనివాడైన అతడు ఆ యమునాద్వీపంలో కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో ప్రసిద్ధి చెంది తపస్సులో దృష్టి నిలిపాడు.)


1_3_46 వచనము

పరాశరుండును సత్యవతి కోరినవరంబు లిచ్చి నిజేచ్ఛ నరిగె నంతఁ గృష్ణద్వైపాయనుండును గృష్ణాజినపరిధానకపిలజటామండలదండకమండలు మండితుండై తల్లి ముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి మీకుం బని గల యప్పుడ నన్నుం దలంచునది యాక్షణంబ వత్తునని సకలలోక పావనుఁ డఖిలలోకహితార్థంబుగాఁ దపోవనంబునకుం జని యందు మహా ఘోరతపంబు సేయుచు.

(పరాశరుడు సత్యవతి కోరిన వరాలిచ్చి వెళ్లిపోయాడు. వ్యాసుడు తల్లి ముందు నిలిచి, "మీకు పని కలిగినప్పుడు నన్ను తలవండి, ఆ క్షణమే వస్తాను", అని చెప్పి తపస్సు చేయటానికి వెళ్లిపోయాడు.)


1_3_47 ఉత్పలమాల

సంచితపుణ్యుఁ డంబురుహసంభవునంశము దాల్చి పుట్టి లో

కాంచితు డైన వాఁడు నిఖిలాగమపుంజము నేర్పడన్ విభా

గించి జగంబు లందు వెలుఁగించి సమస్తజగద్ధితంబుగాఁ

బంచమవేద మై పరగు భారతసంహితఁ జేసె నున్నతిన్.

(వ్యాసుడు వేదాలను విభజించి, వాటిని లోకాలలో ప్రకాశింపజేసి, పంచమవేదమనే పేరుతో ప్రసిద్ధి చెందిన భారతసంహితను రచించాడు.)


-:భీష్మాదివీరులు దేవదానవాదుల యంశంబువలనఁ బుట్టుట:-


1_3_48 వచనము

మఱియు దేవదైత్యదానవ మునియక్షపక్షిగంధర్వాదుల యంశావతారంబులు దాల్చి భీష్మాది మహావీరులు భారతయుద్ధంబు సేయ ననేకులు పుట్టిరి వారల కొలంది యెఱుంగచెప్ప ననేకకాలం బనేక సహస్రముఖంబుల వారికైన నలవిగా దనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(అంతేకాక దేవతలు, రాక్షసులు మొదలైనవారి అంశలతో భీష్ముడు మొదలైన మహావీరులు భారతయుద్ధం చేయటానికి పుట్టారు. వారందరి సామర్ధ్యం గురించి చెప్పటం అనేకవేల ముఖాలు కలవారు చాలాకాలం చెప్పినా సాధ్యం కాదు - అనగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)


1_3_49 కందము

అమరాసురముఖ్యుల యం

శములను మహిఁ బుట్టి సకలజనపాలకసం

ఘములకు భారతరణరం

గమునను లయ మొంద నేమి కారణ మనినన్.

("దేవదానవుల అంశలతో పుట్టిన రాజసమూహాలు భారతయుద్ధంలో నశించటానికి కారణమేమిటి?")


1_3_50 వచనము

జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె.

(వైశంపాయనుడు ఇలా అన్నాడు.)


1_3_51 సీసము

పరశురాముండు భీకరనిజకోపాగ్ని

నుగ్రుఁడై యిరువదియొక్కమాఱు

ధాత్రీతలం బపక్షత్త్రంబు సేసినఁ

దత్క్షత్త్రసతులు సంతానకాంక్ష

వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల

దయఁ జేసి ధర్మువు దప్పకుండఁ

బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల

నిప్పాటఁ దత్క్షత్ర మెసఁగి యుర్విఁ


ఆటవెలది

బర్వి రాజధర్మపద్ధతి ననఘ మై

జారచోర దుష్టజనుల బాధఁ

బొరయ కుండ నిఖిలభూప్రజాపాలనఁ

జేయుచుండె శిష్టసేవ్య మగుచు.

(పరశురాముడు ఇరవైయొక్కమార్లు దండెత్తి క్షత్రియులందరినీ వధించాడు. వారి భార్యలు సంతానకాంక్షతో, మహావిప్రుల దయతో సంతానాన్ని పొందారు. ఆ క్షత్రియవంశం పాపరహితంగా పరిపాలన సాగించింది.)


1_3_52 వచనము

ఇట్లు బ్రాహ్మణవీర్య ప్రభవు లయిన క్షత్త్రియులు ధర్మమార్గంబునం బ్రజాభిరక్షణంబు సేయుటంజేసి వర్ణాశ్రమ ధర్మస్థితులు దప్పక ప్రవర్తిల్లుటయు బ్రహ్మక్షత్త్రంబుల కాయుర్వర్ధనంబును ననవరతయాగతర్పిత పర్జన్య ప్రసాదంబునం గోరిన యప్పుడు వానలు గురియుచు సకలసస్యసమృద్ధియుఁ బ్రజావృద్ధియు నైన భూదేవి ప్రజాభారపీడిత యై సురాసురమునిగణపరివృతులై యున్న హరిహరహిరణ్యగర్భులకడకుం జని యిట్లనియె.

(వారి పాలనలో ప్రజల ఆయుర్దాయాలు పెరిగి, ప్రజావృద్ధి అవగా భూదేవి ఆ భారాన్ని సహించలేక త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి.)


1_3_53 కందము

భూరి ప్రజానిరంతర

భారము దాల్చు టిది కరము భారము దయతో

మీ రీభారమునకుఁ బ్రతి

కారము గావించి నన్నుఁ గావుం డనినన్.

(ఇంతమంది ప్రజలను మోయడం నాకు భారంగా ఉంది. దీనికి చికిత్స చేసి నన్ను కాపాడండి అని భూదేవి పలికింది.)


1_3_54 కందము

వనజాసను ననుమతమున

వనరుహనాభుండు వాసవ ప్రముఖసుప

ర్వనికాయాంశంబులతోఁ

దనరఁగఁ బుట్టించె నుర్విఁ దనయంశమ్మున్.

(బ్రహ్మ సమ్మతితో విష్ణువు ఇంద్రాదుల అంశలతో, తన అంశ అతిశయించేలా భూమిపై జన్మింపజేశాడు.)


1_3_55 కందము

దితిసుత దానవ యక్ష

ప్రతతుల యంశములఁ బుట్టి ప్రజలకు విహితా

హితు లగుచుండి రనేకులు

జితకాశులు ధరణిపతులు శిశుపాలాదుల్.

(దేవదానవుల అంశలతో ప్రజలకు మిత్రులూ, శత్రువులూ అయిన రాజులు చాలామంది పుట్టారు.)


1_3_56 చంపకమాల

అతులబలాఢ్యు లైన యమరాంశసముద్భవు లెల్ల బాండుభూ

పతిసుతపక్ష మై సురవిపక్షగణాంశజు లెల్ల దుర్మదో

ద్ధతకురురాజపక్ష మయి ధారుణిభారము వాయ ఘోరభా

రతరణభూము నీల్గిరి పరస్పర యుద్ధము సేసి వీరులై.

(దేవతల అంశ గలవారు పాండవుల పక్షాన, రాక్షసుల అంశ గలవారు దుర్యోధనుడి పక్షాన భారతరణంలో పోరాడి మరణించి భూభారం తగ్గించారు.)


1_3_57 వచనము

అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.

(ఇది విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇలా అన్నాడు.)


1_3_58 కందము

ఆదిత్య దైత్యదానవు

లాదిగఁ గల భూతరాశి దగు సంభవమున్

మేదినిఁ దదంశముల మ

ర్త్యోదయములు నాకుఁ జెప్పు మొగి నేర్పడఁగన్.

(దేవతలు, దైత్యులు, దానవులు మొదలైనవారి పుట్టుక గురించీ, వారు మనుషులుగా జన్మించటం గురించీ నాకు చెప్పండి.)


-: దేవదానవ ప్రముఖుల యుత్పత్తి క్రమము :-


1_3_59 వచనము

అనిన విని జనమేజయునకు వైశంపాయనుం డిట్లని చెప్పెఁ దొల్లి సకలజగ దుత్పత్తినిమిత్తభూతుం డైన బ్రహ్మకు మానసపుత్త్రు లైన మరీచియు నంగీరసుండును నత్రియుఁ బులస్త్యుండును బులహుండును గ్రతువును నను నార్వురు పుట్టి రందు మరీచికిఁ గశ్యప ప్రజాపతి పుట్టెఁ గశ్యపు వలనఁ జరాచర భూతరాశియెల్ల నుద్భవిల్లె నెట్లనిన బ్రహ్మదక్షిణాంగుష్ఠంబున దక్షుండును వామాంగుష్ఠంబున ధరణియను స్త్రీయునుం బుట్టిన యయ్యిరువురకును.

(అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు: బ్రహ్మదేవుడి ఆరుగురు మానసపుత్రులలో ఒకడైన మరీచికి కశ్యపప్రజాపతి పుట్టాడు. కశ్యపుడి నుండి చరాచరజీవాలన్నీ ఉద్భవించాయి. ఎలాగంటే - బ్రహ్మ కుడిచేతి బొటనవేలు నుండి దక్షప్రజాపతి, ఎడమచేతి బొటనవేలినుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారిద్దరికీ.)


1_3_60 కందము

సుతు లనఘులు వేవురు దమ

యుతులై యుదయించి సాంఖ్యయోగాభ్యాసో

న్నతిఁ జేసి ముక్తులై భూ

రితేజు లందఱును నూర్ధ్వరేతసు లైనన్.

(వేయిమంది పుత్రులు జన్మించి ఋషులయ్యారు.)